మానవ పరిణామం: మనిషి అవయవాలు ఎలా మార్పు చెందుతూ వచ్చాయో చెప్పడం ఇప్పటికీ కష్టమే, ఎందుకంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాక్స్ టెల్ఫోర్డ్
- హోదా, బీబీసీ కోసం
మనిషికి పూర్వీకులైన ప్రైమేట్స్ (వానరాల)తో పోలిస్తే మానవ వృషణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అలా ఎందుకు అనేది పరిణామ క్రమమే మనకు చెప్పగలదు. అయితే, ఇతర శరీర భాగాల పరిమాణం (సైజ్) అంతకుమించిన మిస్టరీ.
మనిషి శరీరం ఒక యంత్రంలాంటిది. కణాల నిగూఢ నిర్మాణం నుంచి చేతులు, కళ్లు, కాలేయం, మెదడు వరకూ ఇవన్నీ నాలుగు బిలియన్ సంవత్సరాల కాలంలో జరిగిన వివిధ దశల పరిణామ మార్పుల ఫలితంగా ఏర్పడ్డాయి.
కానీ మనం ఈ ప్రత్యేకమైన రూపానికి ఎలా చేరుకున్నామనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఉదాహరణకు, మనిషికి మాత్రమే గడ్డం ఎందుకు ఉంటుంది? శరీరపు బరువుతో పోల్చితే మనుషుల వృషణాలు గొరిల్లా కంటే మూడురెట్లు పెద్దగా, చింపాంజీ వృషణాల సైజులో ఐదో వంతు మాత్రమే ఎందుకు ఉన్నాయి?
నా కొత్త పుస్తకం ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’లో పేర్కొన్నట్లుగా, మేం ఈ 'ఎందుకు' అనే ప్రశ్నలకు సమాధానాలను ఇంకా శోధిస్తున్నాం.
వాటిలో కొన్నింటికి ఇప్పుడిప్పుడే సమాధానాలు దొరకడం మొదలైంది.

ఈ రూపానికి మనం ఎలా వచ్చామో జీవ పరిణామక్రమం మనకు చెబుతుంది. ఏకకణ జీవాల నుంచి ప్రతిజాతి ఎలా ప్రత్యేకమైన రూపం సంతరించుకుందో, ఎప్పుడు ఏ లక్షణం దాని ప్రస్తుత రూపానికి జత అయ్యిందనే బ్లూప్రింట్‌కు చేర్చుకుంటూ వెళితే ప్రతి జాతి ఎలా పరిణామం చెందిందో ఈ పరిణామక్రమ వృక్షం చెబుతుంది.
జీవ పరిణామ వృక్షాన్ని ఆసక్తిగా పరిశీలిస్తే, ప్రతి జాతి చేరిన ప్రత్యేక శాఖ, దానికన్నా ముందు నుంచి వచ్చిన అనేక మలుపుల మార్గాలు మనకు కనిపిస్తాయి.
ఉదాహరణకు, మనుషులు సకశేరుకాలుగా (వెన్నెముక కలిగిన) రూపాంతరం చెందడానికి ముందు జంతువులు. ప్రైమేట్స్‌గా మారడానికి ముందు క్షీరదాలు. ఇలా క్రమం సాగుతుంది.
మనకు సంబంధమున్న వివిధ శాఖలకు చెందిన జాతుల సమూహాలు..మన శరీర భాగాలు ఏర్పడిన క్రమాన్ని వెల్లడిస్తాయి.
శరీరం, పేగు (జంతువుల శాఖలో గుర్తించిన) వంటివి వెన్నెముక, అవయవాల (సకశేరుకాల్లో గుర్తించిన )కంటే ముందే ఏర్పడి ఉండాలి. అలాగే పాలు, వెంట్రుకలు (క్షీరదాలు) వేలిగోర్ల కంటే (ప్రైమేట్స్) ముందే ఉండి ఉండాలి.
ఈ శరీర భాగాల్లో ప్రతి ఒక్కటీ ఎలా పరిణామం చెందిందనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఒక మార్గం ఉంది. అయితే పరిణామక్రమ వృక్షంలో వాటికి సంబంధించిన ప్రత్యేక శాఖలను ఒకటికి పదిసార్లు శోధిస్తేనే అది తెలుస్తుంది.
ఈ నిరంతర పరిణామాన్ని కన్వర్జెన్స్ అంటారు. ఇది శాస్త్రవేత్తలను చిరాకు పెట్టే విషయం. ఎందుకంటే, ఒక జాతి మరో జాతితో ఎలా సంబంధం కలిగివుందనే విషయంలో ఇప్పటికీ గందరగోళమే.
ఉదాహరణకు, పక్షుల్లో స్వాలో బర్డ్ , స్విఫ్ట్ బర్డ్‌లు ఒకప్పుడు సోదర జాతులుగా వర్గీకరించారు. కానీ వాటి డీఎన్ఏ, అస్తిపంజరాలపై అధ్యయనాల తర్వాత స్వాలోలు స్విఫ్ట్‌ల కంటే గుడ్లగూబలకు దగ్గరని అర్థమైంది.

ఫొటో సోర్స్, Getty Images
పరిణామ క్రమంలో సైజు కీలకం
ప్రైమేట్ వృషణాల సైజు దీనికి మంచి ఉదాహరణ. నలుపు తెలుపు రంగులో ఉండే కొలొబస్ మంకీ (కోతి జాతి) బొనెట్ మకాక్ (కోతి జాతి)లు దాదాపు ఒకే సైజులో ఉంటాయి.
చింపాంజీలు, గొరిల్లాలు, మానవుల మాదిరిగా, ఒకేలా ఉండే ఈ కోతుల వృషణాలు చాలా భిన్నంగా ఉంటాయి. కొలొబస్ మంకీ వృషణాల బరువు కేవలం 3 గ్రాములు, అయితే దీనికి విరుద్ధంగా, మకాక్‌ల వృషణాల బరువు 48 గ్రాములు ఉంటాయి.
