ఫ్రెంచ్ ఫ్రైస్: భారత్ సూపర్‌పవర్‌గా ఎలా ఎదిగింది?

ఫొటో సోర్స్, Jitesh Patel
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
జితేష్ పటేల్ గుజరాత్ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన కుటుంబం చాలా కాలంగా పత్తి పండించేది. కానీ, ఆ పంట నుంచి వచ్చే రాబడి చాలా తక్కువగా ఉండేది.
గుజరాత్‌లో 2001, 2002 సంవత్సరాల్లో వచ్చిన కరవు వారి పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఆ తర్వాత వారు ఏదైనా చేయాలని నిర్ణయించారు.
''ఎక్కువ నీరు అవసరం లేని పంటలను పండించాలని మేం నిర్ణయించాం.'' అని జితేష్ పటేల్ చెప్పారు.
ఆ తర్వాత ఆయన బంగాళ దుంపలు పండించడం ప్రారంభించారు. తొలుత బంగాళ దుంపలను తమ అవసరం కోసమే పండించేవారు.
దీంతో, పత్తి పంట నుంచి వచ్చినంత రాబడి దీని నుంచి వచ్చేది కాదు.

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీదారులు 2007లో గుజరాత్‌కు వచ్చారు. అప్పటి నుంచి జితేష్ పటేల్ ఆహార పరిశ్రమకు అవసరమైన వివిధ రకాల బంగాళ దుంపలను పండిస్తున్నారు.
'' అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.'' అని జితేష్ పటేల్ చెప్పారు.
బంగాళ దుంపలను పండించడంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారింది. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ విషయంలో.. భారత్ చాలా వేగంగా ముందుకు దూసుకొచ్చింది.
భారత్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉత్పత్తికి గుజరాత్ కేంద్రంగా మారింది. చిప్స్ తయారు చేసే అతిపెద్ద ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి. దీనిలో కెనడాకు చెందిన మెక్‌కెయిన్ ఫుడ్స్, భారత్‌కు చెందిన అతిపెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ కంపెనీ హైఫన్ ఫుడ్స్ ఉన్నాయి. గుజరాత్‌లో ఉత్పత్తయ్యే ఫ్రెంచ్ ఫ్రైస్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.

