భారత పాస్‌పోర్ట్ ఉంటే ఈ దేశాలకు వీసా అవసరం లేదు

- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ నిరుటి కంటే మెరుగైన స్థానంలో నిలిచింది.
ఈ ర్యాంకింగ్స్‌లో నిరుడు భారత్ 80వ స్థానంలో నిలవగా.. 2025కు గానూ 77వ ర్యాంకుకు చేరుకుంది.
వీసా లేకుండా పాస్‌పోర్టును ఉపయోగించి ఎన్ని దేశాలకు ప్రయాణించవచ్చనే సంఖ్య ఆధారంగా హెన్లీ ఈ ర్యాంకులను కేటాయిస్తుంది.
భారత పాస్‌పోర్టును ఉపయోగించి వీసా లేకుండా 59 దేశాలకు ప్రయాణం చేయవచ్చని ఈ రిపోర్ట్‌లో పేర్కొంది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా హెన్లీ ఈ ఇండెక్స్‌ను తయారు చేస్తుంది.
ర్యాంకుల కేటాయింపు ఎలా?
హెన్లీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ అనేది 227 ట్రావెల్ డెస్టినేషన్లకు ప్రపంచంలోని 199 వేర్వేరు పాస్‌పోర్టుల వీసా ఫ్రీ యాక్సెస్‌ను పోల్చి చూస్తుంది.
వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా విశ్లేషిస్తారు.
వీసా ఆన్ అరైవల్ (వీఓఏ), లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ (ఈటీఏ) విధానాలకు పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ జాబితాలో 193 దేశాలకు వీసా రహిత(వీఓఏ, ఈటీఏలతో కలిపి) ప్రయాణానికి వీలుకల్పించే సింగపూర్ పాస్‌పోర్ట్ నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది.
190 దేశాలకు అనుమతించే జపాన్, దక్షిణ కొరియా దేశాల పాస్‌పోర్టులు ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.
ఈ జాబితాలో 77వ స్థానంలో నిలిచిన భారత పాస్‌పోర్టుతో 59 దేశాలకు వీసా లేకుండా కానీ, వీసా ఆన్ అరైవల్ విధానంలో కానీ ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ విధానంలో కానీ ప్రయాణించవచ్చు. భారత పాస్‌పోర్ట్ ఉంటే ముందస్తుగా వీసా పొందకుండానే ఈ దేశాలకు వెళ్లొచ్చు.
ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకుండా 28 దేశాలు, వీసా ఆన్ అరైవల్ 28 దేశాలు, ఈటీఏతో 3 దేశాలు వెళ్లొచ్చు.

వీసా లేకుండా ఏయే దేశాలకు వెళ్లొచ్చంటే..
భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకపోయినప్పటికీ అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, డొమినికా, ఫిజీ, గ్రెనడా, హైతీ, ఇరాన్, జమైకా, కిరిబాటీ వెళ్లొచ్చు.
ఇవే కాకుండా మకావు, మడగాస్కర్, మలేసియా, మారిషస్, మైక్రోనేసియా, మాంటెసెరాట్, నేపాల్, న్యూయీ, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనెడిన్స్ , థాయిలాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, కజక్‌స్తాన్, వనౌతు దేశాలు కూడా భారత పౌరులకు వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశం కల్పిస్తాయి.

వీసా ఆన్ అరైవల్
భారత పాస్‌పోర్టు ఉంటే బొలీవియా, బురుండీ, కాంబోడియా, కామెరో ఐలాండ్స్, కేప్ వెర్డి ఐలాండ్స్, జిబోతి, ఇథియోపియా, గినియా బిసావు, ఇండోనేసియా, జోర్డాన్, లావోస్, మాల్దీవులు ‘వీసా ఆన్ అరైవల్’ విధానంలో వెళ్లొచ్చు.
ఇవి కాకుండా మార్షల్ ఐలాండ్స్, మంగోలియా, మొజాంబిక్, మియన్మార్, నమీబియా, పలావ్ ఐలాండ్స్, ఖతర్, సమోవా, సియెరా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజేనియా, తిమోర్ లెస్తే, తువాలు, జింబాబ్వే దేశాలు అక్కడ దిగిన తర్వాత వీసాలు మంజూరు చేస్తున్నాయి.
ఈటీఏ
కెన్యా, సీషెల్స్, సెయింట్ కీట్స్ అండ్ నెవిస్ దేశాలు ఈటీఏకు అనుమతిస్తున్నాయి.
అంటే ఈ దేశాల్లోకి ప్రవేశించడానికి వీసా అక్కర్లేదు.
కానీ, ఇక్కడికి వెళ్లడానికి ముందే మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ ప్రక్రియకు అప్లై చేయాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














