'రాంగ్ కాల్‌తో పరిచయమై, వివాహిత నుంచి రూ.4 కోట్లు, బంగారం కాజేశాడు', అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాంగ్ కాల్‌తో పరిచయమై ఒక వివాహిత నుంచి రూ.4 కోట్లు, 800 గ్రాముల బంగారం కాజేశాడనే ఆరోపణలపై అక్షయ్ కుమార్ అనే వ్యక్తిని విశాఖ మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళను వేధింపులకు గురిచేసి, భారీగా డబ్బులు వసూలు చేశాడన్న కేసులో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 39 ఏళ్ల బి.అక్షయ్ కుమార్‌ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తిరుపతిలో అరెస్టు చేసి విశాఖకు తరలించారు.
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం చేయడంతో విషయం బయటపడిందని, ఆ తర్వాత ఆమె తన కుటుంబ సభ్యుల సహకారంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది?
ఈ కేసు గురించి విశాఖ పోలీసులతో బీబీసీ మాట్లాడింది. విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ బి.పైడయ్య ఈ కేసు వివరాలను బీబీసీతో చెప్పారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం,
''తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి 39 ఏళ్ల అక్షయ్ కుమార్ 35 ఏళ్ల పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళకు 2020లో ఒక కాల్ చేశాడు. ఆమె రాంగ్ కాల్ అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. అయినా, మళ్లీ మళ్లీ ఫోన్ చేసేవాడు. ఆమె వ్యక్తిగత విషయాలను సేకరించి, ఆ విషయాలను ఎస్ఎంఎస్‌ల ద్వారా ఆమెకు పంపేవాడు.
తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలని, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంతకుముందు తనతో మాట్లాడిన వాయిస్ రికార్డులను, ఇతర వ్యక్తిగత విషయాలను ఆమె భర్తకు, కుటుంబసభ్యులకు పంపిస్తానంటూ బెదిరించేవాడు. కొద్దిరోజుల తర్వాత తనకి రూ.10 లక్షలిస్తే కాల్ రికార్డింగ్స్ అన్నీ ఇచ్చేస్తానని చెప్పిన అక్షయ్ కుమార్, 2021 ఏప్రిల్ 30న విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఉన్న ఒక షాపింగ్ మాల్ వద్దకు డబ్బుతో రావాలని చెప్పాడు. దీంతో డబ్బులు తీసుకుని ఆమె అక్కడికి వెళ్లారు.''
అక్కడ ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకుని, ఆమెను కారులో తీసుకెళ్లి విశాఖపట్నంలోని ఒక హోటల్ గదిలో బలాత్కారం చేశాడని, అది కూడా రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు సీఐ పైడయ్య తెలిపారు.
అప్పటి నుంచి ఆ వీడియోలతో బెదిరిస్తూ, దాదాపు రూ.4 కోట్లు నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారని ఆమె చెప్పారని అన్నారు.

''బ్యాంకుల్లో డిపాజిట్ చేయించిన డబ్బులు దాదాపు రూ.2 కోట్ల 5 లక్షలు కాగా.. మరో రూ.2 కోట్ల వరకూ నగదు రూపంలో తీసుకున్నట్లు బాధితురాలు చెప్పారు. మార్చి మూడోవారంలో నిందితుడు విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ వద్ద కలవమన్నాడని, అందుకు నిరాకరించడంతో మళ్లీ బెదిరింపులకు దిగినట్లు ఆమె చెప్పారు.''
అక్షయ్ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో విషయం కుటుంబసభ్యులకు తెలిసిందని, ఆ తర్వాత భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 23న మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు.
నేరం జరిగింది విశాఖలోనే కావడంతో, ఇక్కడే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నిందితుడి గత రికార్డు పరిశీలిస్తే.. పదేళ్లుగా అతను ఇలాగే పలువురిని బెదిరించి డబ్బులు, నగలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు.

'నిందితుడి బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్ల నగదు'
వివాహిత ఫిర్యాదుతో మూడో పట్టణ పోలీసులు కేసు CR.NO 64/2025 U/s 376 నమోదు చేశారు. నిందితుడిపై 386, 387, 354-C, 354-D, 420, 506(2) IPC and Sec 66-E IT యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.
నిందితుడు అక్షయ్ కుమార్‌ను మార్చి 29న తిరుపతిలో అరెస్ట్ చేసి, విశాఖపట్నం తీసుకొచ్చారు.
''అరెస్ట్ సమయంలో అతడి వద్ద నుంచి ఒక కారు, 39 గ్రాముల బంగారు గొలుసు, 39 గ్రాముల బంగారు చేతి కడియం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నాం. అతడి బ్యాంక్ ఖాతాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించాం. ఆ విషయాన్ని కోర్టుకి నివేదించాం. కోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం'' అని సీఐ పైడయ్య అన్నారు.
ప్రస్తుతం, కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














