బాబర్, అక్బర్, ఔరంగజేబు గురించి పాఠ్యాంశాల్లో మార్పులపై చెలరేగిన వివాదమేంటి? చరిత్రను తారుమారు చేశారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ - ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి కొత్త సోషల్ సైన్స్ పుస్తకంలో బాబర్‌ను అనాగరికమైన, హింసతో గెలిచిన, విధ్వంసకుడిగా అభివర్ణించారు.
అక్బర్ పాలనను క్రూరత్వం, సామరస్యాల కలయికగా పేర్కొనగా.. ఔరంగజేబును దేవాలయాలు, గురుద్వారాలను కూల్చేసిన వ్యక్తిగా పేర్కొన్నారు.
చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలను వివరించడం చాలా ముఖ్యమని ఎన్‌సీఈఆర్‌టీ చెబుతోంది. దానితో పాటు, గతంలో జరిగిన దానికి ఎవరినీ బాధ్యులను చేయలేమని కూడా పుస్తకంలోని ఒక చాప్టర్‌లో పేర్కొంది.
ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకం 'ఎక్స్‌ఫ్లోరింగ్ సొసైటీ : ఇండియన్ అండ్ బియాండ్'లో పార్ట్ - 1 ఈ వారం విడుదలైంది. దిల్లీ సుల్తానులు, మొఘలులను విద్యార్థులకు పరిచయం చేస్తూ.. ఎన్‌సీఈఆర్‌టీ కొత్తగా విడుదల చేస్తున్న పుస్తకాల్లో ఇదే మొదటిది.
ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పుస్తకంలో 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకున్న భారతీయ చరిత్రను అందిస్తున్నారు. ఈ పుస్తకంలో సుల్తానుల పాలనను దేవాలయాలను దోచుకున్న, ధ్వంసం చేసిన కాలంగా పేర్కొన్నారు. మునుపటి పుస్తకాల్లో సుల్తానుల కాలం గురించి ఇలాంటి ప్రస్తావన లేదు.

ఇంగ్లిష్ వార్తాపత్రిక ది హిందూ కథనం ప్రకారం.. ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన కొత్త పుస్తకంలో చిత్తోర్ కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు అక్బర్ వయసు 25 ఏళ్లుగా పేర్కొన్నారు. ఆ రాజ్యంలోని 30 వేల మంది పౌరులను ఊచకోత కోయాలని.. పిల్లలను, మహిళలను బానిసలుగా చేయాలని అక్బర్ ఆదేశించినట్లు రాశారు.
'' మేం అవిశ్వాసులకు (ఇస్లాం కానివారు) చెందిన చాలా కోటలను, పట్టణాలను స్వాధీనం చేసుకున్నాం. అక్కడ ఇస్లాంను స్థాపించాం. రక్తదాహంతో ఉన్న కత్తులతో వారి మనస్సుల్లోంచి అవిశ్వాస ఆనవాళ్లను తీసేశాం. అక్కడున్న ఆలయాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశాం'' అని అక్బర్ అన్నట్లు ఈ పుస్తకంలో రాశారు.
ఆ తర్వాతి కాలంలో అక్బర్ శాంతి, సద్భావన గురించి మాట్లాడటం ప్రారంభించారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
హిందూ కథనం ప్రకారం.. ''విద్యాలయాలు, దేవాలయాలను కూల్చేయాలని ఔరంగజేబు ఆదేశించారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. బనారస్‌తో పాటు జైన మందిరాలను, మథుర, సోమనాథ్, సిక్కు గురుద్వారాలనూ కూల్చేసినట్లు ఈ పుస్తకంలో ఉంది. పార్శీలు, సూఫీలపై మొఘలులు దౌర్జన్యాలకు పాల్పడినట్లు కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.''

ఫొటో సోర్స్, @ncert
చరిత్రను వక్రీకరిస్తున్నారా?
