శ్రీలంకకు ‘తెలుంగు’మాట్లాడే జిప్సీ కుటుంబాలు ఎందుకు వెళ్లాయి, ఎప్పుడు వెళ్లాయి, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది?

శ్రీలంక, భారత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు భాష
ఫొటో క్యాప్షన్, శ్రీలంకకు చెందిన తెలుగు మాట్లాడే ప్రజలు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనం మాట్లాడేది తెలుగు.. వారు మాట్లాడేది 'తెలుంగు'.

మనం పలికేది అక్షరాలు.. వారు అనేది 'అక్కురూలు'.

భాష పరంగా చాలావరకు పోలిక ఉన్నప్పటికీ, వారు ఉండేది ఆంధ్రలోనో, తెలంగాణలోనో కాదు, ఆ మాటకొస్తే, అసలు భారత్‌లోనే కాదు... శ్రీలంకలో.

కొన్ని వందల ఏళ్లుగా 'తెలుంగు' భాష మాట్లాడే ప్రజలు అక్కడ ఉంటున్నట్లు చెబుతున్నారు. వీరు ఎందుకు శ్రీలంక వెళ్లారు, ఎలా వెళ్లారు అనేదానిపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేకపోయినా.. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఇలా తెలుగు మాట్లాడే వారిలో ఇద్దరు శ్రీలంక నుంచి హైదరాబాద్‌ వచ్చారు. తెలుగు జాతి ట్రస్టు, తెలుగు నెరవు ట్రస్టు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని బీబీసీ పలకరించింది.

వారిలో ఒకరు కందసామిగె రామసామి అనువత్తు.

ఈయన ఆల్ సిలోన్ తెలిగు ఆర్టిస్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

"మా పెద్ద ఊరు అనూరాధపుర డిస్ట్రిక్ట్ లోపల తంబుత్తెగమ, అక్కరైపత్తువ .. ఇలా చాలా చోట్ల తెలుంగు మాట్లాడేవారున్నారు. నా ఊరు వచ్చి కాలవెవ" అని బీబీసీతో చెప్పారు అనువత్తు.

ఈయన వెంట కాండీ ప్రాంతానికి చెందిన ధర్మదాసగె నిమల్ కూడా వచ్చారు.

ఆల్ సిలోన్ తెలిగు ఆర్టిస్ట్స్ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు నిమల్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీలంక తెలుంగు కుటుంబం

ఫొటో సోర్స్, UGC

ఎవరీ జిప్సీలు లేదా అహిగుంటికలు?

శ్రీలంకలో తెలుంగు భాష మాట్లాడేవారిని అహిగుంటిక (కుంటిక) లేదా జిప్సీలుగా పిలుస్తారు.

వీరు సింహళీలతోపాటు కాకుండా చిన్న సమూహాలుగా జీవిస్తుంటారు. ఈ సమూహాలను కుప్పయమ అని సింహళీలు పిలుస్తుంటారు.

జిప్పీ కుటుంబాలపై శ్రీలంకలోని యూనివర్సిటీ ఆఫ్ కెలానియా అసిస్టెంట్ డైరెక్టర్ గంగ రజినీ దిస్సనాయక పరిశోధన చేశారు. ఈ పరిశోధన పత్రం 2017 మార్చిలో 'రీసెర్చ్ గేట్' సైట్‌లో ప్రచురితమైంది.

"ఒకరికొకరి మధ్య సహకారం, నాయకత్వానికి మర్యాద, ఐక్యత, మానసికంగా కలిసి ఉండటం, చట్టబద్ధంగా నడుచుకోవడం.. ఇవన్నీ జిప్సీ కుటుంబాల్లో కనిపించే లక్షణాలు" అని ఆమె పేర్కొన్నారు. జీప్సీ కమ్యూనిటీకి 2005 నాటికి నలుగురు 'లీడర్లు' (పెద్దలు) ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య ఆరుకు చేరుకుందని ఆమె వివరించారు.

