కశ్మీర్: పహల్గాం ఎలా ఉంది, అక్కడి వారికి మళ్లీ పని దొరుకుతోందా?

పహల్గాం

ఫొటో సోర్స్, Abid Bhat/BBC

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, పహల్గాం, కశ్మీర్

'' భూమిపై ఏదైనా స్వర్గం ఉంటే, అది ఇక్కడే ఉంది'' అనే.. శతాబ్దాల నాటి పర్షియన్ పద్యాన్ని కశ్మీర్‌ ప్రజలు తరచూ గుర్తుకు చేసుకుంటుంటారు. పహల్గాంను దృష్టిలో ఉంచుకునే దీన్ని రాశారని చాలామంది కశ్మీరీలు అంటుంటారు.

ఎత్తయిన హిమాలయ పర్వతాల మధ్యన, లిడ్డార్ నది సెలయేరు చప్పుళ్లతో ఆకట్టుకునే ఈ చిన్న పట్టణాన్ని 'మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా'గా చెబుతుంటారు.

చుట్టూ పచ్చిక బయళ్లు, లోయలు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం బాలీవుడ్ చిత్రాలకు అద్భుతమైన లొకేషన్లను అందించింది.

అంతేకాక, కాలుష్యం నుంచి తప్పించుకుని ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో గడిపేందుకు పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంటుంది.

కానీ, ఏప్రిల్ 22న ఈ అద్భుతమైన పచ్చిక మైదానం మారణహోమంగా మారడంతో ఈ ప్రశాంతమైన లోయ ప్రపంచ వార్తా శీర్షికల్లో ప్రధానాంశంగా నిలిచింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ రోజు

ఈ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీలో సేదతీరుతోన్న పర్యటకులపై దాడి చేసిన మిలిటెంట్లు 25 మందిని తమ కుటుంబం ఎదురుగానే హత్య చేశారు.

పర్యటకులకు సాయం చేసేందుకు ప్రయత్నించిన గుర్రపు స్వారీని నడిపే ఓ స్థానిక ముస్లిం వ్యక్తిని కూడా కాల్చి చంపారు.

ఈ మారణహోమం అణ్వాయుధాలున్న భారత్-పాకిస్తాన్ దేశాలను యుద్ధం అంచుల్లోకి తీసుకొచ్చింది. పర్యటకులపై జరిగిన ఈ దాడి విషయంలో పాకిస్తాన్‌ను భారత్ నిందించగా.. ఈ ఆరోపణలను ఇస్లామాబాద్ ఖండించింది.

పహల్గాం దాడి తర్వాత మే నెలలో రెండు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో నాలుగు రోజుల పాటు ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి.

ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

పహల్గాం

ఫొటో సోర్స్, REUTERS/Adnan Abidi

కోలుకుంటూ..

పహల్గాంలో పరిస్థితులు నెమ్మదించినట్లు కనిపిస్తోంది. కానీ, స్థానికులే వారి జీవితాలను తిరిగి చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పర్యటకంపైనే ఎక్కువగా ఆధారపడే పహల్గాంను తాజాగా నేను సందర్శించినప్పుడు.. ఆ ప్రాంతపు ప్రజలు కలసికట్టుగా ఈ బాధను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

సహజంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో పహల్గాంకు ఎక్కువ మంది పర్యటకులు వస్తుంటారు. కానీ, ఈ ఏడాది పహల్గాం పూర్తిగా పర్యటక రంగాన్నికోల్పోయింది.

''ఇక్కడ జరిగింది ఖండించదగినది. ఇది అమానవీయ చర్య. అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు.'' అని పహల్గాం హోటల్స్, రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జావీద్ బుర్జా చెప్పారు.

'' సరస్సులు, అడవులు, పచ్చిక బయళ్లు, హిమనీనదాల కోసం దేశవ్యాప్తంగా సందర్శకులు ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడి ప్రజలను, వారి ఆతిథ్యాన్ని చూసి చాలా మురిసిపోయేవారు.'' అని బుర్జా చెప్పారు.

''ఇక్కడి ప్రజలు చాలా పేదవారు. పూట గడిచేందుకు కూడా చాలా కష్టపడుతుంటారు. కానీ, వారెంతో దయ, సహృదయంతో ఉంటారు. ఈ అర్థరహిత హింస పర్యవసనాలను ప్రస్తుతం ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు'' అన్నారు.

