ఇజ్రాయెల్ దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్న ఇరాన్ అధ్యక్షుడు.. గాయపడ్డారని కథనాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కాస్రా నాజి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాన్‌పై గత నెలలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ గాయపడినట్లు చెబుతున్నారు.
జూన్ 16న తెహ్రాన్‌లోని అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఒక రహస్య ప్రాంతంలో నిర్వహించిన ‘సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ అత్యవసర సమావేశానికి పెజాష్కియన్ హాజరైనప్పడు ఈ దాడి జరిగింది.
ఆ రహస్య ప్రాంత ప్రవేశమార్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరు బాంబులు వేశారని ‘రివల్యూషనరీ గార్డ్’కు సన్నిహితంగా ఉండే ఇరాన్‌లోని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ దాడిలో అధ్యక్షుడి కాలికి గాయాలయ్యాయని ఇతరులు అత్యవసర ద్వారంలోంచి తప్పించుకున్నారని ఆ వార్తాసంస్థ వెల్లడించింది.
తమ దేశంలోకి చొరబడిన ఇజ్రాయెల్ ఏజంట్ల కోసం ఇరాన్ వెతుకులాట మొదలు పెట్టిందని ఫార్స్ కథనం పేర్కొంది.

ఫార్స్ కథనాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించుకోలేదు. ఈ నివేదికపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
12 రోజుల యుద్ధంలో వాయువ్య తెహ్రాన్‌లో ఓ కొండ వైపు పదే పదే దాడులు జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది.
నాలుగో రోజు జరిగిన దాడులు తెహ్రాన్‌లోని సీక్రెట్ అండగ్‌గ్రౌండ్ కేంద్రం లక్ష్యంగా జరిగినట్లు ఇప్పుడు బహిర్గతం అవుతోంది.
ఆ సమయంలో ఇరాన్‌లోని టాప్ లీడర్స్ అంతా ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు.
ఈ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ లోపలకు వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు ఉన్న ఆరు మార్గాలపైన, గాలి వెలుతురు వచ్చే పాయింట్లపైనా ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఫార్స్ న్యూస్ వార్తా సంస్థ కథనం తెలిపింది.
ఈ కేంద్రానికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. అయితే పెజిష్కియాన్ సురక్షితంగా బయటపడ్డారు.
నిర్ణయాలు తీసుకోవడంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిలే అత్యున్నత అధికార సంస్థ.

ఫొటో సోర్స్, Reuters
తనను చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని గత వారం పెజిష్కియాన్ ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తిరస్కరించారు.
యుద్ధ లక్ష్యం 'పాలకుల్ని మార్చడం' కాదని ఆయన చెప్పారు.
యుద్ధం ప్రారంభంలోనే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన అనేకమంది కమాండర్లను చంపేసింది.
ఈ దాడుల తర్వాత 24 గంటల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ దాడులను తాము ఊహించలేదని ఇరాన్ నాయకులు అంగీకరించారు.
అయతుల్లా ఖమేనీ తమ లక్ష్యంగా ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు అంగీకరించారు. అయితే సురక్షిత ప్రదేశానికి తరలించిన తర్వాత, ఆయన జాడ తెలుసుకోలేక పోయారు.
ఇరాన్ అత్యున్నత నాయకులు, అధికారులు ఎక్కడున్నారనే కీలక నిఘా సమాచారం ఇజ్రాయెల్ ఎలా సంపాదించిందనే దానిపై ఇప్పటికీ అనేక సందేహలు ఉన్నాయి.
జూన్ 13న ఇజ్రాయెల్ అనూహ్యంగా ఇరాన్ సైనిక, అణు స్థావరాలపై దాడులు ప్రారంభించింది.
తెహ్రాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా వైమానిక దాడులు చేసింది.
అణ్వాయుధాలు తయారు చేస్తున్నామన్న వాదనను తోసిపుచ్చిన ఇరాన్ తమ అణు కార్యక్రమం పౌర ప్రయోజనాలకు ఉద్దేశించిందని తెలిపింది.
జూన్ 22న ఇరాన్ అణు స్థావరాలపై అమెరికన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ వైమానిక, క్షిపణి దాడులు చేసింది.
దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తర్వాత చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














