ఉప్పు ఎక్కువ అవుతోందా? తక్కువ అవుతోందా?

ఉప్పు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇఫ్తేఖర్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉప్పు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, మన శరీరానికి కూడా మేలు చేస్తుంది.

శరీరంలో నీటి సమతుల్యతను కాపాడేది ఉప్పే. కండరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

అయితే, ప్రతిదానికీ ఒక పరిమితి ఉన్నట్లే, దీనికీ ఉంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హాని జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ శాస్త్రవేత్తలు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు చెప్పారు.

అవేంటో తెలుసుకునేముందు.. మన శరీరానికి రోజూ ఎంత ఉప్పు అవసరమో, దానికిమించి తీసుకుంటే, మన ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.

ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, మనం ఎలాంటి ఉప్పు తీసుకుంటున్నామో కాదు, ఎంత ఉప్పు తీసుకుంటున్నామో దానిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.

ఇంట్లో వండిన ఆహారంలోనే కాకుండా, ప్యాక్ చేసిన, తయారుచేసిన అనేక ఉత్పత్తులలో కూడా అధిక మొత్తంలో ఉప్పుంటుందన్నది దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.

రోజువారీ ఆహారంలో తక్కువ ఉప్పే వేసుకున్నప్పటికీ... ఇటువంటి పదార్ధాలను అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలని సూచిస్తోంది. అంటే ఇది దాదాపు ఒక టీస్పూన్ ఉప్పుకు సమానం.

భారతదేశంలో ప్రజలు నిర్దేశించిన దానికంటే చాలా ఎక్కువ ఉప్పును తీసుకుంటున్నారని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సోడియం

శాస్త్రవేత్తలేమంటున్నారు?

ఐసీఎమ్ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ శాస్త్రవేత్తల ప్రకారం , భారతదేశంలో అధిక ఉప్పు వాడకం 'కనిపించని మహమ్మారి'కి ఆజ్యం పోస్తోంది.

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హైబీపీ (అధిక రక్తపోటు), స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం వేగంగా పెరుగుతుందని ఆయన అంటున్నారు.

పట్టణ ప్రాంతాల్లో నివసించే భారతీయులు రోజుకు సగటున 9.2 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం రోజుకు 5.6 గ్రాములు.

శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఈ గణాంకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల కంటే చాలా ఎక్కువ.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు.

ఉప్పు తక్కువగా తినడం ఎంత ప్రయోజనం?

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని, పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

"దీర్ఘకాలికంగా అధికమోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు( హైబ్లడ్ ప్రెజర్) వస్తుంది" అని దిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్, గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ ప్యాంక్రియాటికో-బిలియరీ సైన్సెస్ వైస్-చైర్మన్ డాక్టర్ పియూష్ రంజన్ బీబీసీకి చెప్పారు.

"అధిక రక్తపోటు అనేది "అనేక శరీర వ్యవస్థలను ప్రభావితం చేసే వ్యాధి". గుండె, మూత్రపిండాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది" అని ఆయన అన్నారు.

"శరీరంలో కొన్ని రకాల వ్యాధులు సంభవించినప్పుడు కూడా, సోడియం నిలుపుదల అంటే శరీరంలో ఉప్పు పేరుకుపోవడం పెరుగుతుంది. శరీరంలో ఉప్పు, నీటి సమతుల్యతను కాపాడుకోవడం మూత్రపిండాల బాధ్యత" అని ఆయన తెలిపారు.

రక్తపోటు

"రక్తపోటును నియంత్రించడానికి, అనేక మందులు ఇస్తారు, వీటిని డైయూరిటిక్స్ అంటారు. ఈ మందులు మూత్రపిండాల ద్వారా శరీరం నుంచి ఉప్పును తొలగిస్తాయి, దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది" అని ఆయన అన్నారు.

"గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధి, లివర్ సిర్రోసిస్ వంటి సందర్భాల్లో ఉప్పు తీసుకోవడం పరిమితం చేయాలి" అని రంజన్ సూచించారు.

అనారోగ్యంవల్లే కాకుండా సాధారణంగా కూడా ఉప్పును పరిమితంగా తీసుకోవడం రక్తపోటును నియంత్రించడానికి, గుండె, మూత్రపిండాలను సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు.

పాపడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉప్పు ఉండే పదార్థాల్లో పాపడ్ కూడా ఒకటి.

ఎలాంటి పదార్థాలు తినకూడదు?

ఏ వయసువారైనా ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి, ఉప్పు తీసుకోవడం వీలైనంత తగ్గించాలి. మనకు తెలియకుండా ఉప్పు దాగి ఉన్న ఆహార పదార్థాలు తినకుండా ఉండడం చాలా ముఖ్యం.

"డాక్టర్ పియూష్ రంజన్ చెప్పినదాని ప్రకారం, అనేక సాధారణ ఆహార పదార్థాలలో మనకు తెలియకుండా ఉప్పు ఉంటుంది.

  • ఊరగాయలు
  • పాపడ్
  • ప్యాక్ చేసిన ఆహారం (నమ్కీన్, చిప్స్, సాస్‌లు, తినడానికి సిద్ధంగా ఉన్న వస్తువులు)
  • ప్రాసెస్ చేసిన ఆహారం (సాసేజ్‌లు, నూడుల్స్, కెచప్, బిస్కెట్లు మొదలైనవి).

ఈ ఉత్పత్తులలో సాధారణం కంటే చాలా ఎక్కువ ఉప్పు ఉంటుంది. కాబట్టి వాటిని కొనుగోలు చేసేటప్పుడు, లేబుల్‌పై సోడియం కంటెంట్‌ను తనిఖీ చేయండి. వీలైనంత వరకు వాటిని తినకుండా ఉండడం మంచింది లేదా పరిమితంగా తినండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)