'తనను నియంత అన్న వ్యక్తితో మానవ మలం తినిపించిన.. తనపై తిరుగుబాటు చేసిన వ్యక్తి చర్మం ఒలిపించిన' సుల్తాన్

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, PENGUIN INDIA

ఫొటో క్యాప్షన్, 1325లో తుగ్లక్ దిల్లీ సుల్తాన్ అయ్యారు.
    • రచయిత, రెహాన్ ఫజల్

దిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్ బెంగాల్‌లో 1325లో భారీ విజయం సాధించిన తర్వాత తిరిగి వస్తుండగా, ఆయనకు ఓ పెద్ద ప్రమాదం జరిగింది.

దిల్లీకి కొద్ది కిలోమీటర్ల దూరంలో నిర్మించిన చెక్క పెవిలియన్ కూలి ఆయనపై పడింది. ఈ ప్రమాదంలో సుల్తాన్ గియాసుద్దీన్ మరణించారు.

చరిత్రకారుడు జియాఉద్దీన్ బరాని రాసిన 'తారిఖ్-ఇ-ఫిరోజ్‌షాహి' అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు. వర్షం, పిడుగుపాటుకు పెవిలియన్ కూలిపోయిందని ఆయన రాశారు.

గియాసుద్దీన్ తన కోసం తుగ్లకాబాద్‌లో అప్పటికే సమాధి నిర్మించుకున్నారు. అదే రాత్రి ఆయన్ను అక్కడే ఖననం చేశారు. అయితే ఇలా పెవిలియన్ కూలిపోవడం వెనక కుట్ర ఉందని కొందరు చరిత్రకారులు అంటుంటారు.

ఇది జరిగిన మూడు రోజుల తర్వాత గియాసుద్దీన్ కొడుకు జౌనా దిల్లీ సింహాసనాన్ని అధిరోహించారు. తన పేరును మహమ్మద్ బిన్ తుగ్లక్‌గా మార్చుకున్నారు.

అలా దిల్లీ సుల్తానుల మూడు శతాబ్దాల చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన, సమస్యాత్మకమైన పాలన ప్రారంభమైంది.

మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా సమయంలో మొరాకో యాత్రికుడు ఇబ్న్ బతూతా భారత్ వచ్చారు. తుగ్లక్ ఆస్థానంలో పదేళ్లు గడిపారు.

ముహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రి కాలం నాటి చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ కూడా తుగ్లక్ ఆస్థానంలో చాలా కాలం పనిచేశారు.

''మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్నప్పటికీ, ఆయన లోపాలను, తప్పులను బరానీ వివరంగా రాశారు. అలాగే తుగ్లక్ చేసిన కొన్ని మంచి పనులను కూడా ప్రశంసించారు. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఇబ్న్ బతూతా రాసినది చాలావరకు స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన భారత్ నుంచి తిరిగి వెళ్లిన తర్వాత వీటిని రాశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమనుకుంటారనేదానితో ఆయనకు సంబంధం లేదు'' అని ప్రముఖ చరిత్రకారుడు అబ్రహాం ఇరాలీ తన 'ది ఏజ్ ఆఫ్ రాథ్' పుస్తకంలో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో గియాసుద్దీన్ తుగ్లక్ సమాధి

ద్వంద్వ ప్రవృత్తి

మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను మధ్యయుగ చరిత్రకారులు ద్వంద్వ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు, ఆయనలో అనేక మంచి,చెడు లక్షణాలు ఉన్నాయి.

ఓ వైపు ఆయన చాలా అహంకారిగా కనిపిస్తే, మరోవైపు చాలా వినయవిధేయతలున్న వ్యక్తి‌గా కనిపించేవారు. అంతులేని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూనే, హృదయాన్ని హత్తుకునే కరుణను స్పష్టంగా కనబరిచే వ్యక్తిత్వం ఆయనది.

ఇబ్న్ బతూతా తన 'రిహ్లా' పుస్తకంలో ఆయన గురించి సరిగ్గా వర్ణించారు.

''ఓ వైపు ఈ సుల్తాన్ బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడేవారు. ఇంకోవైపు రక్తం పారించడానికీ ఇష్టపడేవారు. ఒక వైపు తన ముందుకు వచ్చిన పేదలను ధనవంతులుగా మార్చారు...ఇంకోవైపు కొంతమందిని చంపారు కూడా'' అని ఇబ్న్ బతూతా రాశారు.

