ఆంధ్రప్రదేశ్: అసలీ ఇండోసోల్ కంపెనీ ఎవరిది? గతంలో వ్యతిరేకించి, ఇప్పుడు ఇంకా ఎక్కువ భూములు ఎందుకిస్తున్నారు?

ఇండోసోల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, నెల్లూరు జిల్లా చేవూరులోని ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

''ఇండోసోల్‌ అనేది పులివెందుల కంపెనీ, లక్ష రూపాయల క్యాపిటల్‌ స్థాయి గల ఆ సంస్థ రూ.72 వేల కోట్ల పెట్టుబడి పెడతామంటూ ప్రభుత్వంతో సమ్మిట్‌లో ఒప్పందం చేసుకుంది. ఇదంతా ఫేక్, అవన్నీ పులివెందుల ఫేక్‌ కంపెనీలు''

ఇండోసోల్‌ కంపెనీకి నెల్లూరు జిల్లాలో భూముల కేటాయింపుపై 2023లో అప్పటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలివి.

లోకేష్ మాత్రమే కాదు, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కూడా ఈ భూముల కేటాయింపుపై ఆరోపణలు చేశారు.

ఇప్పుడు ఆ కంపెనీతోనే కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని అదే నెల్లూరు జిల్లాలో 8,348 ఎకరాల భూములను అప్పగిస్తూ భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండోసోలార్ కంపెనీ

ఫొటో సోర్స్, indosolsolar

ఫొటో క్యాప్షన్, ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను 2022లో స్థాపించినట్టు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

వైసీపీ హయాంలో ఈ సంస్థకు 5,148 ఎకరాలు కేటాయించగా, అప్పట్లో ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది టీడీపీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 8,348 ఎకరాలను కేటాయించింది.

''కేవలం పారిశ్రామిక ప్రగతి కోసం, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి కోసం అప్పట్లో మా ప్రభుత్వం ఇండోసోల్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. ఎక్కడా రైతుల నుంచి వ్యతిరేకత లేకుండా భూ సేకరణ పూర్తి చేసింది. కానీ, అప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు అనవసరంగా నానాయాగీ చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పారు. కానీ, అదే ప్రాజెక్టుకు మరోచోట 8 వేల ఎకరాలు ఇచ్చారు'' అని నెల్లూరు జిల్లా వైసీపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు.

కాగా, భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు వైసీపీ సంఘీభావం ప్రకటించింది.

అయితే, అప్పుడు విమర్శించిన టీడీపీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు భూములు ఇస్తోంది. దీనిపై వైసీపీ ఏమంటోంది?

ఇంతకూ ఇండోసోల్‌ కంపెనీ ఎవరిది? ఎందుకు రెండు ప్రభుత్వాలు పోటీపడి భూములను కేటాయిస్తున్నాయి? తెలసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎన్‌.విశ్వేశ్వరరెడ్డి

ఫొటో సోర్స్, indosolsolar

ఫొటో క్యాప్షన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశ్వేశ్వరరెడ్డి

ఇండోసోల్‌ ఎవరిదంటే?

ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(ఎస్‌ఎస్‌ఈ)కి అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ను వైఎస్సార్‌ కడప జిల్లాకి చెందిన ఎన్‌ విశ్వేశ్వరరెడ్డి 1994లో కడపలో స్థాపించారు.

మొదట్లో తెలుగు రాష్ట్రాల్లోనే ట్రాన్‌ఫార్మర్లను విక్రయించిన ఈ సంస్థ.. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీదారుగా ఎదిగినట్టు సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అత్యాధునిక ట్రాన్స్‌ఫార్మర్లను ఉత్పత్తి చేయడంతో పాటు సౌరవిద్యుత్‌ ఉత్పత్తి రంగంలో కూడా ఎదగాలనే లక్ష్యంతో 2022లో ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్థాపించినట్టు సంస్థ తెలిపింది.

సముద్రతీరంలో అధిక స్వచ్ఛత గల క్వార్ట్జ్‌ను వెలికి తీయడం మొదలు.. సౌర విద్యుత్‌ ఉత్పత్తి కోసం సోలార్‌ పీవీ మ్యాడ్యూల్స్‌ తయారీ వరకు ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఇండోసోల్‌ భావించింది. 2022లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఇండోసోల్‌ కంపెనీ

ఫొటో సోర్స్, indosolsolar

ఫొటో క్యాప్షన్, సౌరవిద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ఎదగాలనే లక్ష్యంతో ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్థాపించినట్టు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో తెలిపింది.

