డేటాసెంటర్లతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు నీటికి సంబంధమేంటి

డేటా సెంటర్లు, ఏఐ, నీటి వనరులు
ఫొటో క్యాప్షన్, జార్జియా అంతటా భారీ డేటాసెంటర్లు నిర్మిస్తున్నారు.
    • రచయిత, మిషెల్లీ ఫ్లూరీ, నథాలీ జిమెనెజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఓ చిన్న సందేహం రాగానే వెంటనే చాట్ జీపీటీనో, ఇంకేదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్‌నో ఓపెన్ చేసి ప్రశ్నలడిగేస్తున్నారా... మన ఫోన్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో నెట్ సౌకర్యం ఉంటే చాలు, ఏఐ టూల్స్‌కి ఇంకేమీ ఖర్చు కాదనుకుంటున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

మనం అడిగే ఓ ప్రశ్నకు జవాబివ్వడానికి ఏఐ యాప్‌లు ఒక బాటిల్ నీటిని ఖర్చుచేస్తున్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లమంది, ఎన్నెన్ని ప్రశ్నలడుగుతున్నారో... అందుకోసం ఎంతెంత నీళ్లు ఖర్చవుతున్నాయో అర్ధంచేసుకోవచ్చు.

ఏఐ టూల్స్ ఉపయోగించడానికి, నీటికి సంబంధమేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డేటా సెంటర్లు, ఏఐ, నీటి వనరులు

ఫొటో సోర్స్, Getty Images

డేటా సెంటర్ వల్ల నీటిలోకి చేరుతున్న బురద

2016లో బెవర్లీ మోరిస్ రిటైరయ్యారు. జార్జియా గ్రామీణ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో ఆమె తన కలల ఇంటిని నిర్మించుకున్నారు.

కానీ, ఇప్పుడక్కడ అలాంటి వాతావరణం లేదు.

జార్జియా మ్యాన్స్‌ఫీల్డ్‌లోని ఆమె ఇంటి వరండాకు కేవలం 400 అడుగుల దూరంలో ఓ భవనం ఉంది. కిటికీలు లేని ఆ పెద్ద భవనం సర్వర్లు, కేబుళ్లు, మెరిసే లైట్లతో నిండిపోయి ఉంది.

అది ఒక డేటా సెంటర్.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ మొదలుకుని, చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ వంటివి నడిపించేందుకు అమెరికాలోని చిన్న పట్టణాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటవుతున్న డేటా సెంటర్లలో అది కూడా ఒకటి.

''నా ఇంట్లో సగభాగం సరిగ్గా లేదు. నీళ్లు లేవు. ఇలాంటి ఇంట్లో నేను జీవించలేను. నేను ఇక్కడి నీళ్లు తాగలేకపోతున్నాను'' అని మోరిస్ చెప్పారు.

ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాకు చెందిన ఈ డేటా సెంటర్ నిర్మాణం వల్ల ఆమె ఇంట్లో భూగర్భజలాలపై ప్రభావం పడిందని, బురద ఎక్కువగా పేరుకుపోతోందని మోరిస్ భావిస్తున్నారు.

టాయ్‌లెట్ ఫ్లష్ చేసేందుకు ఆమె బకెట్లతో నీళ్లు తీసుకెళ్తున్నారు.

నీళ్లు మళ్లీ బాగా వచ్చేందుకు వీలుగా కిచెన్‌లో కుళాయిని మరమ్మతులు చేయించినా ప్రయోజనం లేకపోయిందని, ఆ నీళ్లలో దుమ్ము పేరుకుపోయి ఉంటోందని మోరిస్ చెప్పారు.

''ఆ నీళ్లను తాగాలంటే నాకు భయమేస్తోంది. కానీ నేను వాటితోనే వంట చేసుకుంటున్నా. వాటితోనే బ్రష్ చేసుకుంటున్నా. నాకిది ఆందోళన కలిగిస్తోంది'' అని ఆమె అన్నారు.

