సింహాలు ఎలా మాట్లాడుకుంటాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గోపాల్ కటేషియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
సింహాల గర్జనల గురించి మీరు వినే ఉంటారు. గుజరాత్‌లోని గిర్ అడవిని లేదా మరేదైనా అభయారణ్యాన్ని సందర్శించినప్పుడు వాటి గర్జనలను మీరు స్వయంగా వినే ఉంటారు.
సింహాల గర్జన విన్నప్పుడు మనుషులే కాదు, జంతువులూ భయపడుతుంటాయి.
అయితే సింహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఈ గర్జనలే ఒక మాధ్యమం. గర్జనలు సింహాల సంభాషణలకు శబ్దరూపం. మామూలుగా మనుషులు మాట్లాడుకోవడమే కాక, దృశ్యరూపంలోనూ సంభాషిస్తారు.జంతువుల హావభావాలు, వాటి అరుపులను అర్ధం చేసుకుని మనుషులు తదనుగుణంగా స్పందిస్తుంటారు.
అయితే, సింహాలు తమ తోటి సింహాలతో గర్జనలతోనూ, ఇతర జంతువులతో రసాయనిక సంకేతాల ద్వారా సంభాషిస్తుంటాయని పరిశోధకులు గుర్తించారు.

ఫొటో సోర్స్, Gujarat Forest Department

గిర్ జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ రామ్ నేతృత్వంలోని ఒక బృందం.. సింహాలు ఇతర జంతువులతో సంభాషించేందుకు రసాయనిక సంకేతాలను ఎక్కడ, ఎలా విడుదల చేస్తుంటాయనే విషయంపై లోతుగా అధ్యయనం చేసింది.
రెండు సంవత్సరాలకు పైగా 2022 మార్చి నుంచి 2024 ఏప్రిల్ వరకు అధునాతన పరికరాలు, విధానాలను వాడుతూ గిర్ సింహాలపై ఈ అధ్యయనం చేశారు.
గిర్ సింహాలు కొన్ని రకాల చెట్లపై రసాయన సంకేతాలను విడుదల చేస్తున్నాయని, ఇలా చేయడం ద్వారా తోటి సింహాలకు, ఇతర జంతువులకు వివిధ రకాల సందేశాలను ఇస్తున్నాయని అధ్యయనం ముగింపులో మోహన్ రామ్ నేతృత్వంలోని బృందం కనుగొంది.
ఇతర సింహాలను రానియ్యవు
పిల్లుల కుటుంబంలో సింహాన్ని అతిపెద్ద జీవిగా చూస్తుంటారు. పులి కూడా ఇదే రకమైన కుటుంబానికి చెందినది. దీన్ని కూడా ఈ కుటుంబంలో అతిపెద్ద జంతువుగానే భావిస్తారు.
అయితే, సింహాలు, పులులు కలిసి జీవించేలా ఈ ప్రపంచంలో ఎటువంటి అడవులు లేదా గడ్డి భూములు లేవు.
గడ్డి భూములు, పొదలుండే అడవులు, గిర్‌లాంటి అడవుల్లో సింహాలు నివసిస్తాయి.
మరోవైపు దట్టమైన అడవులు, సుందర్బన్స్ వంటి బురద ప్రాంతాలు, శీతా కాలంలో గడ్డకట్టే చలివాతావరణం ఉండే రష్యా, సైబీరియాలలో కూడా పులులు నివసిస్తాయి.
సింహాలు ప్రాదేశిక జంతువులు. ఈ జంతువులు తమకంటూ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని, వాటి సరిహద్దులను సంరక్షించుకుంటూ ఉంటాయి.
మగ సింహాలు ఇతర మగ సింహాలను తమ ప్రదేశంలోకి రానీయవు. ఈ ప్రాదేశిక ప్రాంతంలో ఆడ సింహాలతో సంయోగం జరుపుతూ వాటి సంతతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Gujarat Forest Department
మగ సింహాలు గర్జించడం ద్వారా అడవిలో అవి ఏర్పాటు చేసుకున్న ఒక నిర్దిష్ట ప్రదేశంపై తమ నియంత్రణను ప్రదర్శిస్తుంటాయని పలువురు పరిశోధకులు గుర్తించారు.
ఇతర మగ సింహాలు, చిరుత పులులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండేలా, ఆడ సింహాలను అవి ఆకర్షించకుండా ఉండేలా హెచ్చరిస్తుంటాయని పరిశోధకులు కనుగొన్నారు.
మనుషులతో పాటు మరేదైనా జంతువు వాటికి దగ్గరగా వెళ్లినప్పుడు సింహం గర్జిస్తుంటుంది. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తుంది.
అంతేకాక, చెట్లపై ఎక్కడం, వాటి గోళ్లతో తొడలను గోక్కోవడం, మెడను లేదా శరీరాన్ని రుద్దడం, మూత్రాన్ని విసర్జించడం ద్వారా ఒక రకమైన రసాయనిక సంకేతాన్ని (వాసనను) విడుదల చేస్తుంటుంది.
