కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో జంట ఆలింగనం క్లిప్ వైరల్.. సస్పెండ్ అయిన సీఈవో

- రచయిత, అనా ఫగే
- హోదా, బీబీసీ న్యూస్
కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో తమ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆలింగనం చేసుకుంటున్నట్లు కనిపిస్తోన్న క్లిప్ వైరల్ అయిన తర్వాత సీఈవోను సస్పెండ్ చేసినట్లు అమెరికా టెక్ కంపెనీ ఆస్ట్రానమర్ ప్రకటించింది.
బోస్టన్ కాన్సర్ట్‌లోని బిగ్ స్క్రీన్‌పై కనిపించిన ఆ దృశ్యంలో, ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా ఉన్నారు. ఇందులో ఒకరు ఆ కంపెనీ సీఈవోగా వార్తలొచ్చాయి.
వేలమందికి కనిపించేలా ఆ దృశ్యం స్క్రీన్‌పై ప్రదర్శితం కాగానే అది చూసిన వారిద్దరూ వెంటనే కెమెరా నుంచి తమ ముఖాలను దాచుకున్నారు.
ఆ తర్వాత సింగర్ చేసిన ఒక వ్యాఖ్యతో ఆస్ట్రానమర్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తోన్న వీరిద్దరి మధ్య అఫైర్ ఉందనే ఊహాగానాలు ఆన్‌లైన్‌లో వ్యాపించాయి.
ఈ నేపథ్యంలో సీఈవో ఆండీ బిరాన్‌ను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కంపెనీ పోస్ట్ చేసింది.

కచేరీలో మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ, వెంటనే కెమెరా నుంచి దాక్కోవడానికి ప్రయత్నించిన ఆ జంటకు సంబంధించిన వీడియో, కాన్సర్ట్ ముగిసిన తర్వాత బుధవారం రాత్రి వైరల్‌గా మారింది.
కెమెరా నుంచి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్న వారిని చూసిన తర్వాత, 'వారిద్దరి మధ్య అఫైర్ అయినా ఉండాలి, లేదా వారు ఎక్కువగా సిగ్గుపడుతుండొచ్చు' అని అక్కడున్న ప్రేక్షకులతో లీడ్ సింగర్ క్రిస్ మార్టిన్ అన్నారు.
టిక్‌టాక్‌లో ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ విపరీతంగా షేర్ కావడంతో పాటు అనేక మీమ్స్ పుట్టుకొచ్చాయి. టీవీ కార్యక్రమాల్లో కూడా ఈ వీడియోను సరదాగా వాడుకున్నారు.
ఇంటర్నెట్‌లో ఇది వైరల్‌గా మారిన రెండు రోజుల తర్వాత ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామంటూ ఆస్ట్రానమర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ వీడియో గురించి నేరుగా ప్రస్తావించలేదు.

''ఆస్ట్రానమర్ సంస్థ తమ విలువలకు, సంస్కృతికి కట్టుబడి ఉంది. మా లీడర్ల నుంచి ప్రవర్తన, జవాబుదారీతనం పరంగా ఉన్నత ప్రమాణాలను మేం ఆశిస్తాం. ఈ ఘటనపై ఒక అధికారిక దర్యాప్తును డైరెక్టర్ల బోర్డు ప్రారంభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అదనపు వివరాలను మీతో పంచుకుంటాం'' అని ఆస్ట్రానమర్ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ డెజోయ్‌ని తాత్కాలిక సీఈవోగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి ఆస్ట్రానమర్ సంస్థ సీఈవో ఆండీ బిరాన్ అని, 2023 జులై నుంచి కంపెనీలో పనిచేస్తున్నట్లు అనేక రిపోర్టుల్లో పేర్కొన్నారు. బిరాన్ స్వయంగా ఆ వీడియోలో ఉన్నది తానేనని చెప్పలేదు. వీడియోలో కనిపించిన మహిళ క్రిస్టిన్ కబోట్, కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అని, ఆమె 2024 నవంబర్ నుంచి ఆస్ట్రానమర్ కంపెనీలో పనిచేస్తున్నారని ఆన్‌లైన్‌లో అంటున్నారు.
ఆమె కూడా తన గుర్తింపును ధ్రువీకరించలేదు.
వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తుల గుర్తింపును బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేకపోయింది.
గురువారం బిరాన్ వ్యాఖ్యలుగా పేర్కొంటూ 'ఫేక్ స్టేట్‌మెంట్లు' వైరల్ అయ్యాయి.
బిరాన్ వ్యక్తిగతంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని, దీనిపై వచ్చిన వార్తలు సరైనవి కావని ఆస్ట్రానమర్ తన ప్రకటనలో పేర్కొంది. ఆ వీడియాలో తమ కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులు లేరని స్పష్టం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














