ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లోని కరేడులో ఏర్పాటు చేస్తామంటున్న ఈ ప్రాజెక్ట్‌ను స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి పేరిట రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లో భూసేకరణకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో ‘ఇండో సోల్’ సోలార్ ప్రాజెక్ట్ కోసం 8,348 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది.
ఆ భూములన్నీ ఏడాదికి రెండు మూడు పంటలు పండే పొలాలు అంటూ రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


ఓవైపు విశాలమైన సముద్రతీరం, మరో వైపు ఏడాదికి రెండుమూడు పంటలు పండే పచ్చటి పొలాలతో కళకళలాడే కరేడు గ్రామం ప్రభుత్వం నుంచి జూన్ 21న భూసేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆందోళనలతో అట్టుడుకుతోంది.
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈ కరేడు మేజర్ పంచాయతీ, 16 చిన్న చిన్న పల్లెలలతో సుమారు 16 వేలమందికి పైగా జనాభాతో ఇటు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అటు సముద్రతీరానికి దగ్గరగా ఉంటుంది.
ఎక్కువగా సన్నకారు రైతులు, మత్స్యకారులు, దళితులు, గిరిజనులు ఉండే ఈ ఊరు ప్రధానంగా చేపలవేటతో పాటు పాడి, వ్యవసాయ ఆధారిత గ్రామం.

రోడ్డెక్కిన రైతులు
వరి సాగుతో పాటు కొబ్బరి, మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలు, కూరగాయల సాగు, మరోవైపు చేపల వేటతో కళకళలాడే ఈ కరేడు గ్రామంలోని 8,348 ఎకరాలను సోలార్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కి అప్పగిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న జీవో ఎంఎస్ నంబర్ 43ని విడుదల చేసింది. ఈ జీవో వచ్చిన దరిమిలా గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
ఈ భూసేకరణ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
అయితే ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొన్న భూములను ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు కోసం సేకరించనున్నట్టు జూన్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది.
దీంతో అప్పటి నుంచి కరేడు రైతులు ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. జాతీయ రహదారిని ముట్టడించారు.

''ఇలాంటి జీవో వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మా ఊరి వాళ్లం ఇలా రోడెక్కుతామని ఏనాడూ అనుకోలేదు'' అని గ్రామానికి చెందిన రైతు ప్రసాదరెడ్డి బీబీసీతో అన్నారు.
''తరతరాలుగా ఈ ఊళ్లోనే ఉంటున్నాం. నేను సంపాదించిన భూమితో పాటు మా పెద్దల నుంచి వచ్చిన పొలం ఐదెకరాలుంది. గోదావరి జిల్లాల్లో మాదిరి మూడు పంటలు పండుతాయి ఇక్కడ. అలాంటి పచ్చటి పొలాలను ఎలా ఇస్తాం, చావనైనా చస్తాం. ఇచ్చేది లేదు'' అని కరేడుకి చెందిన మామిడి రైతు ఊరా శ్రీనివాసరావు బీబీసీ వద్ద అన్నారు.
ఊరంతా ఒకే మాట మీద ఉందని, ఎవ్వరం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ఉద్యాన రైతు శ్రీనివాసరెడ్డి, మహిళా రైతు అలివేలమ్మ చెప్పారు.

ఫ్యాక్టరీ కడితే వేటకి ఎలా వెళ్తాం?
''సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారులు, ఇతర కుటుంబాల వారు ఐదు వేలమంది వరకు ఉన్నారు. ఇప్పుడు వేలాది ఎకరాల్లో ఫ్యాక్టరీ వస్తే వాళ్లు చుట్టూ కిలోమీటర్ల పొడవున కాంపౌండ్ వాల్ కడతారు. మాకు తరతరాలుగా అలవాటైన ఈ ప్రాంతంలో కాకుండా చేపల వేటకి ఎక్కడికి వెళ్లగలం'' అని కరేడు గ్రామంలోని చిన్నపల్లిపాలెం మత్స్యకార పల్లెకి చెందిన కొక్కిలగడ్డ అంకయ్య బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
''పొలాలున్న రైతులను భయపెట్టో, బతిమాలో భూములు తీసుకుని నష్టపరిహారం ఇచ్చేస్తారనే అనుకుందాం. కానీ, ఆ పొలాల మీదే ఆధారపడి వ్యవసాయ కూలీ పనులు చేసుకుని ఏళ్లుగా ఇక్కడే పల్లెల్లో జీవించే పేదవారి పరిస్థితేంటి?'' అని అక్కడి రైతు కూలీలు మల్లేశ్వరి, లక్ష్మీ బీబీసీతో అన్నారు.
రేపు ఒకవేళ ఫ్యాక్టరీ వచ్చినా మేం చేసే, మాకు వచ్చే ఉద్యోగాలు ఏముంటాయి? అని వారు ప్రశ్నిస్తున్నారు.
''పొలాలే తీసుకుంటారో.. ఇళ్లు కూడా తీసుకుంటారో తెలియడం లేదు. తీరం వెంబడి ఉన్న ఎస్టీ కాలనీల్లోని ఇళ్లు కూడా పోతాయని ప్రచారం జరుగుతోంది. అదేమంటే ఇక్కడ తీస్తే వేరే చోట ఇస్తారులే అంటున్నారు. ఆ వేరే చోటే ఫ్యాక్టరీ పెట్టుకుని మమ్మల్ని ఇక్కడే బతకనివ్వండి. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడికీ కదలం. మేం పేదోళ్లమనీ, యానాది గిరిజనులమనీ మాపై అధికారం, బలం ప్రయోగిస్తే చూస్తూ ఊరుకోం'' అని కరేడులోని గిరిజన పల్లె రామకృష్ణాపురానికి చెందిన రామలక్ష్మమ్మ, లలిత బీబీసీ వద్ద అన్నారు.

