'జడేజా దృఢ సంకల్పం, బుమ్రా పట్టుదల, సిరాజ్ ధైర్యం క్రికెట్ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నాయి'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సంజయ్ కిశోర్
- హోదా, బీబీసీ కోసం
లార్డ్స్ టెస్ట్ క్లైమాక్స్ వంటి ఘట్టాలు టెస్ట్ క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
గాయపడిన ఇద్దరు ప్లేయర్లు (షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్), అలసిపోయిన కెప్టెన్ (బెన్ స్టోక్స్), పట్టువిడవక పోరాటం చేసిన ఆల్ రౌండర్ (రవీంద్ర జడేజా) తమ ప్రదర్శనలతో టెస్ట్ మజాను ప్రేక్షకులను అందించారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది.
ఓవైపు అలసిన శరీరంతో మైదానంలో బెన్‌స్టోక్స్ పోరాడుతూ కనిపించగా, మరోవైపు రవీంద్ర జడేజా, భారత శిబిరంలో ఆశలు సన్నగిల్లకుండా మైదానంలో పోరాటం చేశాడు.
అయినప్పటికీ, భారత్‌కు ఓటమి తప్పలేదు. విజయానికి చాలా చేరువగా వచ్చిన టీమిండియా 22 పరుగులతో ఓడిపోయింది. చిన్న చిన్న కారణాలు ఈ పెద్ద ఓటమికి దారి తీశాయి.


ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్ అయిదో రోజున, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేక నిరాశపరచగా, రవీంద్ర జడేజా మాత్రం పట్టువీడకుండా ఆడాడు.
వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌లో నాలుగో అర్ధ సెంచరీ సాధించాడు. కానీ, ఈసారి అతను సంబరాలు చేసుకోలేదు.
జడేజా 181 బంతుల్లో 61 పరుగులు చేయగా మరో ఎండ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ అతనికి సహకరించారు.
బుమ్రాతో కలిసి 132 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
తర్వాత సిరాజ్‌తో కలిసి 23 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చాడు.
అద్భుతమేదో జరుగుతుందని అందరూ ఆశించిన వేళ, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ అవుటవడంతో భారత్‌కు గెలుపు దూరమైంది. ఏం జరిగిందో గ్రహించిన తర్వాత సిరాజ్ అలాగే క్రీజులో కూలబడ్డాడు.
జడేజా చివరివరకు అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. విజయానికి చేరువగా వచ్చి ఓడిపోవడంతో నిరాశ చెందాడు.

ఫొటో సోర్స్, Getty Images

లార్డ్స్ టెస్ట్ ఆఖరి రోజును భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 58/4 స్కోరుతో మొదలుపెట్టింది. అప్పటికి కేఎల్ రాహుల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
చేతిలో 6 వికెట్లు ఉండగా, విజయానికి 135 పరుగులు చేయాలి. చూడటానికి లక్ష్యం చిన్నదిగానే కనిపించినా ఇంగ్లండ్ బౌలర్లు పరిస్థితిని కష్టతరం చేశారు.
అయిదోరోజు సోమవారం మ్యాచ్ మొదలైన తొలి గంటలోనే భారత్ 3 కీలక వికెట్లను కోల్పోయింది. రిషభ్ పంత్ (9), కేఎల్ రాహుల్ (39), సుందర్ (0) అవుటయ్యారు.
జోఫ్రా ఆర్చర్ వేగం, సీమ్ మూమెంట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ షార్ప్ బౌలింగ్ వంటివి భారత బ్యాట్స్‌మెన్ టెక్నిక్, మనోబలానికి పరీక్షగా నిలిచాయి.
మొదటి సెషన్‌లో భారత్ 43 పరుగులు జోడించి 3 వికెట్లు కోల్పోయి లార్డ్స్ టెస్టులో ఓటమికి నాంది పలికింది.

ఫొటో సోర్స్, Getty Images

ఆట మొదలుపెట్టినప్పుడు కేఎల్ రాహుల్, మిడిలార్డర్ నెమ్మదిగా భారత్‌ను విజయతీరాలు చేరుస్తారని ఆశించారు. ఇంగ్లండ్ బౌలర్లు, ముఖ్యంగా బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ ఈ ఆశలపై నీళ్లు చల్లారు.
స్టోక్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత, జోఫ్రా ఆర్చర్ తన వేగమైన బంతులతో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ (0)లను అవుట్ చేశాడు. గంటకు 144 కి.మీ. వేగంతో జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతులు భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా నిలిచాయి. ఈ పరీక్షలో వారు ఓడిపోయారు.
టాపార్డర్ నుంచి ఒక బలమైన భాగస్వామ్యం నెలకొల్పాల్సిన చోట మేం అలా చేయలేకపోయామని మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు.
టాపార్డర్ విఫలమైతే, ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను మిడిలార్డర్ తీసుకోవాలి. కానీ, ఇక్కడ మిడిలార్డర్ కూడా కుప్పకూలింది.
తొలిసారి ఇంతటి ఒత్తిడి పరిస్థితుల్లో ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్ ప్రయోగించిన బౌన్సర్లు, స్లెడ్జింగ్, మానసిక ఆట ముందు నిస్సహాయంగా మిగిలిపోయాడు. లంచ్‌కు ముందు నితీశ్, సుందర్ అవుట్ కావడంతో భారత్ స్కోరు 112/8 వద్ద నిలిచింది.
ఈ విధంగా మ్యాచ్ మొదటి గంట భారత వికెట్లనే కాకుండా వారి వ్యూహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసింది.

