మొహమ్మద్ అలీ జిన్నా: మిత్రుని ఇంటికి వెళ్లి, 16 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడిన జిన్నా

ఫొటో సోర్స్, PAKISTAN NATIONAL ARCHIVE
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబయికి చెందిన ధనవంతుల్లో ఒకరైన సర్ దిన్షా పెటిట్ తనకు ఇష్టమైన బాంబే క్రానికల్ పేపర్‌లో 8వ పేజీ చదువుతుండగా ఒక వార్త ఆయన కంటపడింది. వెంటనే ఆయన చేతిలో నుంచి పేపర్ జారి కిందపడింది.
ఆ రోజు తేదీ 1918 ఏప్రిల్ 20.
'నిన్న సాయంత్రం మొహమ్మద్ అలీ జిన్నా, సర్ దిన్షా కుమార్తె లేడీ రతిని వివాహం చేసుకున్నారు' ఇది ఆ వార్త సారాంశం.

ఈ కథ ఆ వార్త రావడానికి రెండేళ్ల ముందు మొదలైంది. రెండేళ్ల కిందట తన మిత్రుడు, న్యాయవాది అయిన మొహమ్మద్ అలీ జిన్నాను డార్జిలింగ్‌కు రావాల్సిందిగా సర్ దిన్షా ఆహ్వానించారు.
అప్పుడు దిన్షా కుమార్తె, 16 ఏళ్ల రతి కూడా అక్కడే ఉన్నారు. ఆ కాలంలో ముంబయిలోని అత్యంత అందమైన యువతుల్లో ఒకరిగా ఆమెను పరిగణించేవారు. అలాగే, జిన్నా ఆ రోజుల్లో భారత రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు.
ఆ సమయంలో జిన్నా వయసు 40 ఏళ్లు అయినప్పటికీ, డార్జిలింగ్‌లోని మంచు శిఖరాలు, కళ్ళు తిప్పుకోనియని రతి అందం... .. అలా జిన్నా...రతి ప్రేమలో పడిపోయారు.
తాను రతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని జిన్నా దిన్షాను అడిగారు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక దిన్షాతో జిన్నా మాట్లాడారు. ‘‘రెండు వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు’’ అని 'మిస్టర్ అండ్ మిసెస్ జిన్నా: ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా' పుస్తక రచయిత షీలారెడ్డి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PAKISTAN NATIONAL ARCHIVE
జిన్నా ప్రపోజల్
జిన్నా ప్రశ్నకు బదులిస్తూ ఇలాంటి పెళ్లి, దేశంలో ఐక్యత నెలకొల్పడానికి సహాయ పడుతుందని రతి తండ్రి సర్ దిన్షా అన్నారు. ఈ ప్రశ్నకు ఇంతకంటే మంచి సమాధానం స్వయంగా జిన్నా కూడా ఇవ్వలేకపోయేవారు. ఇక, మరోమాట మాట్లాడకుండా జిన్నా వెంటనే 'మీ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా' అని సర్ దిన్షాకు చెప్పారు.
జిన్నా ప్రతిపాదనతో దిన్షా కోపంతో ఊగిపోయారు. తక్షణమే తన ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ జిన్నాతో అన్నారు. జిన్నా ఈ విషయంలో చాలాలాబీయింగ్ చేశారు. కానీ, దిన్షాను ఒప్పించలేకపోయారు.
రెండు మతాల మధ్య స్నేహంపై జిన్నా వేసిన అడుగు తొలి పరీక్షలోనే విఫలమైంది. ఈ ఘటన తర్వాత, దిన్షా ఎప్పుడూ జిన్నాతో మాట్లాడలేదు. తన ఇంట్లో ఉన్నంతవరకు జిన్నాను కలవొద్దని, మాట్లాడొద్దని రతికి కూడా ఆంక్షలు విధించారు.
రతి మేజర్ అయ్యేవరకు ఆమెను జిన్నా కలవకూడదంటూ కోర్టు ఉత్తర్వులు కూడా పొందారు. ఇంత జరిగినప్పటికీ, వారిద్దరు రహస్యంగా ఒకరినొకరు కలుసుకోవడమేకాక, ఉత్తరాలు కూడా రాసుకునేవారు.

