కోటా వినుత: ‘ఆంధ్రప్రదేశ్‌లో హత్య చేసి శవాన్ని తమిళనాడులో పడేసిన’ కేసులో జనసేన బహిష్కృత నాయకురాలిపై ఆరోపణలు ఏమిటి?

Vinutha Kotaa

ఫొటో సోర్స్, Vinutha Kotaa/facebook

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడులో దొరికిన ఓ మృతదేహానికి సంబంధించిన కేసులో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జ్, ఆమె భర్త అరెస్ట్ కావడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయమైంది.

తమ దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాసులు అనే యువకుడి హత్య కేసులో శ్రీకాళహస్తి నుంచి గతంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి, అనంతరం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కోటా వినుత, ఆమె భర్త చంద్రబాబును చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

కోటా వినుతపై హత్య ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

రాజకీయ కారణాలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

శ్రీనివాసులను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీనివాసులు, శ్రీకాళహస్తి, కోట వినుత, జనసేన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కోటా వినుతతో శ్రీనివాసులు

‘ఆంధ్రలో చంపి తమిళనాడులో పడేశారు’

శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం గ్రామానికి చెందిన 22 ఏళ్ల శ్రీనివాసులు 2019లో వినుత ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.

తర్వాత వారి కుటుంబానికి దగ్గరయ్యారు. వినుతకు డ్రైవరుగా, పీఏగా పనిచేస్తున్నారు.

జులై 8న అతని మృతదేహం చెన్నైలోని కూవం నదిలో కనిపించింది.

పోలీసులు మొదట దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా తమకు లభించిన సీసీటీవీ ఫుటేజి ఆధారంగా.. యువకుడిని హత్య చేశారని గుర్తించినట్లు తమిళనాడు పోలీసులు చెప్పారు.

సీసీటీవీ ఫుటేజి ఆధారంగా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ మీడియా సమావేశంలో చెప్పారు.

‘చెన్నైలో మృతదేహం దొరికింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. పోస్టుమార్టంలో అది హత్య అని తేలింది. సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు మాకు ఒక కారుపై సందేహం వచ్చింది. ఆ కార్ నంబరును ట్రేస్ చేసి.. ఆ కారులో వచ్చిన వాళ్లను మేం పట్టుకున్నాం. ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశాం. వారు నేరం అంగీకరించారు" అని పోలీస్ కమిషనర్ చెప్పారు.

శ్రీనివాసులు, శ్రీకాళహస్తి, కోట వినుత, జనసేన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పోలీస్ స్టేషన్ దగ్గర మృతుడి బంధువులు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయాలు, జనసేన నాయకురాలికి సంబంధించిన విషయంలోనే హత్య జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.

"హత్యకు కారణం ఏంటి అనేది దర్యాప్తు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన మహిళ వద్ద పనిచేస్తూ వేరే పార్టీ వారికి శ్రీనివాసులు మద్దతుగా ఉన్నారు, కొన్ని వీడియోలు తీశారు అనే కారణంతో హత్య చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో హత్య చేసి మృతదేహాన్ని చెన్నైలో పడేశారు. వారు వైద్యం కోసం చెన్నై వచ్చివెళ్తుండడంతో ఈ మార్గం వారికి బాగా తెలుసు. ఇక్కడకు పడేస్తే కనిపెట్టలేరని భావించి తెచ్చిపడేశారు. హత్య ఎలా చేశారనేది విచారణలో తేలుతుంది. దీనిని హత్య కేసుగానే నమోదు చేశాం'' అని పోలీస్ కమిషనర్ అరుణ్ చెప్పారు.

చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కోటా వినుత, ఆమె భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి, షేక్ దాసర్ ఉన్నారు,

శ్రీనివాసులు, శ్రీ కాళహస్తి, కోటా వినుత, జనసేన
ఫొటో క్యాప్షన్, శ్రీనివాసులు సోదరి కీర్తి

కాలు విరిగిందని చెప్పారు-మృతుడి సోదరి

నెల రోజుల క్రితం శ్రీనివాసులు కాలు విరిగిందని చెబితే చూడటానికి వెళ్లామని ఆయన సోదరి కీర్తి బీబీసీతో చెప్పారు.

తన సోదరుడితో తమను సరిగా మాట్లాడనీయలేదన్నారు. ఇప్పుడు అతడిని లేకుండా చేశారని కీర్తి ఆరోపించారు.

''మా అన్న 15 ఏళ్ల వయసులో వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. నమ్మకంగా వాళ్ల దగ్గరే డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. వాళ్లకు పీఏగా ఉంటూనే ఇంట్లో పనంతా చేసేవాడు. జూన్ 21వ తేదీన అతన్ని ఇంట్లో నుంచి పంపించేశారు. అంతకు ముందు అతనికి కాలు విరిగిందని ఫోన్ చేసి చెబితే మేం చూడడానికి వెళ్లాం. అతన్ని మాతో నేరుగా కూడా మాట్లాడనివ్వలేదు. చుట్టూ మనుషులను పెట్టారు" అని ఆమె అన్నారు

తన సోదరుడిపై అంతకు ముందే దాడి చేసి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

శ్రీనివాసులు తనతో మాట్లాడినప్పుడు అటూఇటూ ఉన్న వాళ్లను చూస్తూ భయంభయంగా మాట్లాడారని అన్నారు.