అయితే మెటా మాత్రం ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

తమ పొరుగున ఉన్నవారితో మంచిగా ఉండడం తమ ప్రాధాన్య అంశమని బీబీసీకిచ్చిన ఒక ప్రకటనలో మెటా తెలిపింది.

మోరిస్ ఆందోళనల నేపథ్యంలో మెటా అక్కడి భూగర్భ జలాలపై అధ్యయనం చేయించింది.

ఆ ప్రాంతంలో భూగర్భజలాలపై డేటా సెంటర్ కార్యకలాపాల ప్రభావం ఏమీ లేదని ఆ రిపోర్టు తెలిపింది.

మోరిస్ ఇంటిలోని నీళ్లపై తమ డేటాసెంటర్ ప్రభావం ఏమీ లేదని మెటా చెబుతున్నప్పటికీ, తన ఇంటి పక్కన డేటా సెంటర్ ఉండడం మంచిది కాదనే ఆమె భావిస్తున్నారు.

ఒకప్పుడు ఇది తనకు ఎంతో ఇష్టమైన, అన్నివిధాలా అనువుగా ఉన్న ఇల్లు అని, ఇకపై అలా ఉండనే ఉండదని ఆమె అన్నారు.

డేటా సెంటర్లు, ఏఐ, నీటి వనరులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేటా సెంటర్ల నిర్వహణకు భారీగా నీరు కావాలి.

ప్రాసెసర్ల కూలింగ్ కోసం భారీగా నీటి వినియోగం

ప్రపంచవ్యాప్తంగా పదివేల డేటా సెంటర్లలో క్లౌడ్ ఉంది. ఈ పదివేల డేటా సెంటర్లలో ఎక్కువభాగం అమెరికాలో ఉన్నాయి. ఆ తర్వాత యూకే, జర్మనీల్లో ఉన్నాయి.

ఆన్‌లైన్ కార్యకలాపాల్లో ఏఐ జోరు చూపుతున్న ఈ తరుణంలో డేటా సెంటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అలాగే వాటి చుట్టూ నివసించే స్థానికుల నుంచి ఫిర్యాదులూ పెరుగుతున్నాయి.

స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో అమెరికా డేటా సెంటర్ల బూమ్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా 64 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు ఆలస్యమవడం లేదా ఆగిపోవడం జరిగిందని డేటా సెంటర్ వాచ్ అనే సంస్థ నివేదికలో వెల్లడైంది.

ఈ ఆందోళన డేటాసెంటర్ల నిర్మాణం గురించే కాదు... నీటివినియోగం గురించి కూడా. సర్వర్లను కూల్‌గా ఉంచడానికి చాలా నీళ్లు కావాలి.

''ఇవి చాలా వేడి ప్రాసెసర్లు. వాటిని చల్లగా ఉంచడానికి చాలా నీళ్లు అవసరమవుతాయి'' అని నేషనల్ సెంటర్ ఫర్ ఎనర్జీ ఎనలిటిక్స్‌కు చెందిన మార్క్ మిల్స్ ఏప్రిల్‌లో చెప్పారు.

చాలా డేటా సెంటర్లు భాష్పీభవన శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. వీటిలో నీళ్లు వేడిని గ్రహించి ఆవిరిగా మారతాయి. మన శరీరాల్లోని వేడిని చెమట ఎలా తొలగిస్తుందో అలా. వేడిగా ఉండే రోజుల్లో ఒక్కో డేటా సెంటర్‌కు లక్షల లీటర్ల నీళ్లు ఖర్చవుతాయి.

డేటా సెంటర్లు, ఏఐ, నీటి వనరులు
ఫొటో క్యాప్షన్, జార్జియాలోని ఫ్లింట్ నదిలో నీటి శాంపిల్

నీరు గోధుమరంగులో ఉండడానికి కారణమేంటి?