కొన్ని ప్రాంతాల్లో మల విసర్జన చేయడం ద్వారా వాసనను విడుదల చేస్తూ, ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని ఇతర జంతువులకు తెలియజేస్తుంటాయి.
ఆడ సింహాలు తమ గోళ్లతో చెట్లను లేదా పొదలను గోకడం ద్వారా లేదా వాటికి శరీరాలను రుద్దడం ద్వారా కూడా వాటి ఉనికి తెలియజేస్తుంటాయి.
ఈ విధంగా వాటి శరీరాల నుంచి విడుదల చేసే రసాయనాలను సెమియోకెమికల్స్ అంటారు. తోటి సింహాలు, ఇతర జంతువులు వాటిని చూసినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే ఆడ, మగ సింహాల ఉనికి గుర్తిస్తుంటాయి.
ఇలా రసాయన సంకేతాలు ఇవ్వడం ద్వారా తోటి సింహాలతో, ఇతర జంతువులతో సంభాషిస్తుంటాయని పరిశోధకులు చెప్పారు.
'' వాటి ప్రాదేశిక ప్రాంతంలో తిరుగుతూ, సింహాలు ప్రతి ఐదు నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలోని చెట్టుకు లేదా మొక్కకు మూత్ర విసర్జన చేస్తుంటాయి. ఇలా వాటి సరిహద్దును తెలియజేస్తాయి. అవి మూత్రం విసర్జించే చెట్టు లేదా మొక్క 'బోర్డర్ పోస్టు'లాగా ఉంటుంది.'' అని డాక్టర్ మోహన్ రామ్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Bipin Tankaria/BBC
30 కెమెరాల్లో సింహాల కదలికలు రికార్డు
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో అమ్రేలి, గిర్ సోమనాథ్, జునాగఢ్ జిల్లాల్లో విస్తరించిన గిర్ జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దుకు సమీపంలో 36 ప్రాంతాల్లో ఇన్‌ఫ్రార్‌ర్డ్ మోషన్ డిటెక్షన్ కెమెరాలను డాక్టర్ మోహన్ రామ్, ఆయన బృందం ఇన్‌స్టాల్ చేసింది.
ఈ కెమెరాలు సాధారణంగా ఆఫ్‌లో ఉంటాయి. ఏదైనా జంతువు, పక్షి లేదా మరేదైనా కీటకం వాటికి దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి.
దగ్గరగా వచ్చిన జంతువు, పక్షి, కీటకం కదలికలను గుర్తించినప్పుడు, ఫోటోలు, వీడియోలు తీసేలా ఆ కెమెరాలను ప్రోగ్రామ్ చేశారు.
సింహం కదలికలను గుర్తించినప్పుడు ఫోటో తీసి, ఆ తర్వాత 30 సెకన్ల పాటు వీడియోను తీసేలా డాక్టర్ మోహన్, ఆయన బృందం కెమెరాలను ప్రోగ్రామ్ చేసింది.
పరిశోధకులు ఇన్‌స్టాల్ చేసిన 36 కెమెరాల్లో 30 కెమెరాలు సింహాల కదలికలను రికార్డు చేశాయి. ఏడు రకాల చెట్లకు సమీపంలో ఈ కెమెరాలను పరిశోధకులు ఏర్పాటు చేశారు.
ఈ కెమెరాలన్నీ కలిపి 15,144 ఫోటోలను తీశాయి. వాటిల్లో 1,542 ఫోటోల్లో సింహాలు కనిపించాయి.
ఈ ఫోటోలను, వీడియోలను పరిశీలిస్తే.. నీటి వనరులకు సమీపంలో ఉన్న నేరేడు పండ్ల చెట్ల దగ్గర సింహాలు మూత్ర విసర్జన చేసేందుకు, గోళ్లతో గీకేందుకు ఆసక్తి చూపినట్లు పరిశోధకులు గుర్తించారు.
మోదుగ చెట్లకు సమీపంలో కూడా ఈ రసాయన సంకేతాలను ఎక్కువగా విడుదల చేసినట్లు కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Gujarat forest department
ఎందుకు నేరేడు, మోదుగ చెట్ల దగ్గరే?
ఈ రెండు చెట్ల బెరడు గరుకుగా కనిపించినప్పటికీ, మృదువుగానే ఉంటుందని, వాటి బెరడును గీకినప్పుడు, ఒక రకమైన వాసన, రసాన్ని వెదజల్లుతుందని పరిశోధకులు గుర్తించారు.
''ఇలాంటి చెట్లు నీటి వనరులకు సమీపంలో ఉంటాయి. నీటికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో వనరులు సమృద్ధిగా ఉంటాయి. శాకాహార జీవులు దాక్కునే ప్రదేశాలు, చల్లని వాతావరణం వంటివి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి.'' అని డాక్టర్ మోహన్ బీబీసీకి చెప్పారు.
