మానుపులి: చెట్లు మనుషులను కరుస్తాయా? అంతా అపోహే అంటున్న నిపుణులు

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

పార్వతీపురం - మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని చెట్లు, కర్రలు తమని కరుస్తున్నాయని, పట్టుకుని చుట్టేస్తున్నాయంటూ వలగజ్జి గ్రామ గిరిజనులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అటవీశాఖ అధికారులు గత కొద్దిరోజులుగా వలగజ్జి గిరిజన గ్రామంలో ఏం జరుగుతుందనే దానిపై నిశిత పరిశీలన జరుపుతున్నారు.

అయితే, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నట్లుగా చెట్లు చుట్టేయడం, కర్రలు కరవడం వంటివి జరగవని ఇవన్నీ నమ్మకాలని నిపుణులు చెబుతున్నారు.

అనుకోకుండా జరిగే ఘటనలను నిజంగా భావించి కొందరు అపోహ పడుతుంటారని, ఇవన్నీ పూర్తిగా శాస్త్రీయత లేని నమ్మకాల నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలని వృక్షశాస్త్ర నిపుణులు, అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వలగజ్జి గ్రామంలో చెట్లు ఎలా ఉన్నాయంటే...

అటవీశాఖ అధికారులతో కలిసి బీబీసీ బృందం వలగజ్జి గ్రామానికి వెళ్లింది.

గ్రామంలోకి వెళ్లగానే ఒక పెద్ద చింతచెట్టు, కొబ్బరిచెట్టు మాకు కనిపించాయి. వీటితోపాటు టేకు, అరటి, బాదం, కుంకుడు...ఇలా అనేక మొక్కలు, చెట్లు కనిపించాయి. ఇతర ప్రాంతాల్లో చెట్లతో పోలిస్తే ఇవేమీ ప్రత్యేకంగా లేవు. మామూలుగానే ఉన్నాయి.

దాదాపు 60 కుటుంబాల వరకు నివాసముండే ఈ గ్రామ జనాభా 210. వీరంతా పశుపోషణ, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొన్ని ఇళ్ల ముందర కర్రలతో ఏర్పాటు చేసుకున్న పందిళ్లు, దడులు (కంచె తరహా ఏర్పాటు) ఉన్నాయి. ఇద్దరు, ముగ్గురు భుజాలపై కత్తులు వేసుకుని తోటల్లోకి వెళ్లడం కనిపించింది.

గ్రామంలో ఉన్న కర్రలు, చెట్లు మనుషుల్ని, పశువుల్ని కరవడంతో పాటు పక్కనుంచి వెళ్లేవారిని చుట్టేస్తున్నాయని చెప్తున్న గిరిజనం.. దీనికి మానుపులి అని పేరు పెట్టారు.

పులిపంజా ఎలా పడుతుందో.. అలాగే ఈ చెట్టు, కర్ర పట్టేస్తుందని.. అందుకే దీనిని మాను-పులి అంటామని గ్రామస్థులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

'టేకు చెట్టు చుట్టేసింది'

''పదేళ్ల క్రితం బీరకాయలు కోసేందుకు పాదు వద్దకు వెళ్లినప్పుడు పాదు కోసం అక్కడ పాతిన ఒక కర్ర తనను చుట్టేసిందని, అప్పుడైన గాయానికి కుట్లు కూడా వేశారని'' 62 ఏళ్ల గటికమ్మ బీబీసీతో చెప్పారు.

"నేను అరుస్తుంటే మా మరిది చూసి కత్తితో ఆ కర్రకు గాట్లు పెట్టడంతో నన్ను ఆ కర్ర వదిలింది. దాంతో బతికిపోయాను" అని గటికమ్మ చెప్పుకొచ్చారు.

"నేను పశువు కోసం చెట్టు పక్కన నీళ్లు పెట్టి వచ్చేశాను. తర్వాత మా ఆవు తోకని టేకు చెట్టు చుట్టేసింది. తర్వాత కత్తితోని నరకడంతో వదిలింది" అని వలగజ్జి గ్రామానికి చెందిన మౌనిక బీబీసీకి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

"మానుపులి పట్టినప్పుడు దెయ్యమేదో పట్టుకున్నట్లు ఉంటాది, అయితే కత్తితో చెట్లకు గాట్లు పెడితే పోతాది. దీనికి అదే మందు" అని గంగమ్మ చెప్పారు.

చెట్లు చుట్టేయడం, కర్రలు కరవడం వంటివి జరగవని ఏయూ బోటని విభాగం ప్లాంట్ టాక్సనమిస్ట్ డాక్టర్ జె.ప్రకాశరావు బీబీసీతో చెప్పారు.

