ఎక్కువసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఆటగాళ్లు ఎవరంటే

ambati rayudu, rohit sharma

ఫొటో సోర్స్, facebook/ambatirayudu/gettyimages

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐపీఎల్-2025 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గెలవగానే 18 ఏళ్లుగా ఈ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.

ఈ ట్రోఫీ అతనికి ఎంత విలువైనదో కోహ్లీ చెమర్చిన కళ్లను చూస్తే అర్థం అవుతుంది.

చాలా ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న ఎంతోమంది క్రికెటర్లకు ఈ ట్రోఫీని అందుకోవడం ఒక కల.

అయితే, అతి కొద్ది ప్లేయర్లు మాత్రం ఈ ట్రోఫీని అనేకసార్లు సగర్వంగా ముద్దాడారు.

వారిలో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచారు.

వీరిద్దరూ ఆయా జట్ల తరఫున 6 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నారు.

తర్వాతి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

రోహిత్ శర్మ

అత్యధిక సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న తొలి ప్లేయర్‌గా 2020లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.

2020 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. దీంతో రోహిత్ ఖాతాలో ఆరోసారి ఐపీఎల్ టైటిల్ చేరింది.

రోహిత్ మొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీ 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున గెలుపొందాడు. అతను 2008-10 వరకు డెక్కన్ చార్జర్స్ జట్టుకు ఆడాడు.

ఆ తర్వాత ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా 2013, 2015, 2017, 2019, 2020లో మరో అయిదుసార్లు టైటిల్‌ అందుకున్నాడు.

అంబటి రాయుడు

ఫొటో సోర్స్, Getty Images

అంబటి రాయుడు

అంబటి రాయుడు కూడా ఆరుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి, రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

అంబటి రాయుడు మూడుసార్లు ముంబయి ఇండియన్స్ తరఫున, మరో మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ ట్రోఫీని అందుకున్నాడు.

2013, 2015, 2017 సీజన్లలో ట్రోఫీ గెలిచిన ముంబయి జట్టులో ఆడిన అంబటి రాయుడు ఆ తర్వాత 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు.

ధోని

ఫొటో సోర్స్, Getty Images

మహేంద్ర సింగ్ ధోని, కీరన్ పోలార్డ్

ఒకే జట్టు తరఫున 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోని, కీరన్ పోలార్డ్.

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు కెప్టెన్‌గా ధోని అయిదుసార్లు టైటిల్‌ను అందించాడు.

ఈ అయిదు ఫైనల్ మ్యాచ్‌ల్లో కలిపి ధోని మొత్తం 44 పరుగులు చేశాడు. 3 క్యాచ్‌లు, 2 స్టంపౌట్‌లు చేశాడు.

చెన్నై జట్టు చివరిసారిగా 2023లో ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు 2010, 2011, 2018, 2021లలోనూ చెన్నై విజేతగా నిలిచింది.

ముంబయి తరఫున కీరన్ పోలార్డ్ అయిదు ఫైనల్స్ ఆడి టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడయ్యాడు.

ఈ ఫైనల్ మ్యాచ్‌ల్లో అతను ఓవరాల్‌గా 153 పరుగులు చేశాడు. ఇందులో టాప్ స్కోర్ 60 నాటౌట్.

హార్డిక్ పాండ్యా

ఫొటో సోర్స్, Getty Images

హార్దిక్ పాండ్యా

గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్యా అయిదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచాడు.

2015, 2017, 2019, 2020లో ముంబయి తరఫున 4 సార్లు ఈ ట్రోఫీని అందుకున్నాడు.

తర్వాత గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా 2022లో మరోసారి ఈ టైటిల్‌ను గెలిచాడు.

ఈ అయిదు ఫైనల్ మ్యాచ్‌ల్లో హార్దిక్ చేసిన పరుగులు 63.

రవీంద్ర జడేజా, లసిత్ మలింగ, కృనాల్ పాండ్యా 4 సార్లు చొప్పున ఈ ట్రోఫీని గెలుచుకున్నారు.

రవీంద్ర జడేజా

ఫొటో సోర్స్, Getty Images

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.

2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి టైటిల్ అందుకున్నాడు.

సీఎస్కే తరఫున 2018, 2021, 2023లో గెలిచాడు.

లసిత్ మలింగ నాలుగుసార్లూ ముంబయి ఇండియన్స్ సభ్యుడిగానే ఈ టైటిల్‌ను అందుకున్నాడు.

కృనాల్ పాండ్యా

ఫొటో సోర్స్, Getty Images

కృనాల్ పాండ్యా

కృనాల్ పాండ్యా తన కెరీర్‌లో రెండు జట్ల తరఫున ఐపీఎల్ ఆడాడు.

గతంలో ముంబయి తరఫున 3 సార్లు, తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి ఒకసారి ట్రోఫీని అందుకున్నాడు.

వీరే కాకుండా డ్వేన్ బ్రావో (సీఎస్కే), బుమ్రా (ముంబయి ఇండియన్స్), దీపక్ చహర్ (సీఎస్కే), సునీల్ నరైన్ (కేకేఆర్), యూసుఫ్ పఠాన్ (కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్), రైనా (సీఎస్కే), సూర్యకుమార్ యాదవ్ (కేకేఆర్, ముంబయి ఇండియన్స్) తలా 3 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నారు.

ఏ జట్టు ఎన్నిసార్లు టైటిల్ గెలిచిందంటే..

చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు చెరో 5 సార్లు విజేతగా నిలిచాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ 3 సార్లు టైటిల్‌ను అందుకుంది.

రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలా ఒకసారి ఐపీఎల్ చాంపియన్లుగా నిలిచాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)