విజయవాడ: ‘‘పనిలో చేరిన ఐదోరోజే యజమానిని హత్య చేసిన కేర్ టేకర్’’ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

అనూష

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఖమ్మంకు చెందిన అనూషను రామారావు తన తల్లికోసం కేర్ టేకర్‌గా నియమించుకున్నారు.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

(హెచ్చరిక: కలవరపరిచే అంశాలు ఉన్నాయి)

విజయవాడలో రిటైర్డ్‌ ప్రభుత్వ ఇంజనీరు రామారావు(62) హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. రామారావు ఇంట్లో పని చేసే మహిళా కేర్‌టేకర్‌ పనిలో చేరిన ఐదో రోజే ఆయన్ను హత్య చేశారని పోలీసులు చెప్పారు.

మాచవరం పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ హత్య కేసు వివరాలను సీఐ సీహెచ్‌ ప్రకాష్‌ బీబీసీకి వెల్లడించారు.

''విజయవాడకి చెందిన రిటైర్డ్‌ ఆర్‌ అండ్‌ బీ ఇంజనీరు రామారావు 95 ఏళ్ల తన తల్లితో కలిసి ఎన్టీఆర్‌ కాలనీలో నివాసముంటున్నారు. కొన్నేళ్ల కిందట భార్య అనారోగ్యంతో చనిపోవడం, కూతురు హైదరాబాద్‌లో, కొడుకు చెన్నైలో ఉండటంతో చురుగ్గా కదల్లేని వృద్ధురాలైన తన తల్లిని చూసుకోవడానికి కేర్‌ టేకర్‌ను నియమించుకున్నారు రామారావు. ఎప్పటి నుంచో ఉన్న కేర్‌టేకర్‌ ఇటీవల మానేయడంతో ఈనెల జూన్‌ 5న మంగ అలియాస్‌ అనూషను కొత్త కేర్‌టేకర్‌గా తీసుకున్నారు'' అని సీఐ వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రామారావు హత్య, విజయవాడ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విజయవాడకి చెందిన రిటైర్డ్‌ ఇంజనీరు రామారావు 95 ఏళ్ల తన తల్లితో కలిసి ఎన్టీఆర్‌ కాలనీలో నివాసం ఉండేవారు.

డబ్బు కోసమే..

''జూన్‌ 5వ తేదీన రామారావు ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన అనూష రాత్రిళ్లు వృద్ధురాలికి సాయంగా ఆమె గదిలోనే నిద్రపోయేవారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో నగదు, బంగారం ఉందనీ, సరిగ్గా నడవలేని వృద్ధురాలు, 62 ఏళ్ల రామారావు తప్పా ఇంట్లో ఎవ్వరూ ఉండరని భర్త ఉపేందర్‌ రెడ్డికి సమాచారం ఇచ్చారు. సమయం చూసి డబ్బు, బంగారం తీసుకుని పారిపోవాలని ప్లాన్‌ చేసుకున్నారు.

ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో వృద్ధురాలి గది నుంచి బయటకు వచ్చిన అనూష తనకు సరిగ్గా గాలి ఆడటం లేదని కాసేపు బయట కూర్చుంటానని చెప్పి తలుపుతీసింది. అప్పటికే అక్కడ కాచుక్కూర్చున్న ఉపేందర్‌ రెడ్డి ఇంటి లోపలికి వచ్చారు. ఇద్దరూ బీరువా ఉన్న రామారావు గదిలోకి వెళ్లడంతో మెలకువ వచ్చిన ఆయన వీరిని గద్దించారు. దీంతో ఆయనను హత్య చేసి బీరువాలోని 50 వేల రూపాయలు తీసుకుని ఇద్దరూ పరారయ్యారు’’ అని సీఐ ప్రకాష్‌ చెప్పారు.

తెల్లవారు జామున వృద్ధురాలు లేచి చూడగా పని మనిషి కనిపించలేదు. కుమారుడు అచేతనంగా పడి ఉండటాన్నిగమనించి, చుట్టుపక్కలవాళ్లకు చెప్పడంతో, విషయం తెలుసుకున్న స్థానికులు తమకు సమాచారం అందించారని, వెంటనే తమ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారని సీఐ తెలిపారు.

చెన్నై రైల్వేస్టేషన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చెన్నై రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు అనూష దంపతులు కనిపించారు.

ఎలా దొరికారు?

ఈ కేసును ఛేదించేందుకు మాచవరం పోలీసుల ఆధ్వర్యం లో పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. నిందితులను ఎలా పట్టుకుందీ విచారణాధికారి, సీఐ ప్రకాష్ వివరించారు.

''హత్య చేయగానే ఫోన్‌లు స్విచాఫ్‌ చేసుకొని విజయవాడ బస్‌స్టేషన్‌కి చేరుకున్న ఇద్దరూ బస్సులో తిరుపతికి వెళ్లారు, అటు నుంచి చెన్నై వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దిగి, అక్కడి వైఫై ద్వారా తమకు తెలిసిన వారికి ఫోన్లు చేశారు. అప్పటికే వారి ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు చెన్నై చేరుకునే లోపే హోటల్ గది ఖాళీ చేసి పరారయ్యారు. చెన్నై రైల్వే స్టేషన్‌లో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరూ కనిపించారు.

