బి.సరోజాదేవి : సొంత ఇంట్లోనే అవమానాలపాలైన ఈ నటి 'బాక్సాఫీస్ క్వీన్' గా ఎలా ఎదిగారు?

సరోజా దేవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో 200కి పైగా చిత్రాలలో నటించిన నటి సరోజా దేవి, బెంగళూరులో 2025 జులై 14న మరణించారు.
    • రచయిత, సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"భరతనాట్యం, శాస్త్రీయ గానం లేదా రంగస్థల నాటకంలో శిక్షణ తీసుకోలేదు. నటనలో మార్గనిర్దేశం చేసేవారు కూడా లేదు. అయినా దక్షిణాది చిత్ర పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకున్నారు సరోజాదేవి. దానికి రెండు ముఖ్యమైన కారణాలు కళ పట్ల అంకితభావం, అవిశ్రాంత కృషి. తమిళ సినిమా దిగ్గజాలు, ఎంజీఆర్, శివాజీ, జెమిని గౌరవించిన నటి ఆమె. తమిళ సినిమాలో ఆమె ఒకప్పుడు బాక్సాఫీస్ క్వీన్ కూడా"

దీనదయాళన్ రాసిన సరోజా దేవి జీవిత చరిత్రలోని వాక్యాలివి. నటి సావిత్రి జీవిత చరిత్రను రాసిన వ్యక్తి కూడా ఆయనే.

"సినిమా పరిశ్రమలో నా వేగవంతమైన ఎదుగుదలకు కారణం ఎంజీఆర్ అనే మూడు అక్షరాల మంత్రం" అని సరోజా దేవి తన ఆర్టికల్స్‌లో ఒకదానిలో రాశారు.

కానీ అంత పాపులర్ అయిన ఎంజీఆర్ సినిమాలు కూడా ఎక్కువ ధరలకు అమ్ముడుపోవడంలో సరోజా దేవిది కీలకపాత్ర అని దీనదయాళన్ పుస్తకంలో తెలిపారు.

'మన్నతి మన్నన్' సినిమా విడుదల సమయంలో పోస్టర్లపై సరోజా దేవి స్టిల్స్ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా రీల్స్‌ను తీసుకెళ్లడానికి నిరాకరించడం సరోజా దేవి ప్రాముఖ్యానికి కొలమానం అని దీనదయాళన్ చెప్పారు.

తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో 200కి పైగా చిత్రాలలో నటించిన నటి సరోజా దేవి, బెంగళూరులో 2025 జులై 14న మరణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సరోజా దేవి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సరోజా దేవి 1955లో తన 17 ఏళ్ల వయసులోనే కన్నడ చిత్రం మహాకవి కాళిదాస్ ద్వారా తెరంగేట్రం చేశారు.

కన్నడ, తెలుగు, తమిళం

కర్ణాటకకు చెందిన సరోజా దేవి 1955లో తన 17 సంవత్సరాల వయసులోనే కన్నడ చిత్రం మహాకవి కాళిదాస్ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1957లో పాండురంగ మహత్యం అనే తెలుగు చిత్రంలో నటించారు. ఆ తర్వాతే తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. తెలుగులో సరోజాదేవి ఆనాటి అగ్రనటులు ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి పలు చిత్రాలలో నటించారు.

తెలుగులో సరోజాదేవి మొదటి చిత్రం పాండురంగ మహత్మ్యం. ఇందులో ఎన్‌టీరామారావు కథనాయకుడు. అక్కినేని నాగేశ్వరరావుతో ఆమె మొదటి సినిమా పెళ్లి సందడి. తనకు, పెళ్లి కానుక, ఆత్మబలం సినిమాలు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో బి. సరోజ చెప్పారు. ముఖ్యంగా ఆత్మబలం సినిమాలో చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట తనకూ చాలా ఇష్టమన్నారు.

'బాక్సాఫీస్ క్వీన్'

సరోజాదేవిని తమిళ చిత్ర పరిశ్రమకు ఎవరు పరిచయం చేశారనే దానిపై చాలా గొందరగోళం ఉందని దీనదయాళన్ తెలిపారు. కానీ, శివాజీ నటించిన 'తంగమలై రగస్యం' చిత్రంలో సరోజా దేవి హీరోయిన్ జమునకు తంగమలై రహస్యాన్ని చెప్పే సన్నివేశం ఆమె తొలి సీన్ అని ఆయన అంటున్నారు.

