మహిళ మృతదేహాన్ని గడ్డివాములో కాల్చేశారు, కానీ 'చనిపోయిన' మహిళ వీడియో కాల్‌లో ఎలా బతికొచ్చింది?

మహారాష్ట్ర, కిరణ్ సావంత్, ఆత్మహత్య, పోలీసుల విచారణ

ఫొటో సోర్స్, Mustan Mirza

    • రచయిత, ముస్తాన్ మిర్జా
    • హోదా, బీబీసీ కోసం

ప్రియుడితో పారిపోవడం కోసం, తనకు తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఓ వివాహిత వేసిన మర్డర్ ప్లాన్‌ను పోలీసులు ఛేదించారు.

ఈ ఘటన జూలై 14న, మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మంగళ్వేధా తాలూకాలో జరిగింది.

ఈ కేసులో నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

వివాహిత మహిళ, ఆమె ప్రియుడి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.

అయితే, వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మహారాష్ట్ర, కిరణ్ సావంత్, ఆత్మహత్య, పోలీసుల విచారణ

ఫొటో సోర్స్, Mustan Mirza

ఫొటో క్యాప్షన్, ప్రియుడితో పారిపోయేందుకు వివాహిత, ఆమె ప్రియుడు కలిసి పథకం రచించారు.

అసలేం జరిగింది?

మంగళ్వేధా తాలూకాలోని పత్కల్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల వివాహిత కిరణ్ సావంత్‌, అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల నిషాంత్‌తో ప్రేమలో పడింది.

కిరణ్‌కు రెండేళ్ల కుమార్తె ఉంది.

అయినప్పటికీ, ఆమె ప్రియుడు నిషాంత్‌తో పారిపోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం భయంకరమైన ప్లాన్ వేశారు.

కిరణ్ ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించేందుకు కిరణ్ స్థానంలో వేరొకరి శరీరాన్ని ఉపయోగించాలని పక్కాగా ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్ర, కిరణ్ సావంత్, ఆత్మహత్య, పోలీసుల విచారణ

ఫొటో సోర్స్, Mustan Mirza

ఫొటో క్యాప్షన్, గుర్తుతెలియని మహిళను హత్య చేసి వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు నిరూపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరో మహిళ కోసం వెతుకులాట..

ఈ పథకంలో భాగంగా, కిరణ్ - నిషాంత్ నిరాశ్రయురాలైన మహిళ కోసం వెతకడం మొదలుపెట్టారు.

అలా 8 రోజుల తర్వాత, పండరీపూర్‌లోని గోపాల్‌పూర్ సమీపంలో ఒక మహిళను గుర్తించారు.

తప్పిపోయిన ఆమె కొడుకుని కనిపెట్టేందుకు సాయం చేస్తామని నమ్మించి నిషాంత్ ఆమెను తమ సొంతూరికి తీసుకువచ్చారు.

రెండు రోజుల తర్వాత, ఆమెను గొంతునులిమి చంపేశాడని పోలీసులు చెప్పారు.

జూలై 14 తెల్లవారుజామున, ఆ మహిళ మృతదేహాన్ని కిరణ్ సావంత్ పొలంలోని గడ్డివాములో ఉంచి, గడ్డివామును తగులబెట్టారు.

తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు కిరణ్ తన మొబైల్ ఫోన్‌ను ఆ మృతదేహం పక్కన పడేశారు.

గడ్డివాముకి నిప్పు పెట్టడానికి ముందే కిరణ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయి దానిమ్మ తోటలో దాక్కున్నారు.

గడ్డివాము తగలబడడం చూసి గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.

గడ్డివాములో కాలిపోయిన శరీరం కిరణ్‌దేనని అంతా భావించారు. కిరణ్ ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు.

కిరణ్ భర్త నాగేశ్ సావంత్‌తో పాటు కిరణ్ స్వగ్రామం మహేర్‌ నుంచి కూడా బంధువులు అక్కడికి వచ్చారు.

మహారాష్ట్ర, కిరణ్ సావంత్, ఆత్మహత్య, పోలీసుల విచారణ

ఫొటో సోర్స్, Mustan Mirza

ఫొటో క్యాప్షన్, నిషాంత్ ఫోన్ నుంచి పోలీసులు కిరణ్ సావంత్‌కు వీడియో కాల్ చేశారు.

