యెమెన్‌లో నిమిషప్రియ మరణశిక్ష వాయిదా, చివరి నిమిషంలో ఏం జరిగింది?

నిమిష ప్రియ, కేరళ, యెమెన్, హూతీ
ఫొటో క్యాప్షన్, నిమిష ప్రియ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ న్యూస్

యెమెన్‌లోని భారతీయ నర్సు నిమిషప్రియ మరణశిక్షను హూతీ వర్గం కింద పనిచేసే యెమెన్ రిపబ్లిక్ న్యాయ మంత్రిత్వ శాఖ వాయిదావేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

నిమిష ప్రియకు ఈ నెల 16న మరణశిక్షను అమలు చేయాలనే ఉత్తర్వులను వాయిదా వేయాలని అటార్నీ జనరల్ నిర్ణయించారని అందులో పేర్కొంది. ఈమేరకు తదుపరి నోటీసు వచ్చేవరకు నిమిషప్రియ మరణశిక్షను వాయిదా వేస్తున్నట్లు అందులో పేర్కొంది.

నిమిష కేసు తరపు పవర్ ఆఫ్ అటార్నీ శామ్యూల్ జెరోమ్ బీబీసీతో మాట్లాడారు.

"అంతా సానుకూల దిశలో జరుగుతోంది. కానీ, అది మరణశిక్ష రద్దు గురించి కాదు, నిమిష మరణశిక్ష వాయిదా వేయనున్నారు. త్వరలో అధికారిక ప్రకటనను తెలియజేస్తాను" అని శామ్యూల్ జెరోమ్ అన్నారు.

మహదీ కుటుంబం ఇప్పటివరకు క్షమాభిక్ష ఇవ్వలేదని తెలిపారు.

''వారు క్షమాపణ ఇస్తేనే మరణశిక్ష రద్దు చేస్తారు, కాబట్టి అందుబాటులో ఉన్న ఏకైక ఎంపిక మరణశిక్షను వాయిదా వేయడం. ఇది క్షమాభిక్ష కోసం కుటుంబంతో చర్చలు జరపడానికి మాకు ఎక్కువ సమయం ఇస్తుంది'' అని శామ్యూల్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిమిషప్రియ
ఫొటో క్యాప్షన్, గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లియార్, కేరళకు చెందిన ఒక ముస్లిం మత గురువు.

చివరి నిమిషంలో ఏం జరిగింది?

నిమిష ప్రియ కేసులో సానుకూల పురోగతి కనిపిస్తోందని అంతకుముందు సేవ్ నిమిష గ్రూపు న్యాయవాది సుభాష్ చంద్రన్ చెప్పారు.

ఆయన పంచుకున్న సమాచారం మేరకు "కేరళకు చెందిన ముస్లిం మతాధికారి గ్రాండ్ ముఫ్తీ ఎ.పి. అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత, నిమిష ప్రియకు సంబంధించిన ముఖ్యమైన చర్చల్లో పురోగతి ఉంది. తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో సమావేశం ఈరోజు జరుగుతుంది" అని తెలిపారు.

"మహదీ హత్య అతని కుటుంబానికి మాత్రమే కాకుండా మహదీ నివసించిన ప్రాంతంలోని తెగలు, స్థానికులతో కూడా ఓ భావోద్వేగ సమస్య. అందుకే ఇప్పటివరకు ఎవరూ ఆ కుటుంబాన్ని సంప్రదించలేకపోయారు. ముస్లిం మతాధికారి గ్రాండ్ ముఫ్తీ ఎ.పి. అబూ బకర్ ముస్లియార్ జోక్యం ద్వారా మాత్రమే ఆ పరిచయం సాధ్యమైంది. ప్రఖ్యాత పండితుడు సూఫీ అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ విషయాన్ని పునఃపరిశీలించేందుకు మహదీ కుటుంబం అంగీకరించింది.

"ఈరోజు చర్చ 'బ్లడ్ మనీ’గా పిలిచే పరిహారాన్ని (ఎక్కువగా నగదు) స్వీకరించడంపై తుది నిర్ణయానికి రావడం లక్ష్యంగా పెట్టుకుంది. మహదీ కుటుంబాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని సేవ్ నిమిష గ్రూప్ తరపు న్యాయవాది సుభాష్ చంద్ర అన్నారు.

నిమిషప్రియ
ఫొటో క్యాప్షన్, నిమిప ప్రియ తల్లి ప్రేమ కుమారి భారత ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొంది గత సంవత్సరం శామ్యూల్ జెరోమ్‌తో కలిసి యెమెన్‌కు వెళ్లారు.

అసలేంటీ కేసు?

తన వృత్తిపరమైన భాగస్వామి, యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసినట్టు నిమిష ప్రియ ఆరోపణలు ఎదుర్కొంన్నారు.

ఈ కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం యెమెన్‌లోని సనాలోని సెంట్రల్ జైలులో ఉన్నారు.

యెమెన్‌లో ఆమెను రక్షించడానికి చట్టపరంగా ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయాయి.

2017లో మహదీ మృతదేహం నీటి తొట్టెలో ముక్కలుగా కనిపించింది. ఒక నెల తర్వాత, నిమిషను సౌదీ అరేబియా, యెమెన్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు.

మహదీకి 'అధిక మోతాదులో' మత్తుమందు ఇచ్చి హత్య చేసి, ఆయన మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించినట్టు నిమిషపై ఆరోపణలున్నాయి.

నిమిషను మహదీ శారీరకంగా హింసించారని, ఆమె డబ్బులు తీసుకున్నారని, ఆమె పాస్‌పోర్ట్‌ను తీసుకుని, ఆమెను తుపాకీతో బెదిరించారని నిమిష తరఫు లాయర్ వాదించారు.

నిమిష తన పాస్‌పోర్ట్‌ను తిరిగి తీసుకోవడానికి మహదీకి మత్తుమందు ఇచ్చారని, కానీ అనుకోకుండా అది ఓవర్ డోస్ అయిందని తెలిపారు.

యెమెన్ రాజధాని సనాలోని ఒక కోర్టు 2020లో నిమిషకు మరణశిక్ష విధించింది. దీనిపై నిమిష చేసిన అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు 2023 నవంబర్‌లో తిరస్కరించింది. నిమిషకు విధించిన మరణశిక్షను సమర్థించింది.

ఆ తర్వాత, ఈ ఏడాది ప్రారంభంలో, యెమెన్ అధ్యక్షుడు మెహదీ అల్-మషాద్ మరణశిక్షను ఆమోదించారు.

అయితే, యెమెన్‌లో ఇస్లామిక్ షరియా చట్టం అమలులో ఉన్నందున, బాధితుడి కుటుంబం డబ్బుకు బదులు క్షమాభిక్ష అందించే ''బ్లడ్ మనీ'' లేదా 'తియా'కు అంగీకరిస్తే నిమిష ప్రియ మరణశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)