శ్రీలంక, భారత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు భాష
ఫొటో క్యాప్షన్, అనువత్తు

పాములు, కోతులు ఆడిస్తూ జీవనం..

శ్రీలంకలో ఎక్కువగా మాట్లాడే భాష సింహళీ. తర్వాత స్థానంలో తమిళం ఉంటుంది. తెలుగు మాట్లాడేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని చెబుతున్నారు అనువత్తు.

తాము సుమారు 15వేల మంది వరకు ఉన్నామని ఆయన చెప్పారు. కానీ, దీనికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో లేవు.

గంగ రజనీ దిస్సనాయక తన పరిశోధన పత్రంలో చెప్పిన వివరాల ప్రకారం, నార్తర్న్, నార్త్ సెంట్రల్, నార్త్ వెస్ట్రన్, ఈస్ట్రన్ ప్రావిన్సులలో 2017 నాటికి ఏడు గ్రామాల పరిధిలో 3792 మంది ఉన్నారు.

వీరు పాములు, కోతులను ఆడించుకుంటూ శ్రీలంకలోని వివిధ ప్రదేశాల్లో కనిపిస్తుంటారు. పెద్ద కోబ్రాలను మెడలో వేసుకుని ఆడిస్తుంటారు.

వాటికి తగ్గ సంగీత పరికరాలు వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు.

అలాగే జిప్సీ కుటుంబాల్లో వ్యక్తి పేరు ముందు తండ్రి, తాత పేర్లు ఉంటాయని గంగ రజినీ దిస్సనాయక తన పరిశోధన పత్రంలో రాశారు.

హైదరాబాద్ వచ్చిన అనువత్తు పేరులో కందసామిగె తాత పేరు కాగా, రామసామి తండ్రి పేరని బీబీసీకి ఆయన వివరించారు.

శ్రీలంక, భారత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు భాష
ఫొటో క్యాప్షన్, నిమల్

జిప్సీ కుటుంబాలు ఇప్పుడేం చేస్తున్నాయి?

సుమారు మూడున్నర దశాబ్దాల కిందట వరకు జిప్సీ కుటుంబాలు సంచార జాతిగా ఉండేవి. అందుకే వేర్వేరు ప్రాంతాలలో వీరు విస్తరించి ఉన్నారు. ప్రస్తుతం వీరు ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమై జీవిస్తున్నారు.

"గతంలో వీరంతా శ్రీలంకలోని వేర్వేరు ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగించేవారు. 1989లో శ్రీలంక ప్రభుత్వం భూములు కేటాయించడంతో వరి పండిస్తూ ఒకే ప్రదేశంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు" అని తన పరిశోధన పత్రంలో దిస్సనాయక పేర్కొన్నారు.

"మేం గతంలో పాములు, కోతులు ఆడిస్తూ పొట్ట పోషించుకున్నాం. ఇప్పటికీ అలాంటి కుటుంబాలు ఉన్నాయి కానీ నూరులోపే ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువగా వ్యవసాయం, ఇతర వృత్తుల్లో జీవిస్తున్నారు" అని అనువత్తు బీబీసీతో చెప్పారు.

తాను పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తుండగా.. తన పిల్లలు వ్యాపారాల్లో ఉన్నారని వివరించారు. చదువుకోవడం కారణంగా తమ జీవితాల్లో కొంత మార్పు కనిపిస్తోందని చెప్పారు.

శ్రీలంక, భారత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు భాష

ఇక్కడి తెలుగుకు, అక్కడి తెలుగుకు మధ్య వ్యత్యాసం ఇదే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాట్లాడే తెలుగు భాషకు, శ్రీలంకలో మాట్లాడే తెలుగు భాషకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది.

తెలుగును మాట్లాడటమే తప్ప చదవడం, రాయడం ఉండదని నిమల్ బీబీసీతో వివరించారు. అనురాధపుర సమీపంలో ఎక్కువగా తెలుగు భాష మాట్లాడేవారు ఉంటారని వివరించారు.