ఎన్‌సీఈఆర్‌టీలో ఈ మార్పుపై చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వం కావాలనే చరిత్రను తప్పుగా చూపుతోందని అంటున్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యవస్థాపక సభ్యుడు, ప్రొఫెసర్ మొహమ్మద్ సులేమాన్ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ, ''ప్రస్తుత అధికార సంస్థలు, సిద్ధాంతాలు చరిత్రను వక్రీకరిస్తున్నాయి. చరిత్రను వాస్తవాధారంగా తీసుకున్నప్పుడే ఏ అభివృద్ధి చెందిన సమాజమైనా ముందుకెళ్తుంది. కానీ, మన ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోంది. ఇది దేశానికి ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చదు. అంధ భక్తులను ఇది తప్పుదోవ పట్టించగలదు. కానీ, ప్రపంచంలో ఎక్కడైనా చరిత్ర చదివేప్పుడు, ప్రజలు నిజాలను మాత్రమే ఇష్టపడతారు. తమ ఆత్మ సంతృప్తి కోసం వారు ఏమైనా చేస్తారు'' అని అన్నారు.
ఈ వివాదంపై ఎన్‌సీఈఆర్‌టీ కూడా స్పందించింది.
'' 8వ తరగతి కొత్త సోషల్ సైన్స్ పుస్తకం 'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ, ఇండియా అండ్ బియాండ్' ప్రస్తుతం అందుబాటులో ఉంది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య 2023కు చెందిన నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్)ను అనుసరించి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం'' అని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది.
''ఈ పుస్తకం 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య వరకున్న భారతీయ చరిత్రను అందిస్తుంది. ఈ పుస్తకంలో పాఠ్యాంశాలు పునరావృత్తం కాకుండా విమర్శనాత్మక ఆలోచనతో తీసుకొచ్చాం. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా, వివరాలను అత్యంత సమతుల్యంతో అందించాం. 'ఏ కామెంట్ ఆన్ ది డార్క్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ' (చరిత్రలో చీకటి కోణంపై వ్యాఖ్యానం) అనే పేరుతో ఒక ప్రత్యేక చాప్టర్‌ను అందిస్తున్నాం. ఈ పుస్తకం ద్వారా యువ విద్యావంతులు గతంతో పాటు ఆధునిక భారత నిర్మాణాన్ని అర్థం చేసుకుంటారు'' అని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది.
'' ఈ పుస్తకంలోని అన్ని వాస్తవాలను విశ్వసనీయమైన విద్యా వనరుల ఆధారంగా అందించాం. యువ తరాల్లో ఎలాంటి సందేహం, అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు.. పేజీ నెంబర్ 20లో డార్క్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ అనే పేరుతో ఒక పాఠ్యాంశాన్ని అందించాం'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
''భారతీయ చరిత్ర రసవత్తరంగా మార్చలేం. ప్రతీది మంచే జరిగిందని మేం చూపించలేం. చరిత్రలో చాలా మంచి విషయాలు, చెడు విషయాలు ఉన్నాయి. ప్రజలు హింసకు గురయ్యారు. అందుకే, చరిత్రలో ఈ చాప్టర్‌ను చేర్చాం'' అని ఎన్‌సీఈఆర్‌టీ సోషల్ సైన్స్ కరిక్యులమ్ ఏరియా గ్రూప్ హెడ్ మైకేల్ డేనినో ది హిందూ వార్తా పత్రికకు చెప్పారు.
''అలాగే, గతంలో ఏం జరిగినా దానికి ఇప్పుడు ఎవరూ బాధ్యులు కారు అనే డిస్‌క్లైమర్‌ను అందించాం. మొఘల్ పాలకుల వ్యక్తిత్వంలోని సంక్లిష్టతలోకి వెళ్తే తప్ప దాన్ని మీరు అర్థం చేసుకోలేరు. యువకుడిగా ఉన్నప్పుడు తాను చాలా క్రూరంగా ప్రవర్తించినట్లు అక్బరే ఒప్పుకున్నారు. అక్బర్, ఔరంగజేబును మేం తగ్గించాలనుకోవడంలేదు. అయితే, వారికి కూడా పరిమితులు ఉన్నాయని, దారుణాలకు పాల్పడ్డారని మేం చెబుతున్నాం'' అని తెలిపారు.
చరిత్రను ఎలా చూడాలి?
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని ఈ మార్పులను ఎలా చూడాలనే విషయంపై చరిత్రకారుడు సయద్ ఇర్ఫాన్ హబీబ్‌ను బీబీసీ ప్రశ్నించింది.