'' ఈ ప్రాంతాల్లో ఆధిపత్యం చెల్లాయించేందుకు సింహాలు ప్రయత్నిస్తాయి. నేరేడు, మోదుగ చెట్టు చూడటానికి గరుకుగా కనిపించినప్పటికీ, మృదువుగానే ఉంటాయి. వాటిపై విడుదల చేసే రసాయనాలను అవి ఎక్కువ సేపు ఉంచేలా చేస్తాయి. అందుకే, సింహాలు వాటిని గోళ్లతో గీకి, వాటిపై మూత్ర విసర్జన చేసేందుకు ఇష్టపడుతుంటాయి.'' అని వివరించారు.
గిర్ అడవుల్లో టేకు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ''కానీ, టేకు మృదువుగా కనిపించినప్పటికీ, దానిని గీకడం కష్టం. సింహాలు చాలా అరుదుగా వాటిని గోళ్లతో గీకుతుంటాయి. దీనికి బదులు టేకు చెట్లపై మూత్ర విసర్జన చేస్తుంటాయి.'' అని డాక్టర్ మోహన్ చెప్పారు.
'' మా పరిశోధనలో సింహాలు ఒక చెట్టును ఎంపిక చేసుకుంటాయి. వాటిపైనే పదేపదే రసాయనాలను విడుదల చేస్తుంటాయని మేం గుర్తించాం.'' అని డాక్టర్ మోహన్ తెలిపారు.
అప్పటి గుజరాత్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ నిత్యానంద శ్రీవాస్తవ, అప్పటి జునాగఢ్ వైల్డ్‌లైఫ్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆరాధన సాహు మార్గదర్శకంలో ఈ పరిశోధనా ప్రాజెక్టును ప్రారంభించారు.
గిర్ అడవులు జునాగఢ్ వైల్డ్‌లైఫ్ సర్కిల్ కిందకు వస్తాయి.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ పరిశోధకుడు కూడా ఇందులోభాగమయ్యారు. ఈ రీసర్చ్ ప్రాజెక్ట్, అది కనిపెట్టిన అంశాలను వివరిస్తూ ఓ రీసర్చ్ పేపర్ ఫ్రాంటియర్స్ ఇన్ ఎకాలజీ అండ్ ఎవాల్యుషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఫొటో సోర్స్, Gujarat Forest Department
ఎప్పుడెప్పుడు ఎక్కువగా చేస్తాయి?
ఆడ సింహాల కంటే మగసింహాలు ఎక్కువ రసాయన సంకేతాలను విడుదల చేస్తుంటాయని పరిశోధకులు గుర్తించారు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఎక్కువగా వీటిని విడుదల చేస్తుంటాయని తెలిపారు.
సింహాలు వాసనల ద్వారా సమాచారం పంచుకోవడమనేది తమ మొత్తం సంభాషణలలో 40 శాతం ఉంటుందని, అలాగే శరీరాన్ని చెట్లకు రుద్దడం వల్ల విడుదలయ్యే రసాయనాల ద్వారా జరిపే సంభాషణలు 30 శాతం ఉంటాయని, మూత్రం చేయడం ద్వారా 12శాతమని పరిశోధకులు గుర్తించారు.
జనవరి నుంచి జూన్ మధ్య వీటి కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. చెట్లు ఎక్కడం, వాటి శరీరాలను రద్దుకోవడం ఆడసింహాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
అలాగే సింహాలు చేసే రసాయనసమాచార మార్పిడిలో వాసన పీల్చడం, చెట్లను గోళ్లతో గీకడం వంటివి ఆడ, మగ సింహాలు ఎక్కువగా చేస్తున్నాయని గుర్తించారు పరిశోధకులు.
ఇలా రసాయనాల ద్వారా జరిపే సంభాషణలు ఎక్కువగా డిసెంబర్, ఫిబ్రవరి, జనవరిలో కనిపిస్తాయి. జనవరి, ఏప్రిల్, మే నెలల్లో మగ సింహాల కంటే ఆడ సింహాలు ఎక్కువగా చెట్లను వాటి గోళ్లతో గీకుతుంటాయి.
''శీతాకాల సమయంలో ఆసియా సింహాల సంయోగం ఎక్కువగా ఉండటమే దీనికొక కారణం కావొచ్చు. ఆడ, మగ సింహాలు ఒకదానికొకటి ఆకర్షించుకునేందుకు ఈ కార్యకలాపాల్లో పాల్గొంటుంటాయి. ఆఫ్రికాలో నివసించే సింహాలలో, దాదాపు అన్ని ఆడసింహాలు ఒకేసారి వెచ్చదనాన్ని కోరుకుంటూ, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. గిర్ సింహాల విషయంలో ఇలా జరగదు. గిర్ సింహాలు ఏడాదంతా సంతానోత్పత్తి చేస్తుంటాయి'' అని మోహన్ చెప్పారు.
కానీ, సంయోగం మాత్రం ఎక్కువగా శీతాకాలంలోనే జరుగుతుంటుంది. ఇక్కడుండే వాతావరణ, భౌగోళిక పరిస్థితులు కూడా కారణం కావొచ్చు'' అని డాక్టర్ మోహన్ రామ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