భూ కేటాయింపులు

రామాయపట్నం సమీపంలో భూములిస్తే.. రూ.43,143 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటేడ్‌ సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ తయారీ ఫ్యాక్టరీని స్థాపించి 11,500 మందికి ప్రత్యక్షంగా, మరో 10,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామంటూ ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గత ప్రభుత్వానికి ప్రతిపాదనలతో పాటు డీపీఆర్‌ అందించింది.

ఆ మేరకు 2023 మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో ఒప్పందం చేసుకుంది.

ఈ క్రమంలోనే, గత ప్రభుత్వం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండంలోని చేవూరు, రావూరు గ్రామాల్లో 5,148 ఎకరాల భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2023 నవంబర్‌ 9న జీవో ఎంఎస్‌ నంబర్‌ 112ను విడుదల చేసి, ఏపీ మారీటైం బోర్డు ద్వారా భూసేకరణను చేపట్టింది.

చేవూరు గ్రామ పరిధిలోని 114.5 ఎకరాల్లో తొలిదశ కింద ఒక గిగావాట్‌ సామర్ధ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఇండోసోల్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

నారా లోకేష్

ఫొటో సోర్స్, Facebook/Nara Lokesh

ఫొటో క్యాప్షన్, ఏపీ మంత్రి నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

వ్యతిరేకించిన టీడీపీ

ఇండోసోల్‌ కంపెనీకి గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల్లో 5,148 ఎకరాల భూములను వైసీపీ ప్రభుత్వం కేటాయించడాన్ని అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శించింది.

ఇండోసోల్‌ కంపెనీ మాతృసంస్థ షిర్జీ సాయి ఎలక్ట్రికల్స్‌ నాటి సీఎం వైఎస్‌ జగన్‌ బినామీ కంపెనీ అని అప్పట్లో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ కూడా అప్పట్లో ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేశారు.

అది పులివెందుల కంపెనీ అని, లక్ష రూపాయల కంపెనీ అని, దానికి వేల కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని లోకేష్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పారు.

కరేడులో భూములు, ఇండోసోల్
ఫొటో క్యాప్షన్, ఇండోసోల్ కోసం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో 8,348 ఎకరాల భూములను కేటాయించారు.

కరేడులో 8, 348 ఎకరాలు

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేవూరులో ఇండోసోల్‌ నిర్మాణాలు చేపట్టిన 114.5 ఎకరాలను కేటాయించి, మిగిలిన భూములకి బదులుగా అక్కడికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలోని ఉలవపాడు మండలం కరేడు గ్రామ పరిధిలోని 8,348 ఎకరాల భూములను కేటాయించింది.

ఈ మేరకు, 2025 మార్చిలో జీవో నంబర్‌ 43ను విడుదల చేసిన ప్రభుత్వం.. భూసేకరణ నిమిత్తం జూన్‌ 21న ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది.

వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.69 వేల కోట్లు కాగా, ఇందులో రూ.41, 254 కోట్లను పదిహేనేళ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సీఎస్‌ఎస్‌ చార్జీలు వంటి వివిధ పన్నులు, సంకాల మినహాయింపులతో ఇన్సెంటివ్స్‌గా ఇస్తున్నట్టు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది.

అప్పుడు అదే కంపెనీని వ్యతిరేకించిన టీడీపీ, ఇపుడు అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు,మూడు పంటలు పండే కరేడు గ్రామంలోని సారవంతమైన భూములను ఎలా కట్టబెడుతుందని గ్రామ రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

భూములివ్వబోమని ఇప్పటికే కరేడు గ్రామ రైతులు ఆందోళనలు చేస్తన్నారు.

మాజీ సీఎం జగన్

ఫొటో సోర్స్, YSRCP

ఇండోసోల్‌ను తరిమేసే కుట్ర: జగన్

ఇండోసోల్‌ను తరిమేసే కుట్ర జరుగుతోందని మాజీ సీఎం జగన్ ఇటీవల విమర్శించారు.

"మా హయాంలో చేవూరులో రామాయపట్నంకు ఆనుకుని ఉన్న భూములను రైతులను ఒప్పించి ఇప్పించాం. అయినా అక్కడి నుంచి వాళ్లను పొగబెట్టి వెళ్లిపొమ్మన్నట్టుగా వాళ్ల కోసం సేకరించిన భూములను బీపీసీఎల్‌ వాళ్లకిస్తూ.. కరేడులో రెండుమూడు పంటలు పండే భూములను ఇండోసోల్‌కి ఇస్తామంటున్నారు.

