ఇసుక తుపానుల తీవ్రత దేనికి సంకేతం? ఇవి ఎంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Jaber Abdulkhaleg/Anadolu Agency via Getty Images
- రచయిత, మరియా జాకారో
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
అమెరికా నుంచి మిడిల్ ఈస్ట్ వరకు.. ప్రపంచంలోని అనేక ప్రాంతాలను ఇటీవల ఇసుక, ధూళి తుపానులు ముంచెత్తాయి. ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేలా చేశాయి.
ఈ తుపానులు మామూలుగా విస్తారమైన ఎడారులలో వస్తుంటాయి.
అయితే, ఎడారీకరణ, హిమానీనదాలు కరగడం వంటి వాతావరణ మార్పులతో ఎక్కువ ధూళి వెలువడే ప్రమాదం ఉందని, దీని వల్ల చాలామంది ప్రభావితమవుతారని నిపుణులు బీబీసీకి తెలిపారు.
మధ్యధరా ప్రాంతంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో తుపానుల సంఖ్యతో పాటు, వాటి తీవ్రతలోనూ పెరుగుదలను గమనించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి రిపోర్టులో తెలిపింది.
ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉపశమన ప్రయత్నాలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.


ఫొటో సోర్స్, Kevin Frayer/Getty Images
ధూళి, ఇసుక తుపానులకు కారణం?
ధూళి, ఇసు తుపానులు భూమిపై సహజంగా సంభవిస్తుంటాయి. బలమైన గాలులు పొడి నేలల నుంచి ఇసుక, ధూళిని వాతావరణంలోకి మోసుకెళ్లినప్పుడు ఈ తుపానులు ఏర్పడతాయి.
ప్రతి సంవత్సరం వాతావరణంలోకి దాదాపు 20 లక్షల టన్నుల ఇసుక, ధూళి చేరుతాయని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
ఈ ధూళిలో సగం సహారా ఎడారి నుంచే వస్తుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రిచర్డ్ వాషింగ్టన్ చెప్పారు. ధూళి కణాలు వేల కిలోమీటర్లు ప్రయాణించగలవన్నారు.
ఉదాహరణకు, ఆఫ్రికాలో ఏర్పడిన ధూళి యూరప్, అమెజాన్ వర్షారణ్యాలు, అట్లాంటిక్ మహాసముద్రానికి చేరుకోగలదని తెలిపారు.
ప్రొఫెసర్ వాషింగ్టన్ చెబుతున్న ప్రకారం.. ధూళి ప్రయాణించేటప్పుడు, అది నేల, సముద్రాన్ని మరింత సారవంతం చేయడానికి సహాయపడే ముఖ్యమైన పోషకాలను తీసుకువెళుతుంది.
ఏసియాలోని గోబీ, మిడిల్ ఈస్ట్‌లోని అరేబియా ఎడారి వంటి ఇతర పెద్ద ఎడారులు కూడా చాలా ధూళిని ఉత్పత్తి చేస్తాయి.

ఎంత ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ధూళి, ఇసుక తుపానులు దాదాపు 33 కోట్ల మందిని ప్రభావితం చేయగలవని ఐక్యరాజ్యసమితి డేటా చెబుతోంది.
ఈ తుపానులు శ్వాస తీసుకోవడంలో సమస్యలను కలిగిస్తాయి, జంతువుల మరణానికి కారణమవుతాయి, పంటలను నాశనం చేస్తాయి. వీటివల్ల పరిసరాలు సరిగా కనిపించవు, దీంతో రోడ్లు, విమానాశ్రయాలు మూసివేయాల్సి వస్తుంటుంది.
మార్చిలో అమెరికాలోని టెక్సస్, కాన్సాస్‌లలో బలమైన గాలులు ధూళి తుపానులకు కారణమయ్యాయి, ఇవి కారు ప్రమాదాలకు దారితీశాయి, దాదాపు 12 మంది మరణించారు. న్యూ మెక్సికోలో మరొక తుపాను పరిసరాలు కనిపించడం కష్టతరం చేసింది, ప్రమాదాలకూ కారణమైంది.
ఇరాక్‌లో ఇసుక తుపాను తరువాత 1,000 మందికి పైగా ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు.
మీ ముక్కు లేదా నోటిలో దుమ్ము చిక్కుకుంటే, అది ఆస్తమా లేదా న్యుమోనియా వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. చిన్న ధూళి కణాలు శరీరంలోకి మరింత లోపలికి వెళ్లి, రక్త ప్రవాహంలోకి ప్రవేశించి వివిధ అవయవాలకు హాని కలిగిస్తాయి. ధూళి తుపానులు వాయు కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.
