ప్రయాణం: వెళ్లేప్పుడు దూరంగా, వచ్చేప్పుడు దగ్గరగా ఎందుకనిపిస్తుంది? దీని వెనకున్న సైన్స్ ఏంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"ఆఫీసు పని మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు భారంగా.. ప్రయాణం సాగుతూనే ఉన్నట్లు ఉంటుంది. కానీ, తిరుగు ప్రయాణంలో త్వరగా వచ్చేసినట్లు.. ప్రయాణం హాయిగా అనిపిస్తుంది" అంటున్నారు విశాఖకు చెందిన శ్రీలక్ష్మి దేవళ్ల.
ఎక్కడికైనా వెళ్లినప్పుడు భారంగా చాలా దూరం వెళ్లినట్లు.. వచ్చేటప్పుడు 'త్వరగా వచ్చేశామే' అనే అనుభూతి ఏదో సందర్భంలో మీ అందరికీ కలిగే ఉంటుంది.
దీనినే 'రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్' అంటారు.
ఒక ప్రయాణాన్ని మన మెదడు, మనసు ఎలా స్వీకరిస్తున్నాయనే దాని ఆధారంగా ఈ భావన ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
"అయితే, ఈ భావన కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్పష్టంగా అనిపిస్తుంది. కానీ, రోజూ ప్రయాణాలు చేసే ఆఫీసు వంటి తెలిసిన చోట్లకు చేసే ప్రయాణాల్లో ఈ భావన ఉన్నా.. మనం పెద్దగా పట్టించుకోం" అని అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో న్యూరాలజిస్టుగా పనిచేస్తున్న అప్పాజీ రాయి బీబీసీతో చెప్పారు.

'అది ఊహ కాదు..'
విశాఖకు చెందిన శ్రీలక్ష్మి దేవళ్ల ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తారు. ఆమె విధుల్లో భాగంగా రోజూ అనేక చోట్లకు తిరుగుతూ ఉంటారు.
'రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్'పై ఆమె ఏమన్నారంటే...
"వెళ్లేటప్పుడు.. ఇంత టైం పడుతుందేంటి అనిపిస్తుంది. కానీ, వచ్చేటప్పుడు మాత్రం హాయిగా ఉంటుంది. త్వరగా వచ్చేశామే అనిపిస్తుంది" అని శ్రీలక్ష్మి చెప్పారు.
ఇది శ్రీలక్ష్మికే కాదు.. ఈ కథనం రాస్తున్న నాకు, చదువుతున్న మీకు, ప్రయాణాలు చేసే అందరికీ ఇది అనుభవంలోకి వచ్చే విషయమే.
ఇలా ఒకే దూరం ఉన్న ప్రయాణంలో, వెళ్తున్నప్పుడు ఎక్కువ సమయం పట్టినట్లు, వచ్చేటప్పుడు తక్కువ సమయం పట్టినట్లు అనిపించడం మన ఊహల్లో కలిగే అనుభూతి కాదు, మెదడులో జరిగే చర్యల ఫలితం అని న్యూరాలజిస్టులు చెబుతున్నారు.
దీనిపై విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు బీబీసీతో మాట్లాడారు.
"ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం కొత్తది కాబట్టి చూసుకుంటూ, దానిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ, కొత్త విషయాలను గమనిస్తూ వెళ్తుంటాం. అందుకే సమయం ఎక్కువ పట్టినట్లు అనిపిస్తుంది. తిరిగి వస్తున్నప్పుడు ఆ మార్గం తెలిసినదే కాబట్టి మనం అంతగా పట్టించుకోం. ఇది మనకు హాయినిస్తుంది" అని ఆయన చెప్పారు.

విశాఖపట్నానికి చెందిన న్యూరాలజీ నిపుణులు డాక్టర్ రాజేష్ వెంకట్ ఇండాల కూడా రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ గురించి ఇదే రకమైన వివరణ ఇచ్చారు.
"వెళ్తున్నప్పుడు మన బ్రెయిన్ కొత్త విషయాలను ప్రాసెస్ చేస్తూ, కొత్త జ్ఞాపకాలను తయారు చేసుకుంటుంది. కానీ, అవన్నీ అప్పటికే చూసినవి కావడంతో తిరుగు ప్రయాణంలో బ్రెయిన్‌పై లోడు తగ్గుతుంది. దీంతో, మన ప్రయాణం వేగంగా ముగిసినట్లు అనిపిస్తుంది. దాంతో తిరుగు ప్రయాణాలు మనకు కొంత హాయిగా అనిపిస్తుంటాయి" అని చెప్పారు.