అంటే, వీళ్ల ఉద్దేశం ఏమిటి? అదే బీపీసీఎల్‌కి ల్యాండ్‌ ఇవ్వాలనుకుంటే వేరే ల్యాండ్‌ లేదా? వీళ్ల ఉద్దేశం పరిశ్రమలను ప్రోత్సహించడం కాదు, పారిశ్రామికవేత్తలను బెదిరించడం'' అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఫొటో సోర్స్, facebook/Somireddy Chandra Mohan Redd

ఫొటో క్యాప్షన్, ఇండోసోల్‌ ప్రాజెక్టుపై ఇపుడు మాట్లాడలేనని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

టీడీపీ నేతలు ఏమన్నారంటే..

గత వైసీపీ ప్రభుత్వంలో ఇండోసోల్‌కు భూములు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇప్పుడు మాత్రం దానిపై ఏమీ మాట్లాడబోనని అన్నారు.

కరేడులో కూటమి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడాన్ని బీబీసీ ప్రస్తావించగా, తాను వేరే పనులు, పార్టీపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఆ విషయంపై స్పందించలేనని అన్నారు.

నెల్లూరు జిల్లాకే చెందిన టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి కూడా గతంలో ఇండోసోల్‌ ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.

''కాస్త ఇబ్బందికర అంశం. దీనిపై నేను మాట్లాడలేను కానీ, రైతులు నష్టపోకుండా చూడాలని మాత్రం కోరుకుంటాను'' అని ఆనం వ్యాఖ్యానించారు.

ఇక కరేడు గ్రామం కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

కందుకూరు ఎమ్మెల్యే బీబీసీతో మాట్లాడుతూ, " ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక ప్రగతిని అడ్డుకోకూడదు. కానీ, ఆ 8 వేల ఎకరాల్లో పంటలు పండే భూములు 2,500 ఎకరాల వరకూ ఉంటాయి. వాటిని మాత్రం భూసేకరణ నుంచి మినహాయించాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశాను" అని చెప్పారు.

కాగా, ఇండోసోల్‌ ప్రాజెక్టు విషయమై గానీ, కరేడు భూసేకరణపై గానీ ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని పేరు రాయడానికి ఇష్టపడని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు బీబీసీతో చెప్పారు.

దీనిపై నారా లోకేష్‌తోనూ, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తోనూ మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. వారిరువురూ అందుబాటులోకి రాలేదు. వారి స్పందన రాగానే అప్‌డేట్‌ చేస్తాం.

సీపీఎం, శ్రీనివాసరావు
ఫొటో క్యాప్షన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

రెండు పార్టీలదీ ఒకే తీరు: సీపీఎం

ఇండోసోల్‌ మాతృ సంస్థ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌పై టీడీపీ, వైసీపీలది ఒకటే తీరుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

"ఆ కంపెనీకి భూములను దోచిపెట్టడమే రెండు పార్టీల ఏకైక అజెండాలా కనిపిస్తోంది. నాడు వైసీపీ ప్రభుత్వంలో భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎకరాలను, పైగా సారవంతమైన భూములను ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటనేది పాలకులు చెప్పాలి" అని అన్నారు.

కాగా, ఈ వివాదాలపై ఇండోసోల్‌ కంపెనీతో మాట్లేందుకు బీబీసీ ప్రయత్నించగా కంపెనీ ముఖ్యులు అందుబాటులోకి రాలేదు.

కంపెనీ బాధ్యులెవరూ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు. దీంతో నేరుగా సంస్థకి మెయిల్‌ చేశాం. ఈ కథనం ప్రచురితమయ్యే సమయం వరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

టీడీపీకి రూ.40 కోట్ల విరాళం

ఇండోసోల్‌ మాతృసంస్థ షిర్జీ సాయి ఎలక్రికల్స్‌ సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.40 కోట్లు విరాళంగా రావడం కూడా ఇప్పుడు చర్చనీయంగా మారింది.

సీఎం జగన్‌కు సన్నిహిత సంస్థగా టీడీపీ నేతలు ఆరోపించిన ఈ సంస్థ నుంచి టీడీపీకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో విరాళాలు వచ్చాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)