హైవేపై వెళ్తున్న బస్సులో, 'ప్రయాణికులకు తెలియకుండానే ప్రసవం.. ఆ వెంటనే బిడ్డను బయటకు విసిరేశారు'

పుణె, పర్బాని, మహారాష్ట్ర, చిన్నారులు, నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ప్రియాంక జగ్తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కదులుతున్న బస్సులో నుంచి అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన విసిరేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

ఈ సంఘటన జాతీయ రహదారిపై పాథ్రి - సెలు పట్టణాల మధ్య, దేవనాంద్ర శివారా అనే ప్రదేశం వద్ద జూలై 15 ఉదయం జరిగింది. పుణె నుంచి పర్భానీకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి ఓ జంట నవజాత శిశువును విసిరేశారని పోలీసులు చెప్పారు.

ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, తాము భార్యాభర్తలమని ఆ జంట పోలీసులకు తెలిపింది.

అసలేం జరిగింది? నవజాత శిశువును ఎందుకు విసిరేశారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పుణె, పర్బాని, మహారాష్ట్ర, చిన్నారులు, నేరాలు
ఫొటో క్యాప్షన్, పాథ్రి-సెలు జాతీయ రహదారిపై దేవానంద్ర శివారా వద్ద ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగింది?

జూలై 15 ఉదయం పాథ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీస్ అధికారి అమోల్ జైస్వాల్‌కు తన్వీర్ షేక్ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.

తన్వీర్ షేక్ ఫోన్‌లో "ఎవరో ఇప్పుడే నవజాత శిశువును ట్రావెల్స్ బస్సులో నుంచి సెలు రోడ్డు పక్కన ఉన్న కాలువ దగ్గర విసిరేశారు. వీలైనంత త్వరగా సాయం కావాలి" అని చెప్పారు.

దీంతో, అమోల్ జైస్వాల్ వెంటనే ఆ వ్యక్తి చెప్పిన ప్రదేశానికి వెళ్లారు.

"మేం ఇక్కడ రోడ్డు పక్కన వ్యాయామం చేస్తుండగా బస్సు నుంచి ఏదో పడేయడం చూశాం. ఆ తర్వాత బస్సు 100 అడుగుల దూరం వెళ్లాక రెండు, మూడు నిమిషాల పాటు ఆగింది, తరువాత మళ్లీ కదిలింది" అని తన్వీర్ పోలీసులకు చెప్పారు.

దీంతో, "వాహనం నుంచి ఏం విసిరేశారా అని చూడటానికి నేను ఆ వైపు వెళ్లా. నలుపు-నీలం రంగు వస్త్రంలో ఒక మగ శిశువు కనిపించాడు" అని తన్వీర్ చెప్పినట్లు ఫిర్యాదులో నమోదు చేశారు.

బస్సు మీద రాసి ఉన్న పేరును కూడా అమోల్ జైస్వాల్‌కు చెప్పారు తన్వీర్.

అమోల్ జైస్వాల్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, ఆ తర్వాత పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేష్ లాండ్గేకు సమాచారం అందించారు. దీంతో, పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేష్ లాండ్గే, కానిస్టేబుల్ విష్ణు వాఘ్, వారి బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పుణె, పర్బాని, మహారాష్ట్ర, చిన్నారులు, నేరాలు

ఫొటో సోర్స్, Parbhani Police

ఫొటో క్యాప్షన్, బస్సు యజమాని సుయోగ్ అంబిలావాడే బస్సు వద్దకు చేరుకునే సరికి, పోలీసులు అక్కడే ఉన్నారు.

ఎలా పట్టుకున్నారు?

మహేష్ లాండ్గే బృందం బస్సు లొకేషన్ కనుక్కునేందుకు ప్రయత్నించింది. బస్సు యజమాని సుయోగ్ అంబిల్వాడేకు ఫోన్ చేసి ఘటన గురించి తెలియజేసింది. బస్సు ఎక్కడుంటే అక్కడ ఆపించాలని ఆయనకు పోలీసులు సూచించారు.

ఈ నేపథ్యంలో, బస్సు యజమాని సుయోగ్ అంబిల్వాడేను బీబీసీ సంప్రదించింది.

"జూలై 15న ఉదయం 7.30 గంటలకు, నాకు మహేష్ లాండ్గే సార్ నుంచి కాల్ వచ్చింది. ఎవరో మీ బస్సు నుంచి ఒక శిశువును విసిరేశారని చెప్పారు. కాబట్టి, మీ బస్సును ఎక్కడుంటే అక్కడే ఆపండి. మేం అక్కడికి వచ్చే వరకు ఎవ్వరినీ దిగనివ్వొద్దని చెప్పారు'' అని సుయోగ్ అన్నారు.

సుయోగ్ అంబిల్వాడే బస్సు వద్దకు వెళ్లేసరికి, పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. బస్సును తనిఖీ చేసిన పోలీసులు, శిశువును విసిరేసిన జంటను అదుపులోకి తీసుకున్నారు.

శిశువు తల్లిని పర్భానీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులను కూడా పోలీసులు ప్రశ్నించారు. పాథ్రి పోలీస్ స్టేషన్‌కు బస్సును తీసుకెళ్లి, పంచనామా నిర్వహించి, అనంతరం పంపేశారు.

"మేం అక్కడికి వెళ్లినపుడు, ఆ మహిళ బస్సులోనే ప్రసవించిందని పోలీసులు మాకు చెప్పారు. కానీ, బస్సులో ఎవరికీ ఏమీ తెలియదు, ఏమీ వినిపించలేదు" అని సుయోగ్ అంబిల్వాడే బీబీసీతో చెప్పారు.

పంచనామా సమయంలోనే బస్సులోని ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.

శిశువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆ బిడ్డను ఎందుకు విసిరేశారు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పర్భానీ నివాసితులైన 19 ఏళ్ల మహిళ, 21 ఏళ్ల యువకుడు పుణెలోని శిఖరాపూర్ నుంచి స్వస్థలానికి వెళుతున్నారు. ప్రయాణంలో ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి.

"మేం శిశువును బస్సు నుంచి బయటకు విసిరేశాం, ఎందుకంటే, మేం తనను వద్దనుకున్నాం" అని యువకుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

"ఆ శిశువును వాళ్లు సాకలేక, ముదురునీలం రంగు వస్త్రంలో చుట్టి, ఎవరూ గమనించకుండా.. కదులుతున్న బస్సులో నుంచి బయటకు విసిరారు" అని ఫిర్యాదులో నమోదైంది.

శిశువు చనిపోయి పుట్టిందా లేదా విసిరేశాక చనిపోయిందా? అనేది రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుందని మహేష్ లాండ్గే చెప్పారు.

పోలీసులు దంపతులపై కేసు నమోదు చేశారు. యువకుడిని బెయిల్‌పై విడుదల చేశామని, రిపోర్టులు అందిన తర్వాత విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపారు.

యువకుడి ప్రతిస్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది, కానీ, అతను అందుబాటులోకి రాలేదు. వారి స్పందన రాగానే, ఈ వార్తలో అప్డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)