జంతువుల మీద లైంగిక దాడుల నిరోధక చట్టం చేయాలనే డిమాండ్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

ఫొటో సోర్స్, Jaya Bhattacharya
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
జంతువులపై లైంగిక దాడులను నిరోధించే చట్టాన్ని తిరిగి తీసుకు రావాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
2025 మే 28న దీనిపై కోర్టులో విచారణ జరిగింది. అయితే, చట్టాలు చేయడం, వాటిని మార్చడం పార్లమెంట్ చేసే పని అని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.
పాత చట్టంలోని కొన్ని నిబంధనలను తొలగించవద్దని జంతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంస్థలు, కార్యకర్తలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను ఒకప్పుడు 'అసహజ నేరాల చట్టం1860' అని పేర్కొనేవారు.
జంతువుల మీద లైంగిక దాడి చేసినట్లు తేలిన దోషులకు ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించే అవకాశం ఉండేది.

ఇదే చట్టం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తోంది. శారీరక సంబంధం పెట్టుకున్న ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు మహిళలు ఈ చట్టం కింద శిక్షార్హులు.
2024 జులైలో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి తెచ్చినప్పుడు ప్రభుత్వం సెక్షన్ 377ను తొలగించింది.

ఫొటో సోర్స్, Getty Images
జంతుహక్కుల కార్యకర్తల ఆందోళన ఏంటి?
ముంబయికి చెందిన పూర్ణిమ మోత్వాని తన నాలుగు నెలల పిల్లి మీద లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. అయితే, అలాంటి నేరాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఉన్న చట్టాన్ని ప్రభుత్వం తొలగించిందన్న విషయం ఆమెకు తెలియదు.
"ఆ పిల్లి చాలా భయపడింది. బలహీనంగా ఉంది. నొప్పితో బాధపడుతోంది. తీవ్రమైన గాయాలయ్యాయి. డాక్టర్ దానికి రెండుసార్లు కుట్లు వేయాల్సి వచ్చింది" అని ఆమె చెప్పారు.
తన పిల్లి మీద దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు పూర్ణిమ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, సెక్షన్ 377ను తొలగించారని ఆమె అప్పుడే తెలిసింది.
‘జంతువుల పట్ల క్రూరమైన ప్రవర్తనను నిరోధించే చట్టం’ కింద ఆమె తన ఫిర్యాదు సమర్పించారు. ఈ చట్టం కింద రూ. 50 జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 377 దీని కంటే బలమైనది. అందుకే జంతువుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్- ఫియాపో, ఈ చట్టాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ సంస్థ 200 సంస్థలతో కలిసి ఏర్పడింది.
"పాత చట్టంలో లైంగిక హింస గురించి స్పష్టంగా వివరించారు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించారు. ఇలాంటి కేసుల్లో నిందితులను జైలుకు పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే నిందితుడు బయట ఉంటే తిరిగి వాటి మీద దాడి చేసే అవకాశం ఉంది" అని ఫియాపో న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించే వర్ణికా సింగ్ చెప్పారు.
జంతువుల పట్ల క్రూర ప్రవర్తన నియంత్రణ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేయడానికి తనకు కొంత సమయం పట్టిందని పూర్ణిమ చెప్పారు.
"నేను అనేకసార్లు ఫోన్ చేశాను. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. ఇలాంటి కేసుల్లో చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధంగా లేరు. వాళ్లు దీన్నొక జోక్‌గా భావిస్తున్నారు" అని ఆమె అన్నారు.
పోలీసులకు కంప్లైంట్ చేసి చాలా రోజులైంది. నిందితుడు పారిపోయాడు. అతన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు.
పూర్ణిమ ఆ పిల్లికి గ్రేస్ అని పేరు పెట్టారు. అక్కడున్నవారి సంరక్షణ, సాయంతో పిల్లి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడినా, కొన్నిరోజుల తర్వాత గ్రేస్‌కు వైరల్ ఫీవర్ వచ్చింది. లైంగిక దాడి జరిగిన రెండు వారాల తర్వాత అది చనిపోయింది.