ఒకచోటుకి వెళ్లేటప్పుడు ఆ ప్రదేశంపై ఆసక్తి, అంచనాలు ఎక్కువగా ఉంటాయి. తిరుగు ప్రయాణంలో ఇవేవీ ఉండవు.
‘‘ఆ సమయంలో సంతోషానికి కారణమయ్యే డోపమైన్ లెవెల్స్ మెదడులో పెరుగుతాయి. అందుకే ఆ ప్రయాణం చిన్నదిగా, ఏదైనా షార్ట్ కట్‌లో వచ్చేశామా అన్నట్లు అనిపిస్తుంది" అని డాక్టర్ అప్పాజీ రాయి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్'పై పరిశోధనలు
'రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్'కు సంబంధించి నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎన్.వాన్ డీ వెన్, ఎస్.రిజ్స్విక్, బి.రాయ్ 2011లో ఒక కాగ్నిటివ్ స్టడీ (ఒక విషయాన్ని చూసి గుర్తుపెట్టుకోవడం) చేశారు.
వారి పరిశోధనలో భాగంగా, బస్సు, సైకిళ్లు, నడక ద్వారా కొందరితో ప్రయాణాలు చేయించారు. వారంతా దాదాపు అన్ని సందర్భాల్లోనూ తిరుగు ప్రయాణానికి తక్కువ సమయం పట్టినట్లు అనుభూతి పొందినట్లు గుర్తించారు.
వెళ్తున్నప్పుడు కొత్త రహదారులు, ట్రాఫిక్, పరిసరాలను మెదడు గ్రహిస్తూ కాగ్నిటివ్ లోడ్‌ను (cognitive load) ఎక్కువగా అనుభవిస్తుందని, వాటిని గుర్తుపెట్టుకోవడం వలన.. అంటే, ఆ పరిసరాలతో ఏర్పడిన పరిచయం వల్ల తిరిగి వస్తున్నప్పుడు కాగ్నిటివ్ లోడ్ తగ్గుతుందని డాక్టర్ అప్పాజీ రాయి చెప్పారు.
అయితే, రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్‌కు కేవలం సైకాలజీ, న్యూరాలజీ కోణమే కాదు, భౌతికపరమైన కోణం కూడా ఉండవచ్చునని 2023లో ఒక కొత్త సిద్ధాంతం తెరమీదకు వచ్చింది.
కోజిర్కో అనే శాస్త్రవేత్త ‘ది సర్చ్ ఫర్ ఏ ఫిజికల్ యాస్పెక్ట్ ఇన్ ది రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్’ అనే పరిశోధనలో.. మన శరీరం బయలుదేరిన ప్రదేశంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ కనెక్షన్ ఏర్పరుచుకుంటుందని పేర్కొన్నారు.
అలాంటప్పుడు, ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లే సమయంలో అలవాటు మారడం వల్ల దూరం ఎక్కువగా అనిపించవచ్చు, తిరిగి వస్తే శరీరం మళ్లీ అదే పరిసరాలకు చక్కగా ఒదిగిపోవడం వల్ల దూరం తక్కువగా అనిపించవచ్చు.
"మా పుట్టినిల్లు భద్రాచలం వెళ్తుంటే.. వెళ్లేటప్పుడు చాలా దూరంగా ఉన్నట్లనిపిస్తుంది. కానీ, తిరిగి విశాఖపట్నం వస్తుంటే ప్రయాణం తొందరగానే పూర్తైనట్లు అనిపిస్తుంది" అని శ్రీలక్ష్మి దేవళ్ల చెప్పారు.
ఇది కేవలం ప్రయాణ అనుభూతి మాత్రమే కాదు, మన మెదడు చేసే విశ్లేషణ, సమయాన్ని గ్రహించే విధానం, మానసిక స్థితి, న్యూరోకెమికల్స్.. అన్నీ కలిసి ఈ రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్‌ను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

న్యూరో కెమికల్స్ ప్రభావం...
మెదడులో చురుగ్గా పనిచేసే న్యూరోకెమికల్స్ కూడా రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్‌కు కారణమవుతాయి.
"మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడమో, కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడో మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఒక పనిని త్వరగా పూర్తి చేసినప్పుడు, విజయం సాధించినప్పుడు డోపమైన్ స్థాయులు పెరుగుతాయి. ఈ సందర్భాల్లో చేసే ప్రయాణాల్లో సమయం తక్కువ పట్టినట్లు అనిపిస్తుంది" అని డాక్టర్ అప్పాజీ రాయి చెప్పారు.
