ముక్కు చీమిడి చెప్పే ఆరోగ్య రహస్యాలేంటి, దాని ద్వారా వ్యాధులను గుర్తించవచ్చా?

ఫొటో సోర్స్, Emmanuel Lafont
- రచయిత, సోఫియా క్వాగ్లియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముక్కు నుంచి వచ్చే జిగట స్రావమే చీమిడి. జలుబు, దగ్గు లేదా ధూళికి వచ్చే తుమ్ముల వల్ల ముక్కు నుంచి ఇది కారుతుంటుందని అనుకుంటూ ఉంటాం.
అయితే, వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు శరీరం విడుదల చేసే ఒక సహజ కవచం ఈ జిగట స్రావం .
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఎన్నో వ్యాధులను గుర్తించేందుకు, వాటికి పరిష్కారాలను కనుగొనేందుకు చీమిడిపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ చీమిడి రంగు కూడా శరీరంలో ఏం జరుగుతుందో చెబుతుంది.
పురాతన గ్రీసు కాలంలో, మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలోని నాలుగు ద్రవాలను ముఖ్యమైనవిగా భావించేవారు.

హిప్పో క్రేట్స్ అనే గ్రీకు వైద్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతంలో కఫం (శ్లేష్మం), రక్తం, పసుపు రంగు పిత్తం (yellow bile,), నలుపు పిత్తం (black bile) శరీరంలోని నాలుగు రకాల ద్రవాలు.
ఈ ద్రవాలు శరీరంలో సరైన సమతుల్యతలో ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నట్లే.
ఏదైనా ఒక ద్రవం ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి అనారోగ్యం పాలవుతాడు.
ఆ సమయంలో మెదడు, ఊపిరితిత్తుల్లో కఫం ఉత్పత్తి అయ్యేదని ప్రజలు నమ్మేవారు.
చలికాలంలో, వాతావరణం సరిగ్గా లేనప్పుడు ఇది వస్తుంది. ఫిట్స్ లేదా మూర్ఛ వంటి అనారోగ్యాలకు ఇది దారితీస్తుందని ఆ సమయంలో భావించేవారు.
ముక్కు నుంచి కారే చీమిడి ఎలాంటి అనారోగ్యానికి దారితీయదని మనకు తెలుసు.
అంతేకాక, అనారోగ్యాల నుంచి ఇది మనల్ని కాపాడేలా పనిచేస్తుంది.
ముక్కు కారడం చాలామందికి ఇష్టం లేకపోయినప్పటికీ, మానవ శరీరంలో ముక్కు ద్వారా వచ్చే చీమిడి ఒక అద్భుతమైన పదార్థం.
బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ధూళి నుంచి మనల్ని కాపాడుతుంది.

ఫొటో సోర్స్, Emmanuel Lafont

ముక్కునుంచి కారే స్రావం చాలా ప్రత్యేకమైంది. మీ శరీరంలో ఏం జరుగుతుందో ఇది చెబుతుంది.
కోవిడ్ 19 నుంచి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల వరకు పలు అనారోగ్య సమస్యలను గుర్తించి, వాటికి చికిత్స చేసేందుకు నాసికా స్రావాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
మీ ముక్కును అంతర్గతంగా ఈ జిగట పదార్థం కాపాడుతూ ఉంటుంది.
మీ ముక్కు లోపల ఇది ఎప్పుడూ తడిని అందించడమే కాక, బయట గాలి నుంచి శరీరంలోకి ధూళి, బ్యాక్టీరియా, వైరస్, కాలుష్యం ప్రవేశించకుండా కాపాడుతుంది.
ముక్కులోని వందలాది చిన్న చిన్న రోమాలతో కలిసి, ఈ స్రావం మన శరీరానికి అవసరమైన ఒక రకమైన రక్షణ వ్యవస్థను అందిస్తుంది.
ఒక వ్యక్తి శరీరం ప్రతి రోజూ 100 మిల్లీలీటర్ల జిగట స్రావాన్ని ఉత్పత్తి చేస్తుందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో పనిచేసే రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్, వ్యాక్సినేషన్ ప్రొఫెసర్ డానియేలా ఫెరీరా చెప్పారు.
పిల్లల్లో ఈ జిగట స్రావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి శరీరం తొలిసారి బయట వాతావరణంలోని వివిధ రకాల బ్యాక్టీరియాలు, ధూళిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటుంది.
ముక్కు నుంచి కారే ఈ స్రావానికి చెందిన రంగును, చిక్కదనాన్ని చూడటం ద్వారా మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఇది ఒకరకమైన విజువల్ థర్మామీటర్.
