తెల్లరంగు గుడ్డు మంచిదా, గోధుమ రంగు గుడ్డు బెటరా? ఎందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి?

కోడి గుడ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అన్షుల్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోడిగుడ్లు తినేవారికి తరచూ ఒక సందేహం రావొచ్చు. తెలుపు రంగులో కనిపించే గుడ్డు, గోధుమ రంగులో కనిపించే గుడ్డు...ఈ రెండింటిలో ఏది మంచిది అన్నది ఆ డౌట్.

గోధుమ రంగు గుడ్లు మార్కెట్లో తెల్లటి గుడ్ల కంటే ధర ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్నలు వినియోగదారులకు ఎప్పుడూ ఒక పజిల్‌గానే ఉంటాయి.

గోధుమ రంగు గుడ్లు సేంద్రీయమైనవని, తెల్లగుడ్ల కంటే ఎక్కువ పోషకమైనవని చాలామంది భావిస్తుంటారు. కొంతమంది వాటి రుచిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరి, నిజంగా ఈ రెండు రంగుల గుడ్లలో ఏది ఎక్కువమంచిది, ఏది తక్కువ మంచిది అన్న తేడా ఉందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుడ్డు, రంగు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

గుడ్డు రంగులో తేడా ఎందుకు?

గోధుమ, తెలుపు గుడ్లు రెండూ మార్కెట్లో సులభంగా లభిస్తాయి. కానీ గుడ్లు రంగులో ఎందుకు భిన్నంగా ఉంటాయి? అంటే, అవి అందించే పోషకాహారంలో కూడా తేడా ఉందా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుడ్డు పెంకు, రంగు అనేది కోడి జాతిపై ఆధారపడి వస్తుంది.

అమెరికన్ మ్యాగజీన్ 'ఫుడ్ అండ్ వైన్'లో ప్రచురితమైన రిపోర్టు ప్రకారం, సాధారణంగా తెల్లటి ఈకలు, తెల్లటి చెవులు కలిగిన కోళ్లు తెల్లటి గుడ్లు పెడతాయి. ఎరుపు ఈకలు, ఎరుపు చెవులు కలిగిన జాతి కోళ్లు గోధుమ రంగు గుడ్లు పెడతాయి.

"పెంకు రంగు కోడి జాతి ద్వారా వస్తుంది. ఇది పూర్తిగా జన్యుపరమైనది"అని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో పౌల్ట్రీ నిపుణుడు డాక్టర్ జోనాథన్ మోయిల్ అన్నారు.

గుడ్లు, బ్రౌన్, వైట్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, "చాలా గుడ్లు తెల్లటి రంగులో ఉంటాయి" అని యూసీ డేవిస్ విశ్వవిద్యాలయంలో పౌల్ట్రీ పరిశోధకుడు డాక్టర్ రిచర్డ్ బ్లాచ్‌ఫోర్డ్ వివరించారు.

గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్లలో "గుడ్డు పెంకు ఏర్పడేటపుడు దానికి ప్రోటోపోర్ఫిరిన్ అనే వర్ణద్రవ్యం కలుస్తుంది. ఇది పెంకు రంగును మారుస్తుంది" అని అన్నారు.

అంటే గుడ్డు బయటి రంగు కోడి జన్యు లక్షణాల ద్వారా వస్తుంది. ఇది కాకుండా, కొన్ని జాతుల కోళ్లు నీలం లేదా ఆకుపచ్చ గుడ్లు పెడతాయి. ఇది కూడా జన్యుపరమైన కారణంగా జరుగుతుంది.

బ్రౌన్ ఎగ్స్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయా?

గోధుమ, తెలుపు గుడ్ల మధ్య పోషక స్థాయిలో పెద్ద తేడా లేదని అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్డీఏ) చెబుతోంది.

ఆరోగ్య సమస్యలపై సమాచారాన్ని అందించే వెబ్‌సైట్ మెడికల్ న్యూస్‌టుడే ప్రకారం "రెండు గుడ్లలో దాదాపు ఒకే మొత్తంలో ప్రోటీన్, విటమిన్లు (ఏ, డీ, బీ12), ఖనిజాలు ఉంటాయి"

యూఎస్డీఏ చెబుతున్న దాని ప్రకారం, గుడ్ల పరిమాణం వాటి రంగు కంటే పోషకాహారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పెద్ద గుడ్లలో దాదాపు 90 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, మధ్యస్థ గుడ్లలో దాదాపు 60 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

బయట తిరిగే కోళ్ల నుంచి వచ్చి గుడ్లకు సూర్యరశ్మి లభిస్తుంది కాబట్టి, వాటిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుందని యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (ఎన్ఎల్ఎం) అధ్యయనంలో తేలింది.