'' జూన్ చివరి వరకు మాకు బుకింగ్స్ ఉండేవి. ఈసారి మా జీవనోపాధి అంతా పేకమేడలా కుప్పకూలిపోయింది. ఇక్కడ పెద్దగా ఏమీ మిగలలేదు.'' అని చెప్పారు.

ఈ దాడి తర్వాత పర్యటకులు అందరూ ఈ పట్టణాన్ని విడిచి వెళ్లారని, ఇక్కడికి రావాలనుకున్న వారు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

పహల్గాంకు మరో అవకాశాన్ని ఇవ్వాలని పర్యటకులను ఆయన కోరారు. దాడి జరిగిన వారాల వ్యవధిలోనే ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

అక్కడే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా అధికారుల సూచనను పక్కన పెట్టి, పహల్గాం వీధుల్లో సైకిల్‌పై తిరిగారు.

పహల్గాం సంక్షేమం తన వ్యక్తిగత అంశంగా అబ్దుల్లా భావించారు.

పహల్గాం ఈ ఏడాది ఏప్రిల్ 21న ఎలా ఉందో అలా చూడాలని ఆయన భావిస్తున్నారు.

పహల్గాంలో పర్యటకుల సందడి

ఫొటో సోర్స్, Abid Bhat/BBC

‘‘ముగ్గురిని తీసేశాను’’

ఆ రోజు పర్యటకులతో పహల్గాం సందడిగా ఉందని అక్కడ ప్రధాన మార్కెట్లో డ్రస్సులు, కశ్మీరీ ఎంబ్రాయిడరీ శాలువాలు అమ్మే ఫయాజ్ అహ్మద్ చెప్పారు. ఆ పట్టణం గుండా వెళ్తున్నప్పుడు రోడ్డుకు ఇరు వైపులా దుకాణాలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం చాలా మూతపడ్డాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొన్ని మాత్రమే తెరవడం ప్రారంభించారు.

నేను ఆయన్ను కలిసిన రోజే పర్యటకులపై దాడి జరిగిన తర్వాత తొలిసారి తన దుకాణాన్ని తెరిచినట్లు చెప్పారు.

కరోనా తర్వాత చివరి మూడు సీజన్లలో చాలామంది పర్యటకులు వచ్చినట్లు అహ్మద్ చెప్పారు.

'' ప్రతిరోజూ ఉదయం 11 గంటల కల్లా కనీసం మూడు వేల కార్లు వచ్చేవి. రెండు నుంచి మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యేది. చాలామంది పర్యటకులు అసలు తమకు వసతి దొరకడం లేదని చెప్పేవారు.'' అని తెలిపారు.

తన దుకాణం కూడా కొన్నిసార్లు జనాలతో కిటకిటలాడేదని, బయట నుంచి క్యూలు కట్టేవారని తెలిపారు. వ్యాపారం జోరుగా సాగిందన్నారు. కానీ, ప్రస్తుతం ముగ్గురు సేల్స్‌మెన్‌ను తీసేయాల్సి వచ్చిందని చెప్పారు. వ్యాపారం మళ్లీ పుంజుకుంటేనే తిరిగి వారిని నియమించుకుంటాన న్నారు.

పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం తనని తీవ్రంగా కలవరపెట్టింద న్నారు. 1989 నుంచి కశ్మీర్ లోయలో భారత వ్యతిరేక మిలిటెన్సీ చెలరేగడంతో.. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారిందని తెలిపారు.

'' ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు కూడా భయపడ్డాం. ఇక్కడికి వచ్చే పర్యటకులపై ఇలా ఎప్పుడూ జరగలేదు. కానీ, ఇప్పుడెందుకు వారిని లక్ష్యంగా చేసుకున్నారో అర్థం కావడం లేదు. ఇంతటి దారుణానికి ఎవరు ఒడిగట్టగలరు'' అని ప్రశ్నించారు.

పహల్గాంలో దుకాణాలు

ఫొటో సోర్స్, Abid Bhat/BBC

‘మా స్వర్గానికి ఏమైంది?’

ఈ ప్రాంతంలో జరిగిన మారణహోమానికి పాకిస్తాన్ ఆధారిత మిలిటెంట్లే కారణమని భారత్ ఆరోపిస్తోంది.

