భారత ఎడారిలో పాకిస్తానీ యువజంట మృతదేహాలు...అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Latif Laghari
- రచయిత, షకీల్ అఖ్తర్, రియాజ్ సోహైల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక యువ జంట రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో శవాలై కనిపించింది.
ఆ జంట అక్రమంగా ఎడారిగుండా భారతదేశంలోకి అడుగుపెట్టిందని, సమీపంలోని ఏ గ్రామానికి లేదా నివాస ప్రాంతానికి చేరుకోకముందే చనిపోయారని స్థానిక అధికారులు చెబుతున్నారు.
చనిపోయి పడిఉన్న వారిద్దరినీ రవికుమార్, శాంతి బాయి అని, పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘులాం హుస్సేన్ లగరి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
తన కొడుకు కోపంతో ఇల్లు విడిచి వెళ్లిపోయాడని, భారతదేశానికి ఎప్పుడు వెళ్లాడో తనకు తెలియదని రవికుమార్ తండ్రి దివానో మేఘ్వార్ చెప్పారు.


ఫొటో సోర్స్, Mohar Singh Meena
భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో భారతదేశ భూభాగంలో గుర్తుతెలియని రెండు మృతదేహాలు పడి ఉన్నాయని స్థానికుడు ఒకరు జైసల్మేర్ జిల్లాలోని తనోత్ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారని జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌధరి మీడియాకు చెప్పారు.
''జూన్ 28న పోలీస్ టీమ్ అక్కడికి వెళ్లింది. ఒక చెట్టు కింద పురుషుడి మృతదేహం పడి ఉంది. నీలి రంగు సల్వార్, కుర్తా ధరించాడు. మెడలో పసుపు రంగు స్కార్ఫ్ వేసుకున్నాడు. పాకిస్తాన్ సిమ్ కార్డు ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు గుర్తించారు'' అని ఎస్పీ తెలిపారు.
అక్కడికి సుమారు 50 అడుగుల దూరంలో మహిళ మృతదేహాన్ని గుర్తించారని, ఆమె పసుపు రంగు గాగ్రా, కుర్తా ధరించారని, ఆమె చేతికి ఎరుపు, తెలుపు రంగు గాజులు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు.
''అక్కడి పరిస్థితి చూస్తే, వారు 8 నుంచి 10 రోజుల కిందటే చనిపోయినట్లుగా ఉంది. ఆ మృతదేహాలు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయి. ముఖాలు గుర్తించడం కష్టమైంది. ఎడారిలో అధిక వేడి, ఆకలి, దప్పిక వల్లే వారి చనిపోయి ఉంటారని ప్రాథమిక విచారణను బట్టి తెలుస్తోంది'' అని చెప్పారు.
ఆ మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారని, రిపోర్టు రావాల్సి ఉందని ఎస్పీ సుధీర్ చౌధరి అన్నారు.
వారివద్దనున్న పాకిస్తానీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. వాటి ఆధారంగా అతను దివానో కుమారుడు రవికుమార్, ఆమె గుల్లూ జీ కుమార్తె శాంతి బాయి అని గుర్తించామని వెల్లడించారు. జైసల్మేర్‌లోని వారి బంధువులు కూడా ధ్రువీకరించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తండ్రీ కొడుకుల వాగ్వాదమే కారణమా...
వరి పంటకు నీరు పెట్టే విషయమై తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగిందని రవి కుమార్, శాంతిబాయిల గ్రామానికే చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ లతీఫ్ లగరి..బీబీసీకి చెప్పారు.
''నీరు పెట్టడానికి వెళ్లాలని రవిని అతని తండ్రి దివానో అడిగారు. కానీ అతను నిరాకరించడంతో చెంప దెబ్బ కొట్టారు. దీంతో ఆగ్రహించిన రవి, భార్యను తీసుకొని మోటార్ సైకిల్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయారు’’ అని వెల్లడించారు.
దివానో పదిమంది సంతానంలో రవి కుమార్ మూడోవారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కొడుకు సరిహద్దు ప్రాంతమైన ఖేజులోని నూర్పూరు దర్గా సమీపంలో ఉంటాడనుకుని దివానో అక్కడికి వెళ్లి వెతికారని, కనిపించకపోయేసరికి నిరాశతో వెనుదిరిగారని లతీఫ్ చెప్పారు.
భారతీయ న్యూస్ చానెళ్లలో వార్తలను చూసిన తర్వాతే, ముఖ్యంగా సోషల్ మీడియాలో వారి పాకిస్తాన్ గుర్తింపు కార్డులనూ చూపించడంతో తన కొడుకు, కోడలు చనిపోయారనే సమాచారం దివానోకు తెలిసింది.
భారతదేశంలో ఉన్న రవి బంధువులే అంత్యక్రియలు పూర్తి చేశారని లతీఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాదిన్నర కిందటే భారతదేశ వీసాకు దరఖాస్తు...
భారతదేశ వీసా కోసం రవి ఏడాదిన్నర కిందటే దరఖాస్తు చేశారని జైసల్మేర్‌లోని ఆయన బంధువులతో పాటు సీమంత్ లోక్ సంఘటన్ అధ్యక్షుడు హిందు సింగ్ సోధా చెప్పారు. పాకిస్తాన్ నుంచి రాజస్థాన్‌కు వచ్చే హిందువుల కోసం ఈ సంఘం పనిచేస్తుంటుంది.
రవి ఇల్లు భారతదేశ సరిహద్దు నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో ఉందని, రవి పెట్టుకున్న వీసా అప్లికేషన్ తిరస్కరణకు గురైందని సోధా వెల్లడించారు.
‘‘తండ్రితో వాగ్వాదం తర్వాత ఇక భారతదేశంలోనే ఉండిపోవాలన్న ఉద్దేశంతోనే రవి, శాంతి భారతదేశంలో అడుగుపెట్టారని'' అన్నారు.
‘‘ జైసల్మేర్ ఎడారి ప్రాంతం. చాలా విశాలమైంది. జనాభా కూడా తక్కువే. సరిహద్దుకు ఇవతల 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఒక్కరూ నివసించరు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత జూన్ నెలలో 50 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ఎక్కడా నీటి వనరుల జాడ కూడా కనిపించదు’’ అని సోధా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