పోలీసులకు ఎలా చిక్కారంటే..

కూతురి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కిరణ్ సావంత్ తండ్రి సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను అభ్యర్థించారు.

పోలీసుల దర్యాప్తులో కాలిపోయిన శరీరం పక్కన మొబైల్ ఫోన్ కనిపించడంతో వారికి అనుమానం మొదలైంది.

ఫోన్ కాల్ డేటా రికార్డుల ఆధారంగా, పోలీసులు కిరణ్ సావంత్ ప్రియుడు నిషాంత్‌ను అరెస్ట్ చేశారు. మొదట తనకేమీ తెలియదన్న నిషాంత్.. ఆ తర్వాత తానే హత్య చేసినట్లు అంగీకరించారు.

"కిరణ్ సావంత్ చనిపోలేదు, బతికే ఉంది" అని నిషాంత్ పోలీసులకు చెప్పడంతో పోలీసులు కూడా షాకయ్యారు.

నిషాంత్ సాయంతో పోలీసులు కిరణ్ సావంత్‌కు వీడియో కాల్ చేసి, ఆమె బతికే ఉండడం చూసి నిర్ఘాంతపోయారు.

వెంటనే నిషాంత్‌తో పాటు కరాడ్ గ్రామంలో ఉన్న కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నేరం జరిగిన తీరును వివరించారు.

మహారాష్ట్ర, కిరణ్ సావంత్, ఆత్మహత్య, పోలీసుల విచారణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుర్తు తెలియని మహిళ ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంగళ్వేధా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దత్తాత్రేయ బొరిగడ్డె ఈ కేసు వివరాలు తెలియజేశారు. "జూలై 14న, పత్కల్ గ్రామంలో ఒక మహిళ మంటల్లో కాలిపోయినట్లు స్టేషన్‌కు సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా, మేం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాం."

"మంటల్లో కాలిపోయిన మహిళ కిరణ్ సావంత్‌ అని తెలిసింది. కిరణ్ సావంత్ తండ్రి ఫిర్యాదు మేరకు, ప్రమాదవశాత్తూ జరిగిన మరణం(యాక్సిడెంటల్ డెత్)గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. అయితే, అక్కడ చనిపోయింది కిరణ్ కాదని, మరో గుర్తుతెలియని మహిళ అని మా దర్యాప్తులో తేలింది. కిరణ్ సావంత్ బతికే ఉంది" అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

కిరణ్ సావంత్, నిషాంత్ ఊరొదిలి పారిపోయి కలిసి జీవించేందుకు.. కిరణ్ చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించేలా ఈ పథకం రచించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అందులో భాగంగా.. గుర్తుతెలియని మహిళను చంపేసి, ఆమె మృతదేహాన్ని గడ్డివాములో పడేశారని, కిరణ్ సెల్‌ఫోన్ కూడా మంటల్లో పడేశారని పోలీసులు వెల్లడించారు.

"నిందితులిద్దరినీ అరెస్టు చేశాం. హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నాం" అని బొరిగడ్డె చెప్పారు.

ఈ సంఘటనపై కిరణ్ సావంత్ భర్త నాగేశ్ సావంత్ స్పందించారు.

"ఆ రోజు ఉదయం గడ్డివాముతో పాటు పక్కనున్న వంటగది కూడా కాలిపోయింది. వంటగది కాలిపోతోందని తెలియగానే, మేం అక్కడికి పరిగెత్తుకెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా, అందులో ఒక మృతదేహం కనిపించింది" అని అన్నారు.

"ఆ మృతదేహం నా భార్యదే అనుకున్నా. కానీ తర్వాత ఆమె కాదని తెలిసింది. మా కుటుంబం భయాందోళనకు గురైంది. నిందితులకు, వారికి సహకరించిన వారిపై కఠిన చర్చలు తీసుకుని మాకు న్యాయం చేయాలి" అని నాగేశ్ కోరారు.

చనిపోయిన మహిళ ఎవరు?

ఈ కేసులో పోలీసులు కిరణ్ సావంత్, నిషాంత్‌ను అరెస్టు చేసి, వారిపై హత్య కేసు నమోదు చేశారు.

అయితే, కాలిపోయిన అమాయక మహిళ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఆమె కుటుంబ సభ్యుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)