ఒకవేళ ఈ స్రావం తేటగా, సన్నగా కారితే మీ శరీరం ధూళి వంటి పదార్థాలను బయటకి నెట్టివేస్తోందని అర్థం.
తెల్లగా ఈ స్రావం వస్తే.. మీ శరీరంలోకి వైరస్ ప్రవేశించిందని అర్థం. తెల్ల రక్త కణాలు వాటిపై పోరాడినప్పుడు ఈ తెలుపు పదార్థం ఏర్పడుతుంది.
ఒకవేళ మందంగా, పసుపు పచ్చ రంగులో కారితే, ఆ ప్రాంతంలో చనిపోయిన తెల్ల రక్త కణాలు చాలా ఉన్నాయని అర్థం. అంటే, శరీరం చాలా బలంగా పోరాడినట్లు తెలియజేస్తుంది.
ఎర్రగా లేదా గులాబి రంగులో కారితే... దానిలో కాస్త రక్తం కలిసినట్లు. గట్టిగా చీదినప్పుడు, తుమ్మినప్పుడు ఇలా జరుగుతుండొచ్చు లేదా రాపిడి వల్ల లోపల కాస్త వాచి ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Emmanuel Lafont

మన పేగుల్లోని మైక్రోబయోమ్.. బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవుల ప్రపంచమని మనందరికీ తెలుసు.
ముక్కు నుంచి కారే శ్లేష్మంలోని మైక్రోబయోమ్ కూడా చాలా ముఖ్యమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నాసికా స్రావంలోని మైక్రోబయోమ్ మన ఆరోగ్యానికి, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు దగ్గర సంబంధాన్ని తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మనకు రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు, ఈ స్రావాలు పెద్ద మొత్తంలో వైరస్‌లను, బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుంటాయి.
ఈ సూక్ష్మక్రిములు ముక్కు నుంచి కారే స్రావాల ద్వారా ఇతర వ్యక్తులకు సోకుతుంటాయి.
ప్రతి ఒక్కరి ముక్కు నుంచి కారే ద్రవం భిన్నంగా ఉంటుంది. అంటే, ప్రతి ఒక్కరి నాసల్ మైక్రోబయోమ్ ప్రత్యేకమైంది.
మీ జెండర్, వయసు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏం తింటున్నారు వంటి వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది.
పేగులోని ఈ సూక్ష్మజీవులు మన శరీరాలను రక్షిస్తాయి. వాటి పరస్పర చర్యలు చాలా సూక్ష్మంగా ఉంటాయి.
ఉదాహరణకు, 2024 అధ్యయనంలో స్టెఫిలోకాకస్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ముక్కులో మనుగడ సాగిస్తుందా లేదా అనేది స్రావాలలోని బ్యాక్టీరియా ఐరన్‌ను ఎంత బాగా నిలుపుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు.
అయితే ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగితే అవి జ్వరం, చీముతో నిండి బొబ్బలు వంటి సమస్యను కలిగిస్తాయి. అయితే శరీరంలో సరైన మైక్రోబయమ్ ఉంటే అది వాటితో పోరాడగలదు.
జిగటగా ఉండే ముక్కు స్రావాలను ఎలా ఆరోగ్యకరంగా చేయగలమో కనుగొనే పనిలో ప్రొఫెసర్ ఫెరీరా ఉన్నారు.
దీనర్థం ఇదే సమాచారాన్ని ఉపయోగించి, మీరు జీర్ణక్రియ కోసం ప్రోబయోటిక్స్ తీసుకున్నట్టే... నోస్‌స్ప్రేను కూడా సృష్టించవచ్చని
'' ఒకవేళ మీ ముక్కులో మంచి మైక్రోబయోమ్‌లు ఉంటే, అక్కడే అవి స్థిరపడి పెరిగితే, చెడు మైక్రోబయోమ్‌లను రానీయవు. దీనివల్ల మనం అనారోగ్యం పాలవ్వం.'' అని ఫెరీరా చెప్పారు. అలాంటి స్ప్రేను ప్రతిరోజూ ఉపయోగించగలిగితే అది మీ ముక్కును,ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
ఫెర్రీరా సహచరులు కొన్ని మంచి బ్యాక్టీరియాను ఎంచుకుంటున్నారు, ఇవి ముక్కు ఆరోగ్యంగా ఉండటానికి సరైన మైక్రోబయోమ్‌ను సృష్టించడానికి సాయపడతాయి.