అమెరికాలో వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో జార్జియా ఒకటి. దీంతో డేటా సెంటర్ల వల్ల కలిగే ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక్కడి వాతావరణంలోని తేమ వల్ల సహజంగా డేటా సెంటర్లను కూలింగ్‌గా ఉంచడానికి నీటిపై చేసే ఖర్చు తగ్గుతుంది. దీంతో డేటా సెంటర్ల డెవలపర్లు ఈ ప్రాంతంపై దృష్టిపెడుతున్నారు. కానీ ఆ ప్రాంతం దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

జార్జియాలోని ఫ్లింట్ నది స్థితిగతులను ఫ్లింట్ రివర్ కీపర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గార్డన్ రోగర్స్ పర్యవేక్షిస్తుంటారు. ఇది లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ. అమెరికాకు చెందిన క్వాలిటీ టెక్నాలజీ సర్వీసెస్(క్యూటీఎస్) డేటా సెంటర్‌కోసం నిర్మిస్తున్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక నీటి ప్రవాహం దగ్గరకు ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు.

స్థానిక వాలంటీర్ జార్జ్ డీట్జ్ ఒక ప్లాస్టిక్ బ్యాగులో నీళ్లను నింపారు. అవి గోధుమరంగులో ఉన్నాయి.

నీళ్లు ఆ రంగులో ఉండకూడదని ఆయనన్నారు. నీళ్లు ఇలా ఉన్నాయంటే..వాటిలో బురద లేదా కొన్ని రసాయనాలు ఉన్నాయని అర్ధమని ఆయన చెప్పారు.

భవనాల నిర్మాణంలో మట్టిని పట్టి ఉంచడానికి, కోతకు గురవుకుండా ఉండడానికి ఉపయోగించే రసాయనాలు ఇవి. కానీ అవి నీటి ప్రవాహాల్లోకి చేరితే, నీళ్లు బురదమయమవుతాయి.

తమ డేటాసెంటర్లు పర్యావరణపరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నాయని, స్థానికంగా పన్ను రూపంలో కోట్ల ఆదాయం కల్పిస్తున్నాయని క్యూటీఎస్ చెబుతోంది.

ఈ నిర్మాణాలను చేపడుతుంది ఎవరైనప్పటికీ పరిణామాలను మాత్రం స్థానికులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

''వాళ్లిలా చేయకూడదు. భారీ ఆస్తులకు యజమానులైనవవారికి తక్కువ ఆస్తులన్నవారికన్నా ఎక్కువ హక్కులేమీ ఉండవు'' అని రోగర్స్ అన్నారు.

ఈ సమస్యల గురించి తెలుసుకొని చర్యలు తీసుకుంటున్నామని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.

డేటా సెంటర్లు, ఏఐ, నీటి వనరులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో మెటాకు చెందిన ఓ డేటా సెంటర్

‘నీటి వనరుల నిర్వహణపై దృష్టి’

"2030 నాటికి, మేం డేటా సెంటర్లు నడిపే ప్రాంతాల్లో తీసుకున్న నీటి కంటే ఎక్కువ నీటిని తిరిగి అందించాలన్నది మా లక్ష్యం" అని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)‌లో అంతర్జాతీయంగా నీటి నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగం అధినేత విల్ హ్యూస్ చెప్పారు.

ప్రపంచంలో అత్యధిక డేటా సెంటర్లు ఉంది అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కే.

లీక్‌లను రిపేర్ చేయడం, వర్షపు నీటిని సేకరించి నిల్వచేయడం, కూలింగ్‌కు శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఉపయోగించడం వంటి ప్రాజెక్టులలో ఏడబ్ల్యూఎస్ పెట్టుబడి పెడుతోందని ఆయన చెప్పారు.

అమెరికా వర్జీనియాలోని, చెసాపీక్ బేలో పోషకాల కాలుష్యాన్ని తగ్గించడానికి రైతులతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.