''తుగ్లక్ ఓ వైపు రాక్షసుని హృదయం ఉన్న సాధువు అయితే మరోవైపు సాధువు ఆత్మ ఉన్న రాక్షసుడు'' అని మరో చరిత్రకారుడు రాబర్ట్ సెవెల్ తన 'ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్' అనే తన పుస్తకంలో రాశారు.

తుగ్లక్

ఫొటో సోర్స్, PENGUIN RANDOM HOUSE

క్రూరత్వం

మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడూ కొత్త తరహాలో ఆలోచించేవారు కానీ ఆయన వాటిని ఆచరించేవారు కాదు. ఆయనకు సహనం ఉండేది కాదు. తన మాటల విషయంలో మొండిగా ఉండేవారు.

తుగ్లక్ ప్రణాళికలు చాలావరకు చివరికి ఆయనకు, ఆయన ప్రజలకు భయంకరమైన పీడకలగా మారాయని అప్పటి చరిత్రకారులంతా దాదాపుగా అంగీకరించారు.

అయితే ఆయనెప్పుడూ వైఫల్యాలను తనవిగా అంగీకరించలేదు. ఆ నిందలను తన ప్రజలపై మోపేవారు.

‘‘తుగ్లక్ ఎల్లప్పుడూ రక్తం పారించడానికి సిద్ధంగా ఉండేవారు. ప్రజల పరువు, ప్రతిష్ట గురించి పట్టించుకోకుండా చిన్న నేరాలకు కూడా అతిపెద్ద శిక్షలు విధించేవారు. ప్రతిరోజూ గొలుసులు, సంకెళ్ళు, తాళ్లతో కట్టిన వందలాది మందిని ఒక పెద్ద హాలుకు తీసుకువచ్చేవారు. అక్కడ శిక్షలు అమలుచేసేవారు. మరణశిక్ష విధించిన వారిని అక్కడ చంపేవారు. కొందరిని చిత్రహింసలకు గురిచేసేవారు. కొందరిని కొట్టేవారు'' అని ఇబ్న్ బతూతా రాశారు.

''అక్కడ రక్తం పారకుండా ఒక్క రోజు కూడా గడిచేదికాదు. ఆయన రాజభవనం ప్రధాన ద్వారం దగ్గర ప్రతీచోటా రక్తం కనిపించేది. తుగ్లక్‌కు వ్యతిరేకంగా ఎవరూ గొంతెత్తే ధైర్యం లేకుండా చేయడానికి, మరణశిక్షకు గురైన వ్యక్తుల మృతదేహాలను రాజభవనం ప్రధాన ద్వారం వద్ద హెచ్చరికగా ఉంచేవారు. ఒక్క శుక్రవారం తప్ప వారంలో ప్రతి రోజూ మరణశిక్ష అమలయ్యేది’’ అని రాశారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, ORIENTAL INSTITUTE BARODA

ఫొటో క్యాప్షన్, ఇబ్న్ బతూతా ‘రాహ్లా’ పుస్తకంలో తుగ్లక్ పాలన గురించి రాశారు.

‘నియంత అన్నందుకు..’

మధ్యయుగ పాలకుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, మానవత్వంతో ఉండటానికి బదులుగా మహమ్మద్ బిన్ తుగ్లక్ కఠినమైన వ్యక్తిగా మారారు.

''ఇస్లాం పుస్తకాలలో, మహమ్మద్ ప్రవక్త బోధనల్లో దాతృత్వం, మానవత్వం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తారు. కానీ తుగ్లక్ మాత్రం వాటిపై శ్రద్ధ పెట్టలేదు'' అని తన "తారిఖ్-ఎ-ఫిరోజ్‌షాహి" పుస్తకంలో జియావుద్దీన్ బరానీ రాశారు.

''కజిన్ బహావుద్దీన్ గుర్చస్ప్ తనపై తిరుగుబాటు చేసినప్పుడు, తుగ్లక్ ఆయన చర్మం ఒలిపించారు'' అని ఇబ్న్ బతూతా రాశారు.

ఇబ్న్ బతూతా మరో ఘటన గురించి ప్రస్తావించారు.

