ప్రపంచంలో ఏయే దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, అవి వాటిని ఎలా సంపాదించాయి?

అణు బాంబు విస్పోటనం

ఫొటో సోర్స్, Universal History Archive/Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా (ఎడమ), నాగసాకి (కుడి) నగరాలపై అణుబాంబు వేసింది

అమెరికా మొదటి అణు బాంబును ప్రయోగించిన 80 ఏళ్ల తర్వాత, ఇరాన్ అణు కార్యక్రమం పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణలకు కేంద్రంగా మారింది.

జూన్‌లో తమ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసిన తరువాత, ఐక్యరాజ్య సమితి న్యూక్లియర్ వాచ్‌డాగ్ అయిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కి సహకరించకూడదని ఇరాన్ నిర్ణయించుకుంది. ఈమేరకు సంబంధిత చట్టంపై ఆ దేశ అధ్యక్షుడు జులై 2న సంతకం చేశారు.

అణ్వాయుధాలు తయారుచేయకుండా ఇరాన్‌ను నివారించేందుకు ఈ దాడులు అవసరమేనని ఇజ్రాయెల్, అమెరికా పేర్కొన్నాయి.

ఈ దాడుల వల్ల ఎంత నష్టం కలిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ ప్రాంతంతో పాటు 55 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ఐక్యరాజ్యసమితి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపైనా వీటి ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

తొమ్మిది దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయనేది తెలిసిన విషయమే. వాటికి అణ్వాయుధాలు ఎలా వచ్చాయి, ఇప్పుడు ఇతర దేశాలు కూడా అణ్వాయుధాలను పొందాలని చూస్తున్నాయా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Universal History Archive/Universal Images Group via Getty Images

అణ్వాయుధాలు

అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా అణ్వాయుధాలను కలిగి ఉన్నట్లు ప్రపంచదేశాలకు తెలుసు. అయితే, ఈ దేశాలన్నింటిలో ఇజ్రాయెల్ ఒక్కటే ఎన్నడూ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగంగా రహస్యంగా ఆయుధాలను అభివృద్ధి చేసిన అమెరికా మొట్టమొదటి అణు శక్తి దేశంగా అవతరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై 1945లో అమెరికా అణు బాంబులను ప్రయోగించింది. ఈ విధ్వంసంలో 2 లక్షల మందికి పైగా మరణించారని అంచనా. ఒక యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించింది ఆ ఒక్కసారే.

"అణ్వాయుధ పోటీలో ఇదే ప్రారంభ దాడి" అని ఆయుధ నియంత్రణ నిపుణురాలు డాక్టర్ పాట్రీసియా లూయిస్ అన్నారు. ఈ దాడి ఇతర దేశాలు, ముఖ్యంగా సోవియట్ యూనియన్ వంటివి తమపై దాడులు జరుగకుండా నిరోధించడానికీ, తమ శక్తిని ప్రదర్శించడానికీ సొంతంగా అణ్వాయుధాల తయారీని అత్యవసరంగా ప్రయత్నించేలా చేసింది.

న్యూక్లియర్ వెపన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1953లో ఐక్యరాజ్య సమితిలో అమెరికా అప్పటి అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్ హోవర్ ప్రసంగం
హెడ్డింగ్

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి రెండేళ్ళయినా కాకముందే, ఒక ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. ఇది అమెరికా, సోవియట్ యూనియన్‌తో పాటు వాటి మిత్రదేశాల మధ్య 40 ఏళ్లకు పైగా కొనసాగింది. ఈ ప్రపంచాధిపత్య పోటీ కొన్నిసార్లు అణు సంఘర్షణ ప్రమాదాన్ని పెంచింది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే సోవియట్లు అణు బాంబు తయారీ ప్రయత్నాలను ప్రారంభించారు. 1949లో వాటిని విజయవంతంగా పరీక్షించటం ద్వారా అణ్వాయుధాలపై అమెరికా గుత్తాధిపత్యానికి ముగింపు పలికారు. ఆ తర్వాత మరింత విధ్వంసకరమైన అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి రెండు వైపుల నుంచి ప్రయత్నాలు జరిగాయి.