ఇప్పుడు వారు ఈ బ్యాక్టీరియాను ముక్కు శ్వాసనాళంలోకి విడుదల చేస్తే, అవి అక్కడే ఉండి, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయా లేదా అని పరిశీలిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా అక్కడ వృద్ధి చెందుతుందని, వ్యాధుల నుంచి మెరుగైన రక్షణను అందిస్తుందని వారు ఆశిస్తున్నారు.
నాసికా స్రావాలలో ఉండే మైక్రోబయోమ్‌లు రోగనిరోధక వ్యవస్థతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని ఫెర్రీరా చెప్పారు. దీంతో రోగనిరోధక శక్తిని పెంచేందుకు, టీకాల సమర్థతను మెరుగుపరిచేందుకు వీటిని ఎలా వాడాలనే దానిపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Emmanuel Lafont

ఫెరీరా వర్క్ పూర్తయ్యేందుకు, ఆరోగ్యకరమైన నాసికా స్రావపు మైక్రోబయోమ్‌ను సృష్టించేందుకు మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.
కానీ, స్వీడన్‌లోని శాస్త్రవేత్తలు ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. వారు నిరంతర ముక్కుదిబ్బడ, ఎక్కువ జ్వరం ఉన్న రోగులకు ఆరోగ్యకరమైన వ్యక్తుల నుంచి వచ్చే ముక్కు స్రావాలను వారి ముక్కులోకి మార్పడి చేయడం ద్వారా చికిత్స ప్రారంభించారు. రైనోసైనసిటిస్ అనే నాసికా వ్యాధికి వీటిని ఉపయోగిస్తున్నారు.
ఆరోగ్యకరమైన స్నేహితుల లేదా భాగస్వాముల ముక్కుల్లోంచి జిగటగా ఉండే ఈ ద్రవాన్ని తీసుకుని ప్రతిరోజూ వారి ముక్కుల్లోకి చొప్పించడానికి ఐదు రోజుల పాటు సిరంజీలు వినియోగించమని 22 మంది పెద్దలకు చెప్పారు.
ఈ చికిత్స తర్వాత కనీసం 16 మంది రోగులకు విపరీతమైన దగ్గు, ముఖం నొప్పి వంటి లక్షణాలు 40 శాతం తగ్గినట్లు కనిపించింది. ఈ చికిత్స ప్రభావం మూడు నెలల పాటుఉన్నట్లు గుర్తించారు.
"ఇది మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎవరికీ ఎటువంటి దుష్ప్రభావాలు కలగలేదు" అని అధ్యయనానికి నాయకత్వం వహించిన స్వీడన్‌లోని హెల్సింగ్‌బోర్గ్ హాస్పిటల్ సీనియర్ వైద్యుడు అండర్స్ మార్టెన్సన్ అన్నారు.
ఈ ప్రయోగం వాస్తవానికి గట్ మైక్రోబయోమ్‌పై మునుపటి పరిశోధనల నుండి ప్రేరణ పొందింది, కొన్ని వ్యాధులలో మల మార్పిడి ఎలా జరుగుతుందో అదే విధంగా అన్నమాట.
మొదటి పైలట్ ప్రోగ్రామ్‌లో ఒక విషయం లోపించింది. రోగుల స్రావాల మైక్రోబయోమ్‌లో సరిగ్గా ఏం మారింది? ఏ బ్యాక్టీరియా పెరిగింది లేదా తగ్గింది అనే దానిపై వివరణాత్మక డేటాను సేకరించలేదు. దీంతో ఇప్పుడు కచ్చితమైన అధ్యయనాన్ని ప్రారంభించారు.
వాస్తవానికి ముక్కు, ఊపిరితిత్తులకు చెందిన దీర్ఘకాలిక వ్యాధులకు ముక్కు నుంచి కారే ద్రవాలు బలమైన కవచంగా ఉంటాయి.
యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలొ ముక్కు, కన్ను, గొంతు నిపుణురాలు డాక్టర్ జెనిఫర్ ముల్లిగన్.
దీర్ఘకాలిక రైనోసైనసిటిస్, నాసల్ పాలిప్స్ వంటి వ్యాధులపై అధ్యయనం చేసేందుకు కూడా శాస్త్రవేత్తలు జిగటగా ఉండే ఈ నాసికా స్రావాన్ని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం నుంచి 12 శాతం మందిపై ఇది ప్రభావం చూపుతుంది.
జెనిఫర్ అంతకుముందు రోగుల ముక్కుల్లోంచి కణజాలాన్ని సర్జరీ ద్వారా తీసి ఈ వ్యాధులను నిర్ధరించేవారు. ఈ పద్ధతి చాలా క్లిష్టంగా, బాధాకరంగా ఉండేది.