ఫొటో సోర్స్, majinnah.blogspot.co.uk
18 ఏళ్ల రతి
‘‘ఒకరోజు రతి ఉత్తరం చదువుతుండటాన్ని దిన్షా చూశారు. అది జిన్నా రాసి ఉంటుందనే ఉద్దేశంతో గట్టిగా అరిచారు. రతిని పట్టుకుని ఆ లేఖను చించేయడానికి రతి వెనుక భోజనం బల్ల చుట్టూ పరిగెత్తారు. కానీ ఆయన రతిని పట్టుకోలేకపోయారు’’ అని షీలారెడ్డి చెప్పారు.
అరుదుగా ఓటమి ఎదుర్కొనే ఒక లాయర్‌తో సర్ దిన్షా వ్యవహారాలు జరుపుతుంటారు. దిన్షా ఎంత మొండివాడో, చాలాకాలంగా ఒకరికొకరు దూరంగా ఉంటున్న ఈ జంట తాము అంతకంటే మొండివాళ్లమని నిరూపించుకుంది. వారిద్దరూ రతికి 18 ఏళ్లు వచ్చేంతవరకు చాలా ఓపికగా, మొండిగా ఎదురుచూశారు.
''1918 ఫిబ్రవరి 20న రతికి 18 ఏళ్లు నిండగానే ఆమె తన తండ్రి ఇంటి నుంచి ఒక గొడుగు, ఒక జత దుస్తులతో బయటకు వచ్చారు'' అని జిన్నా జీవితచరిత్ర రచయిత, ప్రొఫెసర్ షరీఫ్ అల్ ముజాహిద్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, hkrdb.kar.nic.in
భారతీయ సమాజం
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో జిన్నా, ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేవారని రతి జిన్నాలపై ఒక పుస్తకం రాసిన ఖ్వాజా రజీ హైదర్ పేర్కొన్నారు. ఒకవేళ ఆయన 'సివిల్ మ్యారేజ్ యాక్ట్' ప్రకారం పెళ్లి చేసుకుంటే బహుశా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని పుస్తకంలో తెలిపారు.
అందుకే ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆయన పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. రతి కూడా ఇందుకు సిద్ధపడ్డారు. నిఖా సమయంలో 1001 రూపాయల కట్నం నిర్ణయించారు. కానీ, రతికి జిన్నా లక్షా పాతికవేల రూపాయలు బహుమతిగా అందజేశారు. 1918లో ఈ మొత్తం చాలా ఎక్కువ.
జిన్నా తన కంటే 24 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ కాలపు సంప్రదాయవాద భారత సమాజానికి ఒక పెద్ద షాక్.
జవహర్‌లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ తన ఆత్మకథ 'ది స్కోప్ ఆప్ హ్యాపినెస్'లో ఇలా రాశారు.
''ధనవంతుడైన పార్సీ, సర్ దిన్షా కుమార్తెను జిన్నా వివాహం చేసుకోవడంతో మొత్తం భారత్‌లో ఒక రకమైన ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. నేను, రతి దాదాపు ఒకే వయసు వాళ్లం. కానీ, మేమిద్దరం పెరిగిన వాతావరణాలు వేరు. జిన్నా ఆ కాలంలో భారత్‌లో సుప్రసిద్ధ న్యాయవాది, ఎదుగుతున్న నాయకుడు. ఈ అంశాలు రతికి నచ్చాయి. అందుకే ఆమె, పార్సీ సమాజాన్ని తన తండ్రిని ఎదిరించి ఈ వివాహం చేసుకున్నారు' అని తన పుస్తకంలో విజయలక్ష్మీ పండిట్ రాశారు.

ఫొటో సోర్స్, Douglas Miller/Getty Images
రతి ప్రేమ
భారత కోకిలగా పేరున్న సరోజినీ నాయుడు, డాక్టర్ సయ్యద్ మహమూద్‌కు రాసిన లేఖలో జిన్నా పెళ్లి గురించి ప్రస్తావించారు.
''ఎట్టకేలకు జిన్నా తాను కోరుకున్నది సాధించుకున్నారు. ఆ అమ్మాయి ఎంత పెద్ద త్యాగం చేసిందో అతనికి కూడా తెలిసిఉండదని అనుకుంటున్నా. కానీ, జిన్నా దీనికి అర్హులు. ఆయన రతిని ప్రేమిస్తున్నారు. ఆయన అంతర్ముఖ వ్యక్తిత్వానికి ఇదొక ఉదాహరణ'' అని ఆ లేఖలో సరోజినీ నాయుడు రాశారు.