గొడ్డుగోదా ఏమవ్వాలి?
''8 వేల ఎకరాలకి పైగా పచ్చటి పంట పొలాలు తీసుకుంటే వ్యవసాయం ఏమవుతుంది?. పశువులు గేదెలు, ఆవులు, ఎడ్లు, గొర్రెలు ఏమవ్వాలి. అవి ఎక్కడికి పోతాయి. అసలు వాటి గురించి ఆలోచించరా?'' అని కరేడుకి చెందిన మహిళా రైతులు చెంచమ్మ, అలివేలమ్మ ప్రశ్నించారు.
ఇదే నెల్లూరు జిల్లాలో సముద్రతీరం వెంబడి ఎన్నో వేలాది ఎకరాల బంజరు భూములు ఖాళీగా ఉన్నాయని, అటువంటి చోట్ల కాకుండా ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను నాశనం చేయడం ఎందుకు? అని గ్రామానికి చెందిన రైతు నాయకుడు మిరియం శ్రీనివాసులు ప్రశ్నించారు.

కాగా, భూ సేకరణపై జులై 4న నిర్వహించిన గ్రామసభను ఊరంతా వ్యతిరేకించింది. గ్రామంలో ఏ ఒక్కరు కూడా భూసేకరణకు అనుకూలంగా మాట్లాడలేదని మిరియం శ్రీనివాసులు అన్నారు.
గ్రామంలో భూసేకరణకు ఉద్దేశించిన ఆ జీవో నెంబర్ 43ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినట్టు ఆయన తెలిపారు.
తమ ఊరు పచ్చటిపొలాలతో సముద్రతీరానికి దగ్గరగా ఉండటమనే శాపంగా మారిందని, అందుకే పరిశ్రమల కళ్లు తమ భూములపై పడ్డాయని గ్రామస్థులు శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు.

కూటమి వచ్చాక ప్రాజెక్టులో మార్పులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కరేడు గ్రామానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలోని గుడ్లూరు మండలం రామాయపట్నం సమీపంలోని చేవూరు, రావూరు గ్రామాల్లో ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఐదువేల ఎకరాల భూములను ఇవ్వాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది.
అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 2024 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చిన తర్వాత భూములను వెనక్కి తీసుకుంటామని టీడీపీ హామీనిచ్చింది.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇండోసోల్ నిర్మాణాలు చేపట్టిన 114.5 ఎకరాలను కేటాయించి, మిగిలిన భూములకి బదులుగా ఇప్పుడు కరేడులో ఏకంగా 8,348 ఎకరాల పంట భూములను కేటాయించడం వివాదాస్పదమవుతోంది.
‘అప్పుడు వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సారవంతమైన భూములను ఎలా కట్టబెడుతుంది?’ అని రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం తగ్గేవరకూ పోరాటం: సీపీఎం
వేలాది ఎకరాలపచ్చటి పొలాలను ధ్వంసం చేస్తూ సోలార్ ప్లాంట్ నిర్మిస్తామంటే మేం చూస్తూ ఊరుకోమని, రైతుల ఆందోళనకు సీపీఎం మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు
ఈ గ్రామం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకూ ప్రజా పోరాటం చేస్తామన్నారు.
''ఓ సోలార్ ప్లాంట్‌కి 8 వేల ఎకరాలు ఎందుకు? అన్ని ఎకరాలను వాళ్లేం చేసుకుంటారు? గత ప్రభుత్వ హయాంలో ఇదే ఇండోసోల్ కంపెనీకి ఆ నాటి ప్రభుత్వం రామాయపట్నం పోర్ట్ సమీపంలో 5 వేల ఎకరాల భూములిస్తే అప్పట్లో టీడీపీ వ్యతిరేకించింది, ఇదంతా భూ కుంభకోణమని ఆరోపించింది. మరిప్పుడు టీడీపీ చేస్తోందేటి, భూ కుంభకోణం కాదా?'' అని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

