మూవీ రివ్యూ: ‘జూనియర్’ సినిమా ఎలా ఉంది, కిరీటి ఆకట్టుకున్నాడా?

ఫొటో సోర్స్, Vaaraahi Chalana Chitram/FB
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. కిరీటి నటుడిగా నిలబడ్డాడా? లేడా?. కథ ఏమంటే...
కోదండపాణికి (రవిచంద్ర) 45 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు. అభి (కిరీటి) పుట్టగానే తల్లి చనిపోతుంది. తండ్రి విపరీత ప్రేమని తట్టుకోలేని హీరో దూరంగా వెళ్లి కాలేజీలో చదువుతుంటాడు.
ఒక ఫైట్, పాట, కొన్ని కామెడీ సీన్స్ తర్వాత హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. అందరూ కలిసి ఒక కంపెనీలో చేరుతారు. అక్కడ సీఈవో విజయ (జెనీలియా). ఆమెకి హీరోకి చిన్న గొడవ. ఈ సందర్భంలో హీరోకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది.
సెకండాఫ్ కోదండపాణి సొంత ఊరు విజయనగరానికి షిప్ట్ అవుతుంది. జెనీలియా నడుపుతున్న కంపెనీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆ గ్రామంలో నిర్వహిస్తుంటుంది. నిధులన్నీ అక్కడి పంచాయతీ సర్పంచ్ తినేస్తున్నాడని తెలిసి తన టీమ్‌తో (హీరో కూడా వుంటాడు) ఆ ఊరు వెళ్తుంది.
తర్వాత ఏం జరిగింది. జెనీలియాకి, హీరోకి ఉన్న ఎమోషన్ ఏంటి? కొడుకు పట్ల తండ్రి ఎందుకంత విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు.
ఫైనల్‌గా ఆ ఊరిలో ఏం జరిగిందనేది మిగతా కథ.


ఫొటో సోర్స్, Vaaraahi Chalana Chitram/FB
పాస్ మార్కులు వచ్చాయా?
ఈ సినిమా బేసిక్‌గా కిరీటి లాంచింగ్ ప్యాడ్. ప్రేక్షకులకు పెద్ద అంచనాలేవీ లేవు. శ్రీలీల, జెనీలియా, సత్య , రావు రమేశ్‌లాంటి నటులుండడం ప్రత్యేకత అయితే, కెమెరా సెంథిల్‌కుమార్ , సంగీతం దేవిశ్రీ ప్రసాద్ ఇంకో ప్రత్యేకత. మరి వీళ్లంతా కలిసినా కూడా కిరీటి సక్సెస్ అయ్యాడా? అంటే , పాస్ మార్కులు వచ్చాయని చెప్పాలి.
మొదటి సినిమా అనగానే ఫైట్స్, డ్యాన్స్ తర్వాతే నటన.
కిరీటి ఫైట్స్ , డ్యాన్స్‌లు నిస్సందేహంగా బాగా చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో జస్ట్ ఓకే.
డైలాగ్‌లు కొన్ని సీన్స్‌లో అప్పజెప్పాడు. కథ, కథనం రెండూ పాతవి కావడంతో ఫస్టాఫ్ బాగా విసిగిస్తుంది. సెకెండాఫ్ కొంచెం పర్వాలేదు కానీ శ్రీమంతుడు, మహర్షి సినిమాలు గుర్తొస్తే మన తప్పు కాదు. కథ వేగంగానూ, కొత్తగా వుంటే తప్ప జనం థియేటర్లకి రాని కాలం. అన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్టు, ముందే తెలిసిపోయేలా వుండడం దర్శకుడి లోపం.
అచ్యుత్‌కుమార్ (కాంతారా ఫేమ్) మంచి నటుడు. కానీ విలన్‌గా ఏదో ఉండాలంటే వున్నాడంతే. సత్య, హర్షలతో కూడా కామెడీ వర్కౌట్ కాలేదు. శ్రీలీల సెకెండాఫ్‌లో ఒక పాటలో తప్ప, ఇంకెక్కడా కనపడదు. ఇంత ప్రాధాన్యత లేని పాత్రలు ఒప్పుకుంటూ వెళితే త్వరలోనే కనపడకుండా పోతుంది. రావు రమేశ్ పరిధి మేరకు నటించాడు.

ఫొటో సోర్స్, Vaaraahi Chalana Chitram/FB
రవిచంద్రన్, జెనీలియా ఎలా నటించారు?
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది రవిచంద్రన్, జెనీలియా గురించి.
కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని పండించారు. ఇది ప్రేక్షకులు చూడాలనో, కథాకథనాలు రక్తి కట్టించాలనో తీసిన సినిమా కాదు. కిరీటి పరిచయం కోసం తీసింది. అది వర్కౌట్ అయ్యింది.
సెంథిల్ కెమెరా పనితనం చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో దేవిశ్రీ బీజీఎమ్ చాలా బాగుంది.
రెండున్నర గంటల నిడివిలో ఎడిటర్ సులభంగా 20 నిమిషాలు కత్తిరించే అవకాశం వుంది.
సింగిల్ లేయర్ కథలకు కాలం చెల్లింది. కథలో అనేక పొరలు , కోణాలుంటే తప్ప ప్రేక్షకులకి ఆనడం లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఒక ట్విస్ట్ కోసం గంట సేపు సినిమాని సాగదీస్తే ఫలితం నెగటివ్‌గానే వుంటుంది.
అయినా ఈ కాలంలో కూడా ఇంటర్‌నెట్ తెలియని గ్రామాలున్నాయంటే ఆశ్చర్యమే.
ఊరు బాగు చేయడం అనే రొటీన్ పాయింట్ కాకుండా తండ్రీకొడుకుల ఎమోషన్, మధ్యలో జెనీలియా క్యారెక్టర్‌తో కథ వుంటే సినిమా వేరే విధంగా వుండేది.
కమర్షియల్ హీరోకి కావాల్సిన డ్యాన్స్, ఫైట్స్ కిరీటికి ఉన్నాయి. కావాల్సింది నటనని మెరుగుపరచుకోవడం. అది సాధిస్తే నిలబడతాడు.
ప్లస్ పాయింట్
1.హీరో ఫైట్, డ్యాన్స్
2.రవిచంద్ర, జెనీలియా నటన
3.ఎమోషన్ సీన్స్‌లో బీజీఎమ్
మైనస్ పాయింట్
1.రొటీన్ కథ, కథనం
2.ఫస్టాఫ్ ల్యాగ్
3.డెజావు ఫీలింగ్
సినిమాలో ఖర్చుకి వెనకాడలేదు కానీ, కథ మాత్రం వెనకటి సినిమాలదే.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