జిన్నా ఆరాధకుల్లో సరోజినీ నాయుడు కూడా ఒకరని ఖ్వాజా రజీ హైదర్ రాశారు. 1916 నాటి కాంగ్రెస్ సభలో ఆమె జిన్నాపై ఓ కవిత కూడా రాశారు.
సరోజినీ నాయుడు కూడా జిన్నాను ప్రేమించారని, అయితే జిన్నా స్పందించలేదంటూ ఒక వృద్ధ పార్సీ మహిళ వ్యక్తం చేసిన భావాలనుజిన్నా జీవిత చరిత్ర రచయిత హెక్టర్ బోలిథే తన పుస్తకంలో ప్రస్తావించారు.
నిజంగానే జిన్నాను సరోజినీ నాయుడు ప్రేమించారా? అని నేను షీలా రెడ్డిని అడిగితే, 'లేదు. కానీ, ఆమె జిన్నాను చాలా గౌరవించేవారు' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Sheela Reddy
జిన్నా, రతి
చక్కని శరీరాకృతితో ఎరుపు, బంగారు, లేత నీలం లేదా గులాబీ రంగుతో కూడిన పల్చటి దుస్తులు ధరించడం ద్వారా రతి మరింత అందంగా కనిపించేవారు. వెండి, పాలరాయితో చేసిన పొడవైన సిగరెట్ హోల్డర్లలోని ఇంగ్లిషు సిగరెట్లను ఊదినప్పుడు ఆమె వ్యక్తిత్వం మరింత ఇనుమడించేది.
ఆమె ప్రతి హావభావం, లావణ్యం, చక్కని నవ్వు ఆమె సమక్షాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేవి.
జిన్నా రతి హనీమూన్ సందర్భంగా లక్నోలో బసచేసినప్పుడు మహముదాబాద్ రాజా అమిర్ అహ్మద్ ఖాన్ వయసు నాలుగున్నరేళ్లని, పసిడి, నలుపు అంచున్న తెల్లచీర కట్టుకున్న రతి రాజా అమిర్‌కు దేవకన్యలా కనిపించారని ఖ్వాజా రజీ హైదర్ రాశారు. 1923లో జిన్నా, రతి దిల్లీలోని మెండెస్ హోటల్లో ఉన్నప్పుడు రాజా అమిర్ ఖాన్ వారిని కలిశారు. అప్పుడు బొమ్మలు కొనుక్కోమంటూ ఆయనకు 500 రూపాయలు ఇచ్చారు.
''నేను ఆమె నుంచి కళ్లు తిప్పకోలేకపోయాను. వారి బగ్గీ నా కళ్ల నుంచి అదృశ్యమయ్యేంత వరకు నేను ఆమెనే చూస్తుండిపోయాను '' అని రతి, జిన్నా స్నేహితుడు కాంజీ ద్వారకా దాస్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, photodivision.gov.in
గవర్నమెంట్ హౌజ్
రతి, జిన్నాలకు చెందిన ఒక ఆసక్తికర అంశాన్ని ఖ్వాజా రజీ హైదర్ చెబుతారు. ఒకసారి ముంబయి గవర్నర్ విల్లింగ్టన్, జిన్నా దంపతులను భోజనానికి ఆహ్వానించారు. అప్పుడు రతి ఒక లో కట్ దుస్తులు ధరించి ఆ విందులో పాల్గొన్నారు.
ఆమె డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు , లేడీ విల్లింగ్టన్ తన సహాయకులను పిలిచి, 'రతీజిన్నా కోసం ఒక శాలువా తీసుకురా. ఆమెకు చలి వేయకుండా' అని ఆదేశించారు.
జిన్నా అది విన్న వెంటనే లేచి నిలబడ్డారు. ''ఒకవేళ శ్రీమతి జిన్నాకు చలిగా అనిపిస్తే ఆమె శాలువా అడుగుతారు'' అని చెప్పి నిరసనగా డైనింగ్ హాల్ నుంచి తన భార్యను తీసుకొని బయటకు నడిచారు. విల్లింగ్టన్ అక్కడున్నంత కాలం ఆయన మళ్లీ ఎప్పుడూ గవర్నర్ హౌజ్‌ను సందర్శించలేదు.