కాలు విరిగిందని చెప్పడంతో ఇంటికి తీసుకెళతామని అడిగామని, అయితే వాళ్లు అందుకు అంగీకరించలేదని శ్రీనివాసులు సోదరి బీబీసీతో చెప్పారు.

''పార్టీ మీద అభిమానంతో మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అక్కడే పని చేసుకుంటూ ఉండిపోయాడు. నెలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. అసలు అక్కడ ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. కనీసం ఇంటికి వచ్చినా ఈరోజు ఇంత దూరం వచ్చుండేది కాదు. చావు వరకు వెళ్లకుండా మేం ఏదో విధంగా అతడిని బయటకు తెచ్చుకునే వాళ్ళం. అతనిని పూర్తిగా భయపెట్టి ఏమి చెప్పనీయలేదు. ఏమైనా బయట చెబితే మీ ఇంట్లో వాళ్లని చంపేస్తాం అని బెదిరించి ఒక మాట కూడా రానీయకుండా అంతా వాళ్లే చేశారు'' అని కీర్తి ఆరోపించారు.

''జూన్ 21వ తేదీన పంపిస్తున్నట్లు చెప్పారు. అయితే శ్రీనివాసులు ఇంటికి రాలేదు. ఆ తర్వాత వాళ్లే తీసుకెళ్లి ఏదో చేసి ఉంటారు. అంతకుముందు ఫోన్ మాట్లాడేవాడు. అయితే గొడవ జరిగిన తర్వాత ఇంటర్నేషనల్ కాల్ అని ఆ ఫోన్లో మాత్రమే మాట్లాడేవాడు. అంటే అది కూడా వాళ్లే మాట్లాడిస్తున్నారని మేం అనుకుంటున్నాం. ఫోన్ చేసినప్పుడు ఏడ్చేవాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్పేవాడు. ఇంక వేరే ఏమీ మాట్లాడేవాడు కాదు. అంతకుముందు ఫోన్ అతని దగ్గరే ఉండేది మేం మాట్లాడే వాళ్లం. అంతా బాగుండేది. ఎప్పుడైతే కాలు విరిగిందో అప్పటి నుంచి వాళ్లు మా అన్న ఫోన్ తీసుకొని పెట్టుకున్నారు'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీనివాసులు, శ్రీ కాళహస్తి, కోట వినుత, జనసేన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్‌తో శ్రీనివాసులు

సొంత అక్కలా నమ్మాడు

కోటా వినుతను తన సొంత సోదరిలా నమ్మాడని తనకంటే ముందు ఆమెతోనే రాఖీ కట్టించుకునేవాడని కీర్తి చెప్పారు.

''ఆమెను సొంత అక్కలాగా నమ్మాడు వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్లాలి. మాకు న్యాయం జరగాలి. తప్పు చేస్తే మాకు చెప్పాలి. అంతే కానీ చంపే హక్కు వాళ్లకు ఎవరు ఇచ్చారు. నా అన్నను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా. వారి మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం'' అని కీర్తి అన్నారు.

శ్రీనివాసులు తండ్రి వెంకటరమణది వెంకటగిరి.

తల్లి గీత చనిపోవడంతో శ్రీనివాసులును 7 ఏళ్ల వయసులోనే శ్రీకాళహస్తి మండలంలోని అతడి అమ్మమ్మ ఊరు బొక్కసంపాళెం పంపించారు.

దీంతో అతడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, మామ, అత్త దగ్గర పెరిగాడు.

కూలి పనులు చేసుకుని పెంచామని శ్రీనివాసులు అత్త జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమని దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసులు బంధువు, గ్రామ సర్పంచ్ సుబ్రమణ్యం బీబీసీతో అన్నారు.

శ్రీనివాసులు, శ్రీ కాళహస్తి, కోటా వినుత, జనసేన

ఫొటో సోర్స్, janasena Party

ఫొటో క్యాప్షన్, వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.

శ్రీకాళహస్తి రాజకీయాలే కారణమా

ఈ హత్య వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు చెన్నై పోలీసులు చెప్పారు.

శ్రీనివాసులు వేరే పార్టీ వారికి సమాచారం చేరవేస్తున్నారనే ఆయన్ను హత్య చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని చెన్నై పోలీసులు చెప్పారు. .

శ్రీకాళహస్తిలో కూటమి నేతలైన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన అధ్యక్షురాలు కోటా వినుత మధ్య విభేదాలు ఉన్నాయని స్థానికంగా చెప్తున్నారు.

2019లో శ్రీ కాళహస్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వినుత ఓటమి పాలయ్యారు.

2024 ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడిన తర్వాత అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి శ్రీకాళహస్తి టికెట్ కేటాయించారు.

వినుతను చెన్నై పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో "ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని దీని వెనుక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందని" కోటా వినుత ఆరోపించారు.

మహిళలని రాజకీయాల్లో ఎదగనీయకుండా తొక్కేస్తున్నారని ఆరోపించారు.

ఆమె ఆరోపణలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు.

ఇది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారం అని, అందులో తమకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)