"తెలుగు వారు ఎక్కువగా ఈస్ట్రన్ ప్రావిన్సులో అక్రెయపత్తు, అలిగంబె తిరుక్కోవిల్, నార్త్ సెంట్రల్‌లో తబుత్తెగమ, కాలవెవ ప్రాంతాల్లో ఉంటారు" అని ఆయన చెప్పారు.

తరాలు మారుతున్న కొద్దీ శ్రీలంకలో మాట్లాడే తెలుగు భాషలో సింహళీ, తమిళం, మలయాళీ వంటివి వచ్చి చేరినట్లుగా కనిపిస్తుంటాయి. అక్కడి తెలుగువారు మాట్లాడే భాష కూడా ఆధునిక తెలుగులా అనిపించదు. గతంలో ఉన్న గ్రాంథిక భాషను పోలినట్లుగా ఉంటుంది.

"మేం తెలుగు మాట్లాడతాం. అక్కురూలు లేవు కదా రాద్దానికి. మా బిల్లలు (పిల్లలు) శ్రీలంకలో నేర్చేది సింహళ, ఇంగ్లిష్. శ్రీలంక స్కూళ్లలో తెలుగు ఉండదు. నా బిల్లలకు తెలుగు నేర్పించి ఏం ఉపయోగం లేదు. అందుకే సింహళ నేర్పేది. ఇంగ్లిషు నేర్పేది'' అని చెప్పారు అనువత్తు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాట్లాడే తెలుగు భాష తరహాలో శ్రీలంకలో మాట్లాడే తెలుగు అనిపించదు. కొన్ని పదాలు అర్థం కానట్లుగా కూడా ఉంటాయి.

శ్రీలంక, భారత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు భాష

అసలు వీరంతా శ్రీలంకకు ఎప్పుడు వెళ్లారు?

శ్రీలంకకు తెలుగు ప్రజలు ఎప్పుడు వలస వెళ్లారనే విషయంపై స్పష్టమైన చారిత్రక ఆధారమేది అందుబాటులో లేదు.

అహిగుంటికలను శ్రీలంక మూలవాసులుగా చెప్పవచ్చని తెలుగు జాతి ట్రస్టు ట్రస్టీ అనురాధ బీబీసీతో చెప్పారు. అయితే, దీనికి సంబంధించి చారిత్రక ఆధారమేదీ లేదు.

శ్రీలంక నుంచి వచ్చిన నిమల్ చెప్పిన వివరాల ప్రకారం... శ్రీలంకలోని కాండీ రాజ్యం చివరి రాజు శ్రీవిక్రమ రాజసిన్హా సమయంలో సుమారు 1800 సంవత్సరంలో కొందరు తెలుగు ప్రజలు వలసలు వచ్చారని చెబుతున్నారు.

"ఆ సమయంలో కాండీ ప్రాంతానికి ఎక్కువగా తెలుగు ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చారు. తర్వాత విక్రమ రాజసిన్హా పాలనా కాలం ముగిశాక శ్రీలంకలోని వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.

అలా వెళ్లిన వారు జీవనాధారం కోసం వేటను మొదలుపెట్టారు. అప్పటికే పాములు, కోతులు పట్టడం, ఆడించడం వంటివి రావడంతో అదే వృత్తిలో కొనసాగారు" అని నిమల్ బీబీసీతో చెప్పారు.

విజయనగర రాజుల కాలంలో భారత్ నుంచి శ్రీలంకకు తెలుగు వాళ్లు వలస వచ్చారని మా పెద్దవాళ్లు చెప్పేవారు అని అనువత్తు చెప్పారు.

"వీరు దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం నుంచి 'సముద్రం స్ట్రిప్' ద్వారా శ్రీలంకలోకి ప్రవేశించి ఉంటారు. తమ వెంట తెల్లని పశువులను కూడా తీసుకువచ్చారు. అప్పట్లో ఆ మార్గంలో ఉన్న కురవార్ అనే ఓ తెగ సంస్కృతిని అలవరచుకున్నారు. అప్పట్నుంచి తెలుంగు లేదా తుళు భాషను మరిచిపోకుండా మాట్లాడుతున్నారు" అని తన పరిశోధనపత్రంలో రాశారు గంగ రజినీ దిస్సనాయక.

