ఎంతమంది భార్యలున్నా తన కంటే పెద్దదైన ‘బోర్తే’ అంటే చెంఘిజ్ ఖాన్‌కు ఎందుకంత ఇష్టం?

 Genghis Khan

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, జర్నలిస్ట్ అండ్ రీసెర్చర్

చెంఘిజ్‌ఖాన్‌తో బోర్తేకు పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె అపహరణకు గురయ్యారు.

బోర్జీగన్ తెగ అధిపతి యసూగోయీ.. మర్కిత్ తెగకు చెందిన హుయిలోన్ అనే మహిళను అపహరించినందుకు ప్రతీకారంగా ఈ కిడ్నాప్ జరిగిందని జర్నలిస్టు ఎరిన్ బ్లేక్‌మోర్ ఒక కథనంలో రాశారు.

హుయిలోన్ చెంఘిజ్‌ఖాన్‌కు తల్లి.

అయితే.. కిడ్నాప్‌కు గురైన తన భార్య బోర్తేను చెంఘిజ్‌ఖాన్ విడిపించుకోగలిగారు.

ఆ తర్వాత ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మర్కిత్ తెగ ఓడిపోవడంతో వారి రాజ్యం ప్రత్యర్థుల వశమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చెంఘిజ్‌ఖాన్‌, బోర్తేను విడిపించడం గురించి ‘ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ మంగోల్స్’ అనే పుస్తకంలో ఇగోర్ డి రష్‌విల్జ్ రాశారు.

"ఆమెను విడిపించడం కోసం చేసిన దాడి కొనసాగుతుండగానే చెంఘిజ్‌ఖాన్.. అటూఇటూ కంగారుగా పరుగులు తీస్తున్న ప్రజల మధ్యలోకి వచ్చి 'బోర్తే బోర్తే' అని అరిచారు" అని రష్‌విల్జ్ రాశారు.

"బోర్తే చెంఘిజ్ ఖాన్ గొంతును గుర్తు పట్టి ఆయన వైపు పరుగు తీస్తూ వెళ్లింది. అప్పటికి అంతా చీకటిగా ఉన్నప్పటికీ వెన్నెల వెలుగులో చెంఘిజ్‌ఖాన్ గుర్రపు కళ్లెం, ఆయన చేతిలో ఉన్న తాడును గుర్తించిన బోర్తే వాటిని అందుకున్నారు. చెంఘిజ్ ఖాన్ కూడా బోర్తేను చూసి వెంటనే గుర్తు పట్టారు’ అని రష్‌విల్జ్ అందులో రాసుకొచ్చారు.

చెంఘిజ్‌ఖాన్, బోర్టే, మంగోల్ సామ్రాజ్యం, చరిత్ర

ఫొటో సోర్స్, Universal History Archive/UIG via Getty Images

ఫొటో క్యాప్షన్, చెంఘిజ్‌ఖాన్ వరుస విజయాలతో మంగోలుల రాజ్యాన్ని విస్తరించారు.

దోచుకోవడమే చెంఘిజ్ ఖాన్ తత్వమా?

గిరిజన తెగ విజయాల పరంపర కొనసాగింది. 13వ శతాబ్దం ప్రారంభంలో తేమూజిన్ చెంఘిజ్ ఖాన్‌గా ప్రసిద్ధి చెందారు. ఆయనే మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

‘చెంఘిజ్‌ఖాన్ యుద్ధాలలలో విజయాలతో తన హోదాను పెంచుకున్నారు’ అని రిచర్డ్ బ్రెస్లర్ తన ‘ది థర్టీన్త్ సెంచరీ: ఎ వరల్డ్ హిస్టరీ’ పుస్తకంలో రాశారు.

‘చెంఘిజ్ ఖాన్‌కు తత్వశాస్త్రంతో ఎలాంటి పరిచయం లేదు. అయితే, ఆయన ప్రకటనల ద్వారా ఆయన దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శత్రువును అణగదొక్కడం, నిర్మూలించడం, శత్రువు నుంచి ప్రతిదీ దోచుకోవడంలోనే ఆనందం ఉంది అనేదే చెంఘిజ్ ఖాన్ తత్వం’ అని స్టువర్ట్ లెగ్ పుస్తకం ‘ది హార్ట్ ల్యాండ్’లో రాశారు.

"అతనికి ఎలాంటి సాధారణ ఫిలాసఫీ తెలియదు. అతను ఏంటనేది అతని మాటల ద్వారా తెలుసుకోవచ్చు. అతను చెప్పిన ఆ మాటల గురించి స్టువర్ట్ లెగ్గ్ పుస్తకం ది హార్ట్‌లాండ్‌లో రాశారు.