ఫొటో సోర్స్, Getty Images

తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్ కావడం మ్యాచ్ గతిని మార్చేసింది. పంత్ వేలికి ఇప్పటికే గాయమైంది. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పడు ఆ గాయం తాలూకు ప్రభావం పదే పదే కనిపించింది. చేతిలో నుంచి బ్యాట్ జారిపోవడం, షాట్లు అనుకున్న విధంగా కొట్టలేకపోవడం కనిపించింది. అయితే, లేని పరుగు కోసం పంత్ ప్రయత్నించగానే మైదానంలోని వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
పంత్ పరుగు తీస్తుండగా, బంతిని అందుకున్న బెన్ స్టోక్స్, ఎక్స్‌ట్రా కవర్ నుంచి నేరుగా వికెట్లకు గిరాటేశాడు.
''పంత్ పరిగెత్తడానికి సంకోచించడం నేను చూశాను. త్రో వేస్తే పంత్ అవుట్ అవుతాడని నాకు అనిపించింది. అదే చేశాను. పంత్ రనౌట్ అయ్యాడు' అని తర్వాత బెన్ స్టోక్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఇన్నింగ్స్‌లో బ్యాట్, బంతితో బెన్‌స్టోక్స్ ప్రదర్శన ఆ జట్టు విజయానికి దారులు వేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ అతను మొత్తం 5 వికెట్లు తీశాడు. ఒక రనౌట్ చేసి మ్యాచ్ గతిని మార్చాడు. అలసట చెందినా ఏకధాటిగా ఒకసారి 9.2 ఓవర్లు, మరోసారి 10 ఓవర్లు స్పెల్ బౌలింగ్ చేశాడు.
''ఒకవేళ టెస్టుల్లో గెలుపుతో జోష్ రాకపోతే, ఇంకా ఏం మిగిలినట్లు'' అని మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు.

ఫొటో సోర్స్, Getty Images

జోఫ్రా ఆర్చర్ దాదాపు నాలుగున్నర ఏళ్ల తర్వాత టెస్టు ఫార్మాట్‌లోకి తిరిగొచ్చాడు.
2021 ఫిబ్రవరిలో అతను చివరి టెస్టు ఆడాడు. లార్డ్స్‌లో అతను ఆడిన రెండో టెస్టు ఇది.
కానీ, అతను పునరాగమనం చేసిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
బౌలింగ్ వేగం, లైన్, స్వింగ్ ఇలా అన్ని అంశాల్లో అతను పూర్తిగా నియంత్రణ సాధించాడు.

ఫొటో సోర్స్, Getty Images

విజయ లక్ష్యం దగ్గర పడుతున్న కొద్దీ భారత బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారు.
''ఇది ఐపీఎల్ కాదు. జడ్డూ పరుగులు స్వయంగా చేయాలి'' అంటూ జడేజాను స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ స్లెడ్జింగ్ చేస్తూనే ఉన్నాడు.
ఆఖరి వరకు జడేజా సింగిల్స్ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, ఇంగ్లండ్ షార్ట్-బాల్ ప్లాన్‌కు సిరాజ్ చిక్కాడు.
మ్యాచ్ కఠిన పరిస్థితుల్లో 54 బంతులు ఎదుర్కొన్న బుమ్రా కూడా పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నిస్తూ అవుటయ్యాడు.
భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టడంలో ఇంగ్లిష్ బౌలర్లు సఫలం అయ్యారు. విజయం అంచులకు చేరుకున్న భారత్, గెలుపు తీరాన్ని అందుకోలేకపోయింది.
ఓటమితో వేదనకు గురైన సిరాజ్‌ను ఇంగ్లండ్ ఆటగాళ్లు క్రాలీ, బ్రూక్, రూట్, స్టోక్స్ ఓదార్చారు.
టెస్ట్ క్రికెట్ ప్రత్యేకతే ఇది... ఇక్కడ ఓటమి కూడా గౌరవప్రదమైనది.
ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ, రవీంద్ర జడేజా దృఢ సంకల్పం, బుమ్రా పట్టుదల, సిరాజ్ ధైర్యం క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