అలాగే డోపమైన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు మన ప్రయాణంలో 'ఎంతసేపు వెళ్లినా… ఇంకా రావట్లేదేంటి' అనే ఫీలింగ్ వస్తుందని డాక్టర్ రాజేష్ వెంకట్ ఇండాల అన్నారు. మెదడులో హార్మోన్ల విడుదల స్థాయి, మనం చేస్తున్న పని కూడా రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్‌పై ప్రభావం చూపుతుందన్నారు.
"మనం సంతోషంగా మన స్నేహితులు, బంధువుల ఇంటికో, నచ్చిన ప్రదేశానికో వెళ్తుంటే... మనం ఎంత దూరం వెళ్తున్నా మనకు కొన్ని సందర్భాల్లో తెలియకుండానే వెళ్లిపోతుంటాం. ఇది డోపమైన్ ప్రభావమే" అని డాక్టర్ రాజేష్ వెంకట్ చెప్పారు.
ఒత్తిడి కూడా మన ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని అప్పాజీ రాయి అంటున్నారు.
''ఒకవేళ, మనం చేసే ప్రయాణంలో ఒత్తిడి (బస్సు, రైలు, విమాన టిక్కెట్లు దొరక్క ఇబ్బంది) ఉంటే కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో, స్ట్రెస్ పెరుగుతుంది. అలాగే సెరొటోనిన్ (Serotonin) తగిన మోతాదులో విడుదల కాకపోతే నిద్రపట్టక డిప్రెషన్‌లోకి తీసుకుని వెళ్తుంది.
కార్టిసాల్, సెరొటోనిస్ వంటి రసాయనాలు కూడా మనం చేసే ప్రయాణాలపై ప్రభావం చూపుతాయి. అంటే, రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ పై ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి" అని ఆయన వివరించారు.

రోజు వెళ్లే ప్రదేశాలపై కూడా రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ ఉంటుందా?
సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈ రిటర్న్ ట్రిప్ ప్రభావానికి లోనైనట్లు భావిస్తాం. కానీ ఇది రోజూ వెళ్లే ప్రదేశాల విషయంలో కూడా ఉంటుందని డాక్టర్ అప్పాజీ చెప్పారు.
ఆయన వాదనను ఏయూలో సైకాలజీ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు సమర్థించారు.
"మనం రోజూ ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు సాధారణంగా కొంత టెన్షన్ ఉంటుంది. అంటే.. 'నేను సమయానికి చేరుకుంటానా? ఏదైనా ట్రాఫిక్ అవాంతరం ఏర్పడుతుందా? ఇవాళేంటి.. ఇంత ట్రాఫిక్ ఉంది? ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి.
తిరిగి వచ్చేటప్పుడు మనకు ఆ టెన్షన్ ఉండదు. తిరుగు ప్రయాణాల్లో ఆందోళనలు, ఆలోచనలు తక్కువగా ఉండటంతో, సమయం తక్కువ పట్టినట్లు అనిపిస్తుంది’’ అని ఎంవీఆర్ రాజు చెప్పారు.
‘‘వెళ్లేటప్పుడు, మనకు ఎంత సమయం పడుతుందో ఒక అంచనా వేస్తాం. తిరుగు ప్రయాణంలో అలాంటి అంచనాలు లేకుండా.. వీలైనంత తొందరగా వెళ్లిపోవాలని అనుకుంటాం. మనసు, మెదడు కూడా దానినే తీసుకుంటాయి’’ అని తెలిపారు.
‘‘రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ వలన కొందరు తమ ప్రయాణాలపై ఇష్టాన్ని పెంచుకుంటారు. కొందరు రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్‌పై ముందుగానే ఓ అంచనాకు.. అంటే, ఫలానా టైంకు చేరుకుంటాం అనే అభిప్రాయానికి వస్తారు. కానీ, అది జరగనప్పుడు ప్రయాణాలపై ఆసక్తిని కోల్పోతుంటారు" అని డాక్టర్ అప్పాజీ చెప్పారు.
రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ అనేది మన మెదడుపై జరిగే చర్యల ఫలితం మాత్రమే. నిజంగా ప్రయాణ దూరం తగ్గడం, పెరగడం ఉండదు. అంటే ప్రయాణ దూరం, సమయం అంతే పడుతుంది.
"కాకపోతే ఆ ప్రయాణాన్ని మెదడు తీసుకునే విధానం వలన.. తిరుగు ప్రయాణంలో తొందరగా వచ్చినట్లు అనిపిస్తుంది" అన్నారు డాక్టర్ ఇండాల.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