ఫొటో సోర్స్, HyFun Foods
పెరిగిన ఎగుమతులు
ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఇండోనేషియాలతో కలుపుకుని ఆసియాలో బంగాళ దుంపలకు కీలకమైన మార్కెట్ ఉందని ఎన్నో ఏళ్లుగా బంగాళ దుంపల మార్కెట్‌ను పరిశీలిస్తోన్న దేవేంద్ర కే. చెప్పారు.
భారత ఫ్రోజెన్ ఫ్రైస్ నెలవారీ దిగుమతులు తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 వేల టన్నుల మార్కును అధిగమించాయి.
ఫిబ్రవరి నాటికి భారత్ గత ఏడాదితో పోలిస్తే 45 శాతం ఎక్కువగా 1,81,773 టన్నుల ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఎగుమతి చేసింది.ఫ్రోజెన్ ఫ్రైస్ ధరలు కూడా ఎగుమతుల పెరిగేందుకు సహకరించాయి.
'' ప్రపంచ మార్కెట్లో భారత ఫ్రోజెన్ ఫ్రైస్ సరసమైన ధరలకు లభిస్తాయి'' అని దేవేంద్ర చెప్పారు. 2024లో చైనా నుంచి వచ్చే వాటి కంటే భారత్‌కు చెందిన ఫ్రెంచ్ ఫ్రైస్ ధరే తక్కువగా ఉందని తెలిపారు.
భారత్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీదారులకు ఇది అనుకూలమైన కాలం.
'' పుష్కలమైన ఉత్పత్తి, తక్కువ ధరలో తయారీ, నైపుణ్య ప్రమాణాలపై దృష్టి పెంచడం వంటివి భారత్‌ను అత్యంత కీలకమైన ఎగుమతిదారుగా మార్చింది.'' అని హైఫన్ ఫుడ్స్ సీఈఓ హరీష్ కరమ్ చందని చెప్పారు.
గుజరాత్‌లో హైఫన్‌కు బంగాళ దుంపల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏడు ఉన్నాయి. 2026 నాటికి మరో రెండు ప్లాంట్లను కంపెనీ తెరవబోతుంది.
'' పట్టణీకరణ, పెరుగుతోన్న ఆదాయాలు, జీవన ప్రమాణాలు మారడం వంటివి ఇళ్లల్లోనే కాదు, బయట కూడా ఫ్రోజెన్ ఫుడ్ తినడాన్ని పెంచాయి.'' అని కరమ్ చందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయంలో సరికొత్త ప్రయోగాలు
పెరుగుతోన్న డిమాండ్‌ను అందుకునేందుకు దశాబ్దాలుగా రైతులు ఎంతో శ్రమిస్తున్నారు. జితేష్ పటేల్ అగ్రికల్చర్ సైన్స్ చదివినప్పటి నుంచి వ్యవసాయంలో సైన్స్‌ను వాడటం ప్రారంభించారు. కుటుంబంతో, స్నేహితులతో కలిసి బంగాళ దుంపల ఉత్పత్తిని పెంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
'' మేం చదువుకున్న రైతులం. కొత్త విధానాలను ప్రయత్నిస్తున్నాం'' అని చెప్పారు. 2003లో తమ పంటలకు నీళ్లు పెట్టేందుకు జితేష్ పటేల్ డ్రిప్ సిస్టమ్‌ను వాడారు. భూమిని సారవంతంగా ఉంచేందుకు వేసవిలో ఎలాంటి పంట వేయకుండా ఖాళీగా ఉంచుతారు. ఆవు పేడను పంట పొలాల్లో ఎరువుగా ఉపయోగిస్తున్నారు.
తన భూమికి, పర్యావరణానికి అనువైన బంగాళ దుంపల ప్లాంట్ కోసం ఆయన వెతుకుతున్నారు.
'' విత్తనాలతో మేం ప్రయోగాలు చేస్తున్నాం. త్వరలోనే మేం కొత్త రకాన్ని సృష్టిస్తాం.'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, HyFun Foods
సాగు నీటి కోసం సరికొత్త ప్రయోగం
భారత్‌లో అతిపెద్ద వ్యవసాయ సాంకేతిక కంపెనీ జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్. సాగు నీటికి అవసరమైన పరికరాలను అమ్మడమే కాకుండా.. బంగాళ దుంపల ప్లాంట్లతో పాటు వ్యవసాయానికి అవసరమైన సరికొత్త విత్తనాలను అభివృద్ధి చేసే బృందాలు ఈ కంపెనీలో పనిచేస్తున్నాయి.
టిష్యూ కల్చర్ (ఒక నియంత్రిత వాతావరణంలో మొక్కల కణాలను, కణజాలాలను అభివృద్ధి చేసే పద్ధతి) అనే సరికొత్త విధానాలను వారు వాడారు.
ఒక నియంత్రిత ప్రయోగశాల వాతావరణంలో మొక్కల కణజాలానికి చెందిన చిన్న ముక్కలను అభివృద్ధి చేయడం ద్వారా వైరస్ రహిత మొక్కలను పెంచారు. ఆ తర్వాత ఈ మొక్కలను వివిధ విధానాల ద్వారా విత్తనాలకు అవసరమైన బంగాళ దుంపలను ఉత్పత్తి చేసేందుకు వాడారు.
'' వివిధ ప్రక్రియలను అనుసరించడం ద్వారా చాలా సురక్షితమైన మార్గంలో బంగాళ దుంపల విత్తనాలను నిపుణులు తయారు చేశారు.'' అని కంపెనీ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ చెప్పారు.
ప్రస్తుతం విజయ్ సింగ్ ఎదుర్కొనే ఒక సమస్య చిప్‌ల తయారీకి అవసరమైన వివిధ రకాల బంగాళ దుంపలను ఉత్పత్తి చేయడం.
షుగర్ కంటెంట్ కారణంగా తమ బంగాళ దుంపలు గోధుమ రంగులోకి మారుతున్నాయని గత ఏడాది నవంబర్‌లో రైతులు గుర్తించారు.
'' మాలాంటి టిస్యూ కల్చర్ కంపెనీలు ఆహార పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన కొత్త రకాల బంగాళ దుంపలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.'' అని సింగ్ చెప్పారు.
భారత్‌లోని రైతులు కూడా తమ పంట దిగుబడులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, దేశీయ ఫ్రోజెన్ ఫుడ్ ఇండస్ట్రీకిపెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం ఉంది. బంగాళ దుంపలను నిల్వ చేసేందుకు చాలా పెట్టుబడుల అవసరం ఉంది. అలా నిల్వ చేసిన వాటిని వినియోగదారులకు చేర్చాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సమస్యలేంటి?
తక్కువ ఉష్ణోగ్రతలో ఆహార పదార్థాలను, వస్తువులను నిల్వ చేసేందుకు ఉపయోగించే అధునాతన శీతలీకరణ గిడ్డంగి కేంద్రాలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. కానీ, మునపటి కంటే ఎక్కువ సంఖ్యలో ప్రస్తుతం కావాల్సి ఉంది.
''ఫ్రోజెన్ ఫుడ్‌ను నిల్వ చేసేందుకు భారత్‌లో ఉన్న 10 నుంచి 15 శాతం శీతలీకరణ గిడ్డంగులు మాత్రమే అనువైనవి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ కేంద్రాలు లేవు.'' అని ఇండో అగ్రి ఫుడ్స్ కో-ఫౌండర్ విజయ్ కుమార్ నాయక్ చెప్పారు.
శీతలీకరణ గిడ్డంగుల తర్వాత, రెండో సమస్య రవాణా.
''భారత్‌లో రిఫ్రిజిరేటర్ ట్రక్కులు, కంటైనర్లు కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇది ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ.. రవాణా చేయడం కష్టంగా మార్చుతుంది. సరైన ఉష్ణోగ్రతలు లేకపోవడంతో ఆహార ఉత్పత్తులు పాడైపోతున్నాయి'' అన్నారు.
ఫ్రోజెన్ ఫుడ్ ఇండస్ట్రీకి విద్యుత్ సరఫరా కూడా కీలకం. '' దేశంలో చాలా ప్రాంతాలు తరచూ ఎదుర్కొనే విద్యుత్ కోతలతో ఆహారం పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది.'' అని నాయక్ చెప్పారు.
'' చైనా, బ్రెజిల్, థాయిలాండ్ లాంటి చాలా దేశాల నుంచి గట్టి పోటీని భారత్ ఎదుర్కొంటోంది. ఈ దేశాల్లో అధునాతన రవాణా సౌకర్యాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.'' అని తెలిపారు.
చిప్ తయారీ కంపెనీలు గుజరాత్‌లోని తమ ప్రాంతానికి రావడంపై జితేష్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.
'' గుజరాత్ ఫుడ్ ప్రాసెసింగ్‌కు కేంద్రంగా ఉంది. నాలాంటి చాలా మంది రైతులు కాంట్రాక్ట్ ఫామింగ్ (ఒప్పంద వ్యవసాయం) చేస్తున్నారు. ఇది మాకు భద్రతను అందిస్తుంది. అంతేకాక, మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