భారత్‌లో, దక్షిణాఫ్రికాలో కూలింగ్ కోసం ఏడబ్ల్యూఎస్ నీటిని ఉపయోగించడం లేదని, అయినప్పటికీ నీటి లభ్యత, నాణ్యతకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడుతోందని చెప్పారు.

అమెరికాలో ఏడాది కాలంలో అత్యంత వేడిగా ఉండే రోజుల్లో మాత్రమే పదిశాతం నీటిని ఉపయోగిస్తామని విల్ హ్యూస్ అంటున్నారు.

డేటా సెంటర్లు, ఏఐ, నీటి వనరులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేటా సెంటర్లు

కానీ లెక్కలు దీనికి భిన్నంగా ఉంటాయి. చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీలను మనం అడిగే ఓ ప్రశ్న మన ఇంటికి దగ్గరలో ఉన్న షాపు నుంచి మనం కొనుక్కునే చిన్న బాటిల్‌లో ఉండే అన్ని నీళ్లను ఉపయోగిస్తుంది. రోజుకు ఎన్ని వేల కోట్ల ప్రశ్నలు వాటికి వస్తాయో, ఇక వాటి కోసం ఎంత నీరు ఖర్చువుతుందో అర్ధం చేసుకోవచ్చు.

అట్లాంటాలోని ఎమోరీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ రాజీవ్ గార్గ్ క్లౌడ్ కంప్యూటింగ్ బోధిస్తారు. ఈ డేటా సెంటర్లనుంచి మనం దూరం జరగలేమన్నది ఆయన అభిప్రాయం. ఏం జరిగినప్పటికీ ఆధునిక జీవితానికి అవి వెన్నెముకలాంటివని ఆయనన్నారు.

''వీటినుంచి వెనక్కి వెళ్లే అవకాశం లేదు..ముందుకే వెళ్లగలం'' అని ఆయన చెప్పారు.

దీర్ఘకాలికంగా ఆలోచించడమే దీనికి పరిష్కారమని ఆయన అంటున్నారు. స్మార్టర్ కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవడం, వర్షపునీటిని నిల్వచేసుకోవడం, మరింత సమర్థవంతమైన మౌలికసదుపాయాలు పెంపొందించుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

కొంతకాలంలోనే డేటా సెంటర్లు తీవ్ర అలజడిని కలగజేశాయని, అయితే ఇప్పుడీపరిశ్రమ స్థిరత్వం వైపు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎవరేం చెప్పినప్పటికీ బెవర్లీ మోరిస్ వంటి ఇంటి యజమానులకు ఇది అంత అంగీకారంగా ఉండదు. నిన్నటి కలకు, రేపటి అవసరానికి మధ్య వారు చిక్కుకుపోయినట్టుఉంది.

డేటా సెంటర్లు ఇప్పుడు ఓ పరిశ్రమలా మాత్రమే కాదు. అవి జాతీయవిధానంలో భాగమైపోయాయి. చరిత్రలోనే అతిపెద్ద ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే చెప్పారు.

జార్జియాలో వాతావరణం తేమతో నిండిపోయింది. సూర్యుడు వెలిగిపోతున్నాడు. డేటా సెంటర్ డెవలపర్లకు ఈ ప్రాంతం అత్యంత ఆకర్షణీయంగా మారడానికి ఇదే కారణం.

టెక్ భవిష్యత్తు ఇక్కడే ఉంది. ఈ శబ్దాల మధ్య, నీటి కష్టాల మధ్య ఇక్కడ జీవించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు.

ఏఐ పెరుగుతున్నకొద్దీ ఓ సవాలు స్పష్టంగా కనిపిస్తుంటుంది. మనిషి జీవనానికి అత్యంత కీలకమైన, ప్రాథమిక వనరైన నీటివనరులను సంగ్రహించకుండా రేపటి డిజిటల్ ప్రపంచానికి శక్తిని ఎలా అందించడమన్నది ఆ సవాలు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)