గోకర్ణ: పాములు తిరిగే ప్రమాదకర గుహలో ఉన్న ఈ రష్యన్ మహిళ ఏం చెప్పారు?

కర్ణాటక, నీనా కుటినా, పోలీసులు, గోవా, రష్యా

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలోని గోకర్ణకు సమీపంలో ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక గుహలో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఉత్తర కన్నడ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఈ గుహ ఉంది.

జూలై 14న ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

నీనా కుటినా అనే ఈ రష్యన్ మహిళ వీసా గడువు ముగిసినప్పటికీ భారత దేశంలోనే ఉంటున్నారు.

గుహలో ఎందుకు ఉంటున్నారనే ప్రశ్నలకు, జూలై 15న ఆమె బదులిచ్చారు.

నీనా కుటినా వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, "మాకు ప్రకృ‌తి ఒడిలో జీవించడమంటే ఇష్టం. మేమేమీ ఆహారం, దొరకని, ఎలాంటి షాపింగ్ సౌకర్యం లేని దట్టమైన అడవిలో ఉండడం లేదు. ఇది గ్రామానికి సమీపంలోనే ఉంటుంది. మేం ఉన్న గుహ చిన్నదేమీ కాదు, చాలా పెద్దది. అడవిలో ఉంటున్నారు, పాములు ఇతరత్రా జంతువులు ఉండొచ్చని మీరంటున్నారు, కానీ అవన్నీ కూడా ప్రకృతిలో భాగం. ప్రకృతి మనకు ఎలాంటి హానీ చేయదు" అని అన్నారు.

వీసా గడువు ముగిసినా ఇంకా భారత్‌లోనే ఉండటంపైనా ఆమె స్పందించారు.

"వారు(పోలీసులు) అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ల దగ్గర ఉన్నది నా పాత పాస్‌పోర్ట్. మా వీసా గడువు ముగిసింది నిజమే. కానీ, అది కొద్దిరోజుల ముందే. 2017 నుంచి, మేం నాలుగు దేశాల్లో పర్యటించి భారత్‌కు తిరిగొచ్చాం. నా కొడుకు చనిపోయాడు. ఈలోగా వీసా గడువు ముగిసింది. అయితే, గడువు ముగిసి చాలా కాలం ఏమీ కాలేదు" అని నీనా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కర్ణాటక, నీనా కుటినా, పోలీసులు, గోవా, రష్యా
ఫొటో క్యాప్షన్, వీసా గడువు ముగిసి 8 ఏళ్లైనా నీనా కుటినా భారత్‌లోనే ఉంటున్నారని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు.

అడవిలోకి ఎందుకు వచ్చారు?

కొండకు 700 నుంచి 800 మీటర్ల కిందనున్న గుహ ప్రవేశద్వారం దగ్గర పోలీస్ పెట్రోలింగ్ బృందం కొన్ని దుస్తులను గుర్తించింది. అక్కడ ఎవరో ఉంటుండొచ్చని భావించిన పోలీసులు గుహ వద్దకు వెళ్లారు. అప్పుడు, ఒక విదేశీ చిన్నారి గుహ నుంచి బయటకు పరిగెత్తుతూ వస్తోంది.

ఆ అడవిలో విదేశీ చిన్నారని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

"గుహ చుట్టూ పాములు తిరుగుతూ కనిపించాయి. ఈ ప్రాంతం ప్రమాదకరమైనది. కిందటేడాది రామతీర్థ కొండల చుట్టూ కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. అందుకే ఈ పరిసర ప్రాంతాల్లో గస్తీ బృందం పహారా కాస్తోంది" అని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం. నారాయణ బీబీసీతో చెప్పారు.

"ప్రకృతి ఒడిలో జీవించడం మాకిష్టం. ప్రకృతి మనకు హాని చేయదు'' అని గుహలో నివాసం గురించి రష్యన్ మహిళ అన్నారు.

ఆ రష్యన్ మహిళ 2016లో బిజినెస్ వీసాపై భారత్ వచ్చారని పోలీసులు తెలిపారు.

ఆమె వీసా గడువు 8 ఏళ్ల కిందటే ముగిసింది. దీంతో ఆమెను తిరిగి రష్యా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

కర్ణాటక, నీనా కుటినా, పోలీసులు, గోవా, రష్యా

ఫొటో సోర్స్, Screengrab

గుహలో పూజలు

పోలీసులు ఆ మహిళను ప్రశ్నించినప్పుడు, తన కుమార్తెలతో కలిసి గోవా నుంచి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారని ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

"ఆమె విఠల్(కృష్ణుడు) విగ్రహానికి పూజలు చేస్తున్నట్లు మా టీమ్ గుర్తించింది. శ్రీకృష్ణుడు తనను ధ్యానం చేయడానికి ఇక్కడకు పంపాడని, తాను తపస్సు చేస్తున్నానని ఆ మహిళ చెప్పారు" అని పోలీసు అధికారి తెలిపారు.

తన పాస్‌పోర్ట్ పోయిందని నీనా పోలీసులకు చెప్పింది. అయితే, పోలీసులు, అటవీ అధికారులు ఆమె పాస్‌పోర్ట్‌ను గుర్తించారు. తాను భారత్ వస్తూ, వెళ్తున్నట్లు నీనా చెబుతున్నారు.

నీనా బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చారు.

గోవా ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఆమెకు ఏప్రిల్ 19, 2018న ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసింది.

ఆ తర్వాత, ఆమె నేపాల్ వెళ్లి సెప్టెంబర్ 8, 2018న భారత్‌కు తిరిగొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)