కానీ, ఇప్పుడు కేవలం నాసికా ద్రవాల ద్వారా మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, ముఖ్యంగా రైనోసైనసిటిస్ వంటి వ్యాధులను అర్థం చేసుకునేందుకు వాడుతున్నారు.
''అసలైన బాధితులు ఎవరు? ఈ వ్యాధికి కారణమేంటి? వంటిని తెలుసుకునేందుకు మేం నాసికా స్రావాలను వాడుతున్నాం.'' అని జెనిఫర్ ముల్లిగన్ తెలిపారు.
ఈ వ్యాధికి కారణాలు ఒక్కో రోగికి ఒక్కో రకంగా ఉంటాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు ఈ చికిత్సలను ట్రయల్ అండ్ ఎర్రర్ ఆధారంగానే నిర్వహించే వారు. ప్రతి రోగికి భిన్నమైన ఫలితాలు వచ్చేవి. కొన్నిసార్లు కొన్ని నెలల తరబడి చికిత్స కొనసాగేది. 10వేల డాలర్ల ( దాదాపు 8.6 లక్షలు) నుంచి 15వేల డాలర్లు ( దాదాపు12.9 లక్షలు) ఖర్చయ్యేది.
కానీ, ముక్కు నుంచి కారే స్రావం వెంటనే చికిత్స లేదా సర్జరీ అవసరం పడుతుందో లేదో తెలుసుకునేందుకు సాయపడుతుందని డాక్టర్ జెనిఫర్ ముల్లిగన్ చెప్పారు.
దీంతో చికిత్సను వేగంగా, అత్యంత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో ఇవ్వొచ్చని అన్నారు.
డాక్టర్ జెనిఫర్ ముల్లిగన్ ప్రతిపాదించిన విధానంపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని ఇంజనీర్లు ప్రారంభించిన డయాగ్-నోస్ వంటి కొత్త ఆరోగ్య సాంకేతిక సంస్థలు ముక్కు నుండి వచ్చే స్రావాలను (స్నాట్) విశ్లేషించే కృత్రిమ మేథ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి.
ఈ కంపెనీలు ముక్కు నుండి స్రావాలను చాలా కచ్చితమైన మొత్తంలో సేకరించే పరికరాలకు పేటెంట్ పొందుతున్నాయి. 2025లో, వారు ఎఫ్‌డీఏ ఆమోదించిన మొదటి నాసికా స్రావ సేకరణ పరికరాన్ని (నోస్ మైక్రో శాంప్లింగ్ డివైస్) ప్రారంభించారు.
ఈ పరికరం శాస్త్రీయ పరిశోధన కోసం ఏకరీతి కచ్చితమైన నమూనాలను పొందేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా పరీక్షలో లోపాల శాతాన్ని తగ్గిస్తుంది.
''కణజాలాన్ని తీయడం ద్వారా కనిపెట్టలేని అన్ని విషయాలను నాసికా స్రావాల నుంచి తెలుసుకున్నాం.'' అని ముల్లిగన్ చెప్పారు.
‘‘ఈ పద్ధతి ఈ వ్యాధి గురించి మన అవగాహనను మార్చివేసింది. భవిష్యత్తులో రోగులను ఎలా పరీక్షిస్తారు, చికిత్సా పద్ధతులను మారుస్తుంది’’ అని చెప్పారు.
ప్రజలు ముక్కు నుంచి వాసన పీల్చుకునే సామర్థ్యాన్ని ఎందుకు కోల్పోతారో కూడా తెలుసుకునేందుకు స్నాట్ టూల్స్ ను వాడారు డాక్టర్ ముల్లిగన్.
ముక్కులో ఏం జరుగుతుందో ఊపిరితిత్తుల్లో కూడా అదే జరుగుతుందని డాక్టర్ ముల్లిగన్ చెప్పారు. ఊపిరితిత్తుల వ్యాధులకు ఈ పరీక్షలు, చికిత్సలు ఉపయోగపడతాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా బృందాలు ఇప్పుడు నాసికా శ్లేష్మాన్ని ఉపయోగించి వివిధ వ్యాధులను గుర్తించే సాధనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారా ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, అల్జీమర్స్,పార్కిన్సన్ వంటి వ్యాధులను గుర్తించవచ్చు.
గమనిక: ఈ కథనంలో సమాచారం అంతా సాధారణ అవగాహనకు మాత్రమే. దీనిని వైద్య సలహాగా భావించకూడదు. మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు మీ డాక్టర్‌ను సంప్రదించండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