కాగా, నడోడి మన్నన్ సినిమా సరోజా దేవికి తమిళనాడులో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎంజీఆర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో సరోజా దేవి ప్రేక్షకులను ఆకర్షించారు. ఆ సమయంలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన సినిమా అది. అప్పటి నుంచి ఆమెను 'బాక్సాఫీస్ క్వీన్' గా చాలామంది తమిళ చిత్ర విమర్శకులు అభివర్ణించారు.

సరోజా దేవి తొలి చిత్రం 'తంగమలై రగస్యం' 1957 జూన్ 29న విడుదలైంది. మూడేళ్ల తర్వాత అంటే 1960లో సరోజా దేవి ఒక అగ్ర తారగా వెలిగిపోయారని రచయిత దీనదయాళన్ తెలిపారు. అయితే, ఆమెకు కష్టపడి పనిచేయడం, వృత్తి పట్ల అంకితభావం ఉన్నప్పటికీ, సరోజా దేవి తల్లి రుద్రమ్మ మాత్రం డబ్బు విషయానికి వస్తే కఠినంగా ఉండేవారని చెప్పారాయన.

కర్ణాటక పోలీస్‌లో పనిచేసే, కఠినమైన కన్నడ కుటుంబం నుంచి వచ్చిన భైరప్ప కూతురు రుద్రమ్మ. తన కూతురుకు అడిగినంత పారితోషికం ఇవ్వకపోతే, మరో కంపెనీకి మారుస్తానని చెప్పేవారని దీనదయాళ్ తెలిపారు.

సరోజా దేవి గురించి నటుడు శివకుమార్ మాట్లాడుతూ "సాధారణంగా, సినిమా పరిశ్రమను విడిచిపెట్టిన చాలామంది నటులు వృద్ధాప్యంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. కానీ, 87 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె సంపదతో మంచి జీవితాన్ని గడిపారు" అని అన్నారు.

సరోజాదేవి, సినిమాలు

ఫొటో సోర్స్, UGC

కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే ముందు, సరోజా దేవి కుటుంబంతో పాటు, ప్రజలలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఒక జర్నల్‌లో అభిప్రాయాలు పంచుకున్నారు.

ఆ జర్నల్ ప్రకారం.. కుటుంబంలో అప్పటికే ముగ్గురు కూతుళ్లు పుట్టడంతో, తర్వాత కొడుకే పుట్టాలని ఆమె తాత అనేక దేవాలయాలు తిరిగారు. అయితే, తర్వాత రుద్రమ్మకు సరోజా దేవి నాలుగో కూతురిగా జన్మించారు. సరోజా దేవికి చిన్న వయసులోనే పక్షవాతం రావడంతో తల్లి రుద్రమ్మ గుళ్ల చుట్టూ తిరిగారు.

దీనికి ఆమె తాత రుద్రమ్మను తిడుతూ 'దీని వల్ల ఉపయోగం ఏమిటి?. ఆమె బతికినా, చనిపోయినా నష్టం లేదు. తనేం అబ్బాయి కాదు, దీనికోసం నువ్వెందుకు ఆకలితో అలమటిస్తున్నావు?' అనేవారు.

ఇప్పుడు ఆయనే నన్ను 'నా డార్లింగ్' అని పిలుస్తున్నారని ఆ జర్నల్‌లో తెలిపారు సరోజాదేవీ.

సరోజా దేవి

ఫొటో సోర్స్, UGC

తెలియకుండానే ఎంజీఆర్‌ను పలకరించి..

తమిళ చిత్ర పరిశ్రమకు టి.ఆర్. రాజకుమారిని 'కచ దేవయాని' చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు కె. సుబ్రమణ్యం, ఆ సినిమా కన్నడ వెర్షన్ కోసం సరోజా దేవిని కథానాయికగా ఎంచుకున్నారు.

సినిమా షూటింగ్‌లో భోజన విరామం వేళ జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి సరోజా దేవి జర్నల్‌లో పంచుకున్నారు.

