‘ఆసుపత్రిలో రోగులను ఊచకోత కోశారు.. వైకల్యంతో ఉన్న పిల్లాడి తలపై కాల్చారు’- రక్తంతో నిండిన సువైదా హాస్పిటల్‌కు వెళ్లిన బీబీసీకి ఏం తెలిసిందంటే

ఫొటో సోర్స్, BBC / Jon Donnison
- రచయిత, జాన్ డానీసన్
- హోదా, బీబీసీ న్యూస్
సిరియాలో వారం కిందట మత ఘర్షణల సమయంలో ప్రభుత్వ బలగాలు ఒక ఆసుపత్రిలో ఊచకోతకు పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి.
సువైదా నగరంలోని నేషనల్ హాస్పిటల్‌ను బీబీసీ సందర్శించింది. ఆసుపత్రి వార్డుల్లోనే రోగులను చంపేశారని అక్కడి సిబ్బంది చెప్పారు.
నేను అక్కడికి వెళ్లగానే మొదట ఆ దుర్వాసన తట్టుకోలేకపోయాను.
ఆసుపత్రిలోని కార్ పార్కింగ్ వద్ద, తెల్లటి ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టిన డజన్ల కొద్ది కుళ్లిపోతున్న శవాలు నేలపై కనిపించాయి.
(హెచ్చరిక: ఈ కథనంలో హింసాత్మక వివరణలు ఉన్నాయి)

రక్తం మడుగులు, దుర్గంధం..
వాటిలోని కొన్ని మృతదేహాల శరీర భాగాలు ఉబ్బిపోయి, దారుణమైన స్థితిలో ఉన్నాయి. అవన్నీ అక్కడ చనిపోయినవారి మృతదేహాలే.
మేం నడుస్తున్న ప్రదేశం అంతా రక్తంతో జారుడుగా మారింది. మండుతున్న ఎండలో, అక్కడ దుర్గంధం విపరీతంగా వస్తోంది.
''ఇది ఊచకోత'' అని ఆ ఆసుపత్రిలోని న్యూరోసర్జన్ డాక్టర్ విసమ్ మసూద్ నాతో అన్నారు.
''శాంతిని కోరుకున్నామని చెబుతూ వచ్చిన సైనికులు, చాలామంది రోగులను కాల్చి చంపారు. వాళ్లు చంపిన వారిలో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు'' అని ఆయన తెలిపారు.
ప్రభుత్వం చేసిన దాడి (రైడ్) తర్వాతి పరిణామాలు అంటూ ఈ వారం మొదట్లో డాక్టర్ మసూద్ నాకు ఒక వీడియో పంపించారు.
ఆ వీడియోలో ఒక మహిళ, ఆసుపత్రి అంతా తిరుగుతూ అక్కడి పరిస్థితిని చూపిస్తున్నారు. వార్డుల్లోని నేలపై డజన్ల కొద్ది రోగుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వారిపైన రక్తసిక్తమైన బెడ్‌షీట్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, BBC / Jon Donnison
అందరిదీ అదే మాట..
అక్కడి వైద్యులు, నర్సులు, వలంటీర్లు అంతా ఇదే మాట చెబుతున్నారు.
గత బుధవారం.. డ్రూజ్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకొని ఆసుపత్రికి వచ్చిన సిరియా ప్రభుత్వ బలగాలు ఈ హత్యలు చేశాయని వారు అన్నారు.
''వాళ్లు చేసిన నేరం ఏంటి? ఒక ప్రజాస్వామ్య దేశంలో మైనారిటీలుగా ఉండటమేనా'' అని ఆసుపత్రిలో వలంటీర్‌గా పని చేసే కినెస్ అబు మోతాబ్, బాధితుల తరఫున మాట్లాడారు.
ఆసుపత్రి బయట మాకు కలిసిన స్థానిక ఇంగ్లిష్ టీచర్ ఒసామా మలక్ మాట్లాడుతూ.. ''వాళ్లు రాక్షసులు, క్రిమినల్స్. ఇక వాళ్లను మేం నమ్మలేం. శారీరక వైకల్యంతో బాధపడుతున్న 8 ఏళ్ల ఒక పిల్లాడిని వాళ్లు తలపై కాల్చి చంపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఆసుపత్రులను రక్షించాలి. కానీ, వాళ్లు ఆసుపత్రులకు వచ్చి దాడులు చేశారు. ఆసుపత్రిలోకి వచ్చి అందరినీ కాల్చడం మొదలుపెట్టారు. బెడ్‌లపై నిద్రిస్తున్న రోగులను కాల్చేశారు'' అని చెప్పారు.
ఈ సంఘర్షణలోని అన్ని పక్షాలు, అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
పౌరులను చంపారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హత్యలు చేశారని సిరియా ఆర్మీతో పాటు డ్రూజ్, బెడ్విన్ ఫైటర్లపై ఆరోపణలు వచ్చాయి.
ఆసుపత్రిలో ఏం జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఆసుపత్రిలో 300 మందికి పైగా చంపేశారని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సంఖ్యను అధికారికంగా ధ్రువీకరించలేదు.
డ్రూజ్ ప్రజలు ఎక్కువగా నివసించే సువైదా నగరంలో మిలిటరీ దుస్తులు ధరించిన వ్యక్తులు 'షాకింగ్ ఉల్లంఘనల'కు పాల్పడుతున్నట్లుగా వచ్చిన కథనాల గురించి తమకు తెలుసునని మంగళవారం రాత్రి సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అకృత్యాలకు సంబంధించి అన్ని పక్షాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని బీబీసీతో సిరియా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ మినిస్టర్ రీడ్ రయీద్ సలేహ్ చెప్పారు.
ప్రస్తుతం సువైదా నగరం, ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉంది. నగరంలోకి రాకపోకలపై పరిమితులు విధించారు.
నగరంలోకి వెళ్లేందుకు మేం చాలా చెక్ పాయింట్లను దాటాల్సి వచ్చింది. లోపల కాలిపోయిన దుకాణాలు, భవనాలు, ట్యాంకుల కింద నలిగిపోయిన కార్లు కనిపించాయి.
సువైదా నగరంలో డ్రూజ్, బెడ్విన్ ఫైటర్ల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. ఈ సమయంలోనే జోక్యం చేసుకున్న సిరియా ప్రభుత్వం, కాల్పుల విరమణను అమలు చేసేందుకు ప్రయత్నించింది.

ఆసుపత్రిలో తన బంధువుతో కలిసి బెంచ్ మీద కూర్చొన్న 8 ఏళ్ల హలా అల్ ఖాతీబ్ మాకు కనిపించారు.
హలా ముఖం రక్తసిక్తంగా ఉంది. బ్యాండేజీ కట్టి ఉంది. ఆమె ఒక కన్ను కోల్పోయినట్లుగా కనిపించారు.
ఇంట్లోని ఒక అల్మారాలో దాక్కున్న తనపై గన్‌మెన్ కాల్పులు జరిపారని, తన తలపై కాల్చారని ఆమె చెప్పారు.
ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయిన విషయం ఇంకా హలాకు తెలియదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