"సాధారణంగా పశువులను ఇంటి దగ్గర కట్టేసినప్పుడు, అటవిలోకి తీసుకుని వెళ్లేటప్పడు...ఆ పశువు తోకకున్న వెంటుక్రలు రఫ్‌గా ఉండటాన్ని గమనించే ఉంటారు. ఆ తోక కర్రలకు, చెట్ల దెబ్బతిన్న భాగాలు, కట్ చేసిన తర్వాత వదిలేసిన పదునైన భాగాలకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. పశువులు వాటిని సరిగ్గా తీసుకోలేక.. ఏదో ప్రయత్నం చేసి దానికి చుట్టేసుకుంటాయి. దాంతో గట్టిగా ముడిపడిపోతాయి. ఇలాంటి సంఘటనల్నే కర్రే లేదా చెట్టే చుట్టేసిందని భ్రమపడుతుంటారు" అని డాక్టర్ ప్రకాశరావు వివరించారు.

మనుషులకు కూడా కొన్నిసార్లు వారి దుస్తులకు తగిలి ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశముందన్నారు డాక్టర్ ప్రకాశరావు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

'ఈ చెట్టును పట్టుకుంటే నాకేమైనా అవుతుందా?'

గిరిజనులు ఈ మానుపులికి వైద్యం కూడా ఉందని చెప్పారు. అది ఎలాగో చూపిస్తామంటూ గతంలో మానుపులి పట్టిందని చెప్తూ.. ఒక టేకు చెట్టు వద్దకు బీబీసీ బృందాన్ని తీసుకుని వెళ్లి వివరించారు.

మానుపులి మనుషులకో, పశువులకో పట్టిన తర్వాత... అంటే చెట్టు చుట్టేసిన తర్వాత.. "కత్తులతో నరికితేనే వదులుతుంది. ఈ చెట్టుకు ఉన్న కత్తిగాట్లు (గంట్లు) పదేళ్ల కిందట ఈ చెట్టుకి మానుపులి పట్టినప్పటివే. కత్తిగాట్లు పెట్టకుండా ప్రమాదంలో ఉన్నవారిని కాపాడదామని వెళ్తే.. అందరికి ప్రమాదమే." అన్నారు గంగాధరి అనే గ్రామస్థుడు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

అయితే, "ఈ చెట్టును పట్టుకుంటే నాకేమైనా అవుతుందా?" అని బీబీసీ ప్రతినిధి అడిగినప్పుడు, ''ఏం కాదు. ఎందుకంటే, కొన్ని గడియల్లోనే మానుపులి పడుతుంది. ఎప్పుడుపడితే అప్పుడు పట్టదు" అని గంగాధరి సమాధానం చెప్పారు.

"మానుపులి ఏ చెట్టుకి పడుతుందో, ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. ఆ చెట్టు నాటిన గడియలు, ఆ చెట్టు పక్కకు మనిషి లేదా పశువు వెళ్లిన గడియలపై ఆధారపడి ఉంటుంది" అని సన్యాసిరావు చెప్పారు.

"మా ఆవుకి మానుపులి పట్టింది. ఆవు అరుస్తుంటే నేను కత్తిపట్టుకొచ్చి చెట్టుకు గాట్లు పెట్టాను. వెంటనే మానుపులి వదిలేసింది" అని వలగజ్జి గ్రామానికి చెందిన మురళి బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

ఏ చెట్టుకైనా మానుపులి పడుతుంది: మౌనిక

ఈ ఏడాది జనవరిలో తమ ఆవును మానుపులి పట్టిందని వలగజ్జి గ్రామానికి చెందిన మౌనిక బీబీసీతో చెప్పారు. ఆ సమయంలో ఆమె గర్భంతో ఉన్నారు.

"మానుపులి ఏ చెట్టుకు పడుతుందో చెప్పలేమండి. అందులో చెట్లు ఉన్న వైపు వెళ్దామంటే కాస్త భయంగా ఉంటుంది. వలగజ్జి గ్రామంలో చాలా ఏళ్లుగా మానుపులి పడుతుంది. ఈ ఏడాది జనవరిలో కూడా మళ్లీ మా ఆవుకి మానుపులి పట్టడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాం" అని మౌనిక చెప్పారు.

అయితే, మూడేళ్ల నుంచి తమ గ్రామంలో మానుపులి పట్టలేదని గంగమ్మ అనే గిరిజన మహిళ అంటే.. 12 ఏళ్ల క్రితం చివరిసారిగా వలగజ్జిలో మానుపులి పట్టిందని గంగాధరి బీబీసీతో చెప్పారు.