భారత పాలిత కశ్మీర్‌లో వేలాది మందిని పొట్టన పెట్టుకున్నతిరుగుబాటుదారులను సరిహద్దు దేశమే పెంచి పోషిస్తోందని దిల్లీ ఆరోపించింది. అయితే, అక్కడ మిలిటెంట్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఇస్లామాబాద్ ఖండించింది.

గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుబాటు తగ్గడంతో, లక్షలమంది పర్యటకులు ఇక్కడకు వస్తున్నారు. ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారుతుందనే భావన పర్యటకులలో పెరిగింది. కానీ, ప్రస్తుతం అంతా మారిపోయింది.

'' పహల్గాం పేరు దెబ్బతింది.'' అని ఇక్కడ నివసించే 80 ఏళ్ల వ్యక్తి నిసార్ అలి బాధపడ్డారు. '' ప్రజలు రుణాలు తీసుకుని దుకాణాలు తెరిచారు. ట్యాక్సీలు కొనుక్కున్నారు. కానీ, ప్రస్తుతం ప్రతి ఒక్కరి భవిష్యత్ అనిశ్చితంగా మారిపోయింది. మా స్వర్గానికి ఏమైందసలు?'' అని బాధపడ్డారు.

పహల్గాం

ఫొటో సోర్స్, Abid Bhat/BBC

మార్కెట్ నుంచి కేవలం 2 కి.మీల దూరంలో, బైసరన్‌ వెళ్లే రోడ్డు మార్గానికి చెందిన సైన్‌బోర్డులు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతానికి 5 కి.మీల మేర కాలి నడకన లేదా గుర్రాలపై వెళ్లాల్సి ఉంటుంది.

పర్యటకులపై దాడికి ముందు, ఇది పర్యటకులకు అత్యంత ప్రముఖ ప్రాంతాల్లో ఒకటి. లోయ అద్భుతమైన దృశ్యాన్ని అందించే ఈ పచ్చిక మైదానం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తెరిచి ఉంటుంది. వేసవి కాలంలో అయితే రోజూ వేలాది మంది పర్యటకులు వస్తుంటారు.

కానీ, ప్రస్తుతం పర్యటకులపై దాడితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మిలిటెంట్లకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కానీ, ఈ మారణహోమానికి పాల్పడిన వారిని మాత్రం ఇప్పటి వరకు పట్టుకోలేదు. దీంతో, వారు మళ్లీ తిరిగి వస్తారనే భయాందోళనలు నెలకొన్నాయి.

ఆరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పచ్చిక మైదానానికి 1,090 మంది వరకు పర్యటకులు వెళ్లినట్లు సంఘటనా స్థలానికి తొలుత చేరుకున్న పహల్గాం గుర్రాల యజమానుల సంఘం అధ్యక్షులు అబ్దుల్ వాహిద్ వానీ చెప్పారు.

దాడి జరిగినప్పుడు బైసరన్ లోయలో 300 మంది వరకు పర్యటకులు ఉన్నట్లు అంచనా వేశారు.. బైసరన్‌లో జరిగిన సంఘటన గురించి మీకేమైనా తెలిసిందా అని పోలీసుల నుంచి తనకు 2.36కు కాల్ వచ్చిందని తెలిపారు.

'' పచ్చిక మైదానానికి పర్యటకులను తీసుకెళ్లిన సహోద్యోగులకు నేను కాల్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ, ఎవరూ ఎత్తలేదు. ఏదో జరిగిందని అనిపించింది. నేను, నా సోదరుడు అక్కడకు పరిగెత్తాం. అక్కడకు వెళ్లే సరికి 3.10 అయింది'' అని తెలిపారు.

గుర్రపు స్వారీలు

ఫొటో సోర్స్, Abid Bhat/BBC

అమర్‌నాథ్ యాత్రతో..

పోలీసులు, పారామిలటరీలు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. '' పిల్లలు, మహిళలు ఏడవడం నేను చూశాను. మృతదేహాలు మైదానంపై పడి ఉన్నాయి. పది నుంచి పదిహేను మందికి గాయాలయ్యాయి.'' అని వానీ తెలిపారు.

