పహల్గాం దాడి: బైసరన్ వ్యాలీ పర్యవేక్షణ బాధ్యత ఎవరిది, ‘సెక్యూరిటీ క్లియరెన్స్’పై ఏం చెబుతున్నారు?

జమ్మూ కశ్మీర్, పహల్గాం దాడి
ఫొటో క్యాప్షన్, బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22న జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది చనిపోయారు.
    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోజు మాదిరిగానే ఏప్రిల్ 22న కూడా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యటకులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఈ ప్రదేశం పహల్గాం మార్కెట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అదే రోజు మధ్యాహ్నం తీవ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. వారిలో 25 మంది పర్యటకులు కాగా, ఒక స్థానిక యువకుడు ఉన్నారు.

గత మూడు దశాబ్దాల్లో, జమ్మూకశ్మీర్‌లో పర్యటకులు లక్ష్యంగా ఇంత పెద్ద దాడి జరగడం ఇదే తొలిసారి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలింతకీ ఈ అందమైన బైసరన్ వ్యాలీ నిర్వహణాబాధ్యతలు చూసేదెవరు? దీనిని ఎప్పుడు తెరుస్తారు? ఎప్పుడు మూసేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం. అలాగే, దీనితో సంబంధమున్న వ్యక్తులు, స్థానికులు ఏం చెబుతున్నారో చూద్దాం.

జమ్మూ కశ్మీర్, పహల్గాం దాడి
ఫొటో క్యాప్షన్, బైసరన్ వ్యాలీని పహల్గాం డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది.

పర్యవేక్షణ బాధ్యతలు

బైసరన్ వ్యాలీ పహల్గాం డెవలప్‌మెంట్ అథారిటీ(పీడీఏ) పరిధిలోకి వస్తుంది. బైసరన్‌తో పాటు పహల్గాంలోని ఇతర పర్యటక ప్రాంతాలను కూడా ఈ అథారిటీనే పర్యవేక్షిస్తుంది.

ఈ అథారిటీతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది. బైసరన్ పార్క్ బాధ్యతలను తమ డిపార్ట్‌మెంటే పర్యవేక్షిస్తుందని వారు స్వయంగా నాతో చెప్పారు.

పర్యవేక్షణాబాధ్యతల గురించి వివరిస్తూ, బైసరన్ లేదా పహల్గాంలోని ఇతర ప్రదేశాల బాధ్యతలను కూడా అథారిటీనే చూస్తుందని వారన్నారు.

ఈ అథారిటీ పహల్గాంలోని బైసరన్ వ్యాలీతో పాటు బెతాబ్ వ్యాలీ, ఇంకా ఇతర చిన్నా పెద్ద పార్కుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తుంది. ఈ ఒప్పందం మూడేళ్లు ఉంటుంది.

పహల్గాంలో పనిచేసిన ఉద్యోగి మాట్లాడుతూ, గత ఏడాది బైసరన్ పార్క్ నిర్వహణ బాధ్యతలను మూడేళ్లకు గానూ 3 కోట్ల రూపాయల టెండర్‌ను ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఆయన తనపేరు బయటకు వెల్లడించొద్దన్నారు.

సదరు ప్రైవేట్ కాంట్రాక్టర్‌ను సంప్రదించేందుకు బీబీసీ కూడా ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు.

జమ్మూ కశ్మీర్, పహల్గాం దాడి
ఫొటో క్యాప్షన్, వాతావరణం అనుకూలంగా లేని సమయాల్లో బైసరన్ వ్యాలీని మూసేస్తారు.

బైసరన్ వ్యాలీని ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు మూసేస్తారు?

బైసరన్ పార్క్, బెతాబ్ వ్యాలీ ఏడాది పొడవునా తెరిచే ఉంటాయని అథారిటీ అధికారి ఒకరు, తన వివరాలు బహిర్గతం చేయద్దన్న షరతుతో బీబీసీకి చెప్పారు.

వాతావరణం అనుకూలించనప్పుడు కొద్దికాలం బైసరన్ వ్యాలీని మూసేస్తారని అన్నారు. భారీగా మంచుకురిసే సమయంలో కశ్మీరీలు కూడా ఇళ్లకే పరిమితమవుతారని, అలాంటి సందర్భాల్లో పర్యటకులు కూడా బైసరన్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లరని ఆయన అన్నారు.

బైసరన్ పార్క్ తెరవాలని కానీ, మూసివేయాలని కానీ పోలీసులు లేదా ఇతర భద్రతా సంస్థలు తమకు ఎప్పుడూ చెప్పలేదని ఈ అధికారి తెలిపారు.

'సెక్యూరిటీ క్లియరెన్స్'గా చెబుతున్నట్లు, బైసరన్ వ్యాలీ తెరవడంపై పోలీసుల వైపు నుంచి తమతో ఎలాంటి సంప్రదింపులూ జరగలేదని ఆయన అన్నారు.