ఆ తర్వాతి 15 ఏళ్లలో మరో మూడు దేశాలు అణ్వస్త్ర శక్తులుగా మారాయి.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణ్వాయుధ అభివృద్ధికి అమెరికాతో కలిసి పనిచేసిన యూకే1952లో మూడో అణ్వస్త్ర దేశంగా నిలిచింది.

1960లో ఫ్రాన్స్, 1964లో చైనా అణ్వాయుధ దేశాలుగా మారాయి.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

అణ్వాయుధాలు

అమెరికా, సోవియట్ యూనియన్, యూకే, ఫ్రాన్స్, చైనా 1960ల నాటికి అణ్వాయుధ దేశాలుగా స్థిరపడ్డాయి. ఇలాగే సాగితే, అణ్వాయుధ దేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే భయాలు కూడా పెరిగాయి.

దీంతో ఐక్యరాజ్యసమితి, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (NPT) తీసుకొచ్చింది. అణ్వాయుధాలు మరింతగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, నిరాయుధీకరణను ప్రోత్సహించడానికి, అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకునేలా చేయడానికి ఈ ఒప్పందాన్ని తీసుకొచ్చారు.

ఈ ఒప్పందం 1970లోనే అమల్లోకి వచ్చింది. కానీ, దీనిపై అన్ని దేశాలు సంతకం చేయలేదు. అణ్వాయుధ వ్యాప్తి పెరుగుతూపోయింది.

భారత్ 1974లో, పాకిస్తాన్1998లో అణుశక్తులుగా అవతరించాయి. అయితే, ఈ రెండు దేశాలకు పరస్పరం భద్రతాపరమైన ఆందోళనలు ఉండటంతో ఇవి కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు.

ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందంపై ఎన్నడూ సంతకం చేయలేదు.

ప్రాంతీయ బెదిరింపులు, ఉద్రిక్తతలు, పొరుగు దేశాలు చాలావాటితో తమకున్న శత్రుత్వం కారణంగానే ఈ ఒప్పందంపై సంతకం చేయలేదని ఇజ్రాయెల్ పదేపదే చెబుతోంది. అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని నిర్ధరించడమో, లేదా తిరస్కరించడమో చేయకుండా ఇజ్రాయెల్, అణ్వాయుధ విధానంలో అస్పష్టతను కొనసాగిస్తోంది.

ఉత్తర కొరియా ముందుగా ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ.. అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను ఆక్షేపిస్తూ 2003లో ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది.

ఉత్తర కొరియా 2006లో అణ్వాయుధాన్ని పరీక్షించింది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న, 2011లో ఏర్పాటైన దక్షిణ సూడాన్ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు.

అణ్వాయుధాలు

''మనకు తెలిసినంతవరకు ఇరాన్ ఇంకా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయలేదు. అయితే వారు అణ్వాయుధం తయారు చేయలేకపోవడానికి నిజమైన సాంకేతిక, శాస్త్రవిజ్ఞాన కారణాల్లేవు'' అని యూకేలోని లెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ రాజకీయాల ప్రొఫెసర్ ఆండ్రూ ఫుటర్ చెప్పారు.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసిన ఇరాన్, తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదనీ, తామెప్పుడూ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని చెబుతూవస్తోంది.

అయితే, ఐఏఈఏ దశాబ్దకాలం పాటు జరిపిన దర్యాప్తులో ఇరాన్ 1980ల చివరి నుంచి 2003 వరకు అణు విస్ఫోటన పరికరం అభివృద్ధి చేయడానికి సంబంధించిన అనేక కార్యకలాపాలను నిర్వహించినట్లు నిరూపించే ఆధారాలను గుర్తించింది. అప్పుడు "ప్రాజెక్ట్ అమద్" కింద చేపట్టిన ఆ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి.

అణ్వాయుధాలు

అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు 2015లో ఆరు ప్రపంచ శక్తులతో ఇరాన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో అది తన అణు కార్యకలాపాలపై ఆంక్షలను అంగీకరించటంతో పాటు ఐఏఈఏ తనిఖీదారుల పర్యవేక్షణను కూడా అనుమతించింది.

కానీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2018లో తన మొదటి పదవీకాలంలో ఈ ఒప్పందం నుంచి బయటకొచ్చారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి ఈ ఒప్పందం వల్ల ఒరిగిందేమీ లేదని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇరాన్‌పై ఆంక్షలను తిరిగి విధించారు. దీంతో ఇరాన్, యురేనియం శుద్ధిపై ఐఏఈఏ విధించిన ఆంక్షలను, పదే పదే ఉల్లంఘించడం ద్వారా ప్రతీకార చర్యలకు పాల్పడింది.

ఈ 20 ఏళ్లలో మొదటిసారిగా ఇరాన్ దాని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని 2025 జూన్ 12న ఐఏఈఏ 35-దేశాల గవర్నర్ల బోర్డు ప్రకటించింది.

ఆ మరుసటి రోజే ఇరాన్ అణు, సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వరుస దాడులను ప్రారంభించింది. ఆ తర్వాత వారి సన్నిహిత మిత్రదేశమైన అమెరికా కూడా ఇజ్రాయెల్‌తో చేరింది. ఇరాన్‌లోని భూగర్భ ఫోర్దోతో సహా మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది.

న్యూక్లియర్ ప్రోగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

అణ్వాయుధాలు

ఇజ్రాయెల్ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లుగా అధికారికంగా ఎప్పుడూ ధ్రువీకరించలేదు. కానీ ఇజ్రాయెల్ వద్ద గణనీయమైన ఆయుధాలు ఉన్నట్లుగా వ్యాప్తిలో ఉంది.

ఇజ్రాయెల్ గతంలో అనుకున్న దానికంటే చాలా విశాలమైన, అధునాతనమైన అణ్వాయుధ కార్యక్రమాన్ని కలిగి ఉందని పేర్కొంటూ ఇజ్రాయెల్ అణు సాంకేతిక నిపుణుడు మోర్డెకాయ్ వనునూ 1986 అక్టోబర్‌లో బ్రిటిష్ వార్తాపత్రిక సండే టైమ్స్‌కు ఆ వివరాలను అందించారు. ఇలా చేసినందుకు ఆయనను ఇజ్రాయెల్‌లో 18 ఏళ్ళ పాటు నిర్బంధించి, 2004లో విడుదల చేశారు.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) ప్రకారం, ఇజ్రాయెల్ తన ఆయుధ సామగ్రిని ఆధునీకరిస్తోంది.

అణు సామర్థ్యం గల జెరిచో బాలిస్టిక్ మిస్సైల్స్ కుటుంబానికి చెందిన ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఇజ్రాయెల్ 2024లో పరీక్షించింది. అది దిమోనాలోని దాని ప్లుటోనియం ఉత్పత్తి కేంద్ర స్థాయిని పెంచుతున్నట్లు కనిపిస్తోందని ఎస్‌ఐపీఆర్‌ఐ తెలిపింది.

తన ప్రాంతీయ ప్రత్యర్థులు అణ్వాయుధ సామర్థ్యాలను సంపాదించకుండా నిరోధించడానికి ఇజ్రాయెల్ సైనికపరంగా వ్యవహరిస్తుంది.

ఇరాన్‌పై దాడులతో పాటు, 1981లో ఇరాక్‌లోని ఒక అణు రియాక్టర్‌పైనా, 2007లో సిరియాలోని ఒక అనుమానిత అణు కేంద్రంపైనా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా 2006లో విజయవంతంగా అణ్వాయుధాన్ని పరీక్షించింది
అణ్వాయుధాలు

బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటి ఇతర దేశాలు అణ్వాయుధాల అభివృద్ధిపై పనిచేయడం మొదలుపెట్టినప్పటికీ, ఆ తరువాత స్వచ్ఛందంగానో, లేదా బయటి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానో తమ కార్యక్రమాలను వదులుకున్నాయి.

విజయవంతంగా అణ్వాయుధాలను తయారుచేసి, ఆపై వాటిని నిరాయుధీకరించి, తన అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసిన ఏకైక దేశం దక్షిణాఫ్రికా.

"ఈ అణు యుగంలో, ఒక దేశం సొంతంగా అణ్వాయుధాలు తయారు చేసుకొని, ఆపైన వాటిని నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకోవటం చాలా అసాధారణం. ఇప్పటికీ నమ్మలేనట్లుగా అనిపిస్తుంది" అని ఫుటర్ చెప్పారు.

