తల్లి, తండ్రి నుంచే కాకుండా మూడో వ్యక్తి డీఎన్‌ఏతో పిల్లలు, ఎలా?

డీఎన్ఏ, పరిశోధనలు, మైటోకాండ్రియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గల్లాఘెర్
    • హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి

ముగ్గురు వ్యక్తుల జన్యువులతో 8 మంది శిశువులు జన్మించారని, తరచూ తలెత్తే ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు ఈ విధానం ఉపయోగకరమని యూకే వైద్యులు చెబుతున్నారు.

యూకే సైంటిస్టులు అవలంబించిన ఈ కొత్త పద్ధతిలో, తల్లిదండ్రుల నుంచి అండం, వీర్యం, మరో దాత(డోనర్) మహిళ నుంచి అండాన్ని సేకరించి ఫలదీకరించారు. ఈ విధానం ద్వారా నయం చేయలేని మైటోకాండ్రియల్ వ్యాధి బారిన పడకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉందని మొదటిసారి నిరూపితమైంది.

యూకేలో పదేళ్ల నుంచి ఈ విధానానికి చట్టబద్ధత ఉంది.

ఈ వ్యాధి సాధారణంగా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. దీనివల్ల శరీరానికి శక్తి అందదు.

ఈ వ్యాధి తీవ్రమైన వైకల్యానికి కారణమవుతుంది. కొంతమంది శిశువులు పుట్టిన కొన్ని రోజులకే చనిపోతారు. ముందుపుట్టిన పిల్లలకు, కుటుంబ సభ్యులకు లేదా తల్లికి ఈ సమస్య ఉంటే, పుట్టబోయే శిశువులో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలుస్తుంది.

ముగ్గురు వ్యక్తుల ద్వారా జన్మించిన పిల్లలు డీఎన్ఏలో ఎక్కువ భాగం, అంటే వారి జన్యు నమూనా, తల్లిదండ్రుల నుంచి పొందుతారు. రెండవ మహిళ నుంచి చిన్న మొత్తం అంటే 0.1శాతం పొందుతారు. దీనిద్వారా తరతరాల సంక్రమణలో మార్పులు వస్తాయి.

ఈ ప్రక్రియలో భాగస్వాములైన వారు తమ గోప్యత దృష్ట్యా బహిరంగంగా మాట్లాడటం లేదు. కానీ ఈ ప్రక్రియ జరిగిన న్యూకాసిల్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా, వివరాలు వెల్లడించకుండా కొన్ని ప్రకటనలు జారీ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డీఎన్ఏ, పరిశోధనలు, మైటోకాండ్రియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైటోకాండ్రియా లోపం వల్ల శరీరానికి తగినంత శక్తిని అందదు.

‘హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’

‘‘ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మాకు ఈ చికిత్స ఆశను కల్పించింది. మా బిడ్డను మాకు తిరిగి ఇచ్చింది’’ అని ఒక ఆడ శిశువు తల్లి చెప్పారు.

‘‘మా బిడ్డని ఇప్పుడు పూర్తి ఆయుష్షుతో చూస్తున్నట్టుంది. మేము ఎంతో కృతజ్ఞులం’’ అని ఆమె అన్నారు.

‘‘ఈ అద్భుతమైన ఆవిష్కరణ కారణంగా మాకు సాయం అందింది, మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.

మైటోకాండ్రియల్ డిసీజ్ భయాందోళన పోయి, దాని స్థానంలో ఆశ, ఆనందం, కృతజ్ఞత కలిగాయి'' అని ఓ మగ శిశువు తల్లి చెప్పారు.

మైటోకాండ్రియా అనేవి మన శరీరంలోని దాదాపు ప్రతి కణంలో ఉండే అతిచిన్న నిర్మాణాలు. మనం శ్వాసతీసుకోవడానికి అవే కారణం. అవి మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ ఉపయోగించి శక్తిగా మారుస్తాయి.

మైటోకాండ్రియా లోపం వల్ల శరీరానికి తగినంత శక్తి అందదు. దీని వల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు. మెదడు దెబ్బతినడం, మూర్ఛలు, అంధత్వం, కండరాల బలహీనత, అవవయవాల వైఫల్యం వంటివి సంభవించవచ్చు.