గత ఏడాది అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా, దాదాపు రెండునెలల పాటు బైసరన్ వ్యాలీని మూసివేసినట్లు అథారిటీకి చెందిన మరో అధికారి తెలిపారు. అయితే, దాని గురించి కూడా పోలీసులు తమతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదని ఆయన చెప్పారు.

బైసరన్ వ్యాలీలో పోలీసులు లేదా భద్రతా సిబ్బంది ఎప్పుడూ లేరని ఈ అధికారి చెప్పారు. బైసరన్ వ్యాలీ ఏడాది పొడవునా తెరిచే ఉంటుందని ఆయన అన్నారు.

బైసరన్ తెరవడానికి సంబంధించిన అనుమతుల గురించి గత మూడేళ్లలో ఎన్నడూ పోలీసులు తమ శాఖతో సంప్రదింపులు జరపలేదని ఆయన అన్నారు.

జమ్మూ కశ్మీర్, పహల్గాం దాడి
ఫొటో క్యాప్షన్, పహల్గాం డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు తమ పేర్లు బహిర్గతం చేయొద్దన్న షరతుతో బీబీసీతో మాట్లాడారు.

ఈ విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయాలనుకోవడం లేదని మరో అధికారి అన్నారు.

మీరు అడుగుతున్న ప్రశ్నలకు మేం సమాధానం చెప్పలేం, ఇది సున్నితమైన విషయమని ఆయన అన్నారు.

బీబీసీతో మాట్లాడిన పహల్గాం డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులందరూ తమ పేర్లు బయటకు వెల్లడించొద్దని మాతో అన్నారు.

మరోవైపు, బైసరన్ పార్క్ తెరిచేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం లాంటిదేదీ లేదని ఒక సీనియర్ పోలీసు అధికారి అన్నారు. ఈ పోలీసు అధికారి ఐదేళ్ల కిందట ఒకసారి, ఏడాది కిందట మరోసారి అనంత్‌నాగ్‌లో పనిచేశారు.

ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు. ఇక్కడ పనిచేసిన సమయంలో బైసరన్ పార్క్ తెరిచేందుకు సెక్యూరిటీ క్లియరెన్స్ వంటి చర్చ ఏదైనా పహల్గాం డెవలప్‌మెంట్ అథారిటీతో జరిగిందా అని మేం ఆయన్ను అడిగాం. తాను పనిచేసిన సమయంలో అలాంటిదేమీ జరగలేదని ఆయన చెప్పారు.

జమ్మూ కశ్మీర్, పహల్గాం దాడి

గుర్రాల యజమానులు ఏం చెప్పారంటే..

పహల్గాంలోని పోనీ స్టాండ్ నంబర్‌వన్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ వానీ బీబీసీతో మాట్లాడుతూ, ఈ దాడికి ముందు తమ స్టాండ్ నుంచి ప్రతిరోజూ గుర్రాలపై పర్యటకులను బైసరన్ పార్కుకు తీసుకెళ్లేవాళ్లమన్నారు.

''బైసరన్‌లో టూరిస్టులపై దాడి జరిగిన రోజు మా స్టాండ్ నుంచి పది గుర్రాలు పర్యటకులను బైసరన్‌కు తీసుకెళ్లాయి. బైసరన్‌ వ్యాలీ ఎప్పుడూ మూతపడలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్కడికి పర్యటకులను తీసుకెళ్తున్నాం. మా స్టాండ్ నుంచి ప్రతిరోజూ యాభై గుర్రాలు బైసరన్ లోయకు వెళ్లేవి. నా జీవితంలో, బైసరన్ మూసేయడం 2024లో అమర్‌నాథ్ యాత్ర సమయంలో చూశా'' అని ఆయన అన్నారు

''మా నాన్న కూడా గుర్రంపై పర్యటకులను తీసుకెళ్లేవారు. దశాబ్దాల కిందట పహల్గాంలో రెండు సైట్ సీన్‌లు (పర్యటక ప్రదేశాలు) మాత్రమే ఉండేవని ఆయన నాతో చెప్పేవారు. వాటిలో ఒకటి శికార్‌గా, మరోటి బైసరన్ వ్యాలీ. ఆ తర్వాత శికార్‌గా వరకూ రోడ్డు వేశారు. దీంతో అక్కడకు గుర్రపు స్వారీలు నడపడం మానేశారు.''

ఇప్పుడు, పహల్గాంలో బైసరన్‌ వ్యాలీ సహా కనీసం ఏడు సైట్‌ సీన్‌లు ఉన్నాయి. గుర్రాలపై వెళ్లి చూసొచ్చే ప్రదేశాల గురించి ఇక్కడి స్థానికులు సైట్‌ సీన్‌ అనే పదాన్ని వాడతారు.