''ఒకసారి ఒక భక్తుడైన ముస్లిం వ్యక్తి తుగ్లక్‌ను నియంత అన్నారు. ఆ ముస్లింను 15 రోజుల పాటు బంధించి ఆకలితో మాడ్చిన తర్వాత కూడా ఆయన తన మాటలను వెనక్కి తీసుకోలేదు. ఆ వ్యక్తికి మానవ మలం బలవంతంగా తినిపించమని సుల్తాన్ ఆదేశించారు. సైనికులు ఆ వ్యక్తిని నేలపై పడుకోబెట్టి, పటకారుతో నోరు తెరిచి సుల్తాన్ ఆదేశాన్ని పాటించారు'' అని ఇబ్న్ బతూతా రాశారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుగ్లక్ పాలన సమయంలో ఇబ్న్ బతూతా మొరాకో నుంచి వచ్చారు.

క్రూరత్వం, బీభత్సం

దిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన 32 మంది సుల్తానులలో, క్రూరత్వానికి పాల్పడినట్టు ఆరోపణలు రాని సుల్తానులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.

''ఆ కాలపు సుల్తాన్ల కోణం నుంచి మనం ఆలోచిస్తే, క్రూరత్వం, బీభత్సం ఆ కాలపు సుల్తాన్ల అవసరాలుగా ఉండేవి. అవి లేకుండా వారు పాలకులుగా ఉండగలిగేవారు కాదు. కానీ తుగ్లక్ ఈ క్రూరత్వాన్ని వ్యతిరేక ప్రభావం చూపించే స్థాయికి తీసుకెళ్లారు'' అని మహమ్మద్ ఖాసిం ఫరిష్తా తన 'తారిఖ్-ఎ-ఫరిష్తా' పుస్తకంలో రాశారు.

''ఇది ఆయన అధికారాన్ని పెంచడానికి బదులుగా తగ్గించింది. తుగ్లక్ విద్యావంతులు, సంస్కారవంతులు, ప్రతిభావంతులనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ ఆయనకు తన ప్రజలపై కరుణ, శ్రద్ధ లేవు'' అని ఖాసిం ఫరిష్తా అభిప్రాయపడ్డారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇబ్న్ బతూతాకి తుగ్లక్ గ్రామాలను జాగీరుగా ఇచ్చేవారు.

విదేశీయులతో స్నేహపూర్వకంగా..

తన పాలనాకాలంలో విదేశీ యాత్రికులతో మహమ్మద్ బిన్ తుగ్లక్ మంచి ప్రవర్తన గురించి చాలా మంది చరిత్రకారులు రాశారు.

''నేను సుల్తాన్ ముందుకు వెళ్ళిన వెంటనే, ఆయన నా చేయి పట్టుకుని, మీరు రావడం బాగుంది. ఏ విషయం గురించి చింతించకండి' అన్నారు'' అని ఇబ్న్ బతూతా వర్ణించారు.

తుగ్లక్ ఆయనకు 6000 టంకాలు నగదు రూపంలో ఇచ్చారని బతూతా తెలిపారు.

మొదట ఆయనకు మూడు గ్రామాల ఎస్టేట్ ఇచ్చారు. తర్వాత మరో రెండు గ్రామాల ఎస్టేట్ ఇచ్చారు. వాటి ద్వారా ఆయనకు 12,000 టంకాల వార్షిక ఆదాయం వచ్చేది.

''సేవ చేయించుకునేందుకు తుగ్లక్ నాకు పది మంది హిందూ బానిసలను కూడా ఇచ్చారు. అంతేకాదు, నాకు స్థానిక భాష అస్సలు తెలియకపోయినా నన్ను దిల్లీ ఖాజీగా నియమించారు. విదేశీ రాజుల విషయంలో కూడా సుల్తాన్ ప్రవర్తన స్నేహపూర్వకంగా ఉండేది'' అని ఇబ్న్ బతూతా తన పుస్తకంలో రాశారు.

''మహమ్మద్ బిన్ తుగ్లక్ 100 గుర్రాలను, 100 మంది బానిసలను, 100 మంది నృత్యకారులను, వస్త్రాలు, టోపీలు, కత్తులు, ముత్యాల ఎంబ్రాయిడరీ చేసిన గ్లోవ్స్, 15 మంది నపుంసకులను చైనా రాజుకు బహుమతులుగా పంపారు'' అని అబ్రహాం ఇరాలీ రాశారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖాజి నిర్ణయాలను తుగ్లక్ పాటించేవారని ఇబ్న్ బతూతా చెప్పారు.

