ఆఫీసులో ఏడవడం బలమా? బలహీనతా?

రేచల్ రీవ్స్

ఫొటో సోర్స్, House of Commons via PA Media

ఫొటో క్యాప్షన్, రేచల్ రీవ్స్ కంటతడి
    • రచయిత, ఫారియా మసూద్, కరెన్ హాగన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఈ వారం బ్రిటన్ ప్రధానమంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో యూకే చాన్స్‌లర్ రేచల్ రీవ్స్ కన్నీరు పెడుతున్నట్లుగా ఉన్న ఫోటోలు ఆ తర్వాత వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లలో ప్రముఖంగా కనిపించాయి.

అయితే, పనిచేసే చోట ఏడవడం అసాధారణమేమీ కాదని అంటుంటారు. దీనికి సంబంధించి బీబీసీతో తమ అనుభవాలను కూడా పంచుకున్నారు.

పనిలో చేరిన కొత్తలో తనపై ఎవరో అరిస్తే ఒకసారి ఏడ్చినట్లు 48 ఏళ్ల క్లారా చెప్పారు. ఆ తర్వాత ఫ్రస్టేషన్‌లో మరోసారి ఏడ్చినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

''ఇంటి నుంచి ఒక దుర్వార్త విన్న తర్వాత కూడా నేను ఏడ్చాను. వెంటనే చేస్తున్న పని ఆపేసి ఇంటికి వెళ్లిపోయాను'' అని ఆమె చెప్పారు.

మగవాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ప్రదేశంలో పనిచేస్తున్నందున తన భావోద్వేగాలను అణచిపెట్టుకోవాలని అనుకున్నట్లుగా ఎమ్మా అనే మరో మహిళ తెలిపారు. ఉద్వేగాలను చూపించడం వల్ల తనను ఒక బలహీన వ్యక్తిగా భావిస్తారేమో అనే ఉద్దేశంతో తన పట్ల తాను కఠినంగా వ్యవహరించినట్లు ఎమ్మా చెప్పారు.

పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఏడ్చే అవకాశం ఉన్నట్లు కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, సహోద్యోగుల ముందు తాము కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చాలామంది పురుషులు బీబీసీకి చెప్పారు.

గై క్లేటన్ ఒక వైద్యుడు. తనతో రోగులు, సహోద్యోగులు, కుటుంబీకులు తమ బాధలు చెప్పుకున్నప్పుడు చాలాసార్లు తాను కూడా ఏడ్చానని క్లేటన్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమాండా ఒక ఇంటర్వ్యూకు వెళ్లి తన వ్యక్తిగత విషయాలు తలుచుకొని దు:ఖించారు

ఫొటో సోర్స్, Amanda

ఫొటో క్యాప్షన్, అమాండా ఒక ఇంటర్వ్యూకు వెళ్లి తన వ్యక్తిగత విషయాలు తలచుకొని ఏడ్చారు.

‘బలం, బాధ్యత కాదు’

ఏడవడం బలమా? బలహీనతా?

పని చేసే ప్రదేశంలో ఏడవడం సరికాదని అనుకోవడం ఒక పాతకాలపు ఆలోచన అని ఎగ్జిక్యూటివ్ కోచ్, సక్సెస్ మెంటార్ షిరీన్ హోబన్ అన్నారు.

''ప్రొఫెషనలిజం అంటే భావోద్వేగాలను ఇంటి వద్దే వదిలేసి రావాలనే పాతకాలపు ఆలోచనను మనం దాటేశాం. నేటి కాలంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బలం, బాధ్యత కాదు'' అని ఆమె చెప్పారు.

పనిచేసే చోట ఉద్యోగులు కలత చెందడం అసాధారణమేమీ కాదని కెరీర్ కోచ్ జార్జియా బ్లాక్‌బర్న్ అన్నారు. కాబట్టి ఈ స్థితిలో ఉన్న ఉద్యోగులకు ఎలా మద్దతుగా నిలవాలో సంస్థలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇలా చేయడం వల్ల ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేస్తారని ఆమె అన్నారు.

''ఉద్యోగుల సమస్యలను వినే, వారి పట్ల కరుణతో ప్రవర్తించే, వారిని అర్థం చేసుకునే యజమాన్యం ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఆ సంస్థ సిబ్బంది మరింత ఉత్సాహంగా, సంతోషంగా పనిచేసే అవకాశం ఉంటుంది'' అని ఆమె తెలిపారు.