"జిప్సీలు శ్రీలంక కమ్యూనిటీకి కొత్తకాదు, కానీ వారు ఎలా శ్రీలంకకు వచ్చారు.. ఏ కారణంతో వచ్చారనేది ఇప్పటికీ తెలియదు" అని రాశారు.

శ్రీలంకలోని ఆదివాసీలు, సింహళీల మూలాలపై జరిగిన జన్యు పరిశోధన ఫలితాలు ఈ ఏడాది జూన్‌లో 'సైన్స్ డైరెక్ట్ జర్నల్'లో ప్రచురితం అయ్యాయి.

శ్రీలంకలోని ఆదివాసీలలోని జన్యువులు దక్షిణ భారతంలోని 'మాల' కులానికి చెందిన పూర్వీకుల జెనెటిక్ సమాచారంతో పోలినట్లుగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. వీటితోపాటు మాదిగ, యాదవ, కాపు కులాలతోనూ సరిపోలుతున్నట్లుగా పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి.

శ్రీలంకలో తెలుగు భాష మాట్లాడేవారు జీవిస్తున్నట్లుగా ఎంతోకాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, 2008లో తెలుగు విలేఖరి చామర్తి మురళీధర్ అక్కడికి వెళ్లి కథనం రాశారు. ఆ తర్వాత దీనిపై విస్తృత చర్చ జరిగింది.

"నేను కర్నూలులో పనిచేస్తున్న సమయంలో శ్రీలంక నుంచి వచ్చిన అధికారి ద్వారా తెలుగు మాట్లాడే ప్రజలు అక్కడ ఉన్నారని తెలిసింది. అక్కడికి వెళ్లి ఎనిమిది రోజులు తిరిగి వారి గురించి తెలుసుకున్నాను.

కురమ, జాలర్లు.. ఇలా రెండు వర్గాలు అక్కడ ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది పాములు, కోతులు ఆడించుకుంటూనో, చేపల వేట ద్వారానో జీవనం సాగిస్తున్నారు" అని మురళీధర్ బీబీసీతో చెప్పారు.

దీనిపై తెలుగు జాతి ట్రస్టు ట్రస్టీ డీపీ అనురాధ బీబీసీతో మాట్లాడారు.

"నేను 2012లో శ్రీలంక వెళ్లాను. అనురాధపుర, కొలంబో, కాండీ, దంబుల్లా.. ఇలా ప్రతిచోట తెలుగువారు కనిపించారు. వారిపై డాక్యుమెంటరీ తీశాను. వీరంతా కొన్ని వందల ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు" అని చెప్పారు.

శ్రీలంక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి: జిప్సీలు

"ఇండియాలో తెలుగు వారందరూ తెలుగులోనే మాట్లాడతారు. రాసేది తెలుగే. మాకు అక్కడ (శ్రీలంకలో) రాసేది లేదు. మాట్లాడటం ఒక్కటే. తమిళ్, సింహళ వల్ల భాష కొద్దిగా తప్పిపోయింది" అని బీబీసీతో నిమల్ చెప్పారు.

ఈ కారణంగా తాము మాట్లాడే చాలా పదాలు ఇక్కడ అందరికీ అర్థం కాకపోవచ్చని అన్నారు. ఇంట్లో గానీ, కమ్యూనిటీ పరంగా తెలుగే వాడుక భాషగా ఉందని వివరించారు.

అలాగే శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చి తెలుగువారిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అనువత్తు, నిమల్ బీబీసీతో చెప్పారు.

"మమ్మల్ని బాగా చూసిరి. మాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు అనువత్తు.

శ్రీలంక ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

"తెలుంగు కమ్యూనిటీలో ఇండ్లు లేని పేదవారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలి" అని నిమల్ కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)