వాటి వృషణాల సైజుకి సంబంధించి కొన్ని వివరణలు ఉన్నాయి. పెద్ద వృషణాలు నెమలి తోకంత పరిమాణంలో ఉండొచ్చు. తనకి అవి ఉపయోగకరం కాకపోవచ్చు, కానీ ఆడవారికి అవి ఆకర్షణీయంగా ఉంటాయి. బహుశా అవి జతకట్టడానికి అత్యంత ఆమోదయోగ్యమైన వివరణ ఇదే కావొచ్చు.
ఒక మగ కొలొబస్ కోతి తనతో జతకట్టే ఆడ భాగస్వామి అంత:పురాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. మరోవైపు మకాక్‌లు సుమారు 30 మంది సభ్యుల మిశ్రమ గ్రూపులుగా ఉంటాయి. వీటి మధ్య ప్రేమ భిన్నంగా ఉంటుంది. ఏది దేనితోనైనా జతకట్టొచ్చు.
ఒక మగకోతి అనేక ఆడవాటితో(పాలీగమి), ఒక ఆడకోతి అనే మగవాటితో(పాలియాండ్రి) జత కట్టొచ్చు.
ఒకే ఆడ భాగస్వామితో సంబంధం ఉండే కొలొబస్ మంకీలలో చాలా తక్కువ మొత్తంలో వీర్యం ఉత్పత్తి అవుతుంది. అవి బిడ్డను కనడానికి ఒక్క చుక్క వీర్యం సరిపోతున్నప్పుడు ఇంకా ఎందుకు ఎక్కువ ఉత్పత్తి చేయాలి?
అదే మగ మకాక్ విషయంలో వేరు.
తనకంటే ముందు, లేదా తన తర్వాత అదే ఆడ భాగస్వామితో జతకట్టిన వాటి వీర్యంతో మగ మకాక్ వీర్యం పోరాడాల్సి ఉంటుంది. అందువల్ల, మగ మకాక్ ఎక్కువ వీర్యాన్ని ఉత్పత్తి చేయాలి. అప్పుడు మాత్రమే దాని జీన్స్ పుట్టబోయే జీవిలో చేరతాయి.
వాటి వృషణాల సైజులకు ఇది సహేతుకమైన వివరణ కావొచ్చు, కానీ అది నిజమేనా? ఇక్కడే 'కన్వర్జెంట్ ఎవల్యూషన్'(పరిణామ క్రమం) ఉపయోగపడుతుంది.
ట్రీ ఆఫ్ లైఫ్‌లోని, క్షీరద శాఖ మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే, వేర్వేరు సైజుల వృషణాలు కలిగివున్న ఎన్నో క్షీరద సమూహాలు మనకి కనిపిస్తాయి.
వీటన్నింటినీ పరిశీలిస్తే, ఎక్కువ మందితో సంభోగం చేసే వాటి వృషణాలు పెద్దవిగానూ, ఒకదానితోనే సంభోగం చేసే జాతుల వృషణాలు చిన్నవిగానూ ఉంటాయి.
చిన్న వృషణాలు కలిగివుండే మగ గొరిల్లాకు ఒకే ఆడభాగస్వామి ఉంటుంది. పెద్ద వృషణాలు ఉండే చింపాంజీలు, బోనోబోలు వాస్తవానికి విచ్చలవిడి జీవనం సాగిస్తాయి.
కన్వర్జెంట్ ఎవల్యూషన్ అందించిన ఇలాంటి వేర్వేరు పరిశీలనల ఆధారంగా, క్షీరదాల్లో వృషణాల సైజుకి, వాటి లైంగిక జీవితానికి మధ్య కచ్చితమైన సంబంధాన్ని మేం గుర్తించగలిగాం.
ఇక, మనుషుల విషయానికొస్తే, మన వృషణ పరిమాణం మధ్యస్తంగా ఉంది. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మనిషి గడ్డం విషయంలో, అది ఎందుకు తయారైందనే విషయంలో శాస్త్రవేత్తల మధ్య భిన్నవాదనలున్నాయి. వృషణాల మాదిరిగానే గడ్డం పరిణామ క్రమాన్ని గురించి వివరించేందుకు దాదాపు అరడజను ఆమోదయోగ్యమైన వివరణలున్నాయి.
గుహలో జీవిస్తున్న మనిషి దవడను బలోపేతం చేయడానికి పరిణామం చెంది ఉండొచ్చు లేదంటే వంట చేయడం కనుగొన్న తర్వాత, మృదువైన ఆహారం వల్ల పరిణామం చెందినది కావొచ్చు.
అయితే ఆశ్చర్యకరంగా గడ్డం మరే ఇతర క్షీరదాల్లోనూ, మానవులకు దగ్గరి సంబంధాలున్న నియాండర్తల్‌లో కూడా కనిపించదు. మానవుల గడ్డం, దాని పరిణామ క్రమం గురించి అనేక ఆమోదయోగ్యమైన వివరణలు ఉన్నప్పటికీ, కన్వర్జెంట్ ఎవల్యూషన్ లేనప్పుడు అవి నిజమో కాదో నిర్ధరించేందుకు సరైన మార్గం మనకు లేనట్టే.
మానవ శరీరంలోని ఇంకా కొన్ని భాగాలు రహస్యంగానే మిగిలిపోవచ్చు.
* యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో జువాలజీ అండ్ కంపారిటివ్ అనాటమీ విభాగంలో జోడ్రెల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు మ్యాక్స్ టెల్ఫోర్డ్ .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














