ఎనిగ్మా కర్సర్: కుక్క సైజులో ఉండే డైనోసార్, పెద్దపెద్ద రాక్షస బల్లులతో కలిసి తిరిగిందా?

ఫొటో సోర్స్, Gwyndaf Hughes/BBC News
- రచయిత, జార్జినా రన్నార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లాబ్రడార్ జాతి కుక్క సైజులో ఉండే డైనోసార్‌ను గుర్తించినప్పుడు, దీని క్యాటగరైజేషన్ (వర్గీకరణ) తప్పుగా జరిగిందని శాస్త్రవేత్తలు భావించారు.
అయితే అది డైనోసార్లలో ప్రత్యేక జాతి అని తర్వాత గుర్తించారు.
దీనికి కొత్తగా ఎనిగ్మాకర్సర్ అని పేరు పెట్టారు. ఎనిగ్మాకర్సర్ అంటే గజిబిజిగా పరుగు తీయడం అని అర్థం.
ఇది 15 కోట్ల సంవత్సరాల కిందట నివసించింది.
స్టెగోసారస్ లాంటి ప్రముఖ భారీ డైనోసార్లతో కలిసి భూమి మీద ఇది పరుగులు తీసింది.
వాస్తవంగా దీన్ని నానోసారస్‌గా వర్గీకరించారు. అయితే ఇదొక ప్రత్యేక జంతువని శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి వచ్చారు.
2014 తర్వాత లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టిన తొలి డైనోసార్ ఇదే.
గురువారం నుంచి దీన్ని ప్రదర్శించడం ప్రారంభించారు.

ఈ డైనోసార్ గురించి ప్రజలకు తెలియజేయడానికి ముందు బీబీసీ బృందం ఒకసారి ఈ మ్యూజియానికి వచ్చింది.
డైనోసార్ల పరిణామక్రమంలో మొదట చిన్న డైనోసార్లు ఉన్నాయని అవి పెద్దగా ఆ తర్వాత వింతైన జంతువులుగా మారయాని చెప్పడానికి తాజా ఆవిష్కరణ ఆధారంగా నిలుస్తుందని మ్యూజియంలో పాలియెంటాలజిస్ట్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ పాల్ బారెట్ చెప్పారు.
మేము మ్యూజియం సందర్శనకు వెళ్లినప్పుడు, ఎనిగ్మాకర్సర్‌ను ప్రదర్శించే ప్రత్యేక గాజు బాక్సును డిజైనర్ చివరిసారిగా పరీక్షిస్తున్నారు.
మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఎర్త్‌హాల్ బాల్కనీ డైనోసార్‌కు కొత్త ఇల్లు కానుంది.
కింద 'సోఫి ది స్టెగోసారస్' ఉంది. ఇది పశ్చిమ అమెరికాలోని మోరిసన్ ఫార్మేషన్‌లో నివసించింది.
ఎనిగ్మాకర్సర్‌ను పోల్చి చూడాల్సి వస్తే చాలా చిన్నది.
64 సెంటీ మీటర్ల ఎత్తు, 180 సెంటీమీటర్ల పొడవు, చిన్న లాబ్రడార్ కుక్క పిల్లంత ఎత్తు ఉంటుంది.
అయితే కాళ్లు చాలా పెద్దవి. తోక మిగతా డైనోసార్ల కంటే పొడవైనది కావచ్చని ప్రొఫెసర్ సుసన్నా మెయిడ్మెంట్ చెప్పారు.

"దీని తల కూడా చిన్నగా ఉంది. కాబట్టి ఇది అంత తెలివైనది కాకపోవచ్చు. లేదా కుర్ర వయసులోనే చనిపోయి ఉండవచ్చు" అని ఆమె అన్నారు.
సంరక్షకులు అల్లింగ్‌టన్ జోన్స్, కీరన్ మైల్స్ లు దాని ఎముకల శిలాజాలను చేతులలోకి తీసుకుని, చాలా జాగ్రత్తగా మెటల్ ఫ్రేమ్‌లో అమర్చారు.

