పిండి జల్లెడను చూసి ఆ అమ్మాయి చేసిన పని ఆమెను జపాన్ దాకా తీసుకువెళ్లింది

- రచయిత, నీతూ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టార్పాలిన్‌తో కప్పిన పూరిగుడిసెలో పెరిగిన ఆ బాలిక ఇప్పుడు 'సైంటిఫిక్' గుర్తింపు సాధించారు.
17 ఏళ్ల పూజ పాల్ ఇటీవలే జపాన్ నుంచి తిరిగొచ్చారు. ఆమెది ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం. గడ్డితో నేసి వర్షానికి కారకుండా దానిపై టార్పాలిన్ కప్పిన ఓ చిన్న గుడిసె పూజ నివాసం.
ఆమె తాను రూపొందించిన 'సైంటిఫిక్ మోడల్'తో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి పేటెంట్ కూడా పొందుతున్నారు.
ఇప్పుడు పూజ ఇంటి ముందు నుంచి వెళ్లే ప్రతి ఒక్కరి కళ్లూ అక్కడ ఆగుతున్నాయి.
పూజ చాలా తక్కువ సౌకర్యాల మధ్య జీవిస్తున్నారు.
నాలుగేళ్ల కిందట ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలో... ధూళి రహిత నూర్పిడి యంత్రం తయారీ ఆలోచన చేశారు.
ఆ తర్వాత అనేక మార్పులు చేసి ఆమె రూపొందించిన మోడల్ 2023లో జాతీయ స్థాయి 'ఇన్‌స్పైర్' అవార్డుకు ఎంపికైంది. దేశవ్యాప్తంగా విజేతలైన 60 మందిలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపికయింది పూజ ఒక్కరే.
సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆ 60 మంది విజేతలను జపాన్ పర్యటనకు పంపారు.
''నేను జపాన్ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి, మా ఇంటి ముందునుంచి ఎవరు వెళ్లినా వారు కచ్చితంగా ఇటు వైపు చూస్తున్నారు. ఈ ఇంటి నుంచే ఒక అమ్మాయి విదేశాలకు వెళ్లి తిరిగొచ్చింది '' అని చెప్పుకుంటున్నారని పూజ వివరించింది.
పూజ ఇంట్లో ఏడుగురు ఉంటున్నారు. వారికి ప్రభుత్వ నివాసం లేదు. మరుగుదొడ్డి లేదు. ఒక మూలన కూర్చొని చదువుకుంటారు. మరో మూల స్టవ్ ఉంటుంది. కానీ అంతర్జాతీయ స్థాయి విజయం ఈ ఇంటిలోనే పుట్టింది.


వెన్నంటి నిలిచిన గురువు
పూజ తండ్రి పుట్టిలాల్ దినసరి కూలీ. తల్లి స్థానిక ప్రాథమిక పాఠశాలలో వంటమనిషి. పుట్టిలాల్ దంపతులకు ఐదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. వారిలో రెండో సంతానం పూజ. ప్రస్తుతం ఆమె జగదీశ్‌చంద్ర ఫతేరాయ్ కాలేజీలో 12వ తరగతి చదువుతోంది.
అగేరా గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నప్పుడు శాస్త్రీయ ఆలోచనల దిశగా పూజ తొలి అడుగు పడింది. ఆ పాఠశాలకు సమీపంలో నూర్పిడి యంత్రం పనిచేస్తున్నప్పుడు ధూళి ఎగిరి కిటికీలో నుంచి తరగతి గదిలోకి వచ్చేది. దీంతో శ్వాస తీసుకోవడానికి, చదువుకోవడానికి పిల్లలు ఇబ్బందిపడేవారు.
''ఈ విషయం రాజీవ్ సర్ (రాజీవ్ శ్రీవాస్తవ)కి చెప్పాను. ఈ ధూళి ఎలా ఆపగలమని అడిగాను. కొద్దిరోజుల తర్వాత, ఇంటి దగ్గర మా అమ్మ పిండి జల్లెడ పట్టడం చూశాను. పిండి జల్లెడను ఉపయోగించి ఈ ధూళికి అడ్డుకట్ట వేయవచ్చన్న ఆలోచన నాకు వచ్చింది'' అని పూజ చెప్పారు.
''రాజీవ్ సర్ సాయంతో తొలుత చార్ట్‌పై ఓ మోడల్ స్కెచ్ వేశా. పేపర్, కర్ర ఉపయోగించి ఓ మోడల్ రూపొందించాం. కానీ అది సరిగా రాలేదు. తర్వాత వెల్డింగ్ మెషిన్ ఉపయోగించి తుది మోడల్‌ను తయారుచేశాం'' అని ఆమె వివరించింది.
ఈ మోడల్ పేరు 'చాఫ్ - డస్ట్ సపరేటర్...
నూర్పిడి యంత్రం నుంచి వెలువడే ధూళి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఈ ధూళిని అరికట్టడానికి పూజ రూపొందించిన 'చాఫ్-డస్ట్ సపరేటర్' ఉపయోగపడుతుంది.
ఇది రైతులకే కాదు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలకు, మహిళలకు ఇది ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది.