"భోజన విరామం. పక్కనే షూటింగ్ చేస్తున్న మరో సినిమా హీరో అక్కడికి వచ్చారు. ఆయన ముఖంలో వెయ్యి సూర్యుల తేజస్సు ఉంది. అందరూ లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. నేను కూడా స్వాగతం చెప్పాను. ఆయన దర్శకుడితో తమిళంలో 'ఈ అమ్మాయి ఎవరు?' అని అడిగారు. తర్వాత, వెళ్లిపోతూ కన్నడలో 'చెన్నడియమ్మా?' (బాగున్నారా?), 'కాఫీ తాగుతారా?' అని అడిగారు. నేను తల అడ్డంగా ఊపాను. ఆయన వెళ్లిన తర్వాతే, ఆయన ఎవరు? అని అడిగాను. అందరూ ఆశ్చర్యపోయి, 'ఏమిటి, మీకు ఎంజీఆర్ తెలియదా?' అని అడిగారు. ఆ సమయంలో, ఆయన ఎవరు, ఆయన ఎంత ప్రభావవంతమైనవారో నాకు తెలియదు. తరువాత నాకు బాధగా అనిపించింది. కానీ, ఆ రోజు నాకు తెలియదు, నేను ఆయనతో మరిన్ని సినిమాల్లో నటించబోతున్నానని!" అని తెలిపారు సరోజాదేవి.

సరోజా దేవి, తెలుగు, తమిళ సినిమాలు

ఫొటో సోర్స్, UGC

మాలయాళంలో ఎందుకు నటించలేదు?

గత సంవత్సరం సరోజాదేవి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె నటించిన చిత్రాలలో తనకు ఇష్టమైనది ఇరువర్ ఉల్లం అని చెప్పారు. ఆ చిత్రానికి సంభాషణలు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాశారు. సినిమా చూసిన కరుణానిధి "మీరు చాలా బాగా నటించారు" అని ఆమెను ప్రశంసించారు.

సరోజా దేవి అనేక దక్షిణ భారత చిత్రాలలో నటించినప్పటికీ, ఒక్క మలయాళ చిత్రంలో కూడా నటించలేదు. దీనికి కారణాన్ని కూడా ఆమె వివరించినట్లు దీనదయాళన్ తెలిపారు.

"ఆ రోజుల్లో, మలయాళ చిత్రాలలో నటీమణులు ముండు (సాంప్రదాయ చుట్టు) మాత్రమే ధరించేవారు. మలయాళ సినిమాల్లో నటించడానికి కేరళ నుంచి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ, తను అలా నటించాలనుకోలేదని సరోజా దేవి చెప్పారు" అని దీనదయాళన్ రాశారు.

సరోజా దేవికి మల్లె పూలు, మామిడిపండ్లు, లిప్‌స్టిక్, తెల్ల చీరలు, నల్ల బొట్టు ఇష్టమైనవాటిల్లో కొన్ని అని దీనదయాళన్ చెప్పారు. ఆమెకు ఇష్టమైన దేవుడు హనుమంతుడు.

వన్స్ మోర్ సినిమా షూటింగ్ సమయంలో, శివాజీ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని తినడానికి ఆమె మొదట్లో సంకోచించారు. దీంతో సరోజాదేవికి శివాజీ గణేషన్ చెప్పిన విషయాన్ని ఆమె తర్వాత గుర్తుచేసుకున్నారు.

"సరోజా! మనకు అవసరమైన వారందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. పలయనన్నన్, సహస్రనామం, రాధా అన్నన్, ఎంజీఆర్ కూడా… అందరూ వెళ్లిపోయారు. ఇప్పుడు, మనలో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. నేను, జయలలిత, నువ్వు. ఎవరు ముందుగా వెళ్తారో తెలియదు. కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒకరికొకరు మద్దతుగా, ఓదార్పుగా ఉందాం" అని చెప్పారని ఆమె తెలిపారు.

శివాజీ గణేశన్ 2001 జూలై 21న 72 సంవత్సరాల వయసులో మరణించారు. జయలలిత 2016 డిసెంబర్ 5న 68 సంవత్సరాల వయసులో మరణించారు.

సరోజా దేవి 2025 జూలై 14న 87 సంవత్సరాల వయసులో మరణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)