మా తండ్రుల కాలం నుంచే బైసరన్ వ్యాలీ సందర్శన కోసం పర్యటకులు వచ్చేవారని బషీర్ అహ్మద్ చెప్పారు. కశ్మీర్‌లో తీవ్రవాదం మొదలుకాకముందు నుంచే పర్యటకులు, స్థానికులు బైసరన్ వ్యాలీకి వస్తుండేవారని అన్నారు.

బషీర్ అహ్మద్ చెప్పిన దాని ప్రకారం, బైసరన్ వ్యాలీ చేరుకోవడానికి రెండు ట్రెక్ మార్గాలున్నాయి. ఒక ట్రెక్ మూడు కిలోమీటర్లు కాగా, మరోటి 6 కిలోమీటర్లు. ఒక ట్రెక్‌ను హిల్ పార్క్ అని, మరో దానిని సీఎం బేస్ రోడ్ అని పిలుస్తారు.

ఏప్రిల్ 22కు ముందు తాము తీసిన బైసరన్ లోయ ఫోటోలు, వీడియోలు ఏవైనా ఉన్నా, వాటిని షేర్ చేయడానికి భయమేస్తోందని మరో గుర్రపు స్వారీ అసోసియేషన్‌కు చెందిన ఒకరు మాతో చెప్పారు.

పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే, మేం మీకు చాలా వీడియోలు చూపించగలమని ఆయన అన్నారు. బైసరన్ వ్యాలీ ఏడాది పొడవునా తెరిచే ఉంటుందని చెప్పడానికి ఆ వీడియోలు సరిపోతాయి.

బైసరన్ వ్యాలీ తెరిచేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని దాడి జరిగిన కొద్దిరోజుల తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ చెప్పినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

జమ్మూ కశ్మీర్, పహల్గాం దాడి
ఫొటో క్యాప్షన్, బైసరన్ పార్క్ మూసేయడం తామెప్పుడూ చూడలేదని స్థానికులు చెప్పారు.

స్థానికులు ఏమంటున్నారు?

బైసరన్ వ్యాలీ ఎప్పుడైనా మూతపడిందా అని తెలుసుకోవడానికి బీబీసీ పహల్గాంలో కనీసం పది మంది స్థానికులతో మాట్లాడింది. వాళ్లందరూ బైసరన్ మూసేయడం తామెప్పుడూ చూడలేదని చెప్పారు.

బైసరన్ పార్క్ మూసేయడం తానెప్పుడూ చూడలేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని స్థానికుడొకరు నాతో చెప్పారు. 2024లో, అమర్‌నాథ్ యాత్ర సమయంలో కేవలం 2 నెలలు మాత్రమే మూసివేసినట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో అక్కడ భద్రతా బలగాలను కూడా మోహరించారని ఆ వ్యక్తి నాతో అన్నారు.

జమ్మూ కశ్మీర్, పహల్గాం దాడి
ఫొటో క్యాప్షన్, బైసరన్‌లో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి.

బైసరన్ వ్యాలీ సమాచారం

పహల్గాం బజార్ నుంచి బైసరన్ పార్క్ వెళ్లే దారి కఠినమైన కొండమార్గం. అక్కడికి గుర్రాలపైనా, లేదంటే కాలినడకన వెళతారు.

బైసరన్ పార్క్ సముద్రమట్టానికి దాదాపు 8 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇది చుట్టూ దట్టమైన అడవులతో ఉండే లోయ ప్రాంతం. బైసరన్ లోయను మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు.

బైసరన్ పార్క్‌లోకి వెళ్లేందుకు ఎంట్రీ టికెట్ కొనాల్సి ఉంటుంది. టికెట్ ధర పెద్దవాళ్లకు 35 రూపాయలు, చిన్నపిల్లలకు 20 రూపాయలు.

పహల్గాం దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఒక భాగం. శ్రీనగర్ నుంచి పహల్గాంకి సుమారు 100 కిలోమీటర్ల దూరం.

ఇక్కడ ఎన్నో బాలీవుడ్ సినిమాలు, నాటకాలు, షార్ట్‌ ఫిల్మ్స్ చిత్రీకరణ జరిగింది.

ఏటా లక్షలాది మంది భక్తులు పహల్గాం మార్కెట్ మీదుగా అమర్‌నాథ్ యాత్రకు వెళతారు. ఈ యాత్ర బేస్‌క్యాంప్ పహల్గాంలోని నున్వాన్‌లో ఉంటుంది. ఈ బేస్‌క్యాంప్ నుంచి యాత్రికులు బృందాలుగా అమర్‌నాథ్ గుహకు వెళతారు.

అమర్‌నాథ్ యాత్ర సమయంలో పహల్గాం నుంచి గుహ వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఎత్తైన పర్వతాలపై భద్రతా దళాలను మోహరిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)