కర్ణాటక: గోకర్ణ గుహలో పిల్లలతో కనిపించిన ఈ రష్యన్ మహిళ ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, గీతా పాండే, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ కర్ణాటకలోని గుహలో కనిపించిన రష్యన్ మహళ, ఆమె ఇద్దరి పిల్లల చుట్టూ ఉన్న చిక్కుముడులను విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గోవాకు సరిహద్దుల్లో ఉన్న గోకర్ణ అడవుల్లోని రామతీర్థ కొండల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో రష్యన్ మహిళ నీనా కుటినాను గుర్తించి, రక్షించారు.
40 ఏళ్ల నీనా కుటినాతో పాటు ఆమె ఆరు, ఐదేళ్ల కూతుళ్లు కూడా ఉన్నారు. భారత్‌లో ఉండేందుకు వారి వద్ద సరైన పత్రాలేవీ లేవు. వాళ్లను బెంగళూరుకు సమీపంలోని విదేశీయుల నిర్బంధ కేంద్రంలో ఉంచారు. త్వరలో రష్యా పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏఎన్ఐ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూల్లో నీనా కుటినా తన జీవనశైలిని సమర్థించుకున్నారు. తన కుమార్తెలతో గుహలో ఆనందంగా జీవించానని ఆమె చెప్పారు. ప్రకృతి మంచి ఆరోగ్యం అందించిందని అన్నారు.
వాళ్లను గుర్తించిన వారం రోజుల తర్వాత, వాళ్లు అసలు పాములు, వన్య ప్రాణులు తిరిగే ఆ అడవుల్లోకి ఎలా వచ్చారు? అక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారనే దానిపై కొంత స్పష్టత వచ్చింది.


ఫొటో సోర్స్, Karnataka police
పోలీసులు గుహ దగ్గరకు వెళ్లినప్పుడు..
"ఈ ప్రాంతం విదేశీ పర్యటకులకు ప్రసిద్ధి చెందింది. అయితే, వర్షాకాలంలో ఇక్కడ చాలా పాములు ఉంటాయి. కొండచరియలు విరిగిపడతాయి. పర్యటకుల భద్రత కోసం గతేడాది నుంచి పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నాం" అని జిల్లా ఎస్పీ ఎం నారాయణ బీబీసీతో చెప్పారు.
గుహ బయట రంగురంగుల దుస్తులు ఆరవేసినట్లు చూసినప్పుడు కొండ పైనుంచి కిందకు నడుచుకుంటూ వెళ్లామని.. అక్కడ గుహలో ఒక రష్యన్ మహిళ, ఇద్దరు పిల్లల్ని గుర్తించినట్లు గస్తీ బృందంలోని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
గుహ దగ్గరకు వెళ్లిన తర్వాత గుహకు ముఖద్వారం మాదిరిగా రంగురంగుల చీరలను కర్టెన్లుగా వేలాడదీసి ఉండటం గుర్తించారు. "ఒక చిన్న అమ్మాయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది" అని పోలీస్ అధికారి చెప్పారు. ఆశ్చర్యపోయిన గస్తీ బృందం లోపలకు వెళ్లినప్పుడు నీనా కుటినా, మరో చిన్నారిని గుర్తించింది.
వారి దగ్గర చాలా తక్కువ వస్తువులు ఉన్నాయి. ప్లాస్టిక్ చాపలు, దుస్తులు, నూడుల్స్ ప్యాకెట్లు, ఇతర కిరాణా సామగ్రి ఉంది. గుహలోకి నీరు వస్తోంది.
గుహలోకి వెళ్లిన తర్వాత పోలీసులు తీసిన వీడియోలను బీబీసీ పరిశీలించింది. అందులో రంగురంగుల దుస్తులు వేసుకున్న ఇద్దరు చిన్నారులు కెమెరా వైపు చూస్తూ నవ్వుతున్నారు.
"ఆ మహిళ, పిల్లలు అక్కడ చాలా సౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. అక్కడ ఉండటం ప్రమాదకరమని వాళ్లకు నచ్చజెప్పడానికి కొంత సమయం పట్టింది" అని ఎస్పీ నారాయణ చెప్పారు.