తెల్ల గుడ్డు, గోధుమ రంగు గుడ్డు ,బ్రౌన్ ఎగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

బ్రౌన్ ఎగ్స్ ఎందుకు ఖరీదైనవి?

రెండు గుడ్లలో పోషకాలు దాదాపు ఒకేలా ఉన్నా, బ్రౌన్ ఎగ్ ధర మాత్రం కొంచెం ఎక్కువగా ఎందుకుంటుంది?

డైటీషియన్ అను అగర్వాల్ దీని వెనుక రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు.

"మొదటి కారణం ఏమిటంటే, తెల్ల గుడ్లతో పోలిస్తే బ్రౌన్ ఎగ్స్ మార్కెట్లో తక్కువగా లభిస్తాయి. రెండవ కారణం ఏమిటంటే, బ్రౌన్ ఎగ్ పెట్టే కోళ్ల జాతి పెద్దది. వాటికి ఎక్కువ ఆహారం అవసరం. పెరిగిన ఉత్పత్తి ఖర్చు కారణంగా, వాటి ధర కూడా పెరుగుతుంది" అని అను అగర్వాల్ అన్నారు.

గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్లు ఎక్కువ ఆహారం తింటాయని, కాబట్టి అవి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముడవుతాయని యూఎస్డీఏ కూడా అంగీకరిస్తోంది.

గుడ్లు

ఫొటో సోర్స్, Getty Images

రుచిలో కూడా తేడా ఉందా?

కొంతమంది గోధుమ రంగు గుడ్లు రుచిలో భిన్నంగా ఉంటాయని చెబుతుంటే, మరికొందరు తెల్లగుడ్లను ఇష్టపడతారు.

అమెరికన్ మీడియా సంస్థ హెల్త్‌లైన్ రిపోర్టు ప్రకారం, ''తెల్ల, గోధుమ రంగు గుడ్లలో పోషకాల మాదిరిగానే రుచిలో కూడా పెద్ద తేడా ఉండదు. అయితే, దీనర్థం అన్ని గుడ్లు ఒకే రుచినిస్తాయని కాదు. కోడి జాతి, దాణా రకం, గుడ్డు తాజాదనం, వంట పద్ధతి వంటి అంశాలు గుడ్ల రుచిని ప్రభావితం చేస్తాయి"

ఏ గుడ్డు ఎంచుకోవాలి?

తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఎక్కువ సేంద్రీయంగా ఉంటాయని చాలామంది వాదిస్తుంటారు. అయితే, అమెరికన్ ఎగ్ బోర్డ్‌లో కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మార్క్ డ్రెస్నర్ ఈ వాదనను తోసిపుచ్చారు.

"అన్ని గుడ్లు ఆరోగ్యకరమైనవే. సేంద్రీయ గుడ్లు తెలుపు, గోధుమ రంగుల్లో కూడా ఉండొచ్చు. కానీ, అన్ని గోధుమ రంగు గుడ్లు సేంద్రీయమైనవి కావు" అన్నారాయన.

రంగుపై దృష్టి పెట్టడానికి బదులుగా, గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు వాటి తాజాదనం, నాణ్యతపై శ్రద్ధ వహించాలి. దీనితో పాటు, గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

  • శుభ్రమైన, పగలని పెంకులు ఉన్న గుడ్లను ఎంచుకోండి.
  • గడువు ముగిసిన గుడ్లను కొనవద్దు.
  • మీ అవసరాలు, బడ్జెట్ ప్రకారం సరైన పరిమాణంలో గుడ్లను ఎంచుకోండి.
  • కొనుగోలు చేసిన తర్వాత, గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
  • గుడ్లను ఎంచుకునేటప్పుడు, దాని తాజాదనం, అవి ఏ జాతి కోడి నుంచి వచ్చాయి అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)