ఎవరీ చిన్నస్వామి? బెంగళూరులో క్రికెట్ స్టేడియానికి ఆయన పేరు ఎందుకు పెట్టారు?

ఫొటో సోర్స్, Mysore Education Society
- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు నగరం నడిబొడ్డున శివాజీనగర్‌లో ఉన్న ఈ అత్యాధునిక స్టేడియం కర్ణాటక క్రికెట్‌కు ఆయువుపట్టు వంటిది.
కర్ణాటక మెన్, కర్ణాటక ఉమెన్, ఫ్రాంచైజీలైన ఆర్‌సీబీ మెన్, ఆర్‌సీబీ ఉమెన్ టీమ్‌లకు ఇదే హోమ్ గ్రౌండ్.
క్రికెట్ ఆటగాళ్లకు, క్రికెట్ అభిమానులకు స్వర్గధామంగా పేరొందిన ఈ స్టేడియానికి చిన్నస్వామి పేరు ఎందుకు పెట్టారంటే...
1950 దశకం నుంచి కర్ణాటకలో క్రికెట్ దినదిన ప్రవర్థమానంగా ఎదగడానికి విశేష కృషి చేసినవారిలో ఎం చిన్నస్వామి అగ్రగణ్యుడని అభిమానులు చెబుతుంటారు.


ఫొటో సోర్స్, Getty Images
చిన్నస్వామి చేసిన సేవలు
మాండ్యా నగరానికి చెందిన చిన్నస్వామి వృత్తిరీత్యా న్యాయవాది.
తనకున్న క్రీడాభిరుచితో కర్ణాటకలో ఎస్‌ఏ శ్రీనివాసన్‌తో కలిసి క్రికెట్‌కు పటిష్ట పునాదులు వేశారు.
మైసూర్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన నాలుగు దశాబ్దాల పాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)కు సేవలందించారు.
కార్యదర్శిగా, అధ్యక్షుడిగా దీని అభివృద్ధికి విశేష కృషి చేశారు.
బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అధ్యక్షుడిగా 1977 నుంచి 1980 వరకు పనిచేశారు.
ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)లో భారత్ తరఫున 1965, 1973, 1977-80 సంవత్సరాలలో ప్రాతినిధ్యం వహించారు. బెంగళూరులో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేశారు.
1969-70లో కేఎస్‌సీఏ స్టేడియం పూర్తయింది. చిన్నస్వామి సేవలకు గుర్తుగా ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టారు.
ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలు వెలుగులోకి రావడానికి ఈ స్టేడియం ఒక వేదిక అయింది.

ఫొటో సోర్స్, Getty Images
గంగూలి, యువరాజ్‌ల 300 పరుగుల పార్టనర్‌షిప్ ఇక్కడే
తొలిసారిగా 1974 నవంబరులో ఇక్కడ నిర్వహించిన ఇండియా-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌లోనే వెస్టిండీస్ ‘బ్యాటింగ్ వీరులు’ వివియన్ రిచర్డ్స్, గార్డన్ గ్రీనిడ్జ్ రంగప్రవేశం చేశారు.
టీమిండియా సాధించిన ఎన్నో రికార్డులకు ఇదో వేదిక.
2007లో ఇండియా-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ 300 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పారు.
బీసీసీఐ కూడా 2000 సంవత్సరంలో ఇక్కడ నేషనల్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 32 వేలు. దీన్ని 70వేలకు విస్తరించాలని కేఎస్‌సీఏ యోచిస్తోంది. ప్రపంచంలో పూర్తిగా సోలార్ విద్యుత్తు ఆధారిత నిర్వహణ ఉన్న తొలి క్రికెట్ స్టేడియం కూడా ఇదే.
అంతేకాదు భారతదేశంలో తొలిసారిగా జరిగిన 1996 మిస్ వరల్డ్ పోటీలకు కూడా ఈ స్టేడియమే వేదిక అయింది.
చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 25 టెస్టులు, 31 వన్డేలు జరిగాయి. ఇందులో 12 వరల్డ్ కప్ వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. 10 టి20లకు ఆతిథ్యమిచ్చింది. ఇందులో 3 వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లు.
(ఆధారం: ది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