ఫొటో సోర్స్, Poornima Motwani
భారత్‌లో జంతువులపై లైంగిక హింస ఏ స్థాయిలో ఉంది?
భారతదేశంలో జంతువుల మీద లైంగిక దాడి జరిగిన కేసులు అంత తేలిగ్గా బయటకు రావు.
చట్ట ప్రకారం నేరమే అయినా, అలాంటి సంఘటనను ఎవరైనా చూసి, రికార్డు చేస్తేనే పోలీసులకు సమాచారం అందుతుంది. అంతే కాదు, ఆ సంఘటనను చూసిన వ్యక్తి జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
2019-2022 మధ్య సెక్షన్ 377 కింద దాదాపు వెయ్యి కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో జంతువులపై లైంగిక హింసకు సంబంధించిన కేసులు ఎన్ని ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. దీని కారణంగా ఈ సమస్య తీవ్రతను అంచనా వేయడం కష్టం.
ఈ విషయం తెలుసుకునేందుకే జంతువుల మీద జరుగుతున్న వివిధ రకాల నేరాల గురించి సమాచారం సేకరించేలా ఎన్‌సీఆర్‌బీని ఆదేశించాలని ఫియాపో కోర్టును కోరింది.
తాను పెంచుకుంటున్న నెల రోజుల వయసు కుక్కపిల్లపై లైంగిక దాడి జరిగిందని 2024 డిసెంబర్‌లో నటి జయ భట్టాచార్యకు తెలిసింది.
ఆమె రెండు దశాబ్దాలుగా జంతు సంక్షేమం కోసం పని చేస్తున్నారు. జంతువుల కోసం ముంబయిలో షెల్టర్ నిర్వహిస్తున్నారు.
కుక్కపిల్లపై దాడి చేసిన నిందితుడు దానికి ఆహారం పెట్టే నెపంతో ఇంట్లోకి తీసుకెళ్లాడని, కొంత సమయం తర్వాత ఆ కుక్కపిల్ల నొప్పితో బాధపడుతుండటాన్ని అక్కడున్న పిల్లలు చూశారని ఆమె చెప్పారు.
ఈ సంఘటన గురించి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాశారు. దీంతో జంతువులపై క్రూర ప్రవర్తన నిరోధక చట్టం కింద స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొన్ని గంటల్లోనే బెయిల్‌పై వదిలేశారు.
"మన సమాజంలో అత్యంత నీచ ప్రవర్తనకు అలాంటి వారు నిదర్శనం. అలాంటి వాళ్లకు శిక్ష పడకపోతే, అది ఇతరులను బాధ పెట్టేందుకు తమకు లభించిన స్వేచ్ఛగా భావిస్తారు" అని జయ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జంతువులపై లైంగిక దాడి చేసేవారు మనుషులపైనా అలాగే చేస్తారా?
జంతువులపై లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తులు మనుషులను కూడా లక్ష్యంగా చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. అందులోనూ ఇదే తేలింది.
కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా సహా అనేక దేశాల్లో జంతువుల మీద లైంగిక హింస నేరం. ఇలాంటి నేరాలకు ఆయా దేశాల్లో రెండేళ్ల నుంచి 20 ఏళ్ల శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి.
"జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ సైకియాట్రీ అండ్ ది లా" ఒక పరిశోధనను ప్రచురించింది. ఈ పరిశోధనలో 1975 నుంచి 2015 మధ్య అమెరికాలో జంతువుల మీద లైంగిక దాడి చేసిన 456 కేసులను అధ్యయనం చేశారు. ఇందులోని మూడింట ఒక వంతు కేసుల్లో జంతువుల మీద దాడి చేసిన వారు.. పిల్లలు, పెద్దవాళ్ల మీద కూడా లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలింది.
భారత్‌లోనూ కొన్ని కేసుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 2024 ఆగస్టులో బులంద్‌షహర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓ మేకతో పాటు ఆ మేకల్ని కాస్తున్న పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
"అతను మేక మీద, ఆ బాలిక మీద అత్యాచారం చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఇంట్లో నుంచి చూసిన ఓ బాలుడు ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశాడు. రెండు వీడియోలను బాలిక తండ్రికి చూపించాడు. రికార్డు చేయకపోయి ఉంటే ఈ హీనమైన నేరం ఎన్నటికీ వెలుగులోకి వచ్చేది కాదు" అని ఈ కేసులో బాలిక తరపు న్యాయవాది వరుణ్ కౌశిక్ చెప్పారు.
పిల్లలపై లైంగిక దాడికి పాల్పడిన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వరు. అందుకే బాలికపైనా, మేకపైనా లైంగిక దాడి చేసిన వ్యక్తి జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Government of India
భారత ప్రభుత్వ వైఖరి ఏంటి?
భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377ను బ్రిటిషర్ల పాలనా కాలమైన 1860 సంవత్సరంలో తీసుకువచ్చారు. ఈ సెక్షన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఇప్పటికీ అస్తిత్వంలో ఉంది.
జంతువులపట్ల క్రూరత్వాన్ని నిరోధించే చట్టాన్ని కఠినంగా మార్చాలని, ఇందులోనే లైంగిక హింసను కూడా చేర్చాలని ఈ సెక్షన్ తొలగించడానికి ముందే ప్రభుత్వాన్ని కోరారు జంతుహక్కుల కార్యకర్తలు.
2010-2020 మధ్య జంతువులపై జరిగిన క్రూరత్వం గురించి మీడియాలో వచ్చిన కథనాలను ఫియాపో సేకరించింది. దీని ప్రకారం వెయ్యి కేసుల్లో 83 కేసులు జంతువుల మీద లైంగిక హింసకు సంబంధించినవి. ఇందులో మూడింట రెండొంతుల కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
ఈ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్‌కు సవరణలు చేసేందుకు 2022లో భారత ప్రభుత్వం ఒక ముసాయిదా సిద్ధం చేసింది. ఇందులో లైంగిక హింస అనే దానికి వివరణను జతపరిచింది.
ఈ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధిస్తామని అందులో పేర్కొంది. అయితే ఆ ముసాయిదాను ఇప్పటి వరకు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టలేదు.
చట్ట సవరణలో జరుగుతున్న ఆలస్యంపై జంతు హక్కుల కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
"చట్టం కఠినంగా ఉండి దాని గురించి అందరికీ తెలిస్తే, ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడే ముందు ఆలోచించి ఆగిపోతారేమో" అని పూర్ణిమా మోత్వాని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