రతి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు.
''1918లో లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ వారిద్దరినీ సిమ్లాలోని వైస్రాయ్ లాడ్జిలో విందుకు ఆహ్వానించారు. అప్పుడు ఆమె భారతీయ సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి వైస్రాయ్‌ని పలకరించారు. భోజనాల తర్వాత రతీని ఉద్దేశించి చెమ్స్ ఫోర్డ్ మాట్లాడుతూ, 'నీ భర్త రాజకీయ జీవితం వృద్ధి చెందాలని కోరుకుంటే మీరు ఏం చేయాలంటే, రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ప్రవర్తించాలనేది గుర్తు పెట్టుకోవాలి' అని ఒక సలహా ఇచ్చారు. రతి దానికి వెంటనే నిజానికి నేను కూడా మీరు చెప్పిందే చేశాను. భారత్‌లో ఉన్నప్పుడు భారతీయ విధానంలో మిమ్మల్ని పలకరించాను' అని రతి సమాధానం చెప్పారు.

ఫొటో సోర్స్, KHWAJA RAZI HAIDER
ఇద్దరి మధ్య పెరిగిన దూరం
ఖ్వాజా రజీ హైదర్ మరో ఘటన గురించి కూడా తన పుస్తకంలో ప్రస్తావించారు.
రతి ఒక విందులో వైస్రాయ్ లార్డ్ రెడింగ్ పక్కన కూర్చున్నారు. మాటల మధ్యలో జర్మనీ ప్రస్తావన రావడంతో లార్డ్ రెడింగ్ మాట్లాడుతూ, 'నేను జర్మనీ వెళ్లాలనుకుంటున్నా. కానీ యుద్ధం తర్వాత బ్రిటన్ వాసులను వారు ఇష్టపడట్లేదు. అందుకే నేను ఇప్పుడు అక్కడికి వెళ్లలేను' అని అన్నారు. వెంటనే రతి మాట్లాడుతూ, మరి మీరు భారత్‌లో ఏం చేయడానికి వచ్చారు? (భారత ప్రజలు కూడా మిమ్మల్ని ఇష్టపడరు కదా) అని ప్రశ్నించారు.
క్రమంగా జిన్నా బిజీగా మారడం, ఇద్దరి మధ్య వయస్సు తేడా కారణంగా జిన్నా, రతి మధ్య దూరం పెరిగింది. వయస్సులో ఉన్న భార్య, పసిపాప అయిన తన కూతురికి సమయం కేటాయించే స్థితిలో ఆయన లేరు.
జిన్నా సెక్రటరీ, ఆ తర్వాత భారత్‌కు విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఎంసీ ఛాగ్లా తన పుస్తకంలో ఇలా రాశారు.
''ఎప్పుడైనా నేను, జిన్నా ఏవైనా చట్టపర విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రతి అక్కడికి వచ్చేవారు. జిన్నాటేబుల్ వద్ద కూర్చొని కాళ్లు ఊపుతుండేవారు. మా మాటలు ముగిస్తే జిన్నాతో కలిసి బయటకు వెళ్లేందుకు ఆమె వేచి చూసేవారు'' అని పుస్తకంలో ఛాగ్లా పేర్కొన్నారు.
జిన్నా ఒక్కసారి కూడా ఆమెపై అసహనాన్ని ప్రదర్శించలేదు. అసలు అక్కడ రతి లేనట్లుగా తన పని తాను చేసుకునేవారని ఆ పుస్తకంలో ఛాగ్లా రాశారు.

జిన్నా సమాధానం
ఛాగ్లీ తన ఆత్మకథ 'రోజెస్ ఇన్ డిసెంబర్'లో ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు.