"అవి లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను దెబ్బతీస్తాయి. వాయు, రోడ్డు ప్రయాణం, వ్యవసాయం, సౌరశక్తిని దెబ్బతీస్తాయి, కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తాయి" అని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) సెక్రటరీ జనరల్, సెలెస్టే సౌలో అన్నారు.
డబ్ల్యూఎంఓ రిపోర్టు ప్రకారం, ధూళి సుదూరంగా ప్రయాణించడం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రదేశాలు:
- పశ్చిమ ఆఫ్రికా, కరీబియన్ మధ్య అట్లాంటిక్ మహాసముద్రం
- లాటిన్ అమెరికా
- మధ్యధరా సముద్రం
- అరేబియా సముద్రం
- బంగాళాఖాతం
- మధ్య-తూర్పు చైనా
2024లో కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే చాలా ఎక్కువ దుమ్ము ఉంది.
వీటిలో లైబీరియా, ఘనా, కామెరూన్ వంటి ఆఫ్రికన్ దేశాలు, ఈజిప్ట్, చైనా, అలాగే కొలంబియా, వెనిజులా, బ్రెజిల్ వంటి లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్ వంటి మధ్య ఆసియా దేశాలున్నాయి. మధ్యధరా సముద్రం, స్పెయిన్, ఇటలీ కూడా ప్రభావితమయ్యాయి.
2017లో గాలి, ధూళి ప్రభావంతో అమెరికాకు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని డబ్ల్యూఎంఓ రిపోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Fareed Kotb/Anadolu Agency via Getty Images
ఎందుకు తీవ్రమవుతున్నాయి?
ఇసుక తుపానులు ఎల్లప్పుడూ ముప్పేనని ప్రొఫెసర్ వాషింగ్టన్ అంటున్నారు. వాతావరణ మార్పులు పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని చెబుతున్నారు.
భూమి సంరక్షణ సరిగా లేకపోవడం, కరవు, కార్చిచ్చులు ఇసుక తుపానుల ప్రమాదాన్ని పెంచుతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది.
భూమి ఎడారిగా మారడం వల్ల ఎక్కువ ధూళి తుపానులు సంభవిస్తాయని డబ్ల్యూఎంఓ సైంటిఫిక్ ఆఫీసర్ సారా బసార్ట్ చెప్పారు. ఎడారులుగా లేని దక్షిణ ఐరోపా వంటి ప్రదేశాలు కూడా పొడిగా మారవచ్చని, ఎక్కువ ధూళి తుపానులు రావొచ్చని బసార్ట్ అభిప్రాయపడ్డారు.
సోమాలియా నుంచి యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా వరకు ఉన్న ప్రాంతాలను పెద్ద కరవులు తాకాయని ఇటీవలి ఐక్యరాజ్యసమితి మద్దతు గల రిపోర్టు తెలిపింది.
కరిగే హిమానీనదాలూ ప్రమాదకరమేనని వాషింగ్టన్ హెచ్చరిస్తున్నారు.
శిలాజ ఇంధనాలను కాల్చడం వంటి మానవ కార్యకలాపాల కారణంగా హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరుగుతున్నాయని ఫిబ్రవరిలో ఒక అధ్యయనం తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ధూళి తుపానులకు దారితీయవచ్చని వాషింగ్టన్ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, AFP/AFP via Getty Images
ఏం చేయొచ్చు?
ధూళి సమస్యగా మారకుండా ఆపడానికి ఉత్తమ మార్గం కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలను తగ్గించడమేనని వాషింగ్టన్ సూచిస్తున్నారు. కార్బన్ డయాక్సైడ్ భూతాపానికి కారణమవుతుందని తెలిపారు.
ఐక్యరాజ్యసమితి(యూఎన్) ప్రకారం, ప్రపంచంలోని ధూళి ఉద్గారాలలో దాదాపు 25 శాతం నిర్మాణం, వ్యవసాయం, పేలవమైన భూ నిర్వహణ పద్ధతులు వంటి మానవ కార్యకలాపాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.
"ఈ తుపానులకు మనుషులు కారణమైనట్లే, వాళ్లే ఆపడానికి సహాయపడగలరు" అని యూఎన్ చెబుతోంది.
తుపానులను అంచనా వేయగల వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం కూడా కీలకమని ప్రొఫెసర్ వాషింగ్టన్ అంటున్నారు. చెట్లను నాటడం, నేలను తేమగా ఉంచడం వల్ల ధూళి తుపానుల సంఖ్య, దాని బలాన్ని తగ్గించడంలో సహాయపడతాయని బసార్ట్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