తుగ్లక్ న్యాయం

దిల్లీ సుల్తానేట్ చరిత్రను పరిశీలిస్తే, పాలకులకు వారి తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలపై అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి.

మహమ్మద్ బిన్ తుగ్లక్ తన తల్లిని చాలా గౌరవించేవారని, ప్రతి విషయంలోనూ ఆమె సలహా తీసుకునేవారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ అధిపతి, చరిత్రకారుడు సతీశ్ చంద్ర తన ''మధ్యయుగ భారతం: సుల్తానుల నుంచి మొఘల్స్ దాకా'' అనే పుస్తకంలో రాశారు. అయితే సైనిక శిబిరాల్లో మహిళల ఉనికిని తుగ్లక్ నిషేధించారు.

మద్యం తాగడాన్ని కూడా సుల్తాన్ ఇష్టపడేవారు కాదని చాలా మంది చరిత్రకారులు రాశారు.

'' తుగ్లక్ ప్రత్యేకత ఏంటంటే, బయటి నుంచి వచ్చిన ముస్లింలు, మంగోలియన్లతో పాటు, ఆయన హిందువులను కూడా ముఖ్యమైన స్థానాల్లో నియమించారు. అలాగే, ఆయన ప్రజలను వారి మతాన్ని బట్టి కాకుండా సామర్థ్యాల ఆధారంగా ఎక్కువగా అంచనా వేసేవారు'' అని 'ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మెడీవల్ ఇండియా' అనే పుస్తకంలో మధ్యయుగ భారతదేశ ప్రఖ్యాత చరిత్రకారులు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ రాశారు.

ఆయన అరబిక్, పర్షియన్ భాషలలో పండితుడు. ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, గణితం, జ్యోతిషశాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది.

ముహమ్మద్ బిన్ తుగ్లక్‌కు న్యాయంపై ఉన్న ప్రేమకు ఇబ్న్ బతూతూ అనేక ఉదాహరణలు రాశారు

''సుల్తాన్ తన సోదరుడికి ఎలాంటి కారణం లేకుండా మరణశిక్ష విధించారని ఓ హిందూ ఆస్థాన సేవకుడు ఖాజీకి ఫిర్యాదు చేశారు.తుగ్లక్ చెప్పులు లేకుండా ఖాజీ కోర్టుకు వెళ్లి, తల వంచి, ఆయన ముందు నిలబడ్డారు. తుగ్లక్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న ఖాజీ, సేవకుని సోదరుణ్ని హత్య చేసినందుకు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఖాజీ ఆదేశాన్ని తుగ్లక్ పాటించారు''

''ఒకసారి ఓ వ్యక్తి సుల్తాన్ తనకు కొంత డబ్బు బాకీ ఉన్నారని చెప్పారు. ఈసారి కూడా తుగ్లక్‌‌కు వ్యతిరేకంగా ఖాజీ నిర్ణయం తీసుకున్నారు. సుల్తాన్ ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారునికి చెల్లించారు'' అని బతూతా రాశారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, IRFAN HABIB

పేదలకు సాయం

భారత్‌లోని అనేక ప్రాంతాలలో తీవ్రమైన కరువు ఏర్పడి, రాజధానిలో గుప్పెడు గోధుమల ధర ఆరు దినార్లకు చేరుకున్నప్పుడు, సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దిల్లీలోని ప్రతి ధనిక, పేద వ్యక్తికి ఆరు నెలల పాటు ప్రతిరోజూ 750 గ్రాముల ఆహార పదార్థాలను అందించాలని ఆదేశించారు.

''సాధారణ రోజుల్లో కూడా, సుల్తాన్ దిల్లీ ప్రజల కోసం ప్రజా వంటశాలలను నిర్వహించారు. వాటిలో ప్రతిరోజూ వేలాది మందికి ఆహారం అందేది. రోగుల కోసం ఆసుపత్రులను, వితంతువులు, అనాథలకు షెల్టర్ హోమ్స్‌ను కూడా తుగ్లక్ అందుబాటులోకి తెచ్చారు'' అని ఇబ్న్ బతూతా రాశారు.

