తోతాపురి మామిడి: తమిళనాడు, కర్ణాటకల నుంచి దిగుమతులపై నిషేధం ఎందుకు, ఏపీ రైతుల ఆందోళన ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో మామిడి పండ్ల సీజన్ చివరిలో వచ్చే తోతాపురి మామిడి కాయలు ఇప్పుడు అంతరాష్ట్ర సమస్యగా మారాయి.
ఈ రకం మామిడికాయలు సాగు చేస్తున్న రాయలసీమ రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు.
అయితే పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రైతులు మాత్రం ఇక్కడి ధర కంటే తక్కువ ధరకే ఏపీలోని పండ్ల ప్రాసెస్ కంపెనీలకు తోతాపురి రకం మామిడి పండ్లు ఇస్తామని ముందుకొచ్చారు.
దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి తోతాపురి మామిడి కాయల దిగుమతులపై ఆంధ్రప్రదేశ్ అధికారులు కొంతకాలం నిషేధం విధించారు.
తోతాపురి రకం మామిడికి ఈ ఏడాది గిట్టుబాటు ధర ఎందుకు తగ్గింది? ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఏయే చర్యలు చేపట్టింది?
ప్రభుత్వ స్పందనపై రైతులు ఏమంటున్నారు? ప్రాసెసింగ్ కంపెనీల వాదన ఏమిటి?


ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నూజివీడురసాలు, బంగినపల్లి, సువర్ణరేఖ, నీలం, రుమానియా రకం మామిడిని ప్రధానంగా పండిస్తారు.
ప్రత్యేకంగా ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే రైతులు పండించే పంట తోతాపురి మామిడి. చిలకముక్కు మామిడిగా పేరొందిన ఈ పండ్లలో గుజ్జు ఎక్కువగా ఉండటంతో జ్యూస్‌ల తయారీకి ఉపయోగిస్తుంటారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిచోట్ల రైతులు కేవలం ఈ మామిడి పంట సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ఈ మూడు జిల్లాల్లో 80వేల హెక్టార్లలో రైతులు మామిడి పంటను సాగు చేస్తున్నారు.
ఇందులో దాదాపు 20వేల హెక్టార్లలో బేనీషా, నీలం, మల్లిక, ఖాదర్, చెరకు రసాలు వంటి వివిధ రకాల మామిడి పంట సాగవుతుండగా, 60వేల హెక్టార్లకు పైగా ఒక్క తోతాపురి మామిడే పండుతుంది.
అందుకే మామిడి పండ్ల జ్యూస్ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ జిల్లాల్లోనే ఎక్కువున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 43 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 37 పని చేస్తున్నాయని తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరెడ్డి బీబీసీతో చెప్పారు.
ఇందులో అన్నమయ్య జిల్లాలో 1, తిరుపతిలో 8 ఉండగా, చిత్తూరు జిల్లాలో 28 ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Govardhan bobby
‘దిగుబడి పెరిగింది.. ఎగుమతులు తగ్గాయి’
"తిరుపతి జిల్లాలో ప్రతి ఏటా 90వేల టన్నులు తోతాపురి మామిడి దిగుబడి వస్తుంది. కానీ ఈ సారి మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటికే లక్షా 45వేల టన్నుల దిగుబడి వచ్చింది. ఇంకా కొంత పంట సాగులోనే ఉందని రైతులు చెబుతున్నారు. కాయ సైజ్ కూడా ఈసారి పెరగడంతో దిగుబడి బాగా వచ్చింది'' అని ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి చెప్పారు.
సరిగ్గా ఇదే సమయంలో జ్యూస్ ఫ్యాక్టరీలు సంక్షోభంలోకి పడ్డాయి.
మామిడి పండ్ల నుంచి ప్రాసెస్ చేసిన గుజ్జును జ్యూస్, పండ్ల రసాల తయారీకి వినియోగిస్తుంటారు.
అవి ఎక్కువగా...అంటే దాదాపు 70శాతానికి పైగా యూరప్ దేశాలకు, ప్రధానంగా యుక్రెయిన్‌కి ఎగుమతి అవుతాయి.
అయితే యూరోపియన్ దేశాలు, ప్రత్యేకించి యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రెండేళ్లుగా ఎగుమతులకు ఆర్డర్లు బాగా తగ్గాయి. దాంతో గత రెండేళ్ల స్టాక్ ఫ్యాక్టరీల్లోనే ఉండిపోయింది.
మళ్లీ ఈ ఏడాది కొత్తగా స్టాక్ తీసుకుని ఏం చేసుకోవాలంటూ ఆయా ఫ్యాక్టరీలు, ప్లాంట్ల యజమానులు కొత్త పంటను తీసుకునేందుకు నిరాకరించారు.
"ఇందులో ఎవరి తప్పు లేదు. గత రెండేళ్లలో ఎగుమతులు తగ్గడంతో ఫ్యాక్టరీల యజమానులు కోట్ల రూపాయలు నష్టపోయారు.ఈ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి" అని బీబీసీతో అన్నారు చిత్తూరులోని సువేరా ప్రాసెసింగ్ ఫుడ్స్ యజమాని కె.గోవర్దన్ బాబీ.

ఫొటో సోర్స్, Govardhan bobby
పడిపోయిన గిట్టుబాటు ధర
దిగుబడి పెరగడం, ఎగుమతులు తగ్గడంతో ఈ ఏడాది తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర పడిపోయింది. గతేడాది కేజీ రూ.16 వరకు కనిష్టంగా గిట్టుబాటు ధర ఉంది.