''ఒకసారి బొంబయి టౌన్ హాల్‌కు విలాసవంతమైన జిన్నా కారులో రతి వచ్చారు. ఆమె తన వెంట ఒక టిఫిన్ బాస్కెట్ తీసుకొచ్చారు. మెట్లు ఎక్కుతూ, 'నీ లంచ్ కోసం నేను ఏం తీసుకొచ్చానో ఊహించు జే' అని అన్నారు. జిన్నాను ఆమె జే అని పిలిచేవారు. నువ్వేం తెచ్చావో నాకెలా తెలుస్తుందని జిన్నా అనగా, నీకు ఎంతో ఇష్టమైన హైమ్ శాండ్‌విచ్ తీసుకొచ్చానని రతి చెప్పారు. 'మై గాడ్, నువ్వేం చేశావో నీకు అర్థమైందా? నేను ఎన్నికల్లో ఓడిపోవాలని నువ్వు అనుకుంటున్నావా? నేను ముస్లిం స్థానం నుంచి పోటీ చేస్తున్నానని నీకు తెలియదా? నేను శాండ్‌విచ్ తింటున్నానని నా ఓటర్లకు తెలిస్తే నేను గెలిచే అవకాశం ఉంటుందా?' అని జిన్నా అన్నారు. అది వినగానే రతి ముఖం వాడిపోయింది. వెంటనే టిఫిన్ తీసుకొని మెట్లపై విసవిసా నుడచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు'' అని ఛాగ్లా రాసుకొచ్చారు.
వారిద్దరు విడిపోవడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని రాజీ హైదర్ అంచనా వేశారు. 1926 వచ్చే నాటికి భారత రాజకీయాల్లో జిన్నా స్థానం మారింది. ఆయన మత రాజకీయాలను స్వీకరించారు. ఆ తర్వాత రతి కూడా అనారోగ్యానికి గురయ్యారు.

ఫొటో సోర్స్, KHWAJA RAZI HAIDAR
రతి చివరి రోజులు
ఫ్రాన్స్‌లో అనారోగ్యానికి గురైన రతి, ఎస్‌ఎస్ రాజ్‌పుత్నా ఓడలో భారతదేశానికి తిరిగి వస్తూ జిన్నాకు ఒక లేఖ రాశారు. ''ప్రియతమా, నువ్వు నా కోసం చేసిన వాటన్నింటికీ నీకు ధన్యవాదాలు. ఏ మనిషి కూడా ప్రేమించనంతగా నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను చెట్టునుంచి తెంపిన పువ్వులా గుర్తుంచుకోవాలి. నలిగిన పువ్వులా కాదు '' అని లేఖలో రాశారు.
రతి జిన్నా 1929 ఫిబ్రవరి 20న, అంటే కేవలం 29 ఏళ్ల వయస్సులో మరణించారు. ఆమె చివరి రోజుల్లో స్నేహితుడు కాంజీ ద్వారకా దాస్ ఆమెతో ఉన్నారు.
"రతి తన చివరి రోజుల్లో డిప్రెషన్‌లో ఉన్నారని కాంజీ తన పుస్తకంలో రాశారు. ఒకసారి కాంజీ ఇప్పుడే వస్తాను అని చెప్పగా, ఆమె నేను అప్పటిదాకా బతికి ఉంటే అని చాలా స్థిరమైన గొంతుతో చెప్పారు. తరువాత తనను కలవడానికి వచ్చిన పాకిస్తానీ జర్నలిస్టుతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు తీసుకుని రతి ఆత్మహత్య చేసుకున్నారు అని కాంజీ చెప్పారు’’ అని షీలా రెడ్డి తెలిపారు.

ఫొటో సోర్స్, KHWAJA RAZI HAIDER
దిల్లీలోని వెస్ట్రన్ కోర్టులో ఉన్నప్పుడు జిన్నాకు రతి అనారోగ్య వార్త గురించి తెలిసింది. ముంబయి నుంచి ఆయనకు ఒక కాల్ వచ్చింది. ఆయన మామ దిన్షా ఆ కాల్ చేశారు.
గత పదేళ్లలో వారిద్దరు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. జిన్నా వెంటనే రైలులో ముంబయికి బయలుదేరారు.
రతి చనిపోయిన విషయం దారిలో ఉన్నప్పుడే ఆయనకు తెలిసింది. ముంబై స్టేషన్ నుంచి ఆయన నేరుగా ఖోజా స్మశానవాటికకు వెళ్ళారు. అక్కడ అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.
"రతి మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత, ఆమె సమాధిపై మట్టి చల్లమని అడిగినప్పుడు జిన్నా గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. జిన్నా తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, ఆయన్ను అలా ఎవరైనా చూడటం ఇదే మొదటిసారి, చివరిసారి కూడా" అని షీలా రెడ్డి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