జపాన్ ఎలా వెళ్లారంటే...
''ఇన్‌స్పైర్ అవార్డు మంచి పథకం. సైన్స్‌లో పిల్లల ఆసక్తిని, ఆవిష్కరణ దిశగా వారి సామర్థ్యాన్ని పరిశీలించవచ్చు'' అని ఉపాధ్యాయుడు రాజీవ్ శ్రీవాస్తవ బీబీసీకి చెప్పారు. ఈ పథకం 2006లో ప్రారంభమైంది. పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనేది లక్ష్యం. దేశవ్యాప్తంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల సంఖ్య 2023 సంవత్సరంలో ఏడు లక్షలకు మించిపోయింది. వారిలో లక్ష మంది రూ.10 వేల ప్రోత్సాహానికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి ప్రదర్శనకు 441 మోడల్స్ ఎంపికయ్యాయి. వాటిలో టాప్ 60 ప్రాజెక్టులకు సంబంధించిన వారికి జపాన్‌లో నిర్వహించే 'సకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం'లో పాల్గొనే అవకాశం ఏటా కల్పిస్తారు.
''గతంలో, విమానంలో ప్రయాణం గురించి వింటేనే చాలా ఉత్సాహంగా అనిపించేది. అదంతా ఎలా జరుగుతుందోనని రాత్రిపూట కలలు కనేదాన్ని. బారాబంకీ వెళ్లడం కూడా దూరం అనిపించేది. కానీ ఈ మోడల్ నన్ను లక్‌నవూ, దిల్లీ, తర్వాత జపాన్ తీసుకెళ్లింది'' అని పూజ చెప్పింది.
పూజ సాధించిన విజయం చూసి తల్లిదండ్రులు ఉప్పొంగిపోతున్నారు.
‘‘మా పరిస్థితి చూసి మా పిల్లలను పొలానికి పంపమని జనాలు చెప్పేవారు. మేం రొట్టె, ఉప్పు తినయినా బతుకుతాంగానీ మా పిల్లలతో పనులు చేయించబోమని మేం బదులిచ్చేవాళ్లం. పూజ జపాన్ వెళ్లి వచ్చిన తర్వాత అందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మా పెద్దమ్మాయి బీకాం చదువుతోంది. మా పిల్లలందరూ సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తారు’’ అని తల్లి సునీల చెప్పారు.
‘‘కూలీగా పనిచేస్తూ మీ అమ్మాయిని జపాన్ పంపావు అని జనం అంటున్నప్పుడు నాకు గర్వంగా అనిపిస్తోంది. నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనిపిస్తోంది. మా అమ్మాయి జపాన్ వెళ్లిన తర్వాత నాకు చాలా పేరు. నాకింతకన్నా ఏం కావాలి..నా కూతురు నాకు అన్నీ ఇచ్చింది’’ అని తండ్రి పుట్టిలాల్ సంతోషంతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