దాడి జరిగిన తర్వాత బయటికి వచ్చిన వైరల్ వీడియోల్లో... బాధితులకు సాయం చేసేందుకు వానీ ప్రయత్నించడం, వారికి నీరు అందివ్వడం, వారికి సాయం చేసేందుకు వచ్చినట్లు చెప్పడం కనిపించాయి.

''ఆరోజు చూసిన దేన్ని నేను మర్చిపోలేను. చాలా భయం వేసింది. నాకు గుండెల్లో దడ పుట్టింది. అంతకుముందెన్నడూ ఇలాంటిది చూడలేదు.'' అని వానీ చెప్పారు.

పహల్గాంలో నేను ఆయన్ను కలిసినప్పుడు, ఆయన చాలా అలసిపోయినట్లు కనిపించారు. ఆయన కళ్లు నిద్ర సరిగ్గా లేక లోపలికి పోయాయి.

'' ఎన్నో రాత్రులు నేను నిద్రపోలేకపోయాను. ఇంకా నిద్ర సమస్య నన్ను వేధిస్తోంది. మిలిటెంట్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు మా వెనుకాలే వచ్చుంటే పరిస్థితి ఏంటని మేం భయపడుతున్నాం. ఎందుకంటే, వారు చంపాలనుకున్న వారిని మేం సాయం చేసి తీసుకొచ్చాం'' అని తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో మేం మాట్లాడుకున్నప్పుడు, కాస్త ఆయనలో ఆశావాదం కనిపించింది.

ఏటా హిందూ భక్తులు చేసే అమర్‌నాథ్ యాత్ర కోసం వేలాది మంది వస్తుండటంతో.. మళ్లీ నగర జీవితం సాధారణ స్థితికి వస్తోంది. జులై 3 నుంచి ఈ యాత్ర ప్రారంభమై, ఆగస్టు 9 వరకు జరుగుతుంది. డజన్ల కొద్ది క్యాంపులు ఏర్పాటు చేశారు. భద్రత కోసం ఈ యాత్ర జరిగే ప్రాంతం గుండా వేలాది మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, Abid Bhat/BBC

‘మళ్లీ పనిదొరుకుతోంది’

అమర్‌నాథ్ యాత్రకు ట్రెక్కింగ్ మొదలుపెట్టే రెండు ప్రాంతాలలో ఒకటి పహల్గాంనే. చాలామంది భక్తులు యాత్ర చేసేందుకు గుర్రపు స్వారీలను ఆశ్రయిస్తుంటారు. దీంతో వానికి, ఆయన సహోద్యోగులకు ప్రస్తుతం పని దొరుకుతోంది.

పర్యటకులు ఈ ప్రాంతానికి తిరిగి రావడం ప్రారంభించడంతో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా టూర్ ఆపరేటర్స్ ప్రెసిడెంట్ రవి గోసేన్ మాట్లాడుతూ.. జూన్‌లో కశ్మీర్ లోయను సందర్శించిన 45,000 మందికి పైగా పర్యటకులు 40 శాతం మంది పహల్గాంకు వెళ్లినట్లు తెలిపారు.

నేను ఒక రోజు అక్కడకు వెళ్లినప్పుడు, ''లవ్ పహల్గాం'' అనే బోర్డు వద్ద ఫోటోలను తీసుకునేందుకు కొన్ని కుటుంబాలు నన్ను ఆపాయి.

షాబిబా, హమీద్ జఫర్ గత ఏడాది ఇదే సమయంలో పహల్గాంను సందర్శించారు. ఇక్కడ ఫోటో తీసుకునేందుకు కనీసం అర్ధగంట వేచిచూడాల్సి వచ్చిందని, అంత రద్దీగా ఉందన్నారు. ''ఈ ఏడాది రావాలనుకున్నప్పుడు, అక్కడంత సురక్షితంగా లేదని మా స్నేహితులు వద్దని చెప్పారు.'' అని షాబిబా చెప్పారు. కానీ, ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉందని, కశ్మీర్‌కు వెళ్దాం అని మా పిల్లలు చెప్పారు.

ఫోటోలు చూసిన తర్వాత తన స్నేహితులు కాల్ చేసినట్లు జఫర్ చెప్పారు. '' హాలిడే కోసం ఇక్కడకు రావాలని నేను వారికి చెప్పాను. ఇంత అందాన్ని ఎక్కడ చూస్తారు? ఇంతటి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది?'' అని చెప్పినట్లు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)