భారత్ దాడికి నా కుటుంబంలో 10మంది చనిపోయారు: ‘ఉగ్రవాది’ మసూద్ అజర్ ప్రకటన

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో బుధవారం తెల్లవారుజామున భారత్ జరిపిన దాడులలో తన కుటుంబానికి చెందిన పదిమంది కుటుంబసభ్యులు చనిపోయినట్టు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మౌలానా మసూద్ అజర్ తెలిపారు.
మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మొహమ్మద్ (జేఈఎం) విడుదల చేసిన ప్రకటనలో చనిపోయినవారిలో మసూద్ పెద్ద అక్క, ఆమె భర్త, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నట్టు తెలిపింది.
ఈ దాడిలో మసూద్ సన్నిహితులు ముగ్గురు చనిపోయారనీ, వారిలో మసూద్ సన్నిహితులకు చెందిన ఒకరి తల్లి కూడా ఉన్నట్టు జైషే మొహమ్మద్ గ్రూపు తెలిపింది.
జమ్మూకశ్మీర్‌లో 2019 ఫిబ్రవరిలో జైషే మొహమ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది సైనికులు మరణించారు. ఈ ఘటన భారత్, పాకిస్తాన్‌లను యుద్ధం ముంగిట నిలిపింది.
భారత్ దాడుల్లో 26 మంది మృతి: పాకిస్తాన్
మరోవైపు, భారత వైమానిక దాడుల్లో 26 మంది చనిపోయారని, 46మంది గాయపడ్డారని పాకిస్తాన్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురీ ప్రకటించారు.
అయితే, తాము పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. తమ దాడుల్లో పాకిస్తాన్ పౌరులెవరూ మరణించలేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పూంఛ్ జిల్లాలో 10 మంది మృతి
భారత్ వైమానిక దాడులు జరిపిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు భారీస్థాయిలో కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో పదిమంది భారత పౌరులు చనిపోయారని, 32మందికి పైగా గాయపడ్డారని భారత ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
చనిపోయిన పదిమందీ పూంఛ్ జిల్లాకు చెందినవారు.
పూంఛ్, మెహందర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయని స్థానికులు బీబీసీకి తెలిపారు. అనేక భవనాలు, ఇళ్లు, షాపులు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.
''కొన్ని గంటలపాటు భారీ స్థాయి పేలుళ్లు జరిగాయి'' అని పూంఛ్ జిల్లాకు చెందిన స్థానిక జర్నలిస్టు జమ్‌రూద్ ముఘల్ బీబీసీకి ఫోన్‌లో చెప్పారు.
''ప్రజలు రాత్రంతా నిద్రపోలేదు. ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు'' అని ముఘల్ తెలిపారు.
''గాయపడ్డవారితో మా లోకల్ ఆస్పత్రి నిండిపోయింది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మిసైల్ దాడులు ఎప్పుడు, ఎలా మొదలుపెట్టామంటే...ఆపరేషన్ వివరాలు వెల్లడించిన కల్నల్ సోఫియా
పాకిస్తాన్‌లోని తీవ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, భారత ఆర్మీ ప్రతినిధులు కల్నల్ సోఫియా ఖురేషీ , వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మీడియా సమావేశంలో వివరించారు.
జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను, పర్యటక రంగాన్ని దెబ్బతీసేందుకే పహల్గాం దాడి జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.
గత ఏడాది 2 కోట్ల 25లక్షలమంది జమ్మూకశ్మీర్‌లో పర్యటించారని ఆయన తెలిపారు.
సీమాంతర దాడులపై స్పందించే హక్కు భారత్‌కు ఉందని, అందుకు అనుగుణంగానే భారత్ దాడులు చేసిందని మిస్రీ తెలిపారు.
ఇది రెచ్చగొట్టేచర్యకాదని అన్నారు.
''భారత్‌పై మరిన్ని దాడులు జరగబోతున్నాయని నిఘావర్గాలు అంచనాకొచ్చాయి. దాడులను అడ్డుకోవడం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరైంది'' అని విక్రమ్ మిస్రీ అన్నారు.
''భారత్ దాడులు కచ్చితమైనవి, బాధ్యతతో కూడుకున్నవి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
పహల్గాం దాడి అత్యంత క్రూరమైనదని మిస్రీ అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను దెబ్బతీయడమే దాడి లక్ష్యమని, అభివృద్ధిని దెబ్బతీయడం ద్వారా ఈ ప్రాంతం వెనుకబడేలా చేయాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని మిస్రీ ఆరోపించారు. భారత్‌లో మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరిగిందని తెలిపారు.
''పహల్గాం దాడి దర్యాప్తులో ఉగ్రవాదులకు పాకిస్తాన్‌తో సంబంధాలు బయటపడ్డాయి. ఉగ్రవాద స్థావరాలను తొలగించేందుకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు'' అని విక్రమ్ మిస్రీ అన్నారు.
''పాకిస్తానీయులు, పాకిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారు'' అని విక్రమ్ మిస్రీ ఆరోపించారు.
పహల్గాం దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని, ఇది పాకిస్తాన్‌లో ఉన్న లష్కరే తోయిబా గ్రూపుకు చెందిందని ఆయన తెలిపారు.
భారత ఆర్మీ అర్ధరాత్రి ఒంటిగంట ఐదు నిమిషాల నుంచి ఒకటిన్నర మధ్య ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని ఇండియన్ ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.
''ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రవాదదాడిలో బాధితులైన సాధారణ పౌరుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించాం. విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఆధారంగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని పూర్తిగా ధ్వంసం చేశాం'' అని సోఫియా వెల్లడించారు.