మూడు పంటలు పండే పొలాలను మినహాయించాలని చంద్రబాబును కోరాను: ఎమ్మెల్యే
రైతుల ఆందోళనలో అర్థం ఉందని.. ఏడాదికి రెండు మూడు పంటలు పండే పొలాలు పోతే ఎవరికైనా బాధనిపిస్తుందని.. అందుకే మూడు పంటలు పండే పొలాలను భూసేకరణ నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విజ్ఞప్తి చేశానని స్థానిక(కందుకూరు) ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ‘బీబీసీ’తో అన్నారు.
‘నా విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. 8300 ఎకరాల్లో.. సుమారు రెండున్నర వేల ఎకరాల వరకు ఇలాంటి పంట భూములు ఉన్నాయి. కచ్చితంగా వాటిని మినహాయిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక కరేడు పంచాయతీ పరిధిలో రామకృష్ణాపురం, ఉప్పరపాలెం అనే రెండు చిన్న పల్లెలను ఖాళీ చేయించాల్సి వస్తుంది. మిగిలిన చోట ఎక్కడా ఇల్లు పోయే పరిస్థితి లేదు. ఆ రెండు పల్లెల్లోని తొలగించిన ఇళ్లకు బదులుగా ఆర్ అండ్ ఆర్ కింద హైవేకి దగ్గరగా నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఓ పెద్ద ప్రాజెక్టు వస్తుందంటే కొన్ని ఇబ్బందులు తప్పవు అన్ని అధిగమించి అందరికీ న్యాయం చేసే ముందుకు వెళ్తాం’ అని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బీబీసీకి వెల్లడించారు.

సముద్రతీరం వెంబడి వేలాది ఎకరాలను ఫ్యాక్టరీలకు కట్టబెట్టడం, పంట పొలాలను సైతం అప్పజెప్పడం దుర్గార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ, కందుకూరు ఇన్‌చార్జి నేతి మహేశ్వరరావు బీబీసీతో అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కరేడు గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ జరిగే విధ్వంసం చూపిస్తామన్నారు.
జులై 4 తేదీన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్థులు మూకుమ్మడిగా వ్యతిరేకించినా ప్రభుత్వం భూసేకరణపై ముందుకే వెళ్తున్నట్టు ఇక్కడి పరిస్థితులు చూస్తే అర్ధమవుతోంది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా కరేడు– ఉలవపాడు రహదారికి మార్కింగ్ కూడా వేశారు. మూడు కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డులో కరేడు పరిధిలో జీసీపీ–46 అని మార్క్ చేశారు. భూసేకరణతో ఈ రోడ్డు కూడా పోతుందని రైతులు అంటున్నారు.

రైతులను ఒప్పిస్తాం: సబ్ కలెక్టర్
భూ సేకరణపై రైతుల ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ఈ భూసేకరణ ప్రక్రియ పర్యవేక్షిస్తున్న కందుకూరు సబ్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి తిరుమాణి శ్రీపూజ బీబీసీకి తెలిపారు.
రైతులకు సాధ్యమైనంత తక్కువ నష్టం, వీలైనంత ఎక్కువ లాభం వచ్చేలా చూస్తామని ఆమె చెప్పారు. కాగా, నష్టపరిహారంపై ఇంకా ఎలాంటి నిర్ధరణకు రాలేదనీ, మార్కెట్ రేటు కంటే ఎక్కువ వచ్చేలా, రైతులు సంతోషించేలా ప్యాకేజీలు నిర్ణయిస్తామని చెప్పారు.
ఎంత ఇచ్చినా రైతులు సుముఖంగా లేరన్న వాదనలపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ.. 'ప్రస్తుతమున్న పరిస్థితి చూస్తే రైతులను ఎలాగైనా ఒప్పించి భూసేకరణకు ముందుకు వెళ్లడమే మా ముందున్న పని' అని స్పష్టంచేశారు.
రైతులు వ్యతిరేకిస్తున్నా మూడు పంటలు పండే ప్రాంతంలోనే ఎందుకు పరిశ్రమలు నెలకొల్పుతున్నారన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తూ.. పరిశ్రమలు పెట్టేవాళ్లు తమకు అనుకూలమైన స్థలాలే అడుగుతారని, లేదంటే మరో చోటకి వెళ్లిపోతారని చెప్పారు.
''పైగా ఇక్కడ వచ్చేవన్నీ పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీలు, ఎగుమతి, దిగుమతుల మీద ఆధారపడేవి, మనం తీరం వెంబడి భూములు ఇవ్వకపోతే వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు ఇక్కడ జరగాల్సిన పారిశ్రామిక అభివృద్ధి జరగదు. కాబట్టి ఇక్కడే ఇస్తున్నాం'' అని సబ్ కలెక్టర్ శ్రీపూజ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














