మీ పళ్లెం సైజు మిమ్మల్ని ఎక్కువ తినేలా చేస్తోందా? నిజానికి, ఒక వ్యక్తి రోజుకి ఎంత తినాలి?

ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

మనం ప్లేట్లలో వడ్డించే ఆహారాన్ని పరిశీలిస్తే, గత కొన్నేళ్లుగా సగటు భోజన పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. తమకు ఎంత ఆహారం సరిపోతుందో చాలామందికి తెలుసు, కానీ అది వారికి ఎంత వడ్డిస్తారనే దానిని బట్టి మారొచ్చు.

కేవలం ఆహారం ఎక్కువగా వడ్డించడం వల్లే ఎక్కువగా తింటే, దాన్ని 'ఆహార పరిమాణ ప్రభావం (పోర్షన్ సైజ్ ఎఫెక్ట్)' అంటారు.

చాలామంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

అనారోగ్యకరమైన అలవాట్లు

"ప్రజలు తమకు అవసరమైన ఆహారం కంటే ఎక్కువ తిన్నప్పుడు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, అనారోగ్యకరమైన ఆహారాలు పెద్ద మొత్తంలో తినడం వల్ల చెడు పరిణామాలు ఉంటాయి" అని లీడ్స్ విశ్వవిద్యాలయంలో యాపిటైట్ అండ్ ఎనర్జీ బ్యాలెన్స్ ప్రొఫెసర్ జేమ్స్ స్టబ్స్ వివరించారు.

"పోర్షన్ సైజ్ ఎఫెక్ట్"కి కారణాలు మనకు పూర్తిగా తెలియదు.

  • భారీగా మార్కెటింగ్ ప్రమోషన్లు
  • రెడీమేడ్ ఆహారం
  • భారీగా ఆహారాన్ని అందించే రెస్టారెంట్లు
  • ఇంకా, పెద్ద ప్లేట్లలో వడ్డించడం

పైన పేర్కొన్నవన్నీ మనం అతిగా తినే పరిస్థితులను సృష్టించవచ్చు.

"1970లలో సగటు డిన్నర్ ప్లేట్ 22 సెం.మీ. ఉండేది. ఇప్పుడది 28 సెం.మీ. అయింది. కాబట్టి అనివార్యంగా మనం తినే పరిమాణం పెరిగింది. అలాగే, రెస్టారెంట్లు ఎక్కువ ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇలాగే ఇంట్లో కూడా చేయాలా వద్దా అనే విషయంపై ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు" అని బీడీఏ అధికార ప్రతినిధి, డైటీషియన్ క్లేర్ థోర్న్‌టన్-వుడ్ చెప్పారు.

ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మనం 'సాధారణంగా' ఎంత తినాలి?

మనం ఎంత తినాలనే విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో,

  • వయస్సు
  • లింగం
  • ఎత్తు లేదా బరువు
  • యాక్టివిటీ లెవెల్స్ ఆధారంగా ఉంటుంది.

ఇది "మీరు రోజులో ఏం తింటారు, ఎంత తరచుగా తింటారనే దానిపై ఆధారపడి ఉంటుంది" అని వుడ్ వివరించారు.

"అయితే, మనం ఎంత తినాలో(ఆహార పరిమాణం) అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ మార్గం మీ చేతులను ఉపయోగించడం" అని ఆయన చెప్పారు.

  • మాంసం - అరచేతి పరిమాణం
  • కోడి/చేప - చేతికి వచ్చేటంత
  • కూరగాయలు - ఒక గుప్పెడు
  • కార్బోహైడ్రేట్లు (బంగాళాదుంపలు, బియ్యం, పాస్తా మొదలైనవి) - ఒక గుప్పెడు
  • పండ్లు - ఒక గుప్పెడు

బీడీఏ (బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్) ప్రతి ఆహారం వడ్డించే పరిమాణం ఎంత ఉండాలనే దానిపై వివరణాత్మక ప్రోటోకాల్‌ను అందించింది.

ఆరోగ్యకరమైన మహిళలకు రోజుకు దాదాపు 2,000 కేలరీలు, పురుషులకు దాదాపు 2,500 కేలరీలు అవసరమని స్టబ్స్ చెప్పారు. పోర్షన్ సైజులు దీని ఆధారంగా ఉంటాయి.

"ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు, కాబట్టి సగటు మొత్తాలు అందరికీ పని చేయవు. కానీ ప్రజలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటే సమస్య కావొచ్చు" అని ప్రొఫెసర్ స్టబ్స్ చెప్పారు.

ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

అతిగా తినకుండా మార్గాలు

"అందరికీ ఒకే పరిమాణంలో ఆహారం అవసరం ఉండదని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు'' అని వుడ్ చెప్పారు.

ఉదాహరణకు, ఒక కుటుంబానికి భోజనం వడ్డిస్తున్నట్లయితే, అందులో ప్రతి వ్యక్తికీ ఒకేలా వడ్డించాల్సిన అవసరం లేదు, వారి అవసరాన్ని బట్టి వడ్డించాలన్నారు.

అలాగే, కొలత కోసం చెంచాలు వాడడం:

''బియ్యం, పాస్తా లేదా నూనె వంటి వాటికి స్పూన్లు వంటివి ఉపయోగించాలి. ప్లాస్టిక్ కప్పును కూడా వాడవచ్చు. ఒక ప్యాక్‌లో ఎంతమంది కోసం ఆహారం ఉంటుందో చూడండి. మీకు తెలియకుండానే ఒకరికి సరిపడినంత కంటే ఎక్కువ తింటుండవచ్చు.

ఆహార కంపెనీలు కూడా ప్రజలు తినే దానికి సరిపోయే విధంగా ప్యాకెట్ల సైజులను అందించాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఏం తింటున్నారో కూడా ముఖ్యమే..

బాగా తినడం అంటే మీరు ఎంత తింటున్నారో కాదు, ఏం తింటున్నారో కూడా ముఖ్యం. ప్రోటీన్ లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించడానికి సహాయపడతాయని వుడ్ చెప్పారు.

బీన్స్, కూరగాయలతో కూడిన సూప్ వంటి ఎక్కువ నీరు ఉన్న ఆహారాలు కూడా సహాయపడతాయని, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఫైబర్, నీరు ఉంటాయని ఆయన తెలిపారు.

అన్ని పోషకాల కంటే కొవ్వులో ఎక్కువ కేలరీలు ఉంటాయి, అది మీకు కడుపు నిండిన అనుభూతినీ కలిగిస్తుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, చేపలు, గింజలు, విత్తనాలు వంటి ఆహారం అందించే ఆరోగ్యకరమైన కొవ్వులను తక్కువ మొత్తంలో వాడటం మంచిది.

చాలావరకు అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలని స్టబ్స్ సూచించారు. అయితే. ఇష్టమైన ఆహారాలనూ వదులుకోవాల్సిన పనిలేదని ఆయన అంటున్నారు.

"మనం 80 శాతం ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీల పోషకమైన ఆహారాలను తీసుకుంటూ, మిగిలిన 20 శాతం మీకు ఇష్టమైన, అధిక కేలరీల ఆహారాలను చేర్చుకోవచ్చు" అని స్టబ్స్ తెలిపారు.

ఇద్దరు నిపుణులూ చెప్పేది ఏమిటంటే, ఆహారం ఎంత అనే దానిపై చింతించవద్దు, బ్యాలెన్స్‌ చేసుకుంటూ తినండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)