స్టాక్‌పోర్ట్‌కు చెందిన అమాండా పరిస్థితి కూడా ఇలాంటిదే.

17 ఏళ్ల క్రితం యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో ఉద్యోగం కోసం వెళ్లి ఇంటర్వ్యూలో ఆమె ఏడ్చారు. ఎందుకంటే, ఆ సమయంలోనే అమాండా తండ్రికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది.

ఇంటర్వ్యూలో ఏడ్చినప్పటికీ ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇప్పటికీ ఆమె అక్కడే పనిచేస్తున్నారు.

''ఆ విషయం తెలిసినప్పటి నుంచి మా నాన్న చనిపోయేంతవరకు అంటే దాదాపు 9 నెలల పాటు నేను రోజూ ఏడ్చాను. కానీ, దీన్ని వారు నార్మల్‌గానే భావించారు. అప్పుడే నేను ఎంత అద్భుతమైన వ్యక్తి కోసం పని చేస్తున్నానో, ఎంతటి అద్భుతమైన ప్రదేశంలో పనిచేస్తున్నానో గ్రహించాను’’ అన్నారు అమాండా.

''ఏడవడాన్ని సాధారణంగా మార్చండి''

ఫ్యాషన్ డిజైనర్ అమీ పౌనీ కూడా నిరుడు చివర్లో కఠిన సమయాన్ని ఎదుర్కొన్నారు.

వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపర జీవితంలో ఎదురైన మార్పులు, సవాళ్లతో సతమతమయ్యారు.

''ఆ కఠిన సమయంలో నేను దుఃఖం ఆపుకోలేకపోయాను. బహిరంగ ప్రదేశాల్లోనూ ఏడ్చేదాన్ని, స్టేజీ మీద కూడా ఏడ్చాను. పని ప్రదేశాల్లో ఏడవడాన్ని ఒక చెడు విషయంగా మార్చారు. కానీ, దీన్నొక సాధారణ అంశంగా మార్చండి'' అని బీబీసీ రేడియో కార్యక్రమంలో ఆమె చెప్పారు.

ఫ్యాషన్ డిజైనర్ అమీ పౌనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్యాషన్ డిజైనర్ అమీ పౌనీ

పురుషులు - మహిళలు, సిబ్బంది - బాస్‌లు

కానీ, అందరూ ఒకేలా ఉండరని, కొంతమంది జడ్జ్ చేస్తుంటారని చార్టర్డ్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (సీఎంఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫ్రాంకే అన్నారు.

ఏడ్చే మహిళలను ‘ఉద్వేగాలు అదుపులో ఉంచుకోలేరని’, విషాద వదనంతో కనిపించే పురుషులను బలహీనులుగా భావిస్తారని ఆమె చెప్పారు.

''ఒక సీనియర్ లీడర్ ఏడిస్తే దాన్నొక షాకింగ్ ఘటనగా, అనుచితంగా చూస్తారు. ఈ విషయంలో జూనియర్లకు వేరేలా ఉంటుంది. పెద్ద స్థానాల్లో ఉన్నవారు కూడా మనుషులే, వారు కూడా భావోద్వేగానికి గురవుతారు'' అని ఆమె అన్నారు.

ఏడుపు మీ ప్రమోషన్‌పై కూడా ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు.

అయితే, భావోద్వేగాలను ప్రదర్శించే వారిని సానుకూలంగా చూసే సంస్థలూ ఉన్నాయని ఆమె చెప్పారు.

ఆఫీసులో ఉన్నప్పుడు దుఃఖం వస్తే ఏం చేయాలి

  • ఒక చిన్న బ్రేక్ తీసుకొని, మిమ్మల్ని మీరు సముదాయించుకోండి
  • మీ భావోద్వేగాలను అణచుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఉద్యోగం పట్ల ఉన్న శ్రద్ధను, అంకితభావాన్ని ఇది తక్కువ చేయదు.
  • ఎవరినైనా సహాయం కోరండి. మీ సహోద్యోగితో మాట్లాడండి. మీ మేనేజర్‌ను లేదా హెచ్‌ఆర్ కలిసి వారి సహాయం తీసుకోండి.
  • సిబ్బందిలో ఎవరైనా ఏడుస్తుంటే మేనేజర్లు, సహోద్యోగులు స్పందించాలి. చూసీచూడనట్లు వ్యవహరించకుండా, వారిని ఓదార్చండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)