యజమాని నుంచి తప్పించుకుని వీధిలోకి వచ్చిన సింహం, పోలీసులు ఏం చేశారంటే...

ఫొటో సోర్స్, Screengrab/BBC
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ న్యూస్
పాకిస్తాన్‌లో ఓ పెంపుడు సింహం యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని ఇంటి నుంచి తప్పించుకున్న ఆ సింహం ఓ మహిళ, ముగ్గురు పిల్లలపై దాడి చేసింది.
లాహోర్‌లోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
గోడపై నుంచి వీధిలోకి దూకిన సింహం ఓ మహిళను వెంటాడిన దృశ్యాలు, ప్రజలు భయంతో పరుగులు తీయడం అందులో రికార్డయ్యాయి.
ఆ మహిళతోపాటు, 5, 7 ఏళ్ల వయసుగల పిల్లలకు చేతులు, ముఖంపైన గాయాలయ్యాయని, వారి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు.
అనుమతి లేకుండా క్రూర మృగాన్ని పెంచినందుకు, అలాగే సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అది తప్పించుకోవడానికి అవకాశం కలిగించారంటూ యజమానిపై పోలీసులు అభియోగాలు మోపారు.


ఫొటో సోర్స్, screengrab/BBC
సింహాలు పెంచుకోవడాన్ని పాకిస్తాన్‌లో ఓ హోదాగా చూస్తారు. సింహాలు, చీతాలు, పులులు, ప్యూమాలు, జాగ్వార్‌లను పెంచుకోవడమనేది అక్కడ చట్టబద్ధమే.
ఇందుకోసం వారు ఒక్కో జంతువుకు 50వేల పాకిస్తానీ రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అయితే అలాంటివాటిని నగర శివార్లలోనే ఉంచాలి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న లాహోర్ నగరం పాకిస్తాన్‌లో రెండో అతిపెద్ద నగరం.
సింహం తమ కుటుంబంపై దాడి చేస్తుంటే, దాని యజమాని కళ్లప్పగించి చూస్తూ నిల్చున్నారని గాయపడిన పిల్లల తండ్రి చెప్పారు.
సింహాన్ని ఆపడానికి ఏ ప్రయత్నమూ చేయలేదన్నారు.
సింహాన్ని చూసిన వెంటనే ఆ మహిళ ఎవరైనా రక్షిస్తారమోనని వెనక్కు తిరిగి పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. చాలామంది భయంతో పరుగులు తీస్తూ కనిపించారు.
ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత, అక్రమంగా అడవి జంతువులు కలిగి ఉన్నవారిపై ప్రభుత్వం చర్యలకు దిగింది. ఐదుగురిని అరెస్ట్ చేసి, 13 సింహాలను స్వాధీనం చేసుకుంది.
అక్రమంగా సింహం పిల్లను పెంచుకుంటున్నందుకు పాకిస్తానీ యూట్యూబర్ రజబ్ భట్‌కు శిక్షగా జంతు సంరక్షణ వీడియోలు చేయాల్సిందిగా జనవరిలో ఆదేశాలు ఇచ్చారు.
56 లక్షల సబ్‌స్క్రైబర్లు కలిగి ఉన్న రజబ్ భట్‌కు సింహం పిల్ల పెళ్లి కానుకగా లభించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