ఫొటో సోర్స్, BBC/Screenshot
భారత యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించుకున్న పాకిస్తాన్
భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాకిస్తాన్ ప్రకటించింది.
‘‘ఇప్పటిదాకా మూడు రఫెల్, ఒక ఎస్‌యు-30, ఒక మిగ్ -20, ఒక హెరాన్ డ్రోన్ సహా మొత్తం ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని నేను ధృవీకరిస్తున్నాను’’ అని పాకిస్తాన్ మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి ఓ వీడియోలో చెప్పారు.
ఈ వీడియోను రాయ్‌టర్స్ వార్తా సంస్థ షేర్ చేసింది.
అయితే ఈ ప్రకటనలపై ఇండియా ఇంకా స్పందించలేదు.
పాకిస్తాన్ ప్రకటనను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించడం లేదు.

ఫొటో సోర్స్, ANI
వైమానిక దాడిపై ఎవరేమన్నారు?
ఆపరేషన్ సిందూర్ గురించి హోంమంత్రి మాట్లాడారు. మన సాయుధ బలగాలను చూస్తే గర్వంగా ఉందని అమిత్ షా ట్వీట్ చేశారు.
‘‘పహల్గాంలో మన అమాయక సోదరులను పాశవికంగా చంపినందుకు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ఇచ్చిన జవాబు ఇది’’ అని హోం మంత్రి ఎక్స్‌లో రాశారు.
‘‘భారత్‌పైనా, భారత ప్రజలపై జరిగే ఎలాంటి దాడికైనా మోదీ ప్రభుత్వం తగిన సమాధానమిస్తుంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని అమిత్ షా తన పోస్టులో పేర్కొన్నారు.
అలాగే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ మాతా కీ జై అని ట్వీట్ చేశారు.


సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా, జై హింద్ అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ చిత్రాన్ని షేర్ చేస్తూ ‘న్యాయం జరిగింది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఒక భారతీయ పౌరుడిగా ముందు మన సాయుధ దళాలకు అండగా నిలవాలి. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద ఫ్యాక్టరీలపై దాడులు గర్వపడేలా చేశాయని’’ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.
‘‘మనందరం ఒకే గళం వినిపిద్దాం - జై హింద్!’’ అని రాశారు.
ప్రముఖ నటుడు చిరంజీవి కొణిదెల తన ఎక్స్ ఖాతాలో ఆపరేషన్ సిందూర్ ఫోటోను షేర్ చేసి జై హింద్ అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన రక్షణ దళాలు జరిపిన దాడులను స్వాగతిస్తున్నా. మరోసారి పహల్గాం లాంటి దాడులు జరగకుండా పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలన్నీ పూర్తిగా ధ్వంసం కావాలి. జై హింద్’’ అని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, facebook/allu arjun
పహల్గాంలో బాధితులను గుర్తు చేసిన అల్లు అర్జున్ ‘న్యాయం జరగాలి’ జై హింద్ అని ట్వీట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ పోస్టును షేర్ చేస్తూ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ‘ఒక దేశంగా ఐకమత్యంగా నిలబడాలి’ అని రాశారు.
మన భద్రతా బలగాల కోసం దేశమంతా ప్రార్థిస్తోందని మహీంద్రా అన్నారు.
సీపీఎం ప్రకటన
ఆపరేషన్ సిందూర్‌పై భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో ప్రకటన విడుదల చేసింది.
''పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించాయి. సాయుధ దళాల ప్రకారం.. అత్యంత పకడ్బందీగా, 9 ప్రదేశాల్లో విజయవంతంగా దాడులు చేశాయి.
ఉగ్రవాదులు, వారిని పెంచిపోషిస్తున్న వారే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి.
ఈ చర్యలతో పాటు పహల్గాంలో అమాయక ప్రజల ఊచకోతకు కారణమైన వారిని అప్పగించడం, తమ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలు పనిచేయకుండా చర్యలు చేపట్టేలా పాకిస్తాన్‌పై ఒత్తిడిని కొనసాగించాలి. భారత ప్రభుత్వం ప్రజల ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడాలి'' అని పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