చెంఘిజ్‌ఖాన్ జీవితమంతా ఇదే ఫిలాసఫీతో బతికారు.

‘చెంఘిజ్‌ఖాన్ ఒకదాని తరవాత ఒకటిగా విజయాలు సాధించారు. భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు అనేక మంది భార్యలు, వందల మంది బానిసలు ఉన్నారు. అయితే బోర్తే ఆయనకు ఎంతో ఇష్టమైన భార్య. ఆయనపై బాగా ప్రభావం చూపిన భార్య. ఆమెకు ఆయన హృదయంలోనే కాదు, రాజ్య వ్యవహారాల్లోనూ కీలక స్థానం ఉంది" అని ఎరిన్ బ్లేక్‌మోర్ రాశారు.

మంగోలుల సమాజంలో మహిళలు రాజకీయ, దౌత్య, వ్యూహాత్మక వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషించినట్లు మైఖేల్ బిర్న్, హొండాంగ్ కిమ్ ఎడిట్ చేసిన ‘కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ది మంగోల్ ఎంపైర్‌’ సూచిస్తోంది.

‘ఆమె చెంఘిజ్‌ఖాన్ కుటుంబానికి సలహాలు ఇచ్చేవారు, రాయబారులను ఆహ్వానించేవారు. దౌత్యపరమైన ప్రయాణాలు చేసేవారు. వివిధ ప్రాంతాల పాలకులతో సమాచారం పంచుకునేవారు. ప్రభుత్వ సమావేశాలకు ఆమె హాజరయ్యేవారు. యుద్ధాలకు ప్రణాళిక సిద్ధం చేసేవారు. అలాగే విధానపరమైన నిర్ణయాలు, వారసత్వం గురించి నిర్ణయాలు తీసుకునేవారు. చెంఘిజ్‌ఖాన్ ఆమెను వారసురాలిగా ఎంపిక చేయకపోయినప్పటికీ ఆమె మాత్రం చెంఘిజ్‌ఖాన్ భార్యగా అధికారాన్ని చలాయించారు’ అని అందులో ఉంది.

"సామ్రాజ్యపు తొలి నాళ్లలో చెంఘిజ్‌ఖాన్‌పై తల్లి హుయిలోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. యసూగోయీ మరణం తరువాత పేదరికంలోనూ ఆమె తన పిల్లలను పెంచారు. తేమూజిన్‌(చెంఘిజ్‌ఖాన్ అసలు పేరు)కు హుయిలోన్ రాజకీయ జ్ఞానం నేర్పారు’ అని రాశారు.

చెంఘిజ్‌ఖాన్, బోర్టే, మంగోల్ సామ్రాజ్యం, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భార్య బోర్తేతో చెంఘిజ్ ఖాన్

బోర్తే కిడ్నాప్, విడుదల

బోర్తే1161లో ఓల్ఖోనుద్ తెగలో జన్మించారు. ఈ తెగకు తేమూజిన్‌కు చెందిన బొర్జీగన్ తెగతో మైత్రి ఉంది.

తేమూజిన్, బోర్తేలకు పెళ్లి చేయాలని వారి బాల్యంలోనే నిశ్చయమైంది. వారికి పెళ్లైనప్పుడు బోర్తేకు 17ఏళ్లు. తేమూజిన్‌కు 16ఏళ్లు.

పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత మర్కిత్ తెగ తేమూజిన్, బోర్తీలు ఉంటున్న క్యాంప్‌పై దాడి చేసింది. తేమూజిన్ తన తల్లి, ఆరుగురు అన్నలతో తప్పించుకున్నారు. అయితే బోర్తే మాత్రం తప్పించుకోలేకపోయారు.

మర్కిత్ తెగ కూడా బోర్తే కోసమే ఈ దాడి చేసినట్లు చరిత్ర చెప్తోంది.

తేమూజిన్ తల్లి హుయిలోన్ మర్కిత్ తెగకు చెందినవారని.. తేమూజిన్ తండ్రి ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారని.. అందుకు ప్రతీకారంగా తేమూజిన్ భార్య బోర్తేను కిడ్నాప్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ తెగ అనుకుందని ఒక కథ ప్రచారంలో ఉంది.