ఈ ఏడాది ఓ దశలో ఐదారు రూపాయలు కూడా ఇవ్వలేమని కొన్ని కంపెనీలు తేల్చిచెప్పాయి.
దీంతో సర్కారు రంగంలోకి దిగి కంపెనీలు కనీసం 8 రూపాయలిస్తే ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీగా ఇస్తుందని మొత్తంగా 12 రూపాయలు రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని ప్రకటించింది.
అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా సమస్య కొలిక్కి రాలేదు.
చాలా కంపెనీలు తాము 8 రూపాయలు కూడా ఇవ్వలేమని చెప్పి పంటను తీసుకునేందుకు నిరాకరించాయి.
"పంట కొనుగోలుకు గుజ్జు పరిశ్రమల యజమానులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెప్పినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. నేను పది ఎకరాల్లో తోతాపురి సాగు చేశాను. కోసుకొచ్చిన పంటతో ఫ్యాక్టరీ గేటు వద్దనే పడికాపులు కాస్తున్నా. ఎప్పుడు తీసుకుంటారో తెలియడం లేదు" అని తిరుపతి జిల్లా వినాయకపురం గ్రామానికి చెందిన రైతు అంకయ్య బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Govardhan bobby
ఐదెకరాల పంటను వదిలేశా: రైతు ఆందోళన
తిరుపతి జిల్లా కేవీబీ పురం గ్రామానికి చెందిన రామచంద్రరావు బీబీసీతో మాట్లాడారు
"నేను 20ఎకరాల్లో తోతాపురి మామిడి వేశాను. ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చిందని అధికారులు అంటున్నారు. కానీ పెట్టుబడి ఖర్చు అంతకు మించి పెరిగింది. పురుగు ఆశించి చాలా పంట దెబ్బతింది. అసలు గిట్టుబాటు ధర 12 రూపాయలైనా వస్తుందని అనుకుంటే అది కూడా తగ్గిస్తామని కంపెనీలు అంటున్నాయి. అందుకే నేను ఐదు ఎకరాల్లో కోతదశలో ఉన్న పంటను వదిలేశా. పంట పక్వానికి(చేతికి) వచ్చినా లాభంలేని కాడికి ఎందుకు'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
కోత నిలిపేసినా కాయ రాలిపోతుందని, కోత కోస్తే మార్కెట్‌లో అమ్మడుపోక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, UGC
పొరుగు రాష్ట్రాల సమస్య ఏమిటి?
ధర తగ్గి రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో తోతాపురి రైతులకు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రైతుల నుంచి మరో సమస్య వచ్చింది.
చిత్తూరు సరిహద్దులో ఉన్న తమిళనాడు, కర్ణాటక రైతులు తక్కువ ధరకు అంటే దాదాపు కేజీ నాలుగైదు రూపాయలకే మన రాష్ట్రంలోని కంపెనీలకు తోతాపురి మామిడి పంట అమ్మేందుకు ముందుకు వచ్చారు.
వాస్తవానికి ప్రతి ఏటా పొరుగున ఉన్న ఆయా రాష్ట్రాల్లోని రైతులు పంటను ఇక్కడికి తీసుకురావడం సాధారణంగా జరిగేదే.
అయితే ఈసారి ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా పొరుగు రాష్ట్రాల రైతులు సగం ధరకు తమ పంట ఇస్తామని చెప్పడంపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో కొన్నాళ్ల పాటు పొరుగు రాష్ట్రాల నుంచి తోతాపురి పండ్లను దిగుమతి చేసుకోవడంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నిషేధం విధించారు.
"అలా చేయకుంటే మన రైతులు నష్టపోతారు. ఈ నిషేధం కొంతకాలమే" అని బీబీసీతో అన్నారు కలెక్టర్ సుమిత్ కుమార్.
ఈ నిషేధం గురించి తమిళనాడు పెద్దగా పట్టించుకోకున్నా, కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది.
నిషేధం నిర్ణయంతో కర్ణాటకలోని ఏపీ సరిహద్దు ప్రాంత మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతారని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.
కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ లేఖలో కోరారు.
అయితే దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook/sumit kumar
మూడు వారాల్లో అంతా సర్దుకుంటుంది: కలెక్టర్
"ఈసారి దిగుబడి బాగా వచ్చింది. స్థానిక రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి వచ్చిన దిగుబడి మొత్తం క్లియర్ చేసేందుకు మూడు వారాల టైం పట్టొచ్చు. ఫ్యాక్టరీల యజమానులతో నేను రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నా. కిలో మామిడికి రూ.12 ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. గుజ్జు పరిశ్రమలు ఆ రేటు కచ్చితంగా చెల్లించాల్సిందే" అని సుమిత్‌కుమార్ అన్నారు.
"ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో తోతాపురి రైతుల సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల తర్వాత కూడా కంపెనీలు కేజీకి 8 రూపాయలు ఇవ్వడం లేదంటే సర్కారు ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలువుత్నాయో అర్ధం చేసుకోవచ్చు" అని తిరుపతి జిల్లా రైతు సంఘం నేత దాసరి జనార్దన్, సీపీఎం నాయకుడు కాణిపాకం వేణుగోపాల్‌లు బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