ఫొటో సోర్స్, Gwyndaf Hughes/BBC News
"బలమైన తొడలు కనిపిస్తున్నాయి. ఇవి వేగంగా పరుగెత్తే డైనోసార్లుగా అనిపిస్తున్నాయి. అయితే ముందు చేతులు చాలా చిన్నగా నేలకు చాలా ఎత్తులో ఉన్నాయి. బహుశా అది తన చేతులను మొక్కలను నోట్లో వేసుకోవడానికి వాడేది కావచ్చు" అని మైల్స్ చెప్పారు.
నేషనల్ హిస్టరీ మ్యూజియంలోని శాస్త్రవేత్తలు ఈ జీవి కొత్త జాతి అని తేల్చడానికి ఎముకలను నమూనాగా తీసుకుని ఉండవచ్చు.
"కొత్త జాతిగా భావిస్తున్న జంతువుల్ని గుర్తించే సమయంలో, దీనితో దగ్గరి సంబంధాలున్న మిగతా డైనోసార్లలో కొన్ని తేడాలు ఉండటం చూశాము. ఇందులో కాలి ఎముకలు చాలా ముఖ్యమైనవి" అని ప్రొఫెసర్ మెయిడ్మెంట్ చెప్పారు.
ఈ డైనోసార్‌ను మ్యూజియంకు విరాళంగా ఇచ్చినప్పుడు 1870లో ఇతర చిన్న డైనోసార్లకు పేరు పెట్టినట్లు గానే దీనికి నానోసారస్ అని పేరు పెట్టారు.
అయితే వాటి వర్గీకరణ తప్పుగా జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వాళ్లు అస్థిపంజరాన్ని స్కాన్ చేసిన చిత్రాలు, ఫోటోలు తీసుకుని అమెరికా వెళ్లారు.
అక్కడ విల్లు లాంటి శరీరం ఉన్న నిజమైన నానోసారస్‌ను చూశారు.
"అయితే దానిలో ఎముకలు లేవు. అది కేవలం ఒక రాయి. దానిలో ఎముక ముద్రలు ఉన్నాయి. ఇది ఎన్ని డైనోసార్లవైనా కావచ్చు’’ అని ప్రొఫెసర్ మెయిడ్మెంట్ అన్నారు.

ఫొటో సోర్స్, Gwyndaf Hughes/BBC News
దీనికి భిన్నంగా, నేషనల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియంలో ఉన్నది అధునాతన, కాలి ఎముకలతో సహా ఉన్న దాదాపు పూర్తి స్థాయి అస్థిపంజరం.
పేర్లు, వర్గీకరణ వెనుక ఉన్న గుట్టు విప్పడం అవసరమని పాలియెంటాలజిస్టులు చెబుతున్నారు.
"మన దగ్గర ఎన్ని జాతులు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి మేము చేస్తున్న పని పునాది లాంటిది. మనం తప్పు చేస్తే అన్నీ దారి తప్పుతాయి" అని ప్రొఫెసర్ మెయిడ్మెంట్ చెప్పారు.
శాస్త్రవేత్తలు నానోసారస్ వర్గాన్ని ఇప్పుడు పూర్తిగా తొలగించారు.
ఈ కాలానికి చెందిన ఇతర చిన్న డైనోసార్ నమూనాలు కూడా భిన్న జాతులకు చెందినవై ఉండవచ్చని నమ్ముతున్నారు.
ఈ ఆవిష్కరణ జురాసిక్ పీరియడ్ చివరి కాలంలో డైనోసార్ల వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు సాయపడుతుంది.
"చిన్న డైనోసార్లు తర్వాతి కాలంలో ప్రముఖంగా మారిన పెద్ద డైనోసార్లకు మూలాలుగా కనిపిస్తున్నాయి" అని ప్రొఫెసర్ బారెట్ చెప్పారు
"మనకు తెలిసిన దానిలో ఉన్న గ్యాప్‌లను పూర్తి చేసేందుకు ఇలాంటి జంతువులు సాయపడతాయి. కాలానుగుణంగా మార్పులు ఎలా సంభవించాయో చూపిస్తాయి" అని ఆయన వివరించారు.
ఈ తొలి తరం జీవులను చూడటం వల్ల "వాటి వింతైన, భారీ ఆకారానికి దారి తీసిన పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు" అని ప్రొఫెసర్ బారెట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Natural History Museum
చిన్న డైనోసార్‌కు సంబంధించి అరుదైన పూర్తి స్థాయి అస్థిపంజరం లభించడం పట్ల శాస్త్రవేత్తలు సంతోషంగా ఉన్నారు.
సాధారణంగా, పెద్ద డైనోసార్ ఎముకలు పెద్ద గిఫ్ట్ లాంటివి. అందుకే చిన్న వాటి ఎముకల కోసం తవ్వకాలు జరపడం మీద అంత ఆసక్తి ఉండేది కాదు.
"మీరు పెద్ద డైనోసార్ల ఎముకల కోసం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వాటి పక్కనే ఉన్న చిన్న వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇప్పుడు చిన్న వాటి ఎముకల కోసం కూడా జాగ్రత్తగా చూస్తారని అనుకుంటున్నాను" అని బారెట్ చెప్పారు.
ఎనిగ్మా కర్సర్ మోల్లీబోర్త్‌వికే గురించిన అంశాలను రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ పుస్తకంలో ప్రచురించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