మతపరమైన అంశాల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అభిప్రాయాలలో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. నమాజ్ చేయని వారి విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరించారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

కానీ సుల్తాన్ తుగ్లక్ మతం గురించి పట్టింపు ఉన్న వ్యక్తి కాదని సమకాలీన చరిత్రకారులు జియావుద్దీన్ బరానీ, అబ్దుల్ మాలిక్ ఇసామి భావిస్తారు.

''సుల్తాన్ సభలో ఉండే వ్యక్తి అయినప్పటికీ, తన ప్రత్యర్థులతో వ్యవహరించే విధానానికి ఇస్లామిక్ సంప్రదాయాలలో గుర్తింపు లేదని ఆయన ముఖం మీదే చెప్పారు'' అని బరానీ చెప్పారు.

చరిత్రకారుడు ఇసామి ఒక అడుగు ముందుకు వేసి తుగ్లక్‌ను "కాఫిర్" అని పిలిచారు. ఆయన ఎల్లప్పుడూ నాస్తికుల పక్కన నిలబడటం చూశానని చెప్పారు.

యోగులు, సాధువులను ఆదరించే మహమ్మద్ బిన్ తుగ్లక్ అలవాటు అప్పటి ముస్లిం మతపెద్దలకు ఆగ్రహం తెప్పించేదని కూడా ఇసామి రాశారు.

''చాలా హింసాత్మక స్వభావం ఉన్నప్పటికీ జైన సన్యాసి జినప్రభ సూరి శిష్యుడిగా మహమ్మద్ తుగ్లక్ ఉండేవారు'' అని అబ్రహాం ఇరాలీ కూడా రాశారు. ఇతర మతాల గురించి తెలుసుకోవడంపై మహమ్మద్ ఎంతో ఆసక్తితో ఉండేవారనడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఆయన ఆలోచనలు, సాంస్కృతిక ఆసక్తులు ఉన్నతమైనవనడానికి ఇదే కారణం'' అని అబ్రహాం ఇరాలీ రాశారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుగ్లక్ రాజధాని మార్పు నిర్ణయం వివాదాస్పదమయింది.

వివాదాస్పదమైన రాజధాని మార్పు నిర్ణయం

రాజధానిని దిల్లీ నుంచి దౌలతాబాద్ (మహారాష్ట్రలోని దేవగిరి)కి మార్చడం మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం అని చరిత్రకారులందరూ దాదాపు అంగీకరిస్తారు.

సుల్తాన్ ఉద్దేశం ప్రకారం ఇది ఒక తెలివైన నిర్ణయం. ఇదెంతో విజయవంతం కావాలి. కానీ ఈ నిర్ణయం మంచి ఫలితాన్నివ్వలేదు.

''లాభనష్టాలను పట్టించుకోకుండా, ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే ఇది సుల్తాన్ వ్యక్తిగత నిర్ణయం. రాజధానిని దౌలతాబాద్ (దేవగిరి)కి మార్చడమే కాకుండా, దిల్లీ జనాభా మొత్తం తనతో పాటు అక్కడికి రావాలని పట్టుబట్టడం వల్ల కూడా ఈ నిర్ణయం విఫలమైంది'' అని బరానీ రాశారు.

చాలా మంది దిల్లీ వాసులు దౌలతాబాద్ లేదా దేవగిరికి వెళ్లడానికి నిరాకరించి తమ ఇళ్లలో దాక్కున్నారు.

''నగరం మొత్తాన్ని వెతకాలని తుగ్లక్ ఆదేశించారు. ఈ సమయంలో ఆయన సైనికులు దిల్లీ వీధుల్లో ఒక వికలాంగుడిని, ఒక అంధుడిని గుర్తించారు. వారిద్దరినీ సుల్తాన్ ముందు హాజరుపరిచారు'' అని బతూతా రాశారు.

''ఆ వికలాంగుడిని ఫిరంగికి కట్టి పేల్చివేయాలని, ఆ అంధుడిని దిల్లీ నుంచి దేవగిరికి 40 రోజుల ప్రయాణంలో ఈడ్చుకెళ్లాలని ఆదేశించారు. ఆ వ్యక్తి రోడ్డుపై ముక్కలు ముక్కలుగా నలిగిపోయారు. ఆయన కాలు మాత్రమే దేవగిరికి చేరుకోగలిగింది'' అని బతూతా రాశారు.

