మాలిలో భారతీయుల కిడ్నాప్.. ఆఫ్రికా ఖండంలోని ఈ దేశానికి ఇండియన్స్ ఎందుకు వెళ్తుంటారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ మాలి దేశంలో ముగ్గురు భారతీయులు అపహరణకు గురైనట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
వీరిలో ఒకరు తెలుగు వ్యక్తి కాగా, మిగిలిన ఇద్దరు ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన వారు.
''రిపబ్లిక్ ఆఫ్ మాలిలో కెయిస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలోకి జులై 1వ తేదీన కొందరు సాయుధులైన దుండగులు ప్రవేశించారు. ముగ్గురు భారతీయులను బలవంతంగా ఎత్తుకుపోయారు'' అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అపహరణకు గురైన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు ఉన్నట్లుగా కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఇతనితోపాటు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన పనాడ్ వెంకటరమణ ఉన్నారు. మూడో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఫొటో సోర్స్, AFP via Getty Images
మాలి ఎందుకు వెళ్లారంటే?
మాలి దేశంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో జోషి జనరల్ మేనేజర్‌గా, అమరలింగేశ్వరరావు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. పనాడ్ వెంకటరమణ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం, వీరి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఈ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ హైదరాబాద్‌కు చెందిన ప్రసాదిత్య గ్రూపు నిర్వహిస్తోంది. దీనికి మోటపర్తి శివ రామ వర ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కిడ్నాప్ ఘటనపై ఇప్పటివరకు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బీబీసీ మెయిల్ ద్వారా సంప్రదించింది. వారి నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది.
మరోవైపు, కిడ్నాప్ ఎవరు చేశారనే విషయంపై సరైన స్పష్టత లేదు. భారతీయులను అపహరించినవారు సాయుధులైన దుండగులని భారత విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోందే కానీ వారు టెర్రిరిస్టులో కాదో ధ్రువీకరించలేదు.
అయితే, మాలిలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని మిలటరీ స్థావరాలపై దాడులు చేసినట్లుగా అల్‌ఖైదా అనుబంధంగా ఉన్న జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్(జేఎన్ఐఎం) ప్రకటించిందని అసోసియేటెట్ ప్రెస్(ఏపీ) న్యూస్ రిపోర్టు చేసింది.

ఫొటో సోర్స్, UGC
'విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు'
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావుకు భార్య వెంకట రమణ, ముగ్గురు పిల్లలున్నారు.
గతంలో వీరి కుటుంబం మిర్యాలగూడలో నివాసం ఉండగా.. తర్వాత హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు మారారు.
అమరలింగేశ్వరరావు తల్లిదండ్రులు జమ్మలమడకలోనే ఉంటున్నారు.
''మా కొడుకును కిడ్నాప్ చేసి ఇప్పటికీ ఏడు రోజులు అయ్యింది. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. అతని క్షేమ సమాచారం విషయంలో ఎంతో భయాందోళనగా ఉంది'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అమరలింగేశ్వరరావు తండ్రి కూరకూల వెంకటేశ్వర్లు.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావు ఎనిమిదేళ్ల కిందట మాలికి వెళ్లారు.
''ఇక్కడ ఉన్నప్పుడు సువర్ణ ఫ్యాక్టరీ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అలాగే కుటుంబాన్ని పిల్లలను చదివించాడు. అతనికి ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు ఆడపిల్లలు. ఎంతకాలం పనిచేసినా, జీతం సరిపోవడం లేదని బాధ పడేవాడు. డైమండ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఉద్యోగం రావడంతో మాలికి వెళ్లాడు'' అని వెంకటేశ్వర్లు బీబీసీతో చెప్పారు.
అమరలింగేశ్వరరావు గత ఎనిమిదేళ్లుగా డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లుగా ఆయన బావమరిది కోటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
''జులై 1వ తేదీ ఉదయం విధులకు వెళ్లారు. ఆ సమయంలో టెర్రరిస్టులు ఫ్యాక్టరీ ఆవరణలోకి వచ్చారు. ఫ్యాక్టరీ జీఎంతోపాటు మా బావ, ఒడిశాకు చెందిన వెంకట రమణను తీసుకెళ్లారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది'' అని చెప్పారు.
అమరలింగేశ్వరరావు చివరిసారిగా 2024 నవంబరులో భారత్‌కు వచ్చి, వెళ్లినట్లుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.
''ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీన ఇండియా రావాలనుకున్నారు. విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఈలోపే ఇలా జరిగింది'' అని కోటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
అమరలింగేశ్వరరావు కిడ్నాప్‌కు గురయ్యారని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది.
''ఫ్యాక్టరీ యజమాని ప్రసాద్‌ను కలిశాం. వారు కూడా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు'' అని కోటేశ్వరరావు వివరించారు.
మరోవైపు, అమరలింగేశ్వరరావు కుటుంబసభ్యులు శుక్రవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిశారు. మాలిలో అపహరణకు గురైన వారిని త్వరగా విడిపించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, మాలిలోని ఇండియన్ ఎంబసీలకు ఆయన లేఖ రాశారు.
అయితే, మాలిలో కిడ్నాప్ విషయంపై తమకు సమాచారం లేదని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
'మొదట పోలీసులన్నారు,ఇప్పుడు టెర్రరిస్టులంటున్నారు'
ఒడిశాలోని గంజాం జిల్లా సమర్జోలా గ్రామానికి చెందిన 29 ఏళ్ల పి. వెంకట రమణ అపహరణకు గురవ్వడంతో ఆయన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇతను బ్లూస్టార్ కంపెనీ తరఫున ఆరు నెలలుగా డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు.
''వెంకట రమణ భద్రత విషయంలో ఆందోళనగా ఉంది'' అని ఆయన తల్లి పి.నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొడుకు కిడ్నాప్ విషయమై హింజిలి పోలీసులకు ఫిర్యాదు చేశారామె.
''జూన్ 30న వెంకటరమణ చివరిసారిగా మాట్లాడాడు. పనికి వెళుతున్నాను. తర్వాత కాల్ చేస్తానని చెప్పాడు. మూడు రోజుల తర్వాత కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. కానీ, నాకేమీ అర్థం కాలేదు. కాసేపటికి నా చిన్న కొడుకు ఫోన్ చేసి అన్నను మాలిలో పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. కానీ, టీవీలో మాత్రం టెర్రరిస్టులు కిడ్నాప్ చేసినట్లుగా వస్తోంది. నాకు ఆందోళనగా ఉంది'' అని మీడియాతో చెప్పారు నర్సమ్మ.
వెంకటరమణ విషయంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎక్స్‌లో స్పందించారు.
''గంజాం జిల్లా హింజిలికట్ ప్రాంతానికి చెందిన వెంకట రమణను కొందరు తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా తెలిసింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఈ విషయంపై దృష్టి సారించి వారిని సురక్షితంగా తీసుకురావాలని కోరుతున్నాను'' అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మాలి ఎక్కడుంది, అక్కడేం జరుగుతోంది?
రిపబ్లిక్ ఆఫ్ మాలి ఆఫ్రికా ఖండంలోని ఓ దేశం. దీని రాజధాని బమాకో నగరం. సుమారు 2.3 కోట్ల జనాభా ఉంది.
90వ దశకం నుంచి భారతీయ వ్యాపారవేత్తలు మాలికి వెళ్లి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లుగా బమాకోలోని ఇండియా ఎంబీసీ చెబుతోంది.
సుమారు 400 మంది భారతీయులు ఆ దేశంలో ఉంటున్నారు. అక్కడ మైనింగ్, పవర్, స్టీల్, సిమెంట్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉన్నారని ఎంబసీ పేర్కొంది.
కొన్ని రోజులుగా మాలిలోని మిలటరీ స్థావరాలపై 'జిహాదిస్టు ఫైటర్లు' వరుస దాడులు చేస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మాలిలోని మిలటరీ ప్రభుత్వ సంస్థలపై జులై ఒకటో తేదీన టెర్రరిస్టులు దాడులు చేసినట్లుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
''మాలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన సీనియర్ అధికారులు సమీక్షిస్తున్నారు. అపహరణకు గురైన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రిపబ్లిక్ ఆఫ్ మాలితో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇలాంటి దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది'' అని తెలిపింది.
మాలిలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
''ప్రస్తుతం మాలిలోని పరిస్థితుల దృష్ట్యా భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. బమాకోలోని ఎంబసీతో మాట్లాడి అవసరమైన సహాయం పొందవచ్చు'' అని చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