మర్కిత్ తెగవాళ్లు దాడి చేసినప్పుడు బోర్తే ఒక ఎద్దుల బండిపై దాక్కోగా వారు ఆమెను గుర్తించి గుర్రంపై ఎక్కించి తీసుకెళ్లారు.

దాంతో భార్యను విడిపించేందుకు తేమూజిన్ చాలా ప్రయత్నాలు చేశారు.

సంచార తెగకు చెందిన మర్కిత్ ప్రజలు మధ్య ఆసియాలోని పచ్చిక బయళ్లకు వెళ్లినప్పుడు చెంఘిజ్ ఖాన్ వారిని అనుసరించినట్లు చెప్తారు.

ఈ సమయంలోనే ఆయన ఆయా ప్రాంతాల నుంచి అనుచరులను తయారుచేసుకోవడం ప్రారంభించారు.

బోర్తే అపహరణను చెంఘిజ్ ఖాన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారని.. ‘నా గుడారాన్ని ఖాళీ చేయడమే కాకుండా నా ఛాతీని చీల్చి నా గుండెను తీసుకెళ్లారు’ అని ఆయన అన్నట్లు ప్రచారంలో ఉంది.

కొన్ని రోజుల తర్వాత మర్కిత్ తెగ సైబీరియాలోని బేకాల్ సరస్సు వద్ద క్యాంపులో ఉన్నప్పుడు తేమూజిన్, ఆయన మనుషులు గెరిల్లా ఆపరేషన్‌తో బోర్తేను శత్రువుల చేతుల నుంచి విడిపించారు.

చెంఘిజ్‌ఖాన్ జీవితంలో ఇది చాలా కీలకమైన సంఘటన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంఘటనే ఆయనను ప్రపంచ విజేతగా నిలబెట్టేందుకు దారులు వేసిందని చెప్తారు.

చెంఘిజ్‌ఖాన్, బోర్తే, మంగోల్ సామ్రాజ్యం, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images/Pictures from History / Contributor

సామ్రాజ్య స్థాపనలో బోర్తే పాత్ర

తేమూజిన్‌ను బోర్తే 1178లో పెళ్లి చేసుకున్నారని 'ది కేంబ్రిడ్జ్ హిస్టరీ'లో రాసి ఉంది. బోర్తే కొన్‌కిరాట్ తెగ అధిపతి దాయీ సచిన్ కుమార్తె అని కేటియా రైట్ ఒక కథనంలో రాశారు.

చెంఘిజ్‌ఖాన్ రాజకీయ జీవితం అతని పెళ్లితోనే మొదలైంది.

ఆ సంబంధం.. ‘అతనికి గౌరవనీయ కుటుంబం అనే గుర్తింపు ఇచ్చింది. అతను అధికారాన్ని సాధించేందుకు అవసరమైన స్నేహితుల్ని అందించింది. మంగోలుల రాజకీయ పొత్తులలో కీలకమైన కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి ఈ వివాహం తేమూజిన్‌కు ఒక మార్గంగా ఉపయోగపడింది’ అని రాశారు.

"బోర్తే తన భర్తకు రాజకీయ సలహాలు ఇచ్చేవారు. ఆమెకు 9 మంది సంతానం. ఆమె కుమారులు చెంఘిజ్‌ఖాన్ సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు పాలకులయ్యారు. వారిలో ఒకరైన ఓగదేను చెంఘిజ్‌ఖాన్ వారసుడిగా ప్రకటించారు. మిగతా భార్యల పిల్లలకు అలాంటి హోదా దక్కలేదు" అని 'కేంబ్రిడ్జ్ హిస్టరీ' చెబుతోంది.

బోర్తే కుమారులకు మాత్రమే చెంఘిజ్‌ఖాన్ తర్వాత ఆయన వారసులుగా గుర్తింపు లభించిందని 'ది మంగోల్ ఎంపైర్'‌లో తిమోతీ మే రాశారు.

ది కేంబ్రిడ్జ్ హిస్టరీలో ఉన్న ప్రకారం... బోర్తే కుమార్తెలు ఎల్కార్జ్, అవిరాత్, ఒగోట్, కౌకిరాత్, ఐగుర్ తెగలకు వారిని వివాహం చేసుకున్నారు. వారి వల్ల మంగోల్ సామ్రాజ్యానికి రాజకీయ, సైనిక శక్తి లభించింది.

ఈ వివాహాల వల్ల ఎలాంటి యుద్ధం లేకుండా పొరుగునున్న రాజ్యాలు మంగోల్ సామ్రాజ్యంలో కలిసిపోయాయి. బోర్తే అల్లుళ్లు మంగోలులు తర్వాతి కాలంలో చేపట్టిన యుద్ధాలలో పాల్గొన్నారు.