అక్కడ పాములు, ప్రమాదకరమైన వన్య ప్రాణులు ఉంటాయని పోలీసులు చెప్పినప్పుడు నీనా కుటినా వారితో "జంతువులు, పాములు మాకు స్నేహితులు, మనుషులే ప్రమాదకరం" అన్నారు.
కుటినా, ఆమె పిల్లల్ని రక్షించిన తర్వాత పోలీసులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Karnataka police
ఎవరీ నీనా కుటినా?
ఆమె రష్యన్. లాంఛనాలన్నీ పూర్తైన తర్వాత ఆమెను స్వదేశానికి పంపిస్తామని ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
తాను రష్యాలోనే పుట్టినప్పటికీ అక్కడ 15ఏళ్లకు మించి పెరగలేదని కోస్టారికా, మలేషియా, బాలి, థాయిలాండ్, నేపాల్, యుక్రెయిన్ సహా అనేక దేశాల్లో పర్యటించినట్లు నీనా కుటినా పీటీఐ, ఏఎన్ఐ వార్తా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు
తనకు 5 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారని ఆమె రెండు వార్తా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. గతేడాది గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన పెద్ద కుమారుడు చనిపోయాడని అన్నారు.
ఆమె రెండో కుమారుడికి 11ఏళ్లని అతను రష్యాలో ఉన్నాడని అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని కాన్సులేట్‌కు తెలిపామన్నారు.
తాము చెన్నైలోని రష్యన్ కాన్సులేట్‌నను సంప్రదించామన్నారు. దిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయానికి లేఖ రాశామని, వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని ఎఫ్ఆర్‌ఆర్ఓ అధికారులు తెలిపారు.
అయితే, బాలికల తండ్రిని మంగళవారం రాత్రి ఎఫ్ఆర్‌ఆర్ఓ గుర్తించగలిగింది.
ఆయన పేరు డ్రోర్ గోల్డ్ స్టెయిన్. ఆయనో ఇజ్రాయెల్ వ్యాపారవేత్త.
ప్రస్తుతం ఆయన భారత్‌లోనే ఉన్నారని నీనా కుటినా, ఆమె ఇద్దరు పిల్లల్ని రష్యాకు తిప్పి పంపేందుకు అవసరమైన సొమ్మును చెల్లించడానికి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎఫ్ఆర్ఆర్ఓ అధికారి చెప్పారు.
కుటినా తనకు చెప్పకుండా గోవా వదిలి వెళ్లారని, ఆమె కనిపించకుండా పోవడంపై గోవా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోల్డ్ స్టెయిన్ ఎన్డీటీవీతో చెప్పారు.
తన కూతుళ్లిద్దరినీ తనతో ఉంచుకోవాలని కోరుకుంటున్నానని, వారిని రష్యా పంపించకుండా ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నీనా గోకర్ణ ఎప్పుడు వచ్చారు?
నీనా కుటినా, ఆమె కుమార్తెలు గోకర్ణ దగ్గరలోని అడవిలోకి ఎప్పుడు ఎలా వచ్చారనే దానిపై స్పష్టత లేదు.
వారం రోజుల నుంచి తాము గుహలో ఉంటున్నట్లు ఆమె తమతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. వారం క్రితం గుహకు దగ్గర్లో ఉన్న గ్రామంలో నూడుల్స్, కొన్ని కూరగాయలు, కిరాణా సామాగ్రి కొనుగోలు ఆమె చెప్పారు.
తాను గోవా నుంచి గోకర్ణ వచ్చానని, అక్కడే గుహలో ఉంటున్నానని చెప్పినా నీనా కుటినా, తన కుమార్తెలలో ఒకరు గుహలో జన్మించారని చెప్పారు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగళూరులో తమను ఉంచిన నిర్బంధ కేంద్రం గురించి మాట్లాడుతూ "ఇది జైలు లాంటిది" అని ఫిర్యాదు చేశారు.
"మేం మంచి ప్రదేశంలో నివసించాము. అయితే ఇప్పుడు మేం ఒంటరిగా ఉండలేము. బయటకు వెళ్ళలేం. ఇక్కడ చాలా మురికిగా ఉంది. తగినంత ఆహారం లేదు" అని ఆమె చెప్పారు.
నీనా కుటినా భారత్‌కు ఎప్పుడు ఎలా వచ్చారనే దానిపైనా స్పష్టత లేదు.