చివరిసారిగా మానుపులి ఎప్పుడు పట్టిందనే దానిపై గ్రామంలో ఒక స్పష్టమైన సమాధానం రాలేదు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాధానం చెప్పారు. కానీ, గ్రామంలో మానుపులి ఉందని మాత్రం అంతా చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

ప్రమాదాల బారిన పడకుండా చేసిన ఏర్పాట్లవి: డాక్టర్ ప్రకాశరావు

అటవీ ప్రాంతంలో నివసించే కొన్ని గిరిజన తెగల్లో మాయతీగ, మగ నక్షత్ర చెట్లు, మానుపులి వంటి కొన్ని నమ్మకాలు ఉంటాయని...అవన్నీ అటవీ ప్రాంతాల్లో పొంచి ఉండే ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినవేనని వృక్షశాస్త్ర నిపుణులు అంటున్నారు.

అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ప్రకృతిని కాపాడుకునేందుకు, అలాగే అడవి జంతువులు, ప్రకృతిలో పొంచివుండే ప్రమాదాల బారి నుంచి తమని కాపాడుకునేందుకు కొన్ని నిబంధనలు పెట్టుకుని.. వాటికి పేర్లు కూడా పెట్టుకుంటారని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

"ఉదాహరణకు, ఎవరైనా అడవిలోకి వెళ్లినప్పుడు తప్పిపోకుండా.. అలాగే, క్రూరమృగాల బారిన పడకుండా మాయతీగ ఉంది. అది దాటకండని అంటుంటారు. అంటే, అది దాటితే అక్కడ జంతువులు లేదా ప్రకృతి నుంచి ప్రమాదాలు ఉన్నాయని అర్థం. మగ నక్షత చెట్లు, మానుపులి వంటివి కూడా అలాంటివే" అని డాక్టర్ ప్రకాశరావు బీబీసీకి చెప్పారు.

"వలగజ్జి గ్రామంపై పరిశోధన చేయాల్సిన అవవసరం ఉంది. కానీ, చెట్లు, కర్రలు మనుషులను, పశువులను లాక్కోవడం వంటివి 18 ఏళ్ల తమ అటవీయాత్రల అనుభవంలో ఎప్పుడూ జరగలేదు" అని డాక్టర్ ప్రకాశరావు అన్నారు..

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

చెట్లతో ఎప్పుడు ప్రమాదకరమంటే: అటవీశాఖ

'మానుపులి' గురించి గిరిజనులు మా దృష్టికి తీసుకురావడంతో ఈ గ్రామాన్ని గత కొన్ని రోజులుగా నిశితంగా పరిశీలిస్తున్నాం. వాళ్లు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, నివేదిక రూపొందిస్తున్నామని పాలకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారులు బీబీసీతో చెప్పారు.

"ఏవో కొన్ని గడియల్లోనే మానుపులి పడుతుందని.. ఏ చెట్టుకైనా, కర్రకైనా పడుతుందని గిరిజనులు చెప్తున్నారు. అయితే గిరిజనులు చెప్తున్న మానుపులి వంటివి లేకపోవచ్చు. కానీ, మానుపులి అంటూ చెప్పున్న వారి అనుభవాలకు కారణాలను అన్వేషించే పనిలో ఉన్నాం" అని పాలకొండ డివిజనల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

మానుపులి వంటివి లేకపోయినా...చెట్లు కొన్నిసార్లు ప్రమాదాలను తీసుకొస్తాయని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నీలవేణి బీబీసీతో అన్నారు.

"చెట్లపై నుంచి లేదా చెట్లకు చుట్టుకుని విద్యుత్ తీగలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొండలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఏదైనా చెట్ల ఆసరా తీసుకుంటే... అవి బలహీనంగా ఉంటే జారిపడతాం. ఎండిపోయిన చెట్లు విరిగిపోయి మనపై పడే అవకాశం ఉంటుంది. అలాగే ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు కూడా చెట్లు పడిపోయే అవకాశం ఉంది. కానీ, చెట్లు మనుషులని, పశువుల్ని లాగడం, కొరకడం అనేది జరగదు" అని నీలవేణి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఏజెన్సీ ఏరియా, గిరిజనులు

'మనుషులను, పశువులను ఆకర్షించే గుణం లేదు'

చెట్లకు, కర్రలకు మనుషులను, పశువులను ఆకర్షించే గుణం లేదని డాక్టర్ ప్రకాశరావు అన్నారు.

"కర్రలు కట్ చేస్తున్నప్పుడు ఏర్పడే క్రాక్ లలో మన వేళ్లు, లేదా చర్మం పడిపోయి గట్టిగా నొక్కుపోయి గాయాలయ్యే అవకాశం ఉంది. దీనిని సాధారణంగా కరిచింది అంటాం. అలా జరిగితే జరగొచ్చు తప్ప... చెట్లు లాక్కోవడం, మనుషులకు గాయాలు చేయడం వంటివి చేయవు. అవి సినిమాల్లోనే కనిపిస్తుంటాయి" అని డాక్టర్ ప్రకాశరావు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)