ఈ విషయం తెలియగానే, దాక్కున్న కొద్దిమంది కూడా దిల్లీని విడిచిపెట్టారు. దిల్లీ పూర్తిగా ధ్వంసమైంది. భయపడిన ప్రజలు తమ ఫర్నిచర్, వస్తువులను తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదని చరిత్రకారులు రాశారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, PENGUIN BOOKS

ఫొటో క్యాప్షన్, అబ్రహాం ఇరాలీ ‘ది ఏజ్ ఆఫ్ రాథ్’ అనే పుస్తకం రాశారు.

తిరిగి రావాలనే నిర్ణయం

రాజధానిని దేవగిరికి మార్చాలనే నిర్ణయం దిల్లీ విధ్వంసానికి నాంది పలికింది.

''దిల్లీ ఒకప్పుడు సంపన్న నగరం. దాన్ని బాగ్దాద్, కైరోలతో పోల్చేవారు. కానీ ఈ నగరం ఎంతగా నాశనం అయిందంటే నగరంలోని భవనాల్లో పిల్లి, కుక్క కూడా ఉండలేవు. అనేక తరాలుగా దిల్లీలో నివసిస్తున్న ప్రజలు గుండె పగిలింది. దేవగిరికి వెళ్లే దారిలో చాలా మంది మరణించారు. దేవగిరికి చేరుకున్న వారు కూడా తమ నగరం వెలుపల నివసించాల్సి వచ్చిన బాధను భరించలేకపోయారు'' అని బరానీ రాశారు.

చివరకు, దేవగిరికి వచ్చిన ప్రజలను దిల్లీకి తిరిగి వెళ్ళేందుకు తుగ్లక్ అనుమతించారు

దిల్లీ నుంచి దక్షిణ ప్రాంతాన్ని నియంత్రించడంలో తనకు ఇబ్బంది ఎదురవుతున్నట్టే, దేవగిరి నుంచి ఉత్తర ప్రాంతాన్ని నియంత్రించలేనన్న విషయాన్ని ఆయన గ్రహించారు.

చాలా మంది సంతోషంగా దిల్లీకి తిరిగి వచ్చారు, మరికొందరు తమ కుటుంబాలతో దేవగిరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. చాలా మంది దిల్లీకి తిరిగి వచ్చినప్పటికీ, దిల్లీ తన పాత వైభవాన్ని తిరిగి పొందలేకపోయిందని అనేకమంది నిపుణులు అభిప్రాయపడ్డారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుగ్లక్ పాలనలో చలామణిలో ఉన్న నాణెం

కరెన్సీ నిర్ణయం కూడా విఫలం

టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాలనే తుగ్లక్ నిర్ణయంపై కూడా చాలా వివాదాలు తలెత్తాయి. 14వ శతాబ్దంలో ప్రపంచంలో వెండి కొరత ఏర్పడినందున, సుల్తాన్ వెండి టంకా నాణేలకు బదులుగా రాగి నాణేలను వాడారు.

టోకెన్ కరెన్సీని ఉపయోగించడమన్నది.. ఆ సమయంలో ఎక్కువగా వాడుకలో ఉన్న చైనా, ఇరాన్‌ను చూసిన తర్వాత తుగ్గక్‌కు కలిగిన ఆలోచన.

కానీ ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి, తుగ్లక్‌కు పరిపాలనా సంకల్పం లేదు, దానిని పూర్తిగా అమలు చేయడానికి శిక్షణ పొందిన వ్యక్తులు లేరు.

''ఫలితంగా నకిలీ నాణేలు వెంటనే మార్కెట్లోకి వచ్చాయి. ప్రజలు ప్రతి లావాదేవీలోనూ నాణెంపై ముద్రించిన విలువ ఆధారంగా కాకుండా నాణేనికి బదులుగా నాణెం ఇవ్వడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి తన బకాయిలను నకిలీ రాగి నాణేల రూపంలో చెల్లించడం ప్రారంభించారు'' అని ప్రొఫెసర్ సతీశ్ చంద్ర తన "మధ్యయుగ భారతం" పుస్తకంలో రాశారు.