వర్ణవివక్ష పాలన ముగియటం, ప్రాంతీయ సంఘర్షణలు తగ్గుముఖం పట్టడం, ప్రపంచ రాజకీయ గతిశీలతలో మార్పు వంటి అంశాలు దక్షణాఫ్రికా ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణమయ్యాయి.

1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత, కొత్తగా స్వతంత్రులుగా మారిన యుక్రెయిన్, బెలారస్, కజకిస్తాన్ దేశాలు అణ్వాయుధాలను వారసత్వంగా పొందాయి. కానీ వాటిని వదులుకున్నాయి.

1994 బుడాపెస్ట్ మెమోరాండమ్ ప్రకారం అమెరికా, యూకే, రష్యా ఇచ్చిన భద్రతా హామీలకు ప్రతిగా యుక్రెయిన్ తన ఆయుధాలను వదులుకుంది.

అయితే, దశాబ్ద కాలంగా రష్యాతో సంఘర్షణలో ఉన్న తమ దేశానికి, ఆయుధాలను వదులుకోవడం వల్ల కలిగిన లాభమేమీ లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియన్‌స్కీ పదే పదే అంటుంటారు.

అణ్వాయుధాలు

ఒక దేశం వద్ద కచ్చితంగా ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా తమ వద్ద ఉన్న ఆయుధాల గురించి పెద్దగా బయటకు చెప్పదు.

కానీ ఎస్‌ఐపీఆర్‌పీ ప్రకారం, 2025 జనవరి నాటికి ప్రపంచ అణ్వాయుధ దేశాల వద్ద మొత్తం 12,241 వార్‌హెడ్‌లు ఉన్నాయని అంచనా.

ప్రపంచ నిల్వలో 90% రష్యా, అమెరికాల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కొత్తవాటిని తయారు చేయడం కంటే పాత ఆయుధాలను నిర్వీర్యం చేయడమే ఎక్కువగా జరిగేది. కానీ, రానున్న కాలంలో ఈ ధోరణి మారే అవకాశం ఉందని ఎస్‌ఐపీఆర్‌పీ పేర్కొంది.

అణ్వాయుధాలు

ఇతర దేశాలు అణ్వాయుధాల తయారీవైపు ఆలోచించాలా? వద్దా? అనే అంశాన్ని ఇరాన్ అణు కార్యక్రమ ఫలితం ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

జూన్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడుల తర్వాత, ఇరాన్ అణు కార్యక్రమాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా దాడులు రెండేళ్ల వెనక్కి నెట్టాయని జులైలో పెంటగన్ పేర్కొంది.

ఇరాన్ చివరకు అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తే, పశ్చిమాసియాలోని ఇతర దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా కూడా సొంతంగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయొచ్చని ఫుటర్ చెప్పారు.

ఎన్‌పీటీ నుంచి ఇరాన్ వైదొలిగే ప్రమాదం అధికంగా ఉందని డాక్టర్ లూయిస్ చెబుతున్నారు. దీనివల్ల ఇతర దేశాలు కూడా ఆ ఒప్పందం నుంచి నిష్క్రమించే అవకాశం కూడా పెరుగుతుంది. అప్పుడు ఈ చర్యలు ఎన్‌పీటీకి ఎదురుదెబ్బ కావొచ్చు. అంతకానీ ముగింపు మాత్రం కాదని లూయిస్ అన్నారు.

కానీ ఇతర దేశాలు అణ్వాయుధాలను నిర్మించాలని నిర్ణయించుకున్నప్పటికీ, కఠినమైన నియంత్రణలో ఉన్న శుద్ధిచేసిన యురేనియంను, లేదా ఆయుధాల తయారీకి పనికివచ్చే ప్లూటోనియంను పొందాలంటే అధిగమించాల్సిన ముఖ్యమైన సవాళ్ళున్నాయని డాక్టర్ లూయిస్ చెప్పారు.

ఆర్థిక భారాన్ని గురించి కూడా ఆమె పేర్కొన్నారు.

"ఇది ఖరీదైనది, ప్రత్యేకించి రహస్యంగా చేసే పక్షంలో సంవత్సరాలు పడుతుంది. అయితే ఇవేవీ ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి పేద దేశాలను ఆపలేవు"

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)