కవ్వాల్ టైగర్ రిజర్వ్: పులుల కోసం అటవీ గ్రామాలు ఖాళీ చేసిన గిరిజనులు తిరిగి అదే అడవిలోకి ఎందుకు వెళ్తున్నారు?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలో పులుల రక్షిత ఆవాసాల అభివృద్ధి కోసం నిరుడు తెలంగాణలోని ఉట్నూర్ ఏజెన్సీ అటవీ ప్రాంతం నుండి రెండు ఆదివాసీ గూడేల ( రాంపూర్, మైసంపేట్) ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు.
ఏడాది గడిచాక పునరావాస కేంద్రంలో ఉండేదేలేదని తిరిగి అడవిబాట పట్టారు ఆదివాసీలు. గతంలో తమ గూడేలున్న ప్రాంతంలో గుడిసెలు వేసి నివాసాలు ఏర్పాటుచేశారు.
అలా అడవిలోకి వెళ్లిన వారిని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఒప్పించి తిరిగి పునరావాస కేంద్రానికి రప్పించారు.
ఇంతకూ ఆదివాసీలు ఇలా ఎందుకు చేశారు, వారు ఏం కోరుకుంటున్నారు?


పులుల సంఖ్య పెంచేందుకు.
రక్షిత అటవీప్రాంతాల్లోని మానవ ఆవాసాలను లేకుండా చేయడం ద్వారా, వన్యప్రాణులకు అనువైన వాతావరణం కల్పించాలని తెలంగాణ అటవీశాఖ భావిస్తోంది.
గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ ప్రాజెక్ట్ అనుభవాల ఆధారంగా మరో పదికి పైగా గూడేలను కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుండి పునరావాస కాలనీలకు తరలించి, ఇక్కడ పులుల సంఖ్య పెంచాలన్నది అటవీశాఖ ప్రణాళిక.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల్లో సామర్థ్యానికి మించి పులులు పెరిగాయి. దీంతో ఆహారం, ఆవాసం కోసం పెరుగుతున్న ఒత్తిడితో అక్కడి పులుల్లో కొన్ని సరిహద్దునే ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో స్థిరపడతాయని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ) అంచన.
ఎన్టీసీఏ అంచనాలకు తగ్గట్టుగానే కవ్వాల్‌లోకి మహారాష్ట్ర నుండి పులుల రాక మొదలైంది. అయితే, ఈ క్రమంలో ఏర్పడుతున్న మానవ-జంతు సంఘర్షణను తగ్గించడంలో మొదటి భాగమే రాంపూర్, మైసంపేట్ గూడేల తరలింపు ప్రక్రియ.
2024 ఎప్రిల్-మే నెలల్లో ప్రస్తుత నిర్మల్ జిల్లా(ఒకప్పటి ఉమ్మడి ఆదిలాబాద్) కడం మండలం పాత మద్దిపడగలో నిర్మించిన పునరావాస కాలనీకి 142 కుటుంబాలకు చెందిన సుమారు 500 మంది ఆదివాసీలను తరలించారు.