ఉపేందర్‌ రెడ్డి శివభక్తుడు కావడం, తరచూ శ్రీకాళహస్తికి వెళ్తాడని తెలిసిన పోలీసులు అక్కడికి వెళ్లొచ్చని అనుమానించారు. గతంలో శ్రీకాళహస్తిలో కొత్త ఫోన్‌ సిమ్‌ కూడా తీసుకున్న నేపథ్యంలో ఆ మొబైల్‌ షాపు యజమానితో పాటు శ్రీకాళహస్తి పోలీసులకు సమాచారం అందించారు'' అని ప్రకాష్ చెప్పారు.

''అనుమానించినట్లే ఉపేందర్‌ రెడ్డి, అనూష కొత్త సిమ్‌ కోసం అదే షాపునకు వెళ్లారు. ఇరువురూ కొద్దిగా వేషధారణ మార్చి ముఖాలకు మాస్క్‌ వేసుకు వచ్చారు. అయితే ఉపేందర్ రెడ్డి గతంలో పలుమార్లు వచ్చిన నేపథ్యంలో షాపు సిబ్బంది గుర్తుపట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.శ్రీకాళహస్తి పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరినీ అదుపులోకి తీసుకుని మాకు అప్పగించారు'' అని సీఐ ప్రకాష్‌ తెలిపారు.

సీఐ ప్రకాష్‌

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మాచవరం సీఐ ప్రకాష్‌

గతంలో నేర చరిత్ర లేదు : సీఐ

''తెలంగాణలోని ఖమ్మంకి చెందిన అనూషకు గతంలో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తితో వివాహం కాగా, ఈ జంటకి ముగ్గురు పిల్లలున్నారు. ఆ తర్వాత అతన్ని వదిలేసి సిద్ధిపేటకి చెందిన మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు అనూష. ఇటీవల ఆయనకు కూడా దూరంగా ఉంటూ సొంతూరు ఖమ్మంకే చెందిన ఉపేందర్‌ రెడ్డిని మూడో పెళ్లి చేసుకున్నారు. ఉపేందర్‌ రెడ్డి శివభక్తుడు కావడం, శ్రీకాళహస్తి సెంటిమెంట్‌ ఉండటంతో ఆ దేవాలయంలోనే ఆమెను ఆరునెలల కిందట వివాహం చేసుకున్నారు. అనంతరం, ఇద్దరూ గుంటూరు జిల్లా నులకపేటలో కాపురం పెట్టారు'' అని సీఐ ప్రకాష్‌ తెలిపారు.

''అనూష అలియాస్‌ మంగకి గానీ ఉపేందర్‌ రెడ్డికి గానీ గతంలో హత్య సంబంధిత నేర చరిత్ర లేదు. కేవలం డబ్బు కోసమే ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి అర్థమవుతోంది. రామారావు కూతురు చందన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. సోమవారం నిందితులను అరెస్ట్ చేశాం. వారిని విచారిస్తున్నాం.'' అని సీఐ ప్రకాష్‌ బీబీసీకి చెప్పారు.

మాచవరం పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మాచవరం పోలీస్ స్టేషన్

ఎవరిని నమ్మాలి: చందన

''నేను హైదరాబాద్‌లో ఉంటాను, సోదరుడు చెన్నైలో ఉంటారు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్నను, నానమ్మను మా వద్దకు రమ్మన్నాం. మేం బిజీగా ఉంటామని, సొంతూరిలోనే ప్రశాంతత దొరుకుతుందని, కేర్‌టేకర్‌లను పెట్టుకుంటే బాగానే వండిపెడతారనీ, చక్కగానే చూస్తారని మాకు చెప్పారు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. నాన్న శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నారు. కానీ కేర్‌టేకర్‌గా వచ్చిన వాళ్లే డబ్బుల కోసం ప్రాణాలు తీస్తుంటే ఎవరిని నమ్మాలి, చాలా దారుణం'' అని రామారావు కూతురు చందన బీబీసీతో అన్నారు.

కేర్‌టేకర్స్ అందరూ అలా ఉండరు కానీ, వారిని తీసుకునే సందర్భాల్లో పూర్తి వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవడం మంచిదని మాచవరం సీఐ ప్రకాష్‌ సూచించారు.

నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నందున ప్రస్తుతం వారి వాదన తీసుకునే అవకాశం లేకుండా ఉంది. నిందితుల తరఫున ఎవరూ ఇంతవరకూ రాలేదని పోలీసులు చెబుతున్నారు.

రామారావు తల్లి వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. వయోభారం రీత్యా ఆమె మీడియాతో మాట్లాడలేరని కుటుంబసభ్యులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)