బోర్తే కొంతమంది కటకునియన్, బొడానియన్ తెగకు చెందిన అనాథలను దత్తత తీసుకుని వారిని తమ సొంత బిడ్డలుగా పెంచారని తిమోతి మే చెబుతున్నారు. దీని వల్ల ఆమెపై విశ్వాసం, సామాజిక స్థితి పెరిగింది.

చెంఘిజ్‌ఖాన్, బోర్తే, మంగోల్ సామ్రాజ్యం, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చెంఘిజ్‌ఖాన్‌కు యుద్ధాలలో ఆయన భార్య బోర్తే సలహాలు ఇచ్చేవారు.

పరిపాలన, యుద్ధాలకు సంబంధించి బోర్తే సలహాలు

మంగోల్ సామ్రాజ్యంలో బోర్తే ప్రాముఖ్యం ఏంటో అందరికీ అవగాహన ఉందని 'ఉమెన్ అండ్ ది మేకింగ్ ఆఫ్ మంగోల్ ఎంపైర్ పుస్తకంలో బ్రాడ్ బ్రిడ్జ్ రాశారు.

బోర్తే చురుగ్గా వ్యవహరించేవారు. తమ తెగకు చెందిన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంతో సహా ఆమె తన అత్తగారు హుయిలోన్‌తో కొన్ని బాధ్యతలను పంచుకున్నారు.

"బోర్తే గొప్ప భార్యగా చెంఘిజ్‌ఖాన్ కుటుంబంతో పాటు పశువులు, వ్యక్తిగత వనరులు, సేవకులు, బానిసలు, ఇతర భార్యలు, రాజ కాపలాదారులను కూడా పర్యవేక్షించేవారు. వీరంతా కలిసి వెయ్యి మందికి పైగా ఉండవచ్చు. మంగోల్ సంప్రదాయం ప్రకారం.. ఆమె తన భర్త, రాజ్యానికి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే బాధ్యతను నెరవేర్చారు.

చెంఘిజ్ ఖాన్ యుద్ధానికి వెళ్లే సమయంలో బోర్తేను సలహాలు అడిగేవారు. తన పట్ల భర్తకున్న నమ్మకాన్ని ఆమె తెలివిగా ఉపయోగించుకున్నారు’ అని రాశారు.

ఉదాహరణకు బోర్తేను శత్రువులు కిడ్నాప్ చేసిన తర్వాత ఆమెను విడిపించడంలో సాయం చేసిన చెంఘిజ్ ఖాన్ స్నేహితుడు జముఖా తర్వాతి కాలంలో రాజకీయ శత్రువుగా మారాడు.

దీంతో అతడితో స్నేహాన్ని తెంచుకోవాలని చెంఘిజ్‌ఖాన్‌కు బోర్తే సలహా ఇచ్చారు.

1204లో చెంఘిజ్ ఖాన్ జముఖాను ఓడించి హత్య చేయించారు.

"చెంఘిజ్ ఖాన్ నమ్మదగిన భార్యను కనుగొనడమే కాకుండా, మొత్తం సామ్రాజ్యానికి అలాంటి మహిళలు అవసరం. ఈ మహిళలు మంగోల్ సామ్రాజ్యంలో లేకుంటే, సామ్రాజ్యం ఉనికిలో ఉండేది కాదు" అని బ్రాడ్ బ్రిడ్జ్ రాశారు.

ఆమె తన జీవితాంతం చెంఘిజ్ ఖాన్ పెద్ద భార్య. ఆమె తన భర్తతో ఎక్కువ సమయం జీవించింది.

బ్రాడ్‌బ్రిడ్జ్ ఆమెను చెంఘిజ్ ఖాన్ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా పేర్కొన్నారు. బోర్తే గురించిన కథలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

చెంఘిజ్ ఖాన్ రాజ్యవిస్తరణలో బిజీగా ఉండగా, బోర్తే మంగోలియాలోనే ఉండి సామ్రాజ్యాన్ని నిర్వహించడానికి సహాయం చేశారు. ఖిర్లాన్ నది వెంబడి ఆమెకు వ్యక్తిగత భూములు ఉన్నాయి.

బోర్తే తన భర్త చెంఘిజ్ ఖాన్ తర్వాత 1230లో మరణించారు. ఆమె జీవితకాలంలో మంగోల్ దేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా మారారని తిమోతీ మే రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)