‘అసంపూర్ణ పునరావాస ప్యాకేజీ’
పులుల కోసం అడవిని వదిలిన ఆదివాసీలకు.. '' రూ. 15 లక్షల నగదు పరిహారం లేదా పునరావాస కాలనీలో డబుల్ బెడ్రూం ఇల్లుతో పాటూ సుమారు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి'' ఇలా రెండు పునరావాస ప్యాజీలను అధికారులు ప్రకటించారు.
నగదు పరిహార ప్యాకేజీని 48 కుటుంబాలు, రెండో తరహా ప్యాకేజీని 94 కుటుంబాలు ఎంచుకున్నాయి.
అయితే, ఏడాది గడిచినా తమకు నగదు పరిహారం పూర్తిగా అందలేదని, హామీ ఇచ్చిన వ్యవసాయ పట్టాలు చేతికి రాలేదని ఆదివాసీలు ఆగ్రహంతో ఉన్నారు.
వీరిలో కొందరు ఇటీవల తమ పాతగూడేలకు తిరిగి వెళ్లి అక్కడ తాత్కాలిక నివాసాలను ఏర్పాటుచేశారు.
తమ వ్యవసాయ భూములు విడిచి పునరావాస కాలనీకి వస్తే, ఉపాధి లేక పస్తులుండాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'పరిస్థితులు ఏమీ మారలేదు'
మైసంపేటకు చెందిన గోండు ఆదివాసీ అర్క లచ్చుకు 6 ఎకరాల భూమి ఉంది.
త్రీఫేజ్ కరెంటు, రోడ్డు సౌకర్యం, మౌలిక వసతులులేని ప్రాంతంలో రాబోయే తరాలకు భవిష్యత్తు లేదని గూడెం వాసులతో పాటూ ఆయన భావించారు.
ఏడాది కిందట 'తమకంతా మంచే జరగాలని' తన పూర్వీకుల సమాధులకు చివరిసారి మొక్కులు చెల్లించి గూడెం వదిలి కుటుంబంతో సహా పునరావాస కాలనీకి వచ్చారు లచ్చు.
అయితే, తాను కోరుకున్నట్టు జరగలేదన్న అసంతృప్తితో లచ్చు ఉన్నారు.
"ఏం బాగుపడ్డాం, పిల్లల చదువులు బాగుంటాయని వచ్చాము. ఇక్కడ గుడి లేదు, బడి లేదు. పట్టాలు ఇస్తే భూమి దున్ని పిల్లలను పోషించుకునేవారం. రైతులుగా బతికిన మేం ఏడాదిగా పునరావాస కాలనీలో కూలీలుగా మారిపోయాం'' అని అర్క లచ్చు బీబీసీతో అన్నారు.
ఒకప్పుడు పత్తి, కందులు, ధాన్యం, సిరిధాన్యాలు పండించి, ఇప్పుడు వరి నాట్లు వేయడానికి కూలీకి పోతున్నామని, ఆ పని కూడా సరిగా దొరకదని కాలనీలో నివసిస్తున్న ఆదివాసీ మహిళలు కొందరు బీబీసీతో చెప్పారు.
గుజిగంటి పార్వతి. రాంపూర్ గూడేనికి చెందిన నాయక్ పోడ్ తెగ మహిళ. గతంలో ఆమె వెదురు బుట్టలు, తడికెలు అల్లే సంప్రదాయ వృత్తితో పాటూ సొంత భూమిలో వ్యవసాయం చేశారు.
"పాత గూడెంలో పండిన బియ్యం బస్తాలతో పునరావాస కాలనీకి వచ్చాము. ఇక్కడ ఉపాధి లేదు. ఇప్పుడు బియ్యం కూడా అయిపోయాయి. ఏడాది దాటినా భూమి పట్టాలు రాలేదు, అందుకే తిరిగి పాత గూడేలకు వెళ్లి గుడిసెలు వేశాం. ఎప్పుడో దొరికే కూలీతో వచ్చే 250 రూపాయలతో ఎలా నెట్టుకురావాలి. మా బతుకులు మారలేదు, మా కష్టాలు పెరిగాయి'' అని పార్వతి అన్నారు.

'చదువులు అటకెక్కాయి'
ఉపాధిహామీ పనులు, పిల్లలకు హాస్టల్ వసతి, కాలనీలో బడి నిర్మాణ హామీ.. ఇలా ఏదీ అమలు కాలేదని పునరావాస కాలనీలోని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలనీలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ భవనంలో ప్రైమరీ క్లాసులు నడుస్తుంటే, అందులోని వంటగదిలో అంగన్‌వాడీ పిల్లలుంటున్నారని బీబీసీ పరిశీనలలో తేలింది.
"అడవిని వదిలేంతవరకు కాలనీకి పోవాలి పోవాలి అన్నారు. ఇక్కడికి వచ్చాక మా బతుకులు పట్టించుకునేవారే లేరు. ఇక్కడి ప్రపంచమంతా అయోమయంగా ఉంది. ఇప్పుడేం చేయాలి, పిల్లలతో ఎలా బతకాలి?" అని గడ్డం సువర్ణ వాపోయారు.