'' వాస్తవాలను ఆధారంగా చేసుకుని చరిత్రను రాశారు. మీ ఊహాగానాలకు అనుగుణంగా చరిత్రను తిరిగి రాయాలని ప్రయత్నించినప్పుడు, అది చరిత్ర అవ్వదు. అంతకుముందు నేర్చుకున్న విషయాలతో మీరు ఏకీభవించకపోవచ్చు. కానీ, అవి వాస్తవాలకు అనుగుణంగా రాసినవి. వాస్తవాల తాత్పర్యంతో మీరు విభేదించవచ్చు. కానీ, నమ్మకాల ఆధారంగా చరిత్రను రాయాలనుకుంటే మాత్రం, అది చరిత్ర కాదు'' అని అన్నారు.
మధ్యయుగ చరిత్ర విషయంలో భారత రాజకీయాల్లో వివాదం నెలకొనడం ఇదే తొలిసారి కాదు.
అంతకుముందు మహారాణా ప్రతాప్, అక్బర్ విషయంలో కూడా వివాదం చెలరేగింది.
హల్దీఘాటీ యుద్ధంలో అక్బర్ చేతిలో మహారాణా ప్రతాప్ ఓడిపోలేదని యూనివర్సిటీ సిలబస్‌లో రాయాలని బీజేపీ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనను 2019లో రాజస్తాన్ యూనివర్సిటీ అంగీకరించింది.
'' హల్దీఘాటీ యుద్ధంలో మహారాణా ప్రతాప్ గెలిచారు, అక్బర్ ఓడిపోయారని వారు చెబుతున్నారు. కానీ, వారు ఎలాంటి వాస్తవాధారాలు లేకుండా చెబుతున్నారు. హల్దీఘాటీలో మహారాణా ప్రతాప్, మాన్ సింగ్ యుద్ధం చేశారు. ఇద్దరు రాజపుత్రుల మధ్య జరిగిన యుద్ధం ఇది. ఒకరు అక్బర్ కోసం పోరాడితే, మరొకరు అక్బర్‌పై పోరాడారు. మహారాణా ప్రతాప్ సైన్యానికి చెందిన కమాండర్ హకీమ్ ఖాన్ సూరీ ముస్లిం. ఇది మతానికి చెందిన యుద్ధం కాదు. కానీ, నేడు మతం ఆధారంగా ఈ మధ్యయుగ భారత చరిత్రను చూస్తున్నారు. ఆధునిక కాలంలో మీరు మతాన్ని వాడుతున్నారు'' అని సయద్ ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత చరిత్రలో మధ్యయుగాన్ని చీకటి కోణంగా చూడాలా?
''మీరు చీకటి అధ్యాయంగా చెబుతున్న చరిత్రను రామచరిత మానస్ రాశారు. ఈ కాలంలో తులసీ దాస్, కబీర్, అబ్దుల్ రహీం ఖాన్-ఈ-ఖానా, మాలిక్ ముహమ్మద్ జయసి వంటి వ్యక్తులు గొప్ప రచనలు చేశారు. ఇది చరిత్రలో చీకటి అధ్యాయమా?'' అని సయద్ ఇర్ఫాన్ హబీబ్ ప్రశ్నించారు.
''బాబర్ చరిత్ర కేవలం నాలుగేళ్లు మాత్రమే. మధ్యయుగ కాలంలో ఆయన పాలకుడు. ఆ సమయంలో రాజ్యాంగంతో కాకుండా, కత్తితో రాజ్యాన్ని నడిపేవారు. ఆ సమయంలో యూరప్‌లో కూడా అదే జరిగింది. కత్తితోనే నిర్ణయాలు తీసుకునే వారు. 400 ఏళ్ల కాలం నాటి విషయంలో మీరు ఏదైనా చెప్పొచ్చు'' అని అన్నారు.
''అలాంటి పుస్తకాలను మీరు తర్వాత తరాలకు అందిస్తున్నారు. దీనిలో చాలా లోపాలు ఉన్నాయి. గతంలో జరిగిన దానికి నేడు ఎవరూ బాధ్యులు కారని డిస్‌క్లైమర్ ఇస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పౌరులను కాకుండా.. తన ఫాలోవర్స్‌ను సిద్ధం చేయాలనుకుంటోంది'' అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