తన పాస్‌పోర్ట్ పోయిందని ఆమె పోలీసులతో చెప్పారు. అయితే పోలీసులు గడువు ముగిసిన పాత పోస్‌పోర్ట్‌ను కనుక్కున్నారు.
అందులో ఆమె 2016 అక్టోబర్ 18 నుంచి 2017 ఏప్రిల్ 17 వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసా మీద భారత్ వచ్చినట్లుగా ఉంది.
అయితే ఆమె గడువు దాటిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారు. ఏడాది తర్వాత ఆమె దేశం విడిచి వెళ్లేందుకు గోవాలోని ఎఫ్ఆర్ఆర్ఓ ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసింది.
ఆమె పాస్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ స్టాంపుల ప్రకారం నీనా కుటినా 2018 ఏప్రిల్ 19న నేపాల్ వెళ్లి, మూడు నెలల తర్వాత ఆ దేశం నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆమె ఎక్కడకు వెళ్లారో స్పష్టంగా తెలియలేదు. అయితే ఏఎన్ఐతో మాట్లాడినప్పుడు తాను "కనీసం 20 దేశాల్లో పర్యటించాను. 2018లో భారత్ నుంచి వెళ్లిపోయిన తర్వాత నాలుగు దేశాల్లో తిరిగాను" అని ఆమె చెప్పారు.
ఆమె తరవాత భారత్ ఎప్పుడు వచ్చారనే దానిపైనా స్పష్టత లేదు కానీ, 2020 ఫిబ్రవరిలో వచ్చినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. "మేం భారత్‌ను నిజంగా ప్రేమిస్తున్నాం" అని ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
తన వీసా గడువు ముగిసిందనే విషయాన్ని ఆమె అంగీకరించారు.
"మాకు ఇక్కడ ఉండటానికి చెల్లుబాటయ్యే వీసా లేదు. దాని గడువు ముగిసింది" అని నీనా చెప్పారు.
చనిపోయి తన కుమారుడి గురించి ఆలోచిస్తూ విషాదంలో ఉన్నందున వీసా గురించి ఆలోచించలేకపోయానన్నారు.

ఫొటో సోర్స్, x.com/PTI_News
గుహలో ఎందుకు ఉన్నారు?
నీనా కుటినా, ఆమె పిల్లలు ఉన్న గుహలో పాండు రంగడి విగ్రహం ఉంది. దీంతో ఆమె ధ్యానం చేయడానికి, ఆధ్యాత్మికంగా నివసించడానికి గుహకు వెళ్లినట్లు భావిస్తున్నారు
అయితే ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తిరస్కరించారు.
"ఇది ఆధ్యాత్మికత గురించి కాదు. ప్రకృతి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మనం దానిని ఇష్టపడతాం. ఇది చాలా ఆరోగ్యవంతమైనది. ఇంట్లో ఉన్నట్లు కాదు" అని నీనా చెప్పారు.
"ప్రకృతి ఒడి లాంటి అడవిలో ఉండటం నాకు చాలా గొప్ప అనుభవం" అని ఆమె చెప్పారు.
తన కుమార్తెలు అక్కడ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
"మేం చనిపోవడం లేదు. నేను నా పిల్లలను అడవిలో చనిపోవడానికి తీసుకురాలేదు. వారు చాలా సంతోషంగా ఉన్నారు, వారు జలపాతంలో ఈత కొట్టారు. రాత్రి పూట నిద్రపోవడానికి చాలా మంచి ప్రదేశం ఉంది. మేం మట్టితో బొమ్మలు చేశాం. రంగుల చిత్రాలు గీశాం. బాగా తిన్నాం. నేను రుచికరమైన ఆహారాన్ని వండాను" అని ఆమె ఏఎన్ఐతో చెప్పారు.
అడవిలో ఉండటం వల్ల పిల్లలకు ప్రమాదం ఏర్పడవచ్చనే విషయాన్ని ఆమె కొట్టిపడేశారు.
"మేం అక్కడ నివసించినంత కాలం కొన్ని పాములను చూశాం" అని నీనా చెప్పారు. అయితే అది గ్రామాల్లో ఇళ్లు, వంట గదులు, టాయిలెట్లలో అప్పుడప్పుడు పాములు కనిపించడం లాంటిదేనని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