దాదాపుగా ప్రతి 5,000 మంది శిశువులలో ఒకరు మైటోకాండ్రియల్ వ్యాధితో జన్మిస్తారు.

ఈ వ్యాధి వల్ల తమ పిల్లలు చనిపోవడం వంటి పరిస్థితులను ఎక్కువ మంది తల్లిదండ్రులు ఎదుర్కొన్నారు.

ప్రతి ఏటా ఈ పద్ధతి ద్వారా 20 నుంచి 30 మంది శిశువుల జననాలకు డిమాండ్ ఉండొచ్చని న్యూకాజిల్ బృందం అంచనా వేస్తోంది.

డీఎన్ఏ, పరిశోధనలు మైటోకాండ్రియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్రోస్పోప్‌తో తీసిన మైటోకాండ్రియా ఫోటో

ముగ్గురి డీఎన్ఏ ఎలా అంటే...

మైటోకాండ్రియా తల్లి నుంచి బిడ్డకు మాత్రమే సంక్రమిస్తుంది. కాబట్టి, ఈ సంతానోత్పత్తి విధానంలో తల్లిదండ్రులిద్దరితో పాటు ఆరోగ్యకరమైన మైటోకాండ్రియాను దానం చేసే ఒక మహిళ ఉండాలి.

న్యూకాజిల్ యూనివర్సిటీ, న్యూకాజిల్ అపాన్ టైన్ హాస్పిటల్స్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌ దశాబ్దం కిందట ఈ విధానాన్ని అభివృద్ధి చేశాయి. ఈ ఆవిష్కరణ ద్వారా అందించే ప్రత్యేక సేవలను 2017లో ఎన్‌హెచ్ఎస్(యూకేలో ప్రజల పన్నులతో నడిచే ఆరోగ్య సంస్థ) అందుబాటులోకి తెచ్చింది.

తల్లి, డోనర్ మహిళ నుంచి తీసుకున్న అండాలను ల్యాబ్‌లో తండ్రి వీర్యంతో ఫలదీకరణం చేస్తారు.

వీర్యం, అండం ఫలదీకరణ తర్వాత, డీఎన్‌ఏ ఏర్పడడానికి ముందు ఏర్పడే ప్రో-న్యూక్లియై(ప్రో-న్యూక్లియై అనేది అండం, వీర్యకణం కలిసిన తర్వాత ఏర్పడే ప్రాథమిక జన్యు నిర్మాణం) వరకూ రెండు పిండాలు అభివృద్ధి చెందుతాయి. ఇవి జుట్టు రంగు, ఎత్తు వంటి మానవ శరీర ఆకృతికి సంబంధించిన బ్లూప్రింట్‌ను కలిగి ఉంటాయి.

ఆ తర్వాత రెండు పిండాల నుంచి ఈ ప్రో-న్యూక్లియైని తొలగించి, ఆరోగ్యకరమైన మైటోకాండ్రియాతో నిండిన పిండంలోకి తల్లిదండ్రుల డీఎన్ఏని జొప్పిస్తారు.

తద్వారా, పుట్టిన బిడ్డ తల్లిదండ్రులతో జన్యుపరంగా సంబంధం కలిగి ఉంటుంది. కానీ మైటోకాండ్రియల్ వ్యాధి నుంచి విముక్తి పొందుతుంది.

డీఎన్ఏ, పరిశోధనలు మైటోకాండ్రియా

ఫొటో సోర్స్, BBC/Josh Elgin

ఫొటో క్యాప్షన్, కుమార్తెతో కాట్ కిట్టో(కుడి)

ఆరోగ్యంగా పుట్టిన పిల్లలు

న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన రెండు రిపోర్టుల ప్రకారం, న్యూకాజిల్ ఫెర్టిలిటీ సెంటర్‌లో 22 కుటుంబాలు ఈ ప్రక్రియను ఎంచుకున్నాయి.

నలుగురు మగశిశువులు, నలుగురు ఆడశిశువులు జన్మించారు, వీరిలో ఓ కవలల జంట కూడా ఉంది. ఒక శిశువు గర్భంలో పెరుగుతోంది.

"ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, అనేక భయాల తర్వాత ఈ శిశువుల తల్లిదండ్రుల ముఖాల్లో ఉపశమనం, ఆనందం చూడడం, అలాగే శిశువులు కూడా ఆరోగ్యంగా ఉండడం, గర్భంలోనూ ఆరోగ్యంగా పెరుగుతుండడం అద్భుతంగా అనిపిస్తోంది'' అని ఎన్‌హెచ్ఎస్ హైలీ స్పెషలైజ్డ్ సర్వీస్ ఫర్ రేర్ మైటోకాండ్రియల్ డిసీజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాబీ మెక్‌ఫార్లాండ్ బీబీబీకి చెప్పారు.

శిశువులంతా మైటోకాండ్రియల్ వ్యాధి లేకుండా జన్మించారు. సాధారణ పిల్లల్లానే పెరుగుతున్నారు.

పుట్టిన పిల్లల్లో ఒక శిశువుకు మూర్ఛవ్యాధి వచ్చి దానంతటదే తగ్గిపోయింది. మరో శిశువుకు హృదయ స్పందన అసాధారణంగా ఉంది. దానికి చికిత్స కొనసాగుతోంది.

ఈ అనారోగ్యానికి, మైటోకాండ్రియాతో సంబంధం లేదని భావిస్తున్నారు. ఇవి ఐవీఎఫ్ వల్ల కలిగే ప్రమాదాల్లో భాగమా లేక ముగ్గురు వ్యక్తుల పద్ధతికి సంబంధించినవా, లేక ఈ టెక్నిక్ ద్వారా జన్మించిన శిశువుల ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల మాత్రమే గుర్తించగలిగారా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

ఈ విధానంలో తలెత్తే మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, లోపభూయిష్టమైన మైటోకాండ్రియా ఆరోగ్యకరమైన పిండంలోకి బదిలీ అయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి?

ఐదు కేసులల్లో వ్యాధిగ్రస్త మైటోకాండ్రియాను గుర్తించలేదు. మిగిలిన మూడు కేసుల్లో రక్తం, మూత్ర నమూనాలలో 5 శాతం నుంచి 20 శాతం మైటోకాండ్రియా గుర్తించారు.

ఇది వ్యాధిని కలిగించే 80 శాతం స్థాయి కంటే తక్కువ. ఇలా ఎందుకు జరిగింది..దీన్ని నివారించవచ్చా అన్నది తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం.

''ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే మైటోకాండ్రియల్ డొనేషన్ సాంకేతికతల పరిమితులను అర్ధం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. అప్పుడే మెరుగైన ఫలితాలొస్తాయి'' అని న్యూకాజిల్ యూనివర్సిటీ, మోనాష్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మేరీ హెర్బట్ అన్నారు.

డీఎన్ఏ, పరిశోధనలు మైటోకాండ్రియా
ఫొటో క్యాప్షన్, యూకేలో పదేళ్లనుంచి ఈ విధానానికి చట్టబద్ధత ఉంది.

''యూకే మాత్రమే ఇది చేయగలిగింది''

ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏతో పిల్లలు పుట్టే సాంకేతికతను అభివృద్ధి చేయడం మాత్రమే కాదు... 2015లో పార్లమెంట్ ఓటింగ్ తర్వాత, ప్రపంచంలో ఈ విధానాన్ని చట్టబద్ధంగా అనుమతించిన మొదటి దేశం కూడా యూకేనే.

దీనిపై వివాదం కూడా ఉంది.

ఈ పద్ధతిలో పుట్టే పిల్లలు తల్లిదండ్రుల డీఎన్‌ఏతో పాటు డోనర్ మహిళ డీఎన్ఏలో 0.1% పొందుతారు.

ఈ పద్ధతిలో పుట్టే అమ్మాయిలు ఈ డీఎన్ఏ మార్పును తమ పిల్లలకు కూడా అందిస్తారు. అంటే ఇది శాశ్వతమైన జన్యుమార్పు.

ఈ సాంకేతికతపై చర్చ జరుగుతున్నప్పుడు, కొంతమంది ఇది జన్యుపరంగా మార్పులు చేసిన ''డిజైనర్ బేబీల''ను రూపొందించడానికి దారులు ఏర్పరుస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, అనేక బాధిత కుటుంబాలకు వంశపారంపర్యంగా ఇది సోకకుండా ఉండడానికి కలిగిన గొప్ప ఆశ ఇది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)