మిస్ గోల్ఫ్: బౌద్ధ సన్యాసులతో సెక్స్, ఆపై బ్లాక్‌మెయిల్.. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన మహిళ

థాయ్‌లాండ్, సెక్స్ కుంభకోణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, జిరాపార్న్ స్రిచం, కో ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధం పెట్టుకొని, ఆ ఫోటోలు, వీడియోలతో వారిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే ఆరోపణలతో ఒక మహిళను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు 'మిస్ గోల్ఫ్'గా పిలుస్తున్న ఈ మహిళ తొమ్మిది మంది సన్యాసులతో శారీరక సంబంధం పెట్టుకున్నారని మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు.

గత మూడేళ్లలో, ఆమె బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ దాదాపు 102 కోట్ల రూపాయలు (385 మిలియన్ బాత్) వసూలు చేశారని పోలీసులు తెలిపారు.

ఆమె ఇంటిని సోదా చేసినప్పుడు, డబ్బు కోసం సన్యాసులను బెదిరించేందుకు ఉపయోగించిన 80 వేలకు పైగా ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు.

తాజాగా వెలుగుచూసిన ఈ సెక్స్ స్కాండల్ థాయ్‌లాండ్‌లోని ప్రతిష్టాత్మక బౌద్ధ సంస్థను కుదిపేస్తోంది. సన్యాసులు లైంగిక నేరాలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన ఆరోపణలు కూడా ఇటీవల కొన్నేళ్లలో వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
థాయ్‌లాండ్, సెక్స్ కుంభకోణం, పోలీసులు

ఫొటో సోర్స్, Thai News Pix

ఫొటో క్యాప్షన్, మిస్ గోల్ఫ్ ఫోన్‌లో 80000కు పైగా ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. వాటితో ఆమె సన్యాసులను బెదిరించారని వారు తెలిపారు.

కేసు ఎలా మొదలైంది?

జూన్ నెలలో బ్యాంకాక్‌లోని ఒక మఠాధిపతి (ఒక సీనియర్ సన్యాసి)ని మహిళ బ్లాక్ మెయిల్ చేయడంతో సన్యాసాన్ని విడిచిపెట్టారని తమ దృష్టికి వచ్చిందని, అప్పటి నుంచి దీనిపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు.

2024 మేలో 'మిస్ గోల్ఫ్' ఆ సన్యాసితో సంబంధం పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ సంబంధంతో ఒక బిడ్డను కన్నట్లు, తనను పెంచడానికి కోటి 84 లక్షల రూపాయలకు పైగా డిమాండ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఇతర సన్యాసులు కూడా 'మిస్ గోల్ఫ్‌'కు అదేవిధంగా డబ్బును బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇది ఆమె బ్లాక్‌మెయిల్ చేసే విధానమని పోలీసులు తెలిపారు.

డబ్బులన్నీ దాదాపుగా విత్‌డ్రా చేశారని, కొంత డబ్బుతో ఆన్‌లైన్ జూదమాడినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.

ఈ నెల ప్రారంభంలో మిస్ గోల్ఫ్ ఇంట్లో దర్యాప్తు అధికారులు సోదాలు చేసినప్పుడు, ఆమె ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై దోపిడీ, మనీలాండరింగ్, దొంగిలించిన వస్తువులను స్వీకరించడం వంటి అనేక అభియోగాలు నమోదు చేశారు.

"తప్పుడు ప్రవర్తన కలిగిన సన్యాసుల"పై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు హాట్‌లైన్‌(ఫిర్యాదుకు ఫోన్ నంబర్)ను కూడా ప్రారంభించారు.

సన్యాసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సన్యాసి నిబంధనలు సమీక్ష

ఈ స్కాండల్ కారణంగా థాయ్ బౌద్ధమత పాలక సంస్థ అయిన సంఘ సుప్రీం కౌన్సిల్, సన్యాసుల నిబంధనలను సమీక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

నియమావళిని ఉల్లంఘించే సన్యాసులకు జరిమానాలు, జైలుతో పాటు కఠిన శిక్షలపై ప్రభుత్వం కూడా ఒత్తిడి తెస్తోంది.

థాయ్‌లాండ్ రాజు వజిరాలాంగ్‌కార్న్ 81 మంది సన్యాసులకు ఉన్నత బిరుదులను ప్రదానం చేస్తూ జూన్‌లో జారీ చేసిన 'రాజ ఆజ్ఞ'ను ఆయన ఈ వారం రద్దు చేశారు.

ఇటీవలి దుష్ప్రవర్తన కేసులను రాజు ఉదహరించారు, ఇది 'బౌద్ధుల మనస్సులను చాలా బాధకు గురిచేసింది' అన్నారు.

థాయ్‌లాండ్‌లో 90 శాతానికి పైగా జనాభాను బౌద్ధులుగా గుర్తిస్తున్నారు, అందువల్లే సన్యాసులకు ఎంతో గౌరవం దక్కుతోంది.

ఇదే మొదటిది కాదు..

ఇటీవలి కాలంలో థాయ్‌లాండ్ బౌద్ధ సంస్థ కుంభకోణాలతో సతమతమవుతోంది. విలాసవంతమైన జీవనశైలి గడిపిన విరాపోల్ సుక్ఫోల్ అనే సన్యాసిపై 2017లో లైంగిక నేరాలు, మోసం, మనీలాండరింగ్ అభియోగాలు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచారు.

ఉత్తర ప్రావిన్సులోని ఫెట్చాబున్ ప్రావిన్స్‌లో ఉన్న మందిరంలోని నలుగురు సన్యాసులను 2022లో మాదకద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత, ఆలయంలో సన్యాసులు లేకుండా పోయారు.

థాయ్ సంఘ, సన్యాసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పాత పద్ధతులపై విమర్శలు

థాయ్ సంఘలో క్రమశిక్షణ, జవాబుదారీతనం వంటి సమస్యలపై సంవత్సరాలుగా విమర్శలు ఉన్నప్పటికీ, శతాబ్దాల నాటి ఈ సంస్థలో వాస్తవిక మార్పు పెద్దగా లేదని చాలామంది అంటున్నారు. కఠినమైన అధికార క్రమం(హైరార్కి) దీనికి ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.

"ఇది థాయ్ బ్యూరోక్రసీ వంటి అధికార వ్యవస్థ, ఇక్కడ సీనియర్ సన్యాసులు ఉన్నత స్థాయి అధికారులైతే, జూనియర్ సన్యాసులు వారి సబార్డినేట్‌లు" అని రెలీజియస్ స్కాలర్ సురఫోత్ తవీసక్ బీబీసీతో అన్నారు.

"వారు ఏదైనా అనుచిత విషయాన్ని చూసినప్పుడు, మాట్లాడటానికి ధైర్యం చేయరు. ఎందుకంటే, వారిని ఆలయం నుంచి వెళ్లగొట్టడం సులభం" అని అన్నారు.

పోలీసు, సంఘ కౌన్సిల్‌ల దర్యాప్తులను అవసరమైన సంస్కరణల ఆవిష్కరణకు కీలకమైన అడుగుగా కొందరు చూస్తున్నారు.

"సంఘంపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా సత్యాన్ని బహిర్గతం చేయడం ముఖ్యం" అని బ్యాంకాక్‌లోని థమ్మసత్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్ర పండితుడు ప్రకిరతి సతసుత్ అన్నారు.

సంస్థను కాపాడటానికి సుప్రీం సంఘ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)