‘మౌలిక వసతులూ కల్పించలేదు...’
కాలనీలో మౌలిక సదుపాయల విషయంలోనూ ఇక్కడివారికి అసంతృప్తే ఉంది.
మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా లేదని మహిళల ఫిర్యాదు.
పునరావాస ప్రక్రియలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ట్యాంకులు పనిచేయడం లేదని బీబీసీ పరిశీలనలో తేలింది.
తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నాసిరకమైందని, గోడలలో పగుళ్లు వస్తున్నాయని చిట్ల భీమక్క అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిహారం కోసం ఎదురుచూస్తూ అనారోగ్యం బారినపడి ఇప్పటికే పదిమంది దాకా మరణించారని కాలనీ యువకుడు కోవ ప్రవీణ్ అన్నారు. అయితే, ఈ మరణాల అంశాన్ని బీబీసీ స్వయంగా ధ్రువీకరించుకోలేదు.
''మా పిల్లలు బాగా చదువుతారన్న ఆలోచనతో ఇక్కడి వచ్చాము. స్కూల్ బిల్డింగ్ లేక ఏడాది కాలంగా ఎంతో చదువు పోయింది. అక్కడ నేర్చుకున్న అక్షరాలు కూడా మరిచిపోయారు. ఇక్కడ చూడటానికి పైకి అందంగా కనిపిస్తున్న ఇల్లు తప్ప ఏమీ లేదు. అందుకే మళ్లీ అడవిబాట పట్టాం'' అని ప్రవీణ్ చెప్పారు.

‘అది నిరసనగానే చూస్తాం...’
'పునరావాస కాలనీ నుండి ఆదివాసీలు తిరిగి అడవిలోకి వెళ్లడాన్ని వారి నిరసనగానే చూస్తున్నాం. అలా వెళ్లిన వారిని అధికారులతో సమన్వయ పరిచి వెనక్కి తీసుకొచ్చాం. అసైన్డ్ పట్టాల స్థానంలో ఎక్కువ ప్రయోజనాలుండే రెవెన్యూ పట్టాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరాము'' అని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఎన్జీవోకు చెందిన ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్వర్ అన్నారు.

'త్వరలోనే సమస్యలన్నీ తీరుస్తాం'
భూమి పట్టాలు, పూర్తిస్థాయి ఆర్థిక పరిహారం త్వరలోనే అందిస్తామని నిర్మల్ జిల్లా అధికారులు చెబుతున్నారు.
'చనిపోయిన వారి వారసుల డిపెండెంట్ సర్టిఫికేట్లు మాకు అందక పోవడం వల్లే కాస్త ఆలస్యం జరుగుతోంది. ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ దాదాపుగా ఇచ్చేశాం. తిరిగి అడవిలోకి వెళ్లొద్దని వారిని కోరుతున్నాం'' అని కడం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( ఎఫ్ఆర్ఓ) గీతారాణి బీబీసీతో చెప్పారు.
''పట్టాలు ఇక రావేమో అని ఆదివాసీలను బయటిశక్తులు కొన్ని భయపెట్టాయి. వీరికి కేటాయించిన ఫారెస్ట్ భూములను రెవెన్యూ ల్యాండ్స్ గా మార్చడానికి కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. వచ్చే రెండు వారాల్లో పట్టాలతో పాటే మిగిలిన ఆర్థిక ప్యాకేజీ డబ్బులు కూడా ఇస్తాం'' అని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