టోకెన్ కరెన్సీ విఫలమైందని గ్రహించిన తుగ్లక్, దాని వాడకం నిలిపివేయాలని నిర్ణయించారు. రాగి నాణేలు ఉన్న ఎవరైనా వాటిని ఖజానాలో జమ చేసి, బదులుగా బంగారం, వెండి నాణేలను తీసుకోవచ్చని ఆయన ప్రకటించారు.

''పర్వతం తరహాలో చాలా రాగి నాణేలు ఖజానాకు చేరాయి. ఈ వైఫల్యం సుల్తాన్ ప్రతిష్ఠను బాగా దెబ్బతీసింది. ప్రజలపై తుగ్లక్ వైఖరి మరింత కఠినంగా మారింది'' అని జియావుద్దీన్ బరానీ రాశారు.

ప్రముఖ చరిత్రకారుడు ఈశ్వరీ ప్రసాద్ తన ''ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా'' అనే పుస్తకంలో ఇలా రాశారు,

''ప్రభుత్వం అవసరం ఎంత గొప్పదైనా, సామాన్య ప్రజలకు కావలసింది రాగి మాత్రమే. టోకెన్ కరెన్సీ లావాదేవీల ప్రక్రియను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. భారతదేశ ప్రజలు సంప్రదాయవాదులు, మార్పుకు భయపడతారనే వాస్తవాన్ని కూడా సుల్తాన్ పట్టించుకోలేదు. పాలకుడు భారతీయ సంతతికి చెందినవారు కానప్పుడు పరిస్థితి క్లిష్టంగా ఉంటుందన్న విషయాన్నీ గ్రహించలేదు'' అని ఈశ్వరీ ప్రసాద్ రాశారు.

తుగ్లక్, దిల్లీ సుల్తాన్, దౌలతాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీకి దూరంగా తుగ్లక్ మరణించారు.

దిల్లీ వెలుపల మరణం

చరిత్ర ప్రకారం మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరినీ విశ్వసించలేదు. అందుకే, తిరుగుబాటును అణిచివేయడానికి ఆయన దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలుతూనే ఉన్నారు. ఈ ప్రక్రియ ఆయన సైన్యాన్ని బాగా నిప్పృహకు గురిచేసింది...అలసిపోయేలా చేసింది. 1345లో, గుజరాత్‌లో తిరుగుబాటును అణిచివేసేందుకు దిల్లీని విడిచిపెట్టి వెళ్లిన తుగ్లక్ తిరిగి మళ్ళీ ఎప్పుడూ దిల్లీకి రాలేకపోయారు.

ఈ యుద్ధంలో, తుగ్లక్ సైన్యంలో ప్లేగు మహమ్మారి వ్యాపించింది. గుజరాత్‌లో తిరుగుబాటు దారుడు మహమ్మద్ తాగీని తుగ్లక్ ఓడించారుగానీ తిరుగుబాటుదారులు సింధ్ వైపు పారిపోవడంతో వారిని బంధించలేకపోయారు.

ఈ సమయంలో తుగ్లక్‌కు తీవ్రమైన జ్వరం వచ్చింది.

''కోలుకున్న తర్వాత ఆయన తాగీని వెంబడిస్తూ సింధ్‌కు బయలుదేరారు. అక్కడ ఆయన సింధ్ నదిని కూడా దాటారు. కానీ ఈలోగా ఆయనకు జ్వరం మళ్ళీ తిరగబెట్టింది'' అని చరిత్రకారులు రాశారు.

మహమ్మద్ బిన్ తుగ్లక్ చత్తా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధు నది ఒడ్డున 1351 మార్చి 20న తుది శ్వాస విడిచారు.

''సుల్తాన్ తుగ్లక్ తన ప్రజల నుంచి ఎక్కువ ప్రేమ, గౌరవాన్ని పొందలేకపోయారు. ప్రజలు ఆయన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. సుల్తాన్ తన ప్రజల నుంచి స్వేచ్ఛ పొందారు...ప్రజలు సుల్తాన్ నుంచి స్వేచ్ఛ పొందారు'' అని ఆ కాలపు చరిత్రకారుడు అబ్దుల్ కాదిర